విజయవాడ

‘జ్ఞానపీఠం’ అధిష్ఠించిన మన తొలి మహాకవి.. విశ్వనాథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర కవిత్వ యుగంలోని మహాకవుల్లో కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ ప్రముఖులు. ప్రాచీన కవిత్వ సంప్రదాయానికి శిఖరాయమానులుగా ఇప్పటి కవుల్లో ఈయన నిలుస్తారు. కావ్యం, ఖండకావ్యం, పద్యం, గేయం, కథ, నవల, నాటకం ఇలా.. అన్ని ప్రక్రియల్లోనూ తన విశిష్ఠ ముద్రను వేసిన సాహితీ స్రష్ట ఈయన. అమేయమైన భావనాశక్తి, అమిత వేగవంతమైన ధారాశుద్ధి, అద్వితీయమైన లోక పరిశీలనాశక్తి వారి రచనల్లో కనిపించే మేలిగుణాలు. వీరు శతాధిక గ్రంథకర్త. దాదాపు అన్ని గ్రంథాలూ ప్రశస్తి పొందినవే. భావ కవిత్వపు రోజుల్లో గిరికుమారుని ప్రేమగీతాలు, శృంగార వీధి, గోదావరి నదికి ఉపనది అయిన కినె్నరసాని మీద ‘కినె్నరసాని పాటలు’ రచించారు. దేశభక్తి ప్రేరేపితులై ‘ఆంధ్ర పౌరుషం’, ‘ఆంధ్ర ప్రశస్తి’ అనే కావ్యాలు రచించారు. తన భార్య పరమపదించినపుడు ‘వరలక్ష్మి త్రిశతి’ అనే 300 పద్యాల ఆత్మవిషాద కావ్యం రచించారు. వీరి ‘ఏకవీర, మాబాబు, చెలియలి కట్ట’ అనే నవలలు ప్రసిద్ధమైనవి. అంతరించిపోయే పాత విలువలను ‘వేయి పడగలు’ అనే భారీ నవలలో పొందుపరిచారు. ‘రామాయణ కల్పవృక్షము’ అనే ఆరు కాండల గ్రంథం విశ్వనాథ అత్యుత్తమ కావ్యంగా ఎన్నదగింది. ఈ కావ్యంలో ఎన్నో శిల్ప రహస్యాలను ఆయన నిక్షిప్తం చేసినట్లు విమర్శకులు చెపుతారు. ఈయన రచనల మీద వాద ప్రతివాదాలు అనేకం అచ్చయ్యాయి. ఇటీవల వీరి ‘వేయిపడగలు’కు స్వర్ణోత్సవం జరిగింది. ఈసందర్భంగా ఆ నవల మీద కొన్ని గ్రంథాలే ప్రకటితమయ్యాయి. నిత్య చర్చలకు గురయ్యే కవుల్లో ప్రముఖులు విశ్వనాథ. వీరి అభిప్రాయాలతో ఏకీభావం లేకపోయినా సాహితీ ప్రియులు వీరి రచనలను అత్యంత ఆసక్తితో చదువుతారు.
నవ్యకవిత్వ వికాశ దశలో విశ్వనాథ ‘ఋతు సంహారం’ రచించారు. పూర్వ కవిత్వ రీతులన్నింటినీ పుణికిపుచ్చుకున్నట్లున్న పద్య రచనలో అత్యద్భుతమైన లోక పరిశీలన, ప్రకృతి సౌందర్య చిత్రణ, వినూత్న భావ వ్యక్తీకరణ ‘ఋతు సంహారం’లో కనిపిస్తాయి. ఈ కావ్యమంతా సీస పద్యాల్లో రచించి నన్నయ్య, శ్రీనాథ మహాకవుల సీస పద్యరచనా శిల్పాన్ని సొంపుగా ప్రదర్శించారు. లోతైన భావన, ఇంపైన శబ్ద విన్యాసమూ ఈ కావ్యానికి పెట్టని సొమ్ములుగా అమిరాయి.
