విశాఖపట్నం

ముల్లును ముల్లుతోనే...(కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగావళి నదొడ్డున ఉన్న గ్రామం అది. పేరు కరజాడ. ఆ వూర్లోని గ్రామీణ బ్యాంకు అది. దానికి మేనేజరుగా వరప్రసాద్ బదిలీపై వచ్చాడు. వచ్చీ రావడంతోనే బ్యాంకులో పాత రుణాలు ఇంకా ఎవరెవరు చెల్లించారో లేదో అని ఓ లిస్టు ముందేసుకు పరిశీలిస్తున్నాడు. పాతబకాయిల వసూలులో అశ్రద్ధగా ఉంటే ప్రధాన కార్యాలయం వారు పీక్కు తినేస్తారు. అందుకే ఆ బ్యాంకు శాఖలో ఉన్న ముదరా కేసుల్ని వరప్రసాద్ పరిశీలించడం మొదలుపెట్టాడు.
లిస్టులో అన్ని ఖాతాల కన్నా సత్తిరాజు బాకీ ఎక్కువగా ఉంది. బ్యాంకు నుండి మూడేళ్ల క్రితం లక్ష రూపాయలు పంట రుణం తీసుకుని మళ్లీ రెన్యువల్ చేయలేదు. ఆ డబ్బు బ్యాంకుకు కట్టేలేదు.
‘‘ ఈ సత్తిరాజు విషయం ఏమిటి?’’ ఫీల్డ్ ఆఫీసర్ ముకుందరావుని అడిగాడు వరప్రసాద్.
‘‘ ఏం చెప్పమంటారు సార్? ఎన్నోసార్లు అతని చుట్టూ తిరిగాం కానీ అలాగే అలాగే అంటూ చెబుతున్నాడు కానీ పంట రుణం రెన్యువల్ చేయలేదు. పైగా అతను ఈ ఊరి ప్రెసిడెంట్. గట్టిగా అడగలేం. అలాగని ఊరుకోలేం’’ అన్నాడు ముకుందం.
‘‘అలా అయితే మనం రేపే అతని ఇంటికి వెళదాం’’ హకుం జారీ చేశాడు వరప్రసాద్.
బ్యాంకులో అనేక రకాలైన కస్టమర్లు ఉంటారు. గ్రామీణ బ్యాంకుకైతే చెప్పనే అక్కర్లేదు. మంచితనంతో గ్రామ ప్రాంతాల్లో పని చేయించుకోవలి. లేదా చమత్కారంతో పని చుట్టుకు రావాలి. పద్ధతి, హోదా, రూలు అంటే గ్రామాల్లో పనులు కావు. పైగా పల్లెటూరి రాజకీయాల్లో ఇరుక్కుపోవలసిందే. వరప్రసాద్ అదంతా అనుభవమే.
మర్నాడు రికార్డులతో గ్రామ సర్పంచ్ సత్తిరాజు ఇంటికి వెళ్లారు వరప్రసాద్, ముకుందం. సత్తిరాజు వారిని సాదరంగా ఆహ్వానించాడు. కుశలప్రశ్నలు వేశాడు.
అంతా అయ్యాక వరప్రసాద్ పంట రుణం రెన్యువల్ గురించి అడిగాడు.
‘‘అదా... ఎంత మాట సార్! ఆ డబ్బు కట్టేస్తాను. ఏదీ నాకస్సలు తీరికే ఉండడంలేదు’’ అన్నాడు.
అతని వాలకం చూస్తుంటే రుణం రెన్యువల్ చేసే ఉద్ధేశ్యం లేనట్లు అనిపిస్తోంది.
‘‘రేపు మీరొక్కసారి బ్యాంకు రండి. అన్నీ రెడీ చేసి అయిదారు నిముషాల్లో మిమ్నల్ని పంపించేస్తాం’’ అన్నాడు వరప్రసాద్.
‘‘రేపంటే అవదండీ! పార్టీ మీటింగు ఉంది. ఎల్లులండి, అవతలి నాడు మా బంధువుల పెళ్లి. పోనీ ఆ తర్వాతి రోజన్నా అవుతుందా అంటే లేదు. తిరుపతి క్యాంపు. ఆ తర్వాత ధాన్యం నూర్పులు. అటు తర్వాత పంచాయతీ మీటింగులు. చాలా కష్టం సార్. చూస్తా ఈ మధ్యలో ఏమాత్రం ఖాళీ ఉన్నా వస్తా’’ బ్యాంకు సిబ్బంది మాట్లాడకుండా సత్తిరాజే మాట్లాడేసాడు.
‘‘సర్లెండి చూద్దాం! మీరు ఖాళీ ఉన్నప్పుడే చేద్దాం’’ అన్నాడు వరప్రసాద్. ఇంతలో సత్తిరాజు టీ తెమ్మని చెప్పడానికి లోపలికి వెళ్లాడు. ‘‘మీరేంటండి సార్ అతన్ని అలా వదిలేశారు. మాకు చెప్పినట్లే మీకూ తెలివిగా సమాధానం చెప్పేసాడు’’ ముకుందరావు అన్నాడు.
