రాజమండ్రి

సాహితీ దీప్తి... అద్దేపల్లి స్మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీ.శే. అద్దేపల్లి రామమోహనరావు ఆరు దశాబ్దాల సాహితీ ప్రస్థానం ఎందరికో మార్గదర్శనం అయ్యింది. ఒక వ్యక్తిగా సాహితీ వ్యవస్థలో జరిగిన అన పరిణామాలకు తన సొంత ముద్రను కలిగి ఉన్న అగ్రేసర కవులలో అద్దేపల్లిది విలక్షణమైన, విశిష్టమైనదనే చెప్పవచ్చును.
//విత్తనంలో వికసించే నేత్రం/శ్రమ సంస్కృతి ప్రతిరూపం//మట్టిలో తలెత్తి లేచిన విత్తనానికి వందనం-నేల చీల్చిన లేత మొక్కకు అభినందనం// అన్న అద్దేపల్లి కవిత్వం సార్వజనీనంగా, సమకాలీనంగా ఎదిగి-ఒదిగి తెలుగు సాహిత్య ధోరణులకు దర్పణం పట్టిందన్నది ఒక సాధికారిక అభిప్రాయం.
ముఖ్యంగా అద్దేపల్లివారు మంచి విమర్శకుడు. ఆపై సమీక్షకుడు. అందరి తప్పొప్పుల్ని ఆత్మీయంగానే అనునయంగానే తెలియచెబుతూ ప్రోత్సహించేవారు. నిజాయితీని, నిబద్ధతను చాటేందుకు విజ్ఞతని, స్వచ్ఛమైన స్ఫటికంలా కనిపించేలా ఉండటం అద్దేపల్లి అనుయాయిగా దశాబ్దాల నా పరిశీలనానుభవంతోనే ఈ మాటలు వ్రాస్తున్నాను.
ముఖ్యంగా అద్దేపల్లి ప్రాచీన-నవీన సాహిత్యాల వారధి (ఆనకట్ట) వెయ్యేళ్లకు పైబడిన సాహితీ ‘వారిధి’ (సముద్రం). ఎందుకంటే బందరు సముద్రం నుంచి కాకినాడ సముద్రానికి చేరువవడం కేవలం యాదృచ్ఛికమూ, కాకతాళీయమూ కాదనే చెప్పాలి. అద్దేపల్లి కాలం వెంబడి ప్రవాహ సాంధ్రతల్ని, పోరాటాల్ని మోసుకుపోయినప్పుడు, నదులు ఎలాగైతే అవి ప్రవహించినంత మేర మట్టిలోని ప్రతి రేణువుని తాకి (ప్రేమించి)న ప్రతీ నేలను ఒరుసుకుంటుందో అద్దేపల్లితో సాన్నిహిత్యం ఉన్న ప్రతీ వారికీ ఆయన హృదయ వైశాల్యత ఆర్ప్రత అనుభవంలోకి వచ్చినవనడానికి 600కు పైగా కవితా సంపుటాలకు ముందుమాటల్ని గీటురాళ్లుగా అందించడమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా శ్రీశ్రీ రచనలపై అద్దేపల్లి వ్రాసిన వ్యాసాలు అభ్యుదయ కవిత్వానికి, అప్పటి విమర్శలకు, సమీక్షకులకు, అంతకుమించి శ్రీశ్రీ అభిమానులకు ఒక వర్తమాన చారిత్రిక అవసరాల్ని ప్రాతిపదికగా అధ్యయనం చేయడం వల్ల శ్రీశ్రీ అభిమానులు కూడా ఆ గ్రంథాల్ని ప్రాముఖ్యంగా, ప్రామాణికంగా తీసుకున్నారు.
// కవిత్వం ఒకనిరం తీరయాత్ర
అక్షరం నీ గుండెల్లోని రక్తపాత్ర
నీ రక్తాన్ని అక్షరంగా మార్చుకోవడం మొదలెడతావు
రక్తంలో సమాజ ప్రతిబింబాన్ని
సముద్రీకరించుకుంటూ
అలల్ని అన్ని దిక్కులకూ పంచుతూ
నీ ఘోష నీలోనే అణిచేసుకుంటూ
జీవితంలో సమాంతరంగా పాటలల్లుకుంటూపోతుంటావు (ఎడారి వసంతం) - అలా కవిత్వాన్ని ఒక సాహితీ సంచారిగా రాష్ట్ర-రాష్ట్రేతర ప్రాంతాలతో అంతేవాసి అనుబంధం అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్నారు.
