దక్షిన తెలంగాణ

గిలిగింతలు పెట్టే ‘శ్రావణ మేఘాలు’ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు : 104
వెల : 100/-
ప్రతులకు: రంగు గోవర్ధన్
7-1-680, మంకమ్మతోట
కరీంనగర్ - 505001
సెల్.నం.9849497679
***
ప్రతి మనిషీ ఏదో ఒక సమయంలో గడిపే కొన్ని మధురక్షణాలని కవిత్వీకరిస్తే..అది పాఠకులను అలరిస్తుంది. ‘ప్రేమ’ జీవితంలో ఒక భాగమైనప్పటికీ.. ప్రేమే జీవితమని భావించే వాళ్లున్నారు. లోకాన్ని వెచ్చదనంతో నింపే ఎన్ని ఉదయాలైనా ప్రపంచాన్ని చల్లదనంతో నింపే ఎన్ని పున్నములైనా..కోట్లాది బిందువులతో కూడిన సింధువులైనా తన కవిత్వంతో సరికావనే కవులూ వున్నారు! పదాలను లాలించి..తమ కవిత్వపు అక్కున చేర్చుకుని వాటిపై కవులు కురిపించే వాత్సల్యం చూస్తుంటే..ఆ కవికి ప్రేయసి కావడం కన్నా..అతని వాక్యమై వాలి పోవాలనిపిస్తుంది. మనసును రివ్వున ఎగరేసి గాలిగోపురం మీద వాలే పావురాయిని చేసేలా కవిత్వం అల్లే కవులూ వున్నారు. ఈ క్రమంలోనే..కవి రంగు గోవర్ధన్ ‘శ్రావణ మేఘాలు’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించి..కాళిదాసు ‘మేఘసందేశాన్ని’ గుర్తుకు తెస్తున్నారు. దృశ్యానికీ..శ్రవణానికీ ఆఘ్రాణించడానికి అలతి అలతి పదాలతో పాఠకులకు గిలిగింతలు పెట్టేలా అద్భుత భావాలను పండించారు. తెల్లని కాగితం లాంటి స్వచ్ఛమైన/ నీ హృదయ క్షేత్రంలో / అందమైన పదాలై / మొలకెత్తి చిగురించి / కవితా కుసుమాలై విరబూయాలని కాంక్షిస్తూ కవితామృతాన్ని పంచిన ‘గోవర్ధన్’ రంగు రంగుల లోకంలో మనం విహరించేలా ఇందులో తమ రచన కొనసాగించారు. నీ రూపం మధురం / నీ లావణ్యం మధురం అంటూ సుమాన్ని తమ అక్షరపు సొబగులతో తీర్చిదిద్దారు. చూపులు కలిసిన శుభవేళ..హృదయక్షేత్రంలో వలపు విత్తనం వేస్తే..తలపుల తుంపర మొదలైందని అంటూ ప్రేమ కుసుమాన్ని వికసింపజేయడంలో కవి సఫలీకృతులైనారు. మనసు శృతిలోన ఉంటే..సుమధుర గీతాలు ఆలపిస్తుందన్న నిజాన్ని నిగ్గుతేల్చారు. నేను కవితనై నీ మనసుకు రంజింపజేయాలనుందని ఆకాంక్షను వెలిబుచ్చారు. పదాలలో పదనిసలు పలికించి హృదయాలను కొల్లగొట్టే క్రమంలో..ప్రేయసితో..నీవు కలిగించిన ఆశ..అలలు అలలుగా ఎగసి ఎగసి అంబరాన్ని తాకుతుందనీ.. నీవు కలిగించిన స్పర్శ అణువణువున హాయిరాగాలు పలికిస్తున్నాయని రమణీయ భావాలను ప్రకటించారు. నీవు నవ్విన ఆ క్షణం / గోదావరి తరంగాల గల గలలు మేళవించి / లేత గులాబీ రెక్కలు విదిలించి / విచ్చిన మల్లియల మకరందాన్ని చిలకరించాయనీ..నీవు చూసిన ఆ క్షణం..కురిసీ కురియని శ్రావణమేఘాలు నన్ను ఆత్మీయంగా పలకరించి..పరవశింపజేశాయని అందంగా మదిలోని భావాలను అక్షరబద్ధం చేసిన తీరు అభినందనీయం! పూర్ణకుంభం వలె భాసిల్లే వక్షస్థల సౌందర్యం..విరబూసిన పువ్వు వంటి వదనం..విశాలమైన జఘన భాగం..అంటూ శృంగార శోభలు వెదజల్లుతూ శిల్ప సుందరిని మనముందుంచారు. తామరపూల తేజస్సుతో..తళుకులీనే అందమైన అరచేతులు..ఆ చేతి స్పర్శకే కురియవా..అణువణువు అమృతాలని వర్ణించిన తీరు బాగుంది. నా హృదయపు వేదికపై..పరవశంతో నీవు నర్తించిన వేళ..నీ తడి తడి పాదాలు నా అంతరంగాన్ని అభిషేకిస్తుంటే.. పట్టలేని ఆనందం పరవళ్లు తొక్కుతుందంటారు కవి! కలకాలం నాలోనే నర్తించు నీ పాద స్పర్శతో నా మనసుకు పరిమళించుమని వేడుకుంటారు.
మన చూపుల మధ్య..మల్లెపూల వారధి అల్లుకుందని చెబుతూ..నిర్మలమైన నా హృదయపు కొలనులో..స్వచ్ఛమైన కలువలా వికసించుమని నేస్తాన్ని అభ్యర్థించారు.
ఓ కవితలో..మెత్తని వొత్తిల్ల మత్తులో సుఖాల తీరాలకు చేరుకునే మధుర క్షణాలను..వలపు వసంతలో తేలియాడే ‘సంగమం’ యొక్క పతాక సన్నివేశాలను దృశ్యమానం చేసిన తీరు కవి యొక్క రసిక హృదయానికి ప్రతిబింబంగా ఆలుమగలు ఒక్కటై..జరిపే ప్రణయ క్రీడను కవి అక్షరాల్లో బంధించి ఒకింత పాఠకులకు గిలిగింతలు పెట్టారు. మధుర భావాలు ప్రకటించే క్రమంలో..ఎక్కడా అశ్లీలతకు తావివ్వకుండా..కవి తీసుకున్న శ్రద్ధ ఆయన సృజనాత్మక ప్రతిభను చాటుతోంది. ఇలా ఈ కవితా సంపుటిలో ఎన్నో పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా వున్నాయి. మనసుకు హాయి గొలిపే సుందర, సుమధుర భావాలతో పాఠకుల్ని పరవశింపజేసిన గోవర్ధన్‌ను అభినందిద్దాం.
***

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- సాన్వి, కరీంనగర్, సెల్.నం.9440525544