‘‘సర్లే చూద్దాం’’ అని వరప్రసాద్ అన్నాడు.
ఇంతలో సత్తిరాజు టీలతో వచ్చాడు.
అంతా టీ తాగుతుండగా తాను ఒక చెక్కు మార్పించడానికి అర్జెంటుగా టౌనుకు వెళుతున్నానని, టౌను బ్యాంకులో చెక్కు మార్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉందని సత్తిరాజు చెప్పాడు. ఆ చెక్కు విలువ రెండు లక్షలని అన్నాడు.
వెంటనే వరప్రసాద్ అందుకున్నాడు. ‘‘అరె ఈ చిన్న పనికి మీరెందుకు టౌనుకు వెళ్లాలి. నాకు ఇక్కడే ఇచ్చెయ్యండి. రేపు ఈ టైముకి మా బ్యాంకుకు వచ్చి ఆ డబ్బు తీసుకోండి’’ అన్నాడు.
‘‘అలా ఇంకో బ్యాంకు చెక్కు ఇక్కడ డబ్బుగా అంత వేగంగా మారుతుందా? సత్తిరాజు అమామకంగా అన్నాడు.
‘‘్భలేవారు సార్! రోజురోజుకి బ్యాంకుల పద్ధతులు మారిపోతున్నాయి. ఇప్పుడంతా ఆన్‌లైన్ కదా. రేపు ఈ టైముకి రండి డబ్బు తప్పకుండా ఇస్తాం’’ అన్నాడు వరప్రసాద్.
సత్తిరాజు ఆనందంగా చెక్కు వెనుక సంతకం చేసి ఇచ్చాడు.
బ్యాంకుకు తిరిగి వస్తుండగా దారిలో ఫీల్డ్ఫాసర్ ముకుందరావు ‘‘అదేంటి సార్? పాతలోను తీర్చని వాడికి ఈ లేనిపోని సర్వీసులు మనమెందుకు చెయ్యాలి?’’ అన్నాడు.
దానికి వరప్రసాద్ మాట్లాడలేదు. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు.
మర్నాడు అనుకున్నట్టుగానే చెక్కు మార్చి ప్రెసిడెంట్ సత్తిరాజు ఖాతాలో జమ చేశాడు వరప్రసాద్.
డబ్బు తియ్యడానికి సత్తిరాజు వచ్చాడు.
అతన్ని చూడగానే మేనేజర్ చిరునవ్వుతో ‘‘రండి సత్తిరాజుగారూ!’’ అన్నాడు.
‘‘నిన్న నేనిచ్చిన చెక్కు డబ్బు ఇప్పించండి సార్’’ అన్నాడు సత్తిరాజు.
‘‘డబ్బు అయితే మీ ఖాతాలో జమ అయింది గానీ బ్యాంకులో అంత క్యాష్ లేదు’’ అన్నాడు వరప్రసాద్.
‘‘అయితే రేపు వస్తాను’’ అన్నాడు సత్తిరాజు.
‘‘లేదు లేదు రేపు నాకు మా రీజనల్ మేనేజర్‌తో మీటింగు ఉంది. ఎల్లుండి, అవతలినాడు మా క్యాషియర్‌గారు సెలవు పెట్టారు. క్యాష్ తెప్పించడానికి సిబ్బంది ఉండరు. ఇక ఆ మర్నాడు బ్యాంకుకు సెలవులు. ఆ తర్వాత ముంబై ట్రైనింగుకి వెళ్లాలి. అటు తర్వాత...’’
‘‘బాబ్బాబు! అలా అనీకండి. నేనేదో పంట రుణం రెన్యువల్ కోసం వస్తే అన్నానని మీరూ నేను చెప్పినట్లే చెబుతున్నారు. దానికీ దీనికి ముడిపెట్టకండి. ఆ డబ్బు ఓ కాంట్రాక్టు పనిది. అర్జెంటుగా పంచకపోతే నా కొంప మునుగుతుంది’’ సత్తిరాజు ఆందోళనగా అన్నాడు.
‘‘అదే సత్తిరాజుగారూ! మాకు కూడా ఈ రెన్యువల్ కాని బకాయిల విషయంలో పై అధికారులతో చాలా తలనొప్పులు ఉంటాయి. మా బాధలు కూడా మీరు అర్ధం చేసుకోవాలి’’ పాఠం చెప్పినట్లు చెప్పాడు వరప్రసాద్.
‘‘బాబూ బుద్ధొచ్చింది. మీరు ఎప్పుడంటే అప్పుడు పంట రుణం రెన్యువల్ చేయించుకుంటాను. ఆ చెక్కు డబ్బులు ఇవాళ జమ చేసేసుకుని నాకు రేపు ఎలాగైనా రుణం