విశాఖపట్నం

భూమి గుండ్రంగా ఉంది (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్ధూ అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.
జీతం మన కరెన్సీలో చూసుకుంటే లక్షల్లో ఉంటుంది. మంచి రూపం, రంగు ఉండడంతో మంచి సంబంధమే వచ్చింది. అమ్మాయి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా అమెరికాలోనే పని చేస్తోంది.
అయితే ఇద్దరూ అమెరికాలోనే వేర్వేరు కంపెనీలలో పని చేస్తున్నారు. అంతేకాదు వారిద్దరూ వేర్వేరు సిటీల్లో ఉంటున్నారు. వీకెండ్స్‌లో మాత్రమే ఇద్దరూ కలుస్తుంటారు. ఒక వారం సిద్ధూ ఆమె వద్దకు వెళితే, మరో వారం లావణ్య అతని దగ్గరకి వెళుతుంది.
‘ఇద్దరూ కలసి ఒకే కంపెనీలో చేరవచ్చు కదా’ అని వారిని ఎవరైనా అడిగితే ‘చేరొచ్చు కానీ ఆశించినంతగా జీతాలు రావు. ఇద్దరం ఒకే రూఫ్ కింద ఉద్యోగాలు చేస్తే ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలాగూ వీకెండ్స్‌లో కలుస్తున్నాం కదా’ అంటారు.
ఈ సమాధానానికి పెద్దవాళ్లు నొచ్చుకునే వాళ్లు. ఇగో ప్రాబ్లం భార్యాభర్తల మధ్య ఎందుకొస్తుంది. మన కాలంలో ఇలాంటివి చూశామా అనుకునేవారు.
వాళ్ల పెళ్లయి అయిదేళ్లు కావస్తుండడంతో పిల్లల గురించి ఎవరైనా అడిగితే కూడా వాళ్లు చిత్రంగానే సమాధానం చెప్పేవారు. ‘మేము మరో అయిదేళ్లు ఎంజాయ్ చేసి, బ్యాంక్ బాలెన్స్ పెంచుకున్న తర్వాతే పిల్లల్ని కంటాం. అంతవరకు ఎంజాయ్ చేస్తాం’ అనేవారు. ‘వీళ్లదేం కాపురంరా బాబూ. ఆన్‌లైన్ చాటింగ్స్, వీకెండ్ కలయికలు, పిజ్జాలు, బర్గర్లే భోజనం, నో అచ్చట్లు, నో ముచ్చట్లు’ అంటూ అంతా చెవులు కొరుక్కునేవారు. అయితే సిద్ధూ, లావణ్య ఇవేవీ పట్టించుకునేవారు కాదు.
అయితే ఇలాంటి మాటలు విని సిద్ధూ, లావణ్యల తల్లిదండ్రులు మాత్రం బాధపడేవారు. వారు తమ పిల్లలకి చెప్పినా వారు వినిపించుకునేవారు కాదు. దాంతో పెద్దవాళ్లు తమలో తామే బాధపడేవారు.
సిద్ధూ, లావణ్యలు కనీసం వీకెండ్స్‌లో షాపింగ్ కూడా చేసేవారు కాదు. ఆన్‌లైన్ షాపింగ్ చేయడమే మేలని, అప్పుడే టైమ్ సేవ్ అవుతుందని అనేవారు. వీకెండ్‌లో బయటికి వెళ్లకుండా పూర్తిగా ఏకాంతంగా గడుపుతామని, ఆ రెండు రోజులు వైన్ తీసుకుంటూ, కక్కా, ముక్కలతో ఒంటరిగా ఇద్దరమే హాయగా కాలం గడుపుతాం అని చెబుతుంటే వినేవారంతా ఇదెక్కడి చోద్యంరా బాబూ అనుకునేవారు.

- మీగడ వీరభద్రస్వామి,
దుర్గాలమ్మకాలనీ, చోడవరం,
విశాఖపట్నం జిల్లా-531505. సెల్ : 9441571505.
ఉండబట్టలేని వారు మాత్రం ‘ఇదెక్కడి కాపురం. మనం ఇండియన్లం. ఇండియన్లలా బిహేవ్ చేయండి. మానవ సంబంధాలతో జీవిస్తే హాయిగా ఉంటుంది. పిల్లల్ని కనడంలో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి’ అని చెబితే సిద్ధూ, లావణ్యలు తేలిగ్గా వారి మాటల్ని కొట్టిపారేసేవారు.
