ఉత్తర తెలంగాణ

పంజరం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెకు ప్రతిదినమూ ఒత్తిడే. చేంతాడులా పెరిగిపోయిన రోజూ చేయాల్సిన పనుల లిస్టు, వచ్చే పండుగకు తయారు చేసుకోవాల్సిన పిండివంటలు, పిల్లలు వస్తే వారికి రోజూ చేసిపెట్టాల్సిన వెరైటీ వంటకాలు, ఫ్రిజ్‌లో సర్దుకోవాల్సిన కూరగాయలు, పండ్లు, మిషన్‌లో వేసుకోవాల్సిన మురికి గుడ్డలు, ఇల్లంతా దులుపుకోవాల్సిన బూజు, దుమ్ము, ఇంటి ముందు కళ్లాపి జల్లి తీర్చిదిద్దాలనుకునే కొత్త రంగవల్లులు, వీటన్నిటి నడుమ ఉద్యోగినిగా అవిశ్రాంత ప్రయాణం. ఆఫీస్‌లో బండెడు చాకిరీ... అలసిన దేహం.. నలిగిన మనసుతో ఇల్లు చేరి అలసటగా హ్యాండ్‌బేగ్‌ను సోఫాలో విసిరేసింది. సింక్‌లో గినె్నలు, దండెం మీద బట్టలు, రాత్రిపూటకి సరిపోని వంటకాలు రోజూ చాకిరీ యంత్రంలా పనిచేసి అరిగిపోయింది ఆమె.
ఎవ్వరితో మాటా, మంతీ లేదు. ఉన్నావా? పోయావా? అభిరుచులు, వ్యాపకాలు అని అడిగే నాథుడు లేడు. ఐనా ఉండబట్టలేక అప్పుడప్పుడు స్నేహితురాండ్రకు ఫోన్ చేసి కుశలప్రశ్నలు అడిగేది. ఊహూ..! అవతలివైపునుండీ అరిగిపోయిన అదే సమాధానం మాకు టైం లేదు పిల్లలొచ్చారు. ట్యూషన్‌కి పంపించాలి. ఇంకా బోల్డన్ని పనులు మిగిలిపోయాయంటూ వ్యథాభరిత మాటలు తెల్లారి పెట్ షాపుకు వెళ్లింది ఆమె. రెండు లవ్‌బర్డ్స్ ఉన్న పంజరం, ఒక అక్వేరియం తెచ్చుకుంది. దాంతో బాటే ఓ ముద్దొచ్చే చిన్ని కుక్కపిల్ల, కొన్ని పూల తొట్టెలు, కొంత మట్టి ఒక ఆటోలో వేయించుకొచ్చింది. హాల్‌లో ఓ మూలగా అక్వేరియం పెట్టించింది. బాల్కనీలో లవ్‌బర్డ్స్‌ని వేలాడదీసింది. డాబాపై పూలతొట్టీలను వరుస కట్టించింది. మిగిలిన మట్టిని తనవద్దనున్న కొన్ని పాతకుండీల్లో వేసి సర్దింది. ఇల్లంతా పారాడుతున్న బొచ్చు కుక్కపిల్ల. సందడిగా మారింది ఆమె ఇల్లు. ఎన్నో పనులు, ఎంతో ఒత్తిడి. యాంత్రిక జీవనం... ఇప్పుడామె ఇంటికి రాగానే టీ కాచుకొని కాసేపు అక్వేరియంలోని చేపపిల్లలను చూస్తూ తన్మయత్వాన్ని పొందుతుంది. నిశ్శబ్దంగా ఉన్న నీళ్లలో అవి చేసే విన్యాసాలను రెప్పలార్పకుండా చూస్తుంది. కాసేపు డాబాపైకి వెళ్లి కొత్త పూలు ఏం పూసాయా అని లెక్కగడుతుంది. రాత్రి మొగ్గగా ఉన్న గులాబీ తెల్లారి రేకులు విప్పితే ఆమె మొహంలో అరవిరిసిన సంతోషం పురివిప్పుతుంది. చీర కుచ్చిళ్లలో దోగాడే బొచ్చు కుక్కపిల్లకు పాలు పోసి అది పోయే గారాలను మురిపెంగా చూస్తుంది. బాల్కనీలోని లవ్‌బర్డ్స్‌కు దాణావేసి నీళ్లు పోస్తుంది. కాసేపు కుర్చీలో కూర్చొని మది నిండిన భావనతో పంజరం కేసి చూస్తుంది. తన జీవితమూ పంజరం వంటిదే. స్వేచ్ఛగా ఎగురలేదు. గిరిగీసుకొని బంధించిన చట్రంలో గానుగెద్దులా తిరుగుతున్న వాళ్లం. కాని అప్పుడప్పుడు మనసుకూ విశ్రాంతి అవసరం. మది నిండే అభిరుచులు, వ్యాపకాలకూ సమయం ఇవ్వాలి. కొంత సమయాన్ని మనకూ కేటాయించుకోవాలి. ఉన్నదాంట్లో ఉత్సాహభరితంగా, జీవనాన్ని ఉత్సవంలా జరుపుకోవాలి. చదువుతున్న పుస్తకాన్ని మడచి టేబుల్ మీద పెట్టింది ఆమె. అలసటగా నిద్రమత్తు అవహించిన శరీరానికి విశ్రాంతినిచ్చింది. అంట్లగినె్నలు, మురికిగుడ్డలు, దుమ్ము దులపాల్సిన సోఫాలు, టేబుల్స్ ఆమెనేవీ గాబరాకి గురిచేయడం లేదు. తమకు తామే సర్దుబాటు చేసుకునే జీవితాలు కొన్ని అయితే.. ఆస్వాదన మర్చిపోయి యాంత్రిక ధోరణిలో పడి ఎగరటం మర్చిపోతున్న కొన్ని ఉద్యోగ జీవితాలు అంతేమరి. బహుశా మానవుడు తన జీవనాన్ని జీవింపజేసుకోవటం లేదేమో..! కేవలం అలా బతికేస్తున్నాడు కాబోలు..!

- బి. కళాగోపాల్ నిజామాబాద్, సెల్.నం.9441631029