ఉత్తర తెలంగాణ

ఓ కన్నీటి బిందువా! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడలి ఒడిలోన ఓలలాడే ఓ కన్నీటి బిందువా!
ఏ దారిన నుండి నను వదిలి పరుగిడినావో?
మంచి ముత్యాల సొబగులద్దుకొని మురిసిపోయేవో
జలధి ధారలవెంట పయనమయ్యేవో?
పగడపు దీవిలో పవలించినావో?
మత్స్యకన్యలతో నీవు ముచ్చటించేవో?
ఆ ఊసులను మోసుకొని మునిగి తేలెదవో!
నే మరువను ఓ కలువ
నీ కరుణతో కూడిన జాతి చూపులను!
ఎదురు చూసిన కల వెనె్నలైపూచేనో..
రాతి మనసు కరిగి రంగులు పులుముకునేనో
ఎండిన సెలయేరు నిండుకుండలా మారేనో
కానరాని అరుంధతి ఎదురొచ్చి నవ్వేనో
అందని చందమ నింగి విడిచి వచ్చనో?
రాత రాసిన బ్రహ్మ కనుతెరిచి చూసేనో
సాటి మనిషి బాధవిని కరుగు తత్వమిచ్చేనో
ఆదిలో కీర్తినే కాంక్షించి భవిష్యత్తులో ఏదీ లేకున్నా
ప్రశాంతత కావాలని కాంక్షించే ఓ మనిషి వింతగాథ!

- నీలగిరి అనిత, కరీంనగర్
సెల్.నం.9014894141
***
నిశ్శబ్దలోకం

నిశ్శబ్దం భయంకరం
నిశ్శబ్దం అభయంకరం
రణగొణధ్వనుల జనజీవనంలో
గగన కుసుమం నిశ్శబ్దం
వాతావరణ రహిత గ్రహాలలో
పాతుకొనిపోయిన నిశ్శబ్దం
భూతలానికి రానంటోంది
మానవరహిత మృగారణ్యాలలోనూ
ప్రత్యక్షం కాదు నిశ్శబ్దం
మానసిక గుహలో మాత్రం
మాటువేసి ఉండే నిశ్శబ్దం,
జీవాత్మల యోగంతో మేలుకొంటుంది
నిశ్శబ్దం ఒక లోకం.. నిశ్శబ్దం అభినవనాకం
ఒక్క క్షణం నిశ్శబ్దంలోకి వెళ్లివస్తే చాలు
ఓజస్సు అపారంగా పెరిగిపోతుంది
నిశ్శబ్దశక్తి పరమాణుతేజస్సుతో సమానం
శాంతికోసం వినియోగిస్తే క్షేమం
నిశ్శబ్దం సృష్టించే జగత్తు అమరధామం!

- డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి, సెల్.నం.9440468557
**
చిన్నచూపు

మనుషులందరిలో
ప్రవహించే రక్తం
ఒకే రంగు కలదనీ,
మనుషులందరూ సమానమేననీ
మనం ఎన్ని ఆదర్శాలు చెప్పుకున్నా
భేదభావాలు వద్దని ఎంత మొత్తుకున్నా
అవి నీటి మీది రాతల వలె
ఆకాశంలో గీచిన గీతల వలె వ్యర్థమవుతున్నాయి!
మనుషుల లోపల మనసులలో
వేళ్లూని ఉన్న ఆలోచనలు వేరు
అవి మానవతకు బద్ధ వ్యతిరేకం!
ధనవంతులకు పేదవారంటే చిన్నచూపు!
బలవంతులకు బలహీనులంటే చిన్నచూపు!
అందమైనవాళ్లకు అందవికారులంటే చిన్నచూపు!
సోఫాలో కూర్చునే వాళ్లకు
శ్రమజీవులంటే చిన్నచూపు!
తెల్లతోలు గలవాళ్లకు
నల్లతోలు గలవారంటే చిన్నచూపు!

- రఘవర్మ, జగిత్యాల
సెల్.నం.9290093933
***

జీవితం

సూర్యోదయాలు చంద్రదర్శనాలు
మెరిసే నీటి అలలు కదిలే మేఘాలు
నా హృదయపు కాగితం మీద
పరుచుకున్న జ్ఞాపకాల వీధులు
మసక మసక వెనె్నల్లో ఇసుక తినె్నలు
నిలిచి ఉన్న కొండలు అద్వైతానుభూత శిఖరాలు!
పద్మాలకు కలువలకు
నిలయమైన రాగరంజితమైన సరస్సులు
ఏకాంతాల నిరీక్షణలు, విరహగీతికలు
శిశిర జీర్ణపత్రాలు ఒంటరి నక్షత్రాలు
నేను పారేసుకున్న జ్ఞాపకాల అనుభూతులు
శరత్కాల అనుబంధాలు
హేమంత నిర్లిప్తతలు, వ్యర్థ వైరాగ్యాలు
ఆమని అందాలు
కాసిన్ని కన్నీళ్లు, కాసిన్ని చిరునవ్వులు
ఇలా ఇవన్ని కలిస్తే
ఇదేగా జీవితమంటే!