కాలం కొన్ని సంవత్సరాలు గిర్రున తిరిగింది. సిద్ధూ, లావణ్యల తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కైప్‌లో చూడడం తప్ప ప్రత్యక్షంగా చూసి ఏళ్లయింది. దాంతో వాళ్లకి పిల్లల్ని చూడాలని అనిపించేది. ఇదే మాట వారితో అంటే ‘ఇండియా రావడానికి బోలెడు ఖర్చు. సెలవులు ఉండవు. జీతం లాస్’ అనేవారు. ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు.
అయితే ఎన్ని సంవత్సరాలు అయినా వాళ్లు ఇక్కడికి రావడం కనిపించలేదు. దాంతో సిద్ధూ, లావణ్యల తల్లిదండ్రులు కూడబలుక్కుని ‘మీరు ఎలాగూ ఇండియా రావడం లేదు. మేమే వద్దామని అనుకుంటున్నాం’ అని ఫోన్ చేశారు. దానికి వెంటనే వారు సమాధానం చెప్పారు. ‘ప్రస్తుతం మేమిద్దరం ఒకే కంపెనీలోకి రావడానికి ప్రయత్నిస్తున్నాం. మా యాజమాన్యాలు ఒప్పుకుంటే అది సాధ్యం అవుతుంది. దీనికి కొంత టైం పడుతుంది. అంత వరకు మీరు రావద్దు. మా కెరీర్‌ని డిస్టర్బ్ చేయొద్దు’ అనేసారు.
ఇక చేసేది లేక పెద్దవాళ్లు వౌనం వహించారు.
* * *
వీరి గోల ఇలావుంటే, ‘అమెరికాలో చదువుకుని నిరుద్యోగులుగా ఉన్న సొంత వారిని కాదని ఇండియా, ఇతర దేశాలకు చెందిన యువతకు పెద్దపెద్ద ఉద్యోగాలు ఇచ్చి, వేల డాలర్లలో జీతాలు చెల్లించడం సమంజసం కాదు. ముందు మన వారికి ఉపాధి చూపించి, తర్వాత ఇతరులకు ఉద్యోగాలు ఇద్దాం’ అని అమెరికన్ నేతలు తీర్మానించుకున్నారు. దాంతో వెంటనే అది కార్యాచరణకు వచ్చింది. అమెరికాలో వేల డాలర్లు తీసుకుంటూ పనిచేస్తున్న ఇండియన్లు, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులను తొలగించడం మొదలుపెట్టారు. సిద్ధూ, లావణ్యలను వాలెంటరీ రిటైర్‌మెంట్ చేసెయ్యాలని అధికారులు ఆజ్ఞాపించారు.
వారిద్దరికీ చేసేదేం లేకపోయింది. ఇద్దరూ ఇండియా వెళ్లిపోయి అక్కడే సెటిల్ అవుదామని నిర్ణయించుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పారు. వారు సంతోషించారు.
ఆన్‌లైన్‌లో బెంగళూరులోని ఒక రియల్ ఎస్టేట్ సంస్థతో మాట్లాడి అక్కడే ప్లాట్ కొనుక్కున్నారు సిద్ధూ, లావణ్య.
ఈ విషయం పెద్దవాళ్లకి చెప్పలేదు. నేరుగా బెంగళూరు వెళ్లిపోయి ప్లాట్‌లో దిగి వారం రోజులు ఉన్న తర్వాత పెద్దవాళ్లకి ఈ విషయం చెప్పారు. వెంటనే సిద్ధూ, లావణ్యల తల్లిదండ్రులు బెంగళూరు చేరుకున్నారు. అయితే సిద్ధూ, లావణ్య పెద్దవాళ్లతో పెద్దగా మాట్లాడలేదు. ‘‘ఎప్పుడూ స్కైప్‌లో మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఇంకేం మాటలు ఉంటాయి?’’ అని నిర్మొహమాటంగా చెప్పేసారు.
పెద్దవాళ్ల మనసులు గాయపడ్డాయి. అయినా తమ పిల్లలే కదా అనుకుని వాళ్లు సర్దుకుపోయారు.