‘ఋతు సంహారం’లో వర్ణనలు ఆంధ్రదేశపు ప్రకృతిని అద్దం పట్టి చూపిస్తాయి. మెట్టపొలాలు, తోటలు, మాగాణి పొలాలు.. అన్నీ సుందర ఆంధ్ర ప్రకృతిని వర్ణించేవే. ఈవిధంగా లోక పరిశీలనలో విశ్వనాథ వారు మిక్కిలి నైపుణ్యం కలిగినవారు. ప్రకృతిలోని సూక్ష్మ దృశ్యాలు కూడా ఆయన వర్ణనలో రసవంతమై నిలుస్తాయి. భోగుల జీవితమూ, దీనుల జీవితమూ రెండినీ సరిసమానంగానే విశ్వనాథ పరికించారు. సంపన్నులు తాపోపశమనానికి చేసుకునే శీతలోపాచారాలు, భార్యాప్రవాసి విరహమూ, బ్రతికి చెడిన వాని చిదుగుగుండియ వెత ఆయనకు బాగా తెలుసు. ప్రకృతి పరిశీలన కేవలం ప్రకృతి పరిశీలనకు గాక, దానికి మానవుడి జీవితంతో సంబంధం కల్పించి వర్ణించటంలో విశ్వనాథ మిక్కిలి సమర్థులు. ఇది ప్రాచీనుల్లో, నవ్యుల్లోనూ మిక్కిలి అరుదుగా కనిపించే సామర్థ్యం. ఈయన రచించిన రామాయణ కల్పవృక్షము కావ్యానికి ‘్భరతీయ జ్ఞానపీఠం’ పురస్కారం దక్కటం తెలుగుభాషకి దక్కిన మొట్టమొదటి గొప్ప విశిష్ఠ పురస్కారం. ఆధునికాంధ్ర మహాకవుల్లో సంప్రదాయ కవిత్వ శాఖకు మూలస్తంభం వంటి కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ 1976 అక్టోబర్ 18న మన నుండి భౌతికంగా దూరమయ్యారు.
- చలపాక ప్రకాష్,
విజయవాడ.
చరవాణి : 9247475957

***
పుస్తక పరిచయం

సమాజంపై సూటి ప్రశ్న.. ‘మట్టికిరీటం’!

తెలుగు సాహిత్యంలో నేటికీ ఆదరణ తగ్గక ముందుకు సాగుతున్న ప్రక్రియ వచన కవిత. మనిషి మనసుపై బలమైన ముద్రవేసి ఆలోచనలో పడదోసి కవి లక్ష్యాన్ని చేర్చడం దీనికి కరతలామలకం. అందుకేనేమో కవి తన భావాలను వచన కవితలో చొప్పించి దానికి మట్టికిరీటం తొడిగి సమాజాన్ని లక్ష్యంగా చేసుకొని పునాదులు కదిలేలా, మూలాలు వెదుక్కునేలా చాపమోదాడు. మనిషిని చూస్తే ప్రశాంతం. కానీ మనసులో ఎంత కల్లోలం! కవితల్లో ఎంత విధ్వంసం!! సమాజాన్ని అన్నివైపుల నుంచి జల్లెడపట్టి రాళ్లను, పురుగులను ఏరిపారేశాడు. పాలకి పాలు, నీళ్లకి నీళ్లుగా చేసినట్టు నీతులు, బూతులు వేరుచేసి చూపారు నారిశెట్టి కృష్ణారావుగారు. ప్రస్తుతం ఈయన నాగార్జున విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫిసర్‌గా పనిచేస్తున్నారు. ఈయన రాసిన వచన కవితా సంపుటే ‘మట్టికిరీటం’! దీనిలోని నిజాలు, ఇజాలే మీకు పరిచయం చేస్తున్నా!
ఒక్కో కవితకు ప్రేరణ వర్తమానంలోని వాస్తవిక ఘటనలే. వాటిని తన ఆలోచనతో మధించి అక్షరూపాన్నిచ్చి చదువరులకు ఆవేశాన్ని కలిగించే ‘మట్టికిరీటం’లోని కవితా ఖండికలని చూడండి.
‘కాడిని కింద పడెయ్
పొలాలను పాలకులే దున్నుకుంటారో!
కంప్యూటర్లు దున్నుతాయో!
లోకానికి శోకం తప్ప సుఖముంటే ఒట్టే!
అభివృద్ధి ప్రవాహంలో కొట్టుకుపోతూ ఆధునికులమని సంబరపడే మనం నోటికి ముద్దను అందించే రైతును మరచి కంప్యూటర్లనే నమ్ముకుంటూపోతే కడుపు నిండేదెట్లా? ప్రభుత్వానికి, ప్రజలకు రైతుపై ఇంత నిర్లక్ష్య భావన ఎందుకని ప్రశ్నించి, పాలకులలో ప్రజలలో మార్పు రావాలంటే ‘కాడిని కింద పడేస్తేనే’ అది సాధ్యమని రైతు గుండెకోతకు అండగా నిలచారు.
