విజయవాడ

చమత్కారాల పద్య ప్రప్రాసాదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వద్దనరాదు భోజనము, వద్దనరాదు ఫలంబు, పుష్పముల్
వద్దనరాదు, మోహమున వద్దకు వచ్చిన కాంత కౌగిలిన్
వద్దనరాదు స్నేహితుని పల్కులు నీదు హితంబు గోరినన్
వద్దనరాదు భామవి సపర్యలు చల్లని సంధ్యవేళలన్!
చూశారా.. ఈ పద్యం ఎంత తేలికగా ఉందో! తేలికగా రచన చేయటం అంత తేలికగాదండీ! ఇలా రాసిన ఆయన ‘ఈ కవనమె నా జీవనము, ఈ కవనమె నాకు వ్యసన’మని ప్రకటించుకున్నారు. అంతేకాదు- ‘కవితపై గౌరవముంచిన వారంతా నాకు మాన్యులనీ, వారితో నేను చుట్టరికాన్ని కలుపుకుంటానని అంటూ తనకున్న ‘కవిమిత్ర’ బిరుదును సార్థకం చేసుకున్నారు. ఇంతకీ ఈయన తెలుగు పండితునిగా ఉద్యోగించినవారు కాదు. కానీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ గారు గురువర్యులై ఉత్తేజాన్నిచ్చారు. సర్వశ్రీ జొన్నవిత్తుల, బేతవోలు, శ్రీకాంతశర్మ వంటి మిత్రులు ప్రోత్సహించారు. కానీ వృత్తి మాత్రం స్టేట్ బ్యాంకులో ఉద్యోగం. రిటైరయ్యారు. పేరు వాడ్రేవు వెంకట సత్యప్రసాద్ గారు.
1962లో రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నపుడు ‘్ధనం’ గురించి పద్య కవితల పోటీ పెట్టినపుడు..
‘్ధనమా! బహుముఖముల సా
ధనమా! కోర్కెలకు మూలధనమా
నా ఇంధనమా! జీవితపున్ బో
ధనమా! నీ మహిమలెన్నతరమా! నాకున్!’
ఇత్యాదిగా పద్యాలు రాసి బహుమతి కొట్టేశారు. పోతన భాగవతంలోని ‘లేమా! దనుజుల గెలువలేమా!’.. అనే పద్య స్ఫూర్తితో రాశారు పైరీతిగా గొప్ప పద్యాన్ని.
‘కుక్కపిల్లా, సబ్బుబిళ్లా, అగ్గిపుల్లా కాదేదీ కవిత కనర్హం’ అన్న శ్రీశ్రీ స్ఫూర్తితోనూ పద్యాలు రాసిన వాడ్రేవు వారు మచ్చుకి అగ్గిపుల్ల మీద ఆటవెలదిని ఎలా వెలిగించారో చూడండి.
‘అగ్గిపుల్లయైన, అగరుబతె్తైనను
ఎండుపుల్లనంటి యుండునట్లు
భర్త వెనుక భార్య ప్రతిభ కన్పడుచుండు
వెలగబోడు ఆమె వెనుకలేక!’
‘్భర్య వెనుక భర్త ప్రతిభ కన్పడుచుండు
వెలగబోదు అతడు వెనుకలేక!’ అని మార్చి చదువుకోడానికి వీలుగా సందేశాత్మకంగా గొప్ప చమత్కారం చేశారు సత్యప్రసాద్ గారు.
‘ఇంటావిడ లేనప్పుడు
వంటావిడ వంటగూర్చి వహ్వా! యందున్
ఇంటావిడ యున్నప్పుడు
వంటావిడ వంటగూర్చి పలుకగ తరమే!’
అని ఓసారి ఆయన పలికిన కందంలో స్వచ్ఛ చమత్‌‘కార’ కాంతి కనబడటం లేదూ!- సంసారపక్షంగా. ‘పెళ్లిచూపులు - తదనంతరం’ శీర్షికలో స్ర్తి పురుష తత్వాలను సరదాగా ఎలా చమత్కరించారో చూడండి- అవే పదాలతో రెండు పద్యాలను రాసి మగవారి వైపు:-
‘పెళ్లిచూపులందు పిల్లిగ కనిపించు
పుస్తె కట్టగానె పులిగ మారు
ఆడవారి తత్త్వ మరయంగ వశవౌనె
ఎంత చదువుకున్న ఎవరితరము?’