‘‘మేము ఇక్కడ బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. నేను మలేషియా, లావణ్య సింగపూర్ వెళ్లి రావాలి. ఇద్దరం తిరిగి రావడానికి రెండు మూడు నెలలు పడుతుంది. మీరు త్వరగా మన ఊరు వెళ్లిపోతే మా పనిలో మేము ఉంటాం’’ అన్నాడు సిద్ధూ తల్లిదండ్రులతో. వాళ్లు అవాక్కయ్యారు.
‘‘మీరు అవసరానికి కావలసిన దాని కంటే ఎక్కువే సంపాదించుకున్నారు. ఇకనైనా ప్రశాంతంగా ఉండండి. మన పల్లెటూరిలో మంచి వాతావరణం, ప్రశాంతత ఉంటుంది. మనకు ఇళ్లు ఉన్నాయి. అవీ నచ్చకపోతే మంచి సౌకర్యాలతో మీరే మంచిగా కట్టుకోవచ్చు. పిల్లా పాపలని కని హాయిగా ఉండండి’’ అని సిద్ధూ తల్లి అంటే ‘‘అమ్మా నీకు తెలియదు... ఇండియాలో డబ్బున్న మొదటి పదిమందిలో మేము ఉండాలని అనుకుంటున్నాం’’ అని సమాధానం చెప్పాడు.
‘‘ఇంకా ఈ పరుగులెందుకు? పిల్లల్ని కనేదెప్పుడు?’’ అన్నారు పెద్దవాళ్లు. దానికి సిద్ధూ, లావణ్య ఇద్దరూ తల్లిదండ్రుల మీద కస్సున లేచారు. ‘‘మేమేమీ ముసలివాళ్లం కాదు. ముందు డబ్బు సంపాదించనివ్వండి. తర్వాతే పిల్లల్ని కంటాం’’ అని వాళ్లని కసురుకున్నారు.
దాంతో పెద్దవాళ్లు నిరాశతో తమ ఊళ్లకి వెళ్లిపోయారు.
* * *
సిద్ధూ, లావణ్య సొంతంగా బిజినెస్ మొదలుపెట్టారు. అయితే వ్యాపారంలో అంత అనుభవం లేకపోవడం, ఒకేసారి పెద్దగా వ్యాపారం మొదలుపెట్టడంతో మొదటి సంవత్సరం వారికి నష్టం వచ్చింది. రెండవ సంవత్సరం వ్యాపారం కుదుటపడినట్లే అనిపించింది కానీ, చివరికి లాసే వచ్చింది. అదే సమయంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు పొడసూపాయి. ఆర్థిక సమస్యలు దీనికి తోడు కావడంతో ఇద్దరూ మెంటల్ బ్యాలెన్స్ తప్పిపోయి ఎలా బిహేవ్ చేస్తున్నామో తెలుసుకోలేకపోయారు. జీవిత భాగస్వామితో ఎవరికి వారు పరుషంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దీంతో వారి మధ్య అగాథం మరీ పెరిగిపోయింది. ఈ దుస్థితికి నువ్వు కారణం అంటే నువ్వు కారణం అంటూ ఇద్దరూ బద్ధశత్రువుల్లా కాట్లాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి వ్యవహారం విడిపోవడం దాకా వచ్చింది. సిద్ధూకి ముప్పై ఎనిమిది, లావణ్యకి ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చేశాయి. కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. ఇక లాభం లేదనుకుని తల్లిదండ్రులు రంగప్రవేశం చేశారు. పిల్లల చెంపలు వాయించారు. అయినా కోర్టు తీర్పు.. విడాకులు తప్పదు కాబట్టి ఎవరి తల్లిదండ్రులతో వారు వెళ్లిపోయారు.
* * *
సిద్ధూ, లావణ్య తల్లిదండ్రులతో పల్లెటూళ్లకి వెళ్లిపోయారు. ఆ వాతావరణం మొదట్లో వారికి పెద్దగా నచ్చలేదు. బిజినెస్‌లో పోగా మిగిలిన డబ్బును ఇద్దరూ తల్లిదండ్రులకి ఇచ్చేసి తమ భారం వాళ్ల మీదే వేశారు. ఇల్లు కదలకుండా, ఎవరితోనూ మాట్లాడకుండా ఫోన్లలో స్నేహితులతో మాట్లాడుకుంటూ కాలం గడిపేవారు. వాళ్లని చూసి తల్లిదండ్రులకి కోపం వచ్చింది. ‘‘అన్నీ ఆన్‌లైన్ ఆన్‌లైన్ అంటూ ఉప్పు, పప్పు నుండి కొంప వరకు అలాగే కొనుక్కున్నారు. వయసులో ఉండగా భార్యాభర్తలు ఎలా ఉండాలో తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు ఇద్దరూ నలభైలో పడుతున్నారు. ఇప్పటికైనా కలుసుకోండి. కలసి బతకండి’’ అని పెద్దవాళ్లు పోరేసరికి అలా చేయాలని అనుకున్నారు. అయితే ముందుగా మాట్లాడితే తక్కువైపోతాం అనుకుని ఎవరికి వాళ్లు మిన్నకుండిపోయారు.
