రాజమండ్రి

నాన్న మాట! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘మా నాన్న చనిపోయే ముందు మీ నాన్నకి ఏం చెప్పారు?’’ అడిగాడు రాంప్రసాద్ భార్య కౌసల్యని.
‘‘నేను విన్నానా’’ అంది కౌసల్య.
‘‘నాకు తెలియాలి అది’’
‘‘అయితే మా నాన్నని అడగండి’’
‘‘మీ నాన్న నిజం చెబుతాడని అనుకోను’’
‘‘అయితే ఊరుకోండి’’
‘‘నీ జవాబేం బాలేదు’’ కోపంగా అన్నాడు రాంప్రసాద్.
‘‘నాకు తెలియని విషయం అడిగితే జవాబిలాగే ఉంటుంది మరి’’
‘‘మీ నాన్నో నెంబర్‌వన్...’’ అంటూ ఆగాడు.
‘‘అది పెళ్లికి ముందే అడగాల్సింది’’
‘‘అప్పుడు తెలియదు’’
‘‘మా నాన్నా అలాగే అనుకుంటున్నాడు’’
‘‘మాటలు నేర్చావ్’’
కౌసల్య ఆవేదనంతా క్షణాల్లో పెల్లుబుకింది.
‘‘మాటకీ మా నాన్నని అంటారు. ప్రేమించానన్నారు. మీరు ఇష్టపడి చేసుకుంటానని అనడంతో మా నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించకుండా టీచర్ ట్రైనింగ్ చేయించాడు. మరీ పెద్ద చదువులు చదివితే మీరు చేసుకుంటారో8 లేదో అన్న భయంతో. మీరూ బియిడి చేస్తే సంతోషించారు. ఉన్నంతలో ఏ లోటూ లేకుండా పెళ్లి చేశారు. అప్పట్లో మీ ఉద్యోగం పోయినా పెళ్లయ్యే వరకూ అది బయటికి పొక్కుకండా గుంభనంగా ఉంచింది మీరు. అది తెలిస్తే పెళ్లి కొన్నాళ్లు వాయిదా పడుద్దని మీ భయం. ఆడపిల్లనే అయినా నిశ్చితార్థం జరిగే వరకు నన్నూ, అన్నయ్యని కంటికి రెప్పలా చూశారు నాన్న. మీకో విషయం తెలుసా తనతో మనస్ఫూర్తిగా మాట్లాడేవాళ్లు, ఎక్కువ సేపు మాట్లాడేవాళ్లు లేక మీరంటే ఎంత ఇష్టపడ్డారో’’
‘‘మీ పుట్టింటి గొప్పలు చెప్పనక్కరలేదు’’ ఎకసెక్కంగా అన్నాడు రాంప్రసాద్.
‘‘అవేం గొప్పలు కాదు నిజాలే’’ అంది కౌసల్య.
‘‘ఏమైనా మీ నాన్న...’’
‘‘మా నాన్న గురించి ఎక్కువ మాట్లాడకండి. చదువు, సంస్కారం ఉన్నవాడు గనుక మీరు ఇష్టపడ్డారని నన్ను ఒప్పించి వివాహానికి తొందరపెట్టారు. మీరు మాత్రం పెళ్లయిన రెండేళ్లే నాతో ఆప్యాయంగా ఉన్నారు. తర్వాత మరేం అయిందో ఒక్కోసారి ఎడమొహం పెడమొహంగా ఉండడం మొదలుపెట్టారు. మా నాన్న ఈనాటికీ మా అమ్మని ఒక్క మాట అని ఎరగరు. వాళ్లది పాతికేళ్ల అనుబంధం. అమ్మ ఇష్టానిష్టాలను నాన్న గౌరవిస్తారు. బయట ఏమీ తినరు. ఏదైనా తెస్తే భార్యాపిల్లలు తినకుండా తినరు. గట్టిగా, కోపంగా మాట్లాడడం కూడా చేయరు’’ అంది కౌసల్య.
రాంప్రసాద్‌కి ఎక్కడ తగలాలో అక్కడ తగిలింది.
ఎందుకంటే అతను స్నేహితులతో కలసి బయట తినేసి ఇంటికి వస్తుంటాడు చాలాసార్లు.
ఈ టాపిక్ రావడంతో అతనికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.
‘‘ఏమైనా మొగుడికన్నా మీ నాన్ననే ఎక్కువ సమర్థిస్తున్నావు. నా కన్నా మంచి సంబంధం చూసుకోవలసింది’’ వాదనలో ఓడిపోతూ కసిగా అన్నాడు.