ఆడవారి వైపు:- ‘పెళ్లిచూపులందు పిల్లిగ కనిపించు...’ అనే పై పద్యానే్న తిప్పారు చమత్కారంగా. సంసార పక్షమైన ఈయన చమత్కార సరదా పద్యాల్లో అమాయకత్వం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందుకు వీరి శ్రీమతి ఉమాకామేశ్వరి గారి గుణగణాలను తెలిపిన ఆటవెలది పద్యం నిదర్శనం.
‘మిడిసిపాటు లేదు గడుసుతనము లేదు
అదరగొట్టబోదు ఆదరించు
కల్లలాడబోదు కపటమెరుంగదు
కటువుమాట లేదు కవిత వినదు!’
‘కవిత విన’దని ఉన్నదున్నట్టుగా చెప్పటంలోనే ఉంది అమాయకత్వ రూపమైన చమత్కారం. సాధారణమైన ఇల్లాలి గురించి రాసిన ఈయన ఆటవెలదిని గూడా ఎవరు కాదనలేరు.
‘ఆదివారమొకటి ఆ మరురోజున
బందు జరుగు గుండె బాదుకొందు
శలవచ్చెనేని సంసార నౌకకు
చిల్లుపడును ఖర్చు బిల్లు పెరిగి!’.. ఇలా అతి సామాన్య విషయాలను అందరి స్పందనలకు ప్రతినిధిగా అలవోక పద్యాలను రాయటంలోనే ఉంది చమత్కారం.
‘హైద్రబాదునందు ఆటో ప్రయాణమ్ము
గూబ గుయ్యిమనును జేబు చిల్లు
మేటి ధీరుడతడు మీటరు ఛార్జిపై
ఎక్కువీయకుండ ఎక్కెనేని’.. ఇత్యాదిగా నిత్యమూ అనుభవించే హై‘్ధర‘బాధ’లను తేలికగా తెలియజెప్పారు సత్యప్రసాద్ గారు. ఇవన్నీ వీరి ‘పద్యప్రసాదం’ అనే ఖండకావ్య సంపుటిలో కనిపిస్తాయి. అప్పుడప్పుడూ వీరు రేడియో, టీవీలలో పూరించిన సమస్యాపూరణలలో సైకిలు, రిక్షా, ఆటో, కారు పదాలకు అర్థాలను మారుస్తూ భారతార్థంలో మత్త్భేంలో ఎలా నడిపించారో చూడండి- చమత్కారంగా!
‘అనుమా! సై!కిలుమున్ వదల్చెదను
శౌర్యాగ్నుల్ విజృంభించగన్
ఇనుడే సాక్షిగ పల్కెదన్ వినుము వైరి క్షాళనే ధ్యేయమై
దునుమన్ కౌరవసేన నంతట పటాటోపంబులున్ జెల్లు! కా
దను నారుూ కురువృద్ధులున్న సభ! తత్కారుణమే పారగన్!’
ఈ ఖండకావ్య సంపుటిలో కేవలం పద్య కవితలేకాక, ఆకాశవాణి- విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన లలిత గేయాలున్నాయి. ‘కాలానికి వౌన సాక్షలు, చరిత్రకి నిద్రిస్తున్న అక్షులు, బుద్ధిని బంధించే విరూపాక్షులు’.. ఇత్యాదిగా ‘పుస్తకం’పై అంత్యనుప్రాసలతో నిర్వచనాత్మకంగా చెప్పిన వచన కవితలూ ఉన్నాయి. ‘్భక్తిప్రసూనాలు’ అనే పేరుతో ప్రత్యేకంగా దేవతాపరంగా ఒక పుస్తకానే్న వెలువరించారు వీరు తర్వాత. గేయ, వచన కవితలున్నప్పటికినీ పద్యానికి పెద్దపీట వేసిన సత్యప్రసాద్ గారి ‘పద్యప్రసాదం’ చమత్కార రుచిరమైన పద్యప్రసాదమే! అంటే.., అందాల పద్యభవనమే!!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287

***
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,