ముఖ్యంగా 1980 తరువాత తెలుగు వచన కవిత్వ పరిణామ దశలు, వాదాలు అన్నింటా సమతుల్యత ప్రదర్శించటం అద్దేపల్లి సహానుభవశీలతకు నిదర్శనం.
వీటన్నింటి కంటే తక్షణావసరం పొంచి వుంది - అది సామ్రాజ్యవాద విషకీల, ప్రపంచీకరణ నేపథ్యంలోంచి వలస పెట్టుబడిదారుల కొండ చిలువల వేళ్లు సముద్రాల్నించి కబళిస్తున్నాయని హెచ్చరించిన దార్శనికుడు అద్దేపల్లి. అటు విప్లవ సాహిత్యపు వస్తు విస్తృతి, ప్రతిఘటన సామ్రాజ్యవాద వ్యతిరేకత, సమకాలీన అంశాలు ఎన్నో అద్దేపల్లికి మూలసూత్రాలుగా ఆలంబనలయ్యాయి. ఒక అభిప్రాయం ప్రకారం అప్పటి ఉమర్ ఖయామ్ రుబారుూల అనువాదం నుంచి ‘విలొకనం’ కవితా సంపుటి వరకూ అద్దేపల్లి రచనలు, సాహితీ విమర్శన గ్రంథాలు - రాబోయే వసంతాలకు చెరగని సంతకాలుగా తన అక్షరాల్ని - జ్ఞానముద్రలుగా తెలుగు వెలుగుల్ని కాంతిమయం చేశారు.
ఆయన మాతృభాషాభిమానంతో వ్రాసిన ఈ పదాలు చాలు // నువ్వు ఎన్ని ఇ-మెయిళ్లనైనా పంపుకో/ నాలుక చివర మాత్రం మాతృభాషకే ఇల్లు కట్టుకో// యిదీ ఆ మెరపుపువ్వు సంభాషణ. కొత్త తరాన్ని ప్రోత్సహించడంలో ఆయన కవితలు అభివ్యక్తిని-తాజాదనాన్ని, మెళకువల్ని నేర్పించాయి.
చాలామంది మిత్రులు అద్దేపల్లి గురించి ఒక్కటే నిజం చెబుతుంటారు. ‘అద్దేపల్లి-స్నేహశీలి బహుముఖీన ప్రతిభాశాలి - ప్రగతిశీలి’ ఇంతకంటే ఏ కవికైనా ప్రజల నాల్కలమీద నడయాడిన అదృష్టం గురించి వ్రాయడం జ్ఞాపకంగా ఉంచుకోవడం కంటే నివాళి ఇంకేముంటుంది.
అద్దేపల్లి మానవ సంబంధాల్ని, మనిషితనాన్ని సాహిత్యం కోసం, స్నేహం కోసం విలువల్ని గౌరవించడం తెలుసున్నవారు. కాలంలో ఎన్నో జీవసంఘర్షణలు అధిగమించారు. జీవితం కవిత్వం రాయడానికి అభ్యంతరం కాదన్నారు. సమాజం- చైతన్యం- లోచూపు- ప్రవాహమైన కవిత్వం నిరంతరం రాయాలనే తపన కలిగి ఉంటే ఎవరికైనా పేరు ప్రతిష్టలు వస్తాయని పలు సభల్లో చెప్పడం నేనెరుగుదును. అందుకు భాష, అభివ్యక్తి, శిల్పం రచనా స్పృహను పెంపొందించుకోవాలన్న మాటల్ని వర్తమానతరం కవులు గుర్తుంచుకోవాలి.
// పిడికిళ్లు బిగించి కూర్చున్న శిశువు/ తెలుగు అక్షరంలా కనిపించదూ?/ అక్షరం రాస్తున్న చెయ్యి ఆగదు// పొగచూరిన ఆకాశం. అద్దేపల్లి భౌతికంగా ఊపిరి వదిలేశారు. కవిత్వ సమూహంలో అందరికీ శ్వాసలై - సామ్యవాద - సామూహిక స్వప్నాల బాటల్లోంచి ఒక బావుటాను ఎగురవేసిన ప్రజాకవి - కీర్తి సాంధ్రుడు!!
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా.
email: merupurjy@andhrabhoomi.net

- విఎస్‌ఆర్‌ఎస్ సోమయాజులు సెల్: 9441148158