‘‘మీకు తెలియదు మా అన్నయ్య కన్నా నాకే ఎక్కువ మార్కులు వచ్చేవి. నన్నూ ఇంజనీరింగ్ చదివిద్దామని అనుకున్నారు. ఒక్క క్షణం డబ్బు గురించి ఆలోచించి... మరో క్షణం అంత చదువు చదివితే నన్ను మీరు వివాహం చేసుకోనని అంటారేమోనని ఎంత మధనపడ్డారో’’
‘‘నాకన్నా ఆప్యాయంగా నిన్ను ఎవరు చూస్తారు?’’
‘‘అవునవును... భార్య ఏదైనా మాట చెబితే ఆలోచించకపోవడం, రోజుల తరబడి భార్యతో మాట్లాడకపోవడం గొప్పనుకోవడం, పిల్లలతో సరిగ్గా గడపకపోవడం, భవిష్యత్ గురించి ఆలోచించకపోవడం, భార్య తిన్నదా లేదా, తనూ ఒక మనిషే అని ఆలోచించకపోవడం... ఎన్నని చెప్పను మీ సుగుణాలు?’’ బాధగా అంది కౌసల్య.
‘‘ఏం పెళ్లికి ముందు మీ నాన్నకి నా గురించి తెలియదా?’’ అన్నాడు రాంప్రసాద్.
‘‘నిజం చెప్పాలంటే అసలు తెలియదు. మీ కుటుంబం గురించి గొప్పగా విని ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు’’
‘‘నేను కట్నకానుకలు అడిగానా?’’
‘‘మా నానే్నమైనా ఇచ్చానని చెప్పాడా ఎవరికైనా? మీకు తెలుసో లేదో మీ నాన్నగారు అంటే మామయ్యగారు కేవలం లాంఛనాలుగా అయిదువేలు మాత్రం అడిగారని ఎంత మురిసిపోయారో’’
‘‘మీ గొప్పలు చెప్పుకోవడం మానవు’’
‘‘ఇవి గొప్పలు కావు నిజాలు. పెళ్లయింది మొదలు మా నాన్న అమ్మతో కష్టసుఖాలు పంచుకునేవారు. సర్దుకుపోయే మనస్థత్వం కూడా నాన్నకు ఎక్కువే. లేకపోతే అప్పట్నుండి ఇరవై అయిదు సంవత్సరాలు ఏ పొరపొచ్చాలు లేకుండా ఎలా గడుపుతారు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఇది మా అమ్మ చెప్పింది. అమ్మ, నాన్న పెళ్లయి రెండేళ్లు గడిచాక నాలుగైదుసార్లు చెప్పిన మాట వినకపోయేసరికి సరదాగా మీ అన్నయ్యో, తమ్ముడో ఎవరో ఒకరి ఇంటికి వెళ్లి నాలుగు రోజులు ఉండి రా. నీకూ, నాకూ ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడుండి ప్రతిదానికీ విసుక్కోకు అని పంపించారు. అమ్మ వాళ్ల అన్నయ్య దగ్గరకి వెళుతుండగానే ఫోన్ చేసి ఒరేయ్ మీ చెల్లెలు ఇంటికి వస్తోందిరా. ఇక్కడ పనిపాట్లు చేసి అలసిపోయింది. అక్కడేం పని చెప్పకండి. ఉన్నన్ని రోజులు కష్టపెట్టకుండా చూసుకోండి అన్నారట. మరి మీరో నన్ను మా ఇంటికి దిగబెట్టాక రోడ్డు మీద నుండే వెళ్లిపోతూ అందరి దృష్టిలో మా నాన్నకు విలువ లేకుండా చేశారు. ఇదీ తేడా ఇద్దరికీ’’
‘‘మీ నాన్నదే తప్పు. మొన్న నీ ఆరోగ్యం విషయంలో నేను నిర్లక్ష్యం చేశానని, తానైతే శ్రద్ధగా చూసుకుంటానని అన్నారు. అది తప్పు కాదా? అయినా నువ్వు చెప్పేది ఇంత ఓపిగ్గా వినడం నాదే తప్పు’’ విసుగ్గా అన్నాడు రాంప్రసాద్.