జరిగిన, జరుగుతున్న వాస్తవాలకు సమాధానాలు కావాలంటే తనలోకి తాను చూసుకోమంటున్న ఈ కవితా ఖండికను చూడండి.
‘తనలోని తనను చూసుకునే ఆత్మపరిశీలకుడికి
తనను తాను మధించుకునే ఆత్మధైర్యశాలికి
తనను తాను విమర్శించుకునే ఆత్మవిమర్శకి మాత్రమే
సరైన సమాధానాలు లభిస్తాయి’
జాతిని పట్టిపీడిస్తూ మనిషి అస్థిత్వానికి పెనుసవాలుగా మారిన అసాంఘిక శక్తులను వ్యితిరేకిస్తూ నినదించిన కవితా ఖండిక ఇది.
‘ఎంత తిట్టుకున్నా ఏం లాభం
ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం
జరగరానిదే జరిగింది
ఒళ్లు కాల్చేశాక బళ్లెందుకు? గుళ్లెందుకు?
జాతి చచ్చాక సానుభూతెందుకు?
గుంటనక్కల సాహసం ఎన్నాల్టిదో
ఎండిన నెత్తురు గుటక వడదులే’
ఎంతగా కుమిలిపోయాడు కవి. చేయాల్సిన నిర్లక్ష్యం చేసి అన్ని దారుణాలకు కారణభూతులై గుంటనక్కల వంటి నయవంచకులతో చేరి బక్కచిక్కిన బీదల శరీరంలో ఎండిన నెత్తురును కూడా గుటక వేయాలన్నా అది గొంతు దిగదు, దిగనివ్వను.. అని హెచ్చరించడం ఈ కవికే సాధ్యం.
సమాజంలో మేధావులుగా చలామణి అవుతూ ఎవరికీ ఎందుకూ అక్కరకు రాని మేధావితనం దండగని నిగ్గదీస్తాడు.
‘మేధావులారా! మీరు కళ్లు తెరవద్దు
కళ్లు తెరిస్తే కుళ్లు లోకం చూడాల్సొస్తుందేమోనని భయమా?
అయినా మీరనలు కళ్లెప్పుడు మూశారు గనుక తెరవడానికి
కుళ్లిపోయిన లోకంలో
కుళ్లుతూవున్న క్షుద్రజీవులు మొదట మీరేగా!?
ఏ రంగంలోనైనా ఎంత గొప్ప మేధావులు ఉండీ చేసిందేమిటి? డాక్టర్లు, ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు, న్యాయవాదులు.. ఇలా అన్ని రంగాల్లోని మేధావులు సాధించిందేమిటి? మార్పు కోసం ఏంచేశారు? ఎవరిని ప్రగతిపథం వైపు నడిపించారు. మీ గొప్పలు మీ డప్పులు మీరే కొట్టుకుంటూ సమాజానికి దూరంగా గాజుమేడలో జీవించే శవాలు మీరు.. అని నడిచే శవాలుగా వారిని పరిగణించి ప్రశ్నించడం ఈ కవికే చెల్లింది.
సమాజంలో జాతీయతాభావం ఇలా రోజురోజుకూ దిగజారుతూ ఉంటే ముందుకెలా వెళ్లడమని, దేశభక్తిని ప్రశ్నిస్తున్న ఈ కవితా ఖండిక చూడండి.
‘డాలర్ బలానికి చేతులెత్తి మోకరిల్లి
అమెరికా అందాలను గాలిగదుల్లో బంధించి
ఆస్ట్రేలియా ఆచారాల మత్తును రక్తానికెక్కించి
నీ దేశంలో నువ్వు నువ్వుగా బతకక
నీదిగాని దేశంలో నికృష్టంగా బతుకుతున్నా
అదే జీవిత చిరునామాగా సుఖిస్తున్నానుకుంటున్న
ఆ సుఖజీవి, ఆశల జీవి
వందల సంవత్సరాలు బానిసత్వం బాగా వంటబట్టింది’
ఇక్కడ చదివి, ఇక్కడ పెరిగి నీ తెలివితేటలతో దేశ అభివృద్ధికి పాటుపడక డాలర్ మోజుతో పరదేశ వ్యామోహంలో మొన్న తెచ్చుకున్న నీ స్వాతంత్య్రాన్ని నిన్ననే తాకట్టు పెట్టేసిన నువ్వు సుఖానికి బానిసవని, పరదేశ మత్తు వదిలించాలని తాపత్రయ పడతాడు ఈ కవి.