దీంతో లావణ్య తల్లిదండ్రులు ‘‘మేము కాశీ వెళుతున్నాం. రావడానికి సంవత్సరం పడుతుంది’’ అని వెళ్లిపోయారు. అది పల్లెటూరు కావడంతో అక్కడ ఆన్‌లైన్‌కి ఆవకాయ అమ్మేవాడు కూడా పలకడు కాబట్టి అన్నీ స్వయంగా వెళ్లి తెచ్చుకునేది లావణ్య. అలాగే పోస్ట్ఫాసు, బ్యాంకు, బస్టాండ్, రైల్వేస్టేషన్ అన్నిటికీ ఆ పల్లె నుండి దూరంలో ఉన్న పట్నానికి వెళ్లాలి. దాంతో తోడు ఉండక తప్పదు. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే సిద్ధూ పరిస్థితి కూడా అలాగే ఉంది. అతని తల్లిదండ్రులు కూడా లావణ్య తల్లిదండ్రులతోనే కలసి కాశీ వెళ్లడం వల్ల అతను కూడా ఒంటరిగానే ఉన్నాడు. దాంతో అయిష్టంగానే ఇద్దరూ కలుసుకున్నారు. కలిసే అన్ని పనులు చేసుకునేవారు. కలిసే తిరిగేవారు. అలా నెలలు గడిచాయి కానీ పెద్దవాళ్లు కాశీ నుండి రాలేదు. రమ్మంటే ఇదిగో అదిగో అంటూ, సంతాన కామేష్టి యాగం చేస్తున్నాం అంటూ చెప్పేవారు. చేసేదిలేక సిద్ధూ, లావణ్య కలిసి ఒకేచోట ఉండేవాళ్లు. అలా కొన్నాళ్లకు వారికి భార్యాభర్తల బంధంలోని మాధుర్యం అవగతం అయింది. ‘మీరు ఇష్టపడితే ఎప్పుడైనా కలుసుకోవచ్చు. అప్పుడు విడాకులు వాటంతట అవే రద్దు అవుతాయి’ అని గతంలోనే కోర్టు చెప్పిన మాటలు వారికి గుర్తుకొచ్చాయి. దాంతో ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకున్నారు. తప్పు చేసినట్లు ఒకరికి ఒకరు చెప్పుకుని ఇద్దరూ ఒక్కటయ్యారు. లావణ్య గర్భవతి అయింది. ఆ పల్లెలోని మంచితనం, మానవత్వం, స్నేహం, ప్రేమ, ఆప్యాయత, అనురాగం అన్నీ వారికి అవగతం అయ్యాయి. ఇక ఇక్కడే ఉందాం అనుకున్నారు. ఇద్దరి దగ్గర మిగిలిన డబ్బుతో ఇక్కడే రైస్‌మిల్లు పెట్టుకుందాం అనుకున్నారు. విషయం ఇరుగుపొరుగు ద్వారా కాశీలో ఉన్న పెద్దవాళ్లకి తెలిసింది. వాళ్లు వెంటనే తిరిగి వచ్చారు. పిల్లల ఆశయానికి అండగా ఉంటూ ఆదర్శ తల్లిదండ్రులు అనిపించుకున్నారు.
డబ్బు సంపాదన, అమెరికాలో బతకడం, గొప్పగా ఉండడం కాదు... మనుషుల్లా బతకడం, మానవత్వంతో జీవించడమే ప్రతి మనిషి ప్రథమ కర్తవ్యం అని సిద్ధూ, లావణ్యలు తెలుసుకోవడంతో వారి తల్లిదండ్రులు సంతోషించారు.

- మీగడ వీరభద్రస్వామి