‘‘అలా అనకండి. ఎదుటి వారు చెప్పేది వినండి. మా నాన్న అయితే చెప్పాల్సింది చెప్పి ఆలోచించమనే వారు. మా మాటలో ఎక్కడ తప్పుందో సలహా ఇచ్చేవారు. తాను కోల్పోయిన ఆప్యాయతల్ని మాకు పంచేవారు. మరి మీరో ఎప్పుడు కోపగించుకుంటారో, ఎప్పుడు నవ్వుతారో తెలియదు. నేనూ, పిల్లలు బిక్కుబిక్కుమంటూ ఉంటాం’’
‘‘ఎంతసేపూ నీ గురించి, మీ నాన్న గురించేనా చెప్పడం’’
‘‘కాదండీ! మన గురించి మనం మాట్లాడుకోవడం. పిల్లల పట్ల మీరు ఏమాత్రం ప్రేమ చూపించడంలేదు. మా నాన్న అలా కాదు. పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతారు. మొన్న ఇంటికి వెళ్లాను. అప్పుడు నాన్న, అమ్మ బాబుగాడిని తీసుకుని ఎగ్జిబిషన్‌కి వెళ్లారు. నేను వెళ్లలేదు. అక్కడ బాబుగాడు నాన్నగారి కళ్లద్దాలు విరగ్గొట్టేస్తే వాడిని ఏమీ అనలేదు. అమ్మని, బాబుగాడిని ఆటోలో ఇంటికి పంపించి, ఆయన తెలిసిన వాళ్ల షాపులో కళ్లద్దాలు బాగు చేయించుకుని రాత్రి పదకొండుకి ఇంటికి వచ్చారు. మళ్లీ అప్పుడు డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి పదోన్నతి పొందడానికి పరీక్షకు చదివారు. అంత ఓపిక ఆయనకి’’
‘‘మీ నాన్న చాలా గొప్పవాడు. నేనే చెడ్డవాడిని. ఇక ఆపు నీ సోది’’ విసుక్కున్నాడు రాంప్రసాద్.
టై, బూట్లు విప్పి స్నానానికి వెళ్లాడు.
ముగించుకుని వస్తూనే ‘‘అయితే మా నాన్న మీ నాన్నకి ఏం చెప్పి ఉంటాడంటావ్’’ అంటూ ప్రశ్నించాడు.
‘‘చెబుతాను బాబూ చెబుతాను’’ అప్పుడే అక్కడికి వచ్చిన కౌసల్య తండ్రి అన్నాడు.
అతన్ని చూడగానే రాంప్రసాద్ ముఖం చిట్టిస్తే, కౌసల్య మాత్రం సంతోషంగా అతనికి ఎదురెళ్లింది.
మంచినీళ్లు తెచ్చి తండ్రికి ఇచ్చింది.
‘‘నాన్న ఇదేనా రావడం?’’ అంది.
‘‘అవునమ్మా! ఊర్లో చిన్న పనుండి వచ్చాను. ఎలాగూ వచ్చాను కదా నిన్ను, అల్లుడిని, బాబుగాడిని చూసి పోదామని వచ్చాను’’ కౌసల్య చూపించిన కుర్చీలో కూర్చుంటూ అన్నాడు.
రాంప్రసాద్ వౌనంగా ఉండిపోయాడు.
‘‘ద్వేషంతో కాదు ప్రేమతో ఎదుటి వారిని జయించాలి. పరుషంగా మాట్లాడి, దండించడం ద్వారా ఎదుటి వారిలో మనం కోరుకునే మార్పు గానీ, మంచి గానూ చూడడం అనేది జరగదు. ప్రేమతోను, ఓర్పుతోను, సహనంతోను ఇది సాధ్యమవుతుంది. అలా తన కొడుకు ఇంటిని కోడలు శాంతిమయంగా చేయాలని, అదే తాను కోరుకుంటున్నట్లు మీ నాన్నగారు మరణానికి ముందు నాతో చెప్పారు బాబూ. ఆ మాటే నేను నా కూతురు... అదే నీ భార్య కౌసల్యతో చెప్పాను. అందుకే అది నీవెన్ని బాధలు పెడుతున్నా సహించింది. నీపై ప్రేమ, అనురాగాలనే కురిపించింది’’ చెప్పి వచ్చిన పని అయిపోయినట్లు లేచి నిలబడ్డాడు కౌసల్య తండ్రి.
‘‘నాన్న వెళ్లిపోతారా? ఉండండి భోజనం చేసి వెళుదురు’’ అంది కౌసల్య.
‘‘ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా భోంచేస్తానమ్మా. వస్తాను అల్లుడుగారూ’’ అంటూ బయటికి నడిచాడు అతను.