- టి.సుధాత్రి, నిజామాబాద్
సెల్.నం.8686961611
**

ముళ్ల నవ్వు

ఆకాశాన్ని అరచేతిలో పెట్టుకొని
ఆడుకోవడం నాకు సరదా
నక్షత్రాలను నామైదానానికి ఆహ్వానించి
ఆట మొదలెట్టడం నాకు ఆనందం
ఎక్కడ ఆగాను నేను?
గమనం ఎక్కడా ఆగలేదు
ఆనందం పట్టాల మీద పరుగులు తీస్తున్నప్పుడు
ప్రకృతి పండుగ చేస్తున్న తీరు..
ఇది ప్రయాణం కాదు!
ఓ మల్లెపూల యాణం
చెట్టుమీది గులాబీని చూస్తూ కూర్చోవాలా?
దేవుడు ఎదిరి చూస్తున్నాడని?
ముళ్లతో యుద్ధం చేయనా?
చెట్టుమీదే నాకు ఆనందం
గుట్టమీది దేవుడు
పూలతో కాదు వెలిగేది
నా కాంతిలో కాంతి అయి
ఏ ఆనందాన్ని వెతుక్కుకుంటున్నావు బాబూ నీవు
ఆకలి వున్నదే!
విషాదం మనదే!
ఈ రెండు దారులలో కూడా
ముళ్లను ఏరుకుంటూనే
నవ్వుల పూలు పూయిస్తాను

- సిహెచ్.మధు, నిజామాబాద్
***

హరిత శ్రావణం

ఆకాశ దేశాన
సాగిపోతున్న శ్రావణ మేఘాలు
వరాల వర్షం కురిపిస్తుంటే..
వాగులు, నదులు పొంగిపోతుంటే
కొండకోనల్లో జలపాతాలు
దూకుతుంటే
దక్షిణాయణ పుణ్యకాలంలో
ధరణి అంతా పచ్చచీర కట్టుకుని
మురిసిపోతుంది
పాడి పంటలను
నమ్ముకున్న రైతు గుండె
పట్టలేని సంతోషంతో
తడిసి పోతుంది!
శ్రావణ శుక్రవారాలు
సంబరంలో
వరలక్ష్మి వ్రతాలు
వైభోగంతో
ఎటుచూసినా శోభాయమానం!
వనితల పాలిట ఇది కాదా
వసంత మాసం!
ఆహ్లాదకరమైన
వాతావరణంతో అలరారుతుంది!
ఆకుపచ్చని శ్రావణం!
పచ్చదనం వైపు
అడుగులేస్తుంది జనజీవనం!

- రంగు గోవర్ధన్
కరీంనగర్
సెల్.నం.9849497679
**

ఆటబతుకు

మెరిసేదంతా!
సరియా! బంగారమా!
కాదు కాదు
మెరుపుని జూసి జడసుకోకు
మెరుపులోని విరుపుల జూసి
వొడిసిపట్టి
నీవు భేషుగ్గా
చుక్కలతో ఆడుకోవాలి
చక్కదనం కలిగించాలి
నీది నీకు ఉల్లాసమనిపించినా
చూసేవారికో ‘షాక్’
లోకానికో ‘ఊపు’ కావాలికదా!
జోడు కట్టుటలో వొక్కక్కసారి
కుడి ఎడమలు కావొచ్చు
తామరాకు మీది
నీటి బొట్టు కదా బతుకంటే!
ఇది తెలిసుంటే ఈ దిగులేల?
ధీరునిలా, వీరునిలా విజృంభిస్తూ
ముందుకు సాగిపో
తప్పదు ఎవరికైనా
బతుకు పోరాటం
దానిలో జీవి
ఓ ఆటగాడు మాత్రమే కదా!

- కూర్మాచలం వెంకటేశ్వర్లు
కరీంనగర్
సెల్.నం.7702261031
**
బంగారమ్మా...

తారల తళుకులతో పోటీపడే నయనాలు
పాల మీగడలు జాలువారే అధరాలు
దూది పింజలాంటి పాదాల్ని
చెక్కిళ్లకేసి రుద్దుకుంటుంటే
ఆ మధురానుభూతి చెప్పనలవికాదు
చిట్టి చేతుల్ని ముద్దాడుతుంటే
చిత్తం ఎక్కడికో ఎగిరి పోతున్నట్లుంటుంది
ఎత్తుకొని ఎదకు హత్తుకుంటుంటే
మెత్తని తీయని అనుబంధాల్ని
పెనవేసుకుంటున్నట్లుంది
బోసినవ్వుల కేరింతల్లో
బోలెడన్ని పున్నమివెనె్నల్లు
జలకమాడుతున్నట్లుంటుంది
జీవితానికొక అర్థం పరమార్థం
సిద్ధిక్షగా అవతరించి
అనుగ్రహింపబడినదిగా ఉంటుంది
కల్లా కపటం తెలియని పిల్లలు
దేవుని ప్రతిరూపాలంటే ఇదేనేమో
దివ్య శశాంకుల బంగారుకొండ
కావ్య జగత్తున
ఛందస్సలంకారపు సుమనవరాలు
చిరుగజ్జెల సవ్వడితో
కరకంకణ గలగలతో
పోరాడుతూ..పరుగెడుతూ
పల్టీలు కొట్టే పిల్ల వస్తాదు
ముసలివాళ్లతో ముసిముసిగా నవ్వుతూ
ముచ్చట్లు చెప్పే పసిడి వనె్నల అపరంజి
అమ్మ లాలతో నాన్న జోలతో
అమ్మమ్మ తాతయ్యల ఒడిలో
గుమ్ముగా నిదురను పోయే విరజాజి
భాషకు అందని ఊసులతో
ఆశలు రేపుతూ హాయిని పంచే సింగారి
కంటికింపుగా ఆటలాడుతూ
ఇంట నిలిచిన బంగారమ్మ!

- రాకుమార, గోదావరిఖని
సెల్.నం.9550184758