విజయవాడ

రత్నగర్భ నా తెలుగు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా తల్లి గురించి కవిత రాయాలట
రాస్తాను కవితేగా! కానీ..
ఎంత చిత్రమైన సందర్భం
తల్లి బతికుందని కొడుకు సాక్ష్యం చెప్పాలా?
నిన్నమొన్నటిదాకా అందలమెక్కిన నా తెలుగు
నేడు అంతరించే భాషల్లో వుందంటే
ఈ తప్పెవరిది?
చిత్తశుద్ధిలేని పాలకులదా,
పాశ్చాత్య పోకడలవైపు
పరుగులు తీస్తున్న ప్రజలదా?
వౌనం వహించి ప్రయోజనం లేదు
చేయిచేయి కలిపి చేసిన పాపాన్ని
చెప్పుకునైనా కడుక్కోండి

ఎంత గొప్ప భాష నా తెలుగు
జీవనదిలా సాగుతూ ఎంతోమంది
కవుల కల్పనలలో కవితలా మారింది
విద్యాజ్ఞానం లేనిచోట
అక్షరామృత తేనెలూర
ఆశుకవితై జాలువారింది

పేగుతెంచిన ఏడ్పులోను
చంటిపాపల నవ్వులోను
ఆనందాశృధారల్లోను తానై ప్రతిఫలించింది
వచ్చీరాని ముద్దుమాటల నుండి
వృద్ధాప్యాన ప్రేమగా నెమరే స్పర్శ వరకు
అంతా.. అన్నింటా.. తానే అంతర్వాహిని

భావాలను, అనుభవాలను
అనుభూతులను, ఆప్యాయతలను
అన్నింటినీ అందంగా మలిచేది నా భాషే
నా మాతృభాష గురించి
ఎవడో ఒక్క వెర్రికూత కూసినంత మాత్రాన
రత్నగర్భ ఎండిపోతుందా..
దివ్యజ్యోతి ఆరుతుందా!
నరనరాన అణువణువున నన్ను పెనవేసుకుని
చైతన్యమై నడిపే తెలుగుతల్లి
నిర్జీవంగా మారిందనటం
బతికున్నవాడికి డెత్ సర్ట్ఫికెట్ ఇవ్వటం కాదా?

ఎవడో విసిరిన నాలుగు ఎంగిలి
మెతుకులు ఏరుకుని
మమీ డాడీ అన్నంతమాత్రాన
ఆంధ్రమాతను అమ్మానాన్నను
ఎవ్వరైనా మరచిపోతారా?

వేల సంవత్సరాల సంప్రదాయం నా భాష
వారసత్వ సంపద నా భాష
నమ్మకపోతే నాతో రండి
విశ్వవ్యాపితమైన పరిమళాల
తెలుగుతోటకు తీసుకెళతా
సుందర సుమనోహరమై
వికసించిన కుసుమాక్షరాలు కోసుకుని
తెలుగు సాహిత్య వీధుల్లో విహరింతురు గాని
జై తెలుగుతల్లి..
జైజై కావ్య కళామతల్లి!

- పెరుగుపల్లి బలరామ్,
నాగార్జున విశ్వవిద్యాలయం.
చరవాణి : 9676636816
***

అబ్దుల్ కలాంకో సలాం

1. వెన్నముద్దయే గుండెలోనున్న మనిషి
వాణినే బుద్ధినిల్పిన ప్రాజ్ఞతముడా
మానవత్వమె రూపవౌ మహితమూర్తి
అబ్దులు కలాము! జోహారు లందుకొనుము
2. అంత ఎత్తుకు పెరిగి ఆమ్రతరువు
పండ్లనిచ్చెడి కోర్కెతో వంగియుండా
తాడినెక్కగా వలె కోర తాటిముంజ
పెద్ద పదవి కల్గియు నిక్కుపిసరు లేదు
3. పెదవి విప్పిన బిరబిర సుధలు కురియు
పల్కులే కాదు విజ్ఞానమొల్కు వాణి
కర్ణపుటముల కింపునే కరముకూర్చు
డంబమెరుగని నిస్వార్థ డాక్టరతడు
4. అర్ధ చంద్రాకృతినుండు అతని నుదుట
నున్న అలకలు, సాక్షి ప్రసన్నతకు, వి
శాల నేత్రమ్ములార్ద్ర గుణాల గనులు
అతని దేహమే మేటి దేవాలయంబు
5. మరణమందియు - ప్రజల సన్మానసముల
కొలువుదీరిన మాన్యుండు - వెలుగుచూపు
దివ్వెయైయొసగు ఘనుడు, భువ స్థిరగుణుండు
ఆ కలామునకు సలాము లాచరింతు
6. నిన్నమొన్ననో కనుమూసి నింగికేగి
నట్టులనిపించు మా సుహృదబ్జములకు
కాని వత్సరంబును దాటె కనులముందె
సజ్జనులు పోవనిట్లన సహజవౌను!

- కలవకొలను సూర్యనారాయణ,
గుంటూరు.
చరవాణి : 98492 68659
***
భూమాత సందేశం

ఆవగింజంత మర్రిగింజ
నీపై పడ్డప్పుడు ప్రేమతో
దాన్ని నీ కడుపులో
దాచుకొని
అది నీలో సన్నని సూదిలా,
దబ్బనంలా, గునపంలా
చొచ్చుకుపోతుంటే
నీరు, పోషకాలనిచ్చి
దాన్ని మహావృక్షంలా
ఎదగనిస్తావు
ఎంతో సహనం చూపిస్తావు
కాసిని గింజలను నీలో పోసి
కొన్నాళ్ళు ఆగితే
మొక్కలుగా మార్చి పెరగనిచ్చి
ఫలవంతం చేసి
పుట్లకొలది ధాన్యాన్నిచ్చి
మా పొట్టలు నింపుతావు
మా ప్రాణాలు నిలబెడతావు
మేముండేది నీపైనే
నడిచేది నీపైనే
ఆడి పాడేది నీపైనే
మా విసర్జకాలు నీపైనే
అయినా శాంతి చూపుతావు
మాకు నీవిచ్చే సందేశం
సహనమే! సహనమే!
అది ఆచరిస్తే భూమిపై
అంతా ఆనందమే
ప్రతి దేశమూ
నందన నిలయమే!

- దేశం పాపిరెడ్డి, గుంటూరు.
చరవాణి : 9849048242