‘‘మీరు మాతో గడపకుండా కోల్పోయిన క్షణాలు, రోజులు, ఆప్యాయతలు తిరిగి రమ్మన్నా మళ్లీ రావు. మనిషి బాల్యం పదేళ్లు, యవ్వనం ఇరవై ఏళ్లు. తర్వాత బాధ్యతలు, ముసలితనం. ఈ కాలంలోనే నిద్ర, పని ఇలాంటి వాటన్నటికీ కాలం పోతే నిజంగా ఎనభై ఏళ్ల జీవితంలో గడిపేది ఇరవై ఏళ్లే. తిరిగి చూసుకుంటే గతం మిమ్మల్ని వెక్కిరించకమానదు. మీ నాన్న అయినా, మా నాన్న అయిన పిల్లలకి చెప్పేది ఇదే’’ అంది కౌసల్య.
రాంప్రసాద్ మాట్లాడలేదు.
ఎన్నడూ లేని విధంగా పిల్లాడితో ఎక్కువ సేపు ఆడుకోవడం, భార్యతో సాయంత్రం లేదా రాత్రి కొంత సమయం గడపడం, సుఖమయ సంసారం అలవాటు చేసుకున్నాడు మర్నాటి నుండి.

- చౌదరి స్పర్శ,
సెల్ : 9490562999
**

ఘనకార్యం (కథ)

మాళవ రాజ్యానే్నలే రాజు సుదర్శనుడు అసమర్థుడు. వంశపారంపర్యంగా రాజయ్యాడు గానీ రాజ్యపాలనకు తగిన దక్షత లేదు. వయసు మీరుతున్నా ఎలాగోలా మంత్రుల సాయంతో నెట్టుకొస్తున్నాడు. హఠాత్తుగా సుదర్శనుడి ఏదైనా గొప్పపని చేసి భావి తరాలు తనను గుర్తుంచుకునేలా చేయాలనే కోరిక కలిగింది. సుదర్శనుడు కొలువుదీరి ‘నేను మరణించినా నా పేరు శాశ్వతంగా ప్రజల నాలుకల మీద నిలిచిపోవాలంటే ఏం చేయాలో చెప్పండి’ అన్నాడు.
‘మహారాజా! మనం పెద్ద సైన్యంతో దండెత్తి పొరుగు రాజ్యాలను జయించి, మన రాజ్యంలో కలిపితే గొప్ప సామ్రాజ్య చక్రవర్తిగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది’ అన్నాడు సేనాధిపతి
‘పన్నుల భారం తగ్గించి, బావులు, చెరువులు తవ్వించి ప్రజాహిత కార్యక్రమాలు చేపడితే జనరంజకుడైన పాలకుడిగా మీరు ప్రసిద్ధి పొందుతారు’ అన్నాడు మహామంత్రి.
‘మన రాజ్యంలోని వివిధ మతస్థులకు గుళ్లు, గోపురాలు నిర్మించి, వారి మధ్య ఐక్యత సాధించగలిగితే పరమత సహనశీలిగా మీరు కీర్తించబడతారు’ అన్నాడు రాజ గురువు.
‘లలిత కళలను ప్రోత్సహించి, కవి పండితులను ఆదరిస్తే కళాపోషకుడిగా మీకు గుర్తింపు లభిస్తుంది’ అన్నాడు ఆస్థాన కవి.
సుదర్శనుడికి ఇవేమీ రుచించలేదు. అయిష్టంగా తలాడిస్తూ ‘ఇంతకంటే గొప్ప కార్యం ఏదైనా ఆలోచించి చెప్పండి’ అన్నాడు.
ఆస్థాన విదూషకుడు లేచి, ఒక్క క్షణం తటపటాయించి ‘మహారాజా! మీ పట్ల విరక్తిచెందిన ప్రజలు, ఉప్పెనలా కదలివచ్చి, పదవీ భ్రష్టుడిని చేయకముందే, మీరు వానప్రస్థం స్వీకరిస్తే, సకాలంలో ప్రజావ్యతిరేకతని నివారించిన రాజుగా ఆచంద్రార్కం ప్రజల నోళ్లల్లో నానుతారు’ అన్నాడు.
సుదర్శనుడు నిర్ఘాంతపోయి, విధూషకుడి మాటల్లోని నిజం గ్రహించి, తక్షణమే తన కుమారుడికి పట్టం గట్టి భార్యతో అడవులకు వెళ్లిపోయాడు.

-కౌలూరి ప్రసాదరావు
వేళ్ళచింతలగూడెం (పోస్టు)
గోపాలపురం (మం), ప.గో.జిల్లా - 534316,
సెల్: 7382907677