అలాగే మహిళల గురించి. మహిళలకు హక్కులు కావాలి. మమ్మల్ని గుర్తించండని ఉద్యమించి చివరకు వారు మాత్రం చేసిందేమిటని నిలదీశాడు.
తెలుగు మహిళోద్ధరణే తమ జీవితోద్ధరణని
అసెంబ్లీలో సీట్లు కేటాయించి
మీ ప్రశంసలు అందుకున్న ప్రభుత్వాలు
బార్లకు లైసెన్స్‌లిస్తే
మీ ‘సెన్స్’లేమయ్యాయి?
అని అంటూ..
సారా రక్కసికి
సంసారాలు చచ్చిపోతున్నాయంటూ
ఏడుపులతో ఎదురుతిరిగిన తెలుగుమహిళ
చవకబారు పథకాలకు
చేవచచ్చి చతికిలబడిపోయిందా?.. అని ప్రశ్నిస్తాడు.
‘అమ్మో సారా’ అని అనాడు తిరగబడ్డాం
‘పోనీలే బీరు’ అని ఈనాడు జాలిపడుతున్నాం అంటారా?.. అని నిలదీస్తాడు.
మహిళలకు అధికారం లేకపోవటం వల్లనే అన్యాయం జరుగుతోందని, వారి సమస్యలు వారే పరిష్కరించుకోవాలంటే వారికి అధికారం అవసరమని మంత్రి పదవులిస్తే మీరు చేసిందేమిటి? పదవుల మోజులోపడి పని మరచారు. డ్వాక్రా మహిళలు పథకాల మోజులో ప్రభుత్వాలను నిలదీయటం మరచారని, సారా వద్దని నినదించిన మహిళలే ప్రతి బజారులో బార్లు పెడుతుంటే తాగేది బీరే కదా అని సద్దుకున్నారా! అని మహిళలను ఒక్కసారి ఆత్మపరిశీలనలో పడేసి వారిని విస్మయానికి గురిచేశాడు కవి.
‘బాధ నీదే సుఖం నీదే
బాధించే మనసు నీదే
మాట నీదే మరపు నీదే
మనిషీ మృగమూ నీవే’.. అని అన్నింటినీ ఎదుర్కోవలసింది నీవేనని, అన్నీ నీతోనే ఉన్నాయంటూ మనిషిని మనిషిగా పరిచయం చేశాడు. కవి తన నైజాన్ని పాఠకుల ముందు పరచిన తీరు ఎంత నిర్మొహమాటంగా ఉందో చూడండి..
‘నీలో మానత్వం కనిపిస్తే నినే్న దేవుడుంటాను
దానివత్వం ప్రకోపిస్తే దారుణంగా విమర్శిస్తాను
అందరికీ నీ బతుకు వివరిస్తాను
నా కలానే్న కత్తిగా భావిస్తాను’
మంచి చేస్తే అభిమానించినట్టే చెడును చీల్చిచెండాడుతానని, నీ స్వభావాన్ని నగ్నంగా నిలబెడతానని, తన కలాన్ని కత్తిగా భావిస్తాననడంలో యుద్ధానికైనా సిద్ధమని ఎలాంటి బెరుకూ లేకుండా పేర్కొన్నాడు.
ఇలా రాసుకుంటూపోతే ఈ సముద్రంలో నుంచి బయటపడలేను. అందుకే ముందే చెప్పాను. సమాజాన్ని అన్ని వైపుల నుంచి జల్లెడ పట్టాడు కవి అని. కాదని చెప్పండి చూద్దాం! ఒక్కసారి ఆలోచించండి. ఎన్ని సమస్యలు మన చుట్టూ పరిభ్రమిస్తున్నాయని! అందరూ నిదురించిన తరువాత తను మేల్కొని అందరి బాధలను తన భావంలో మధించి వాటికి అక్షర రూపంతో పలువలు కట్టి మనకు నిలువెత్తు ఆకృతిగా మంచి చూపించడానికి ఎంత నేర్పుకావాలి? ఈ దురాగతాలను ఇలా సాగనీయక సమాధి కడదాం రండి.. కవితో కలిసి నడుద్దాం పదండి!

పెరుగుపల్లి బలరామ్,
చరవాణి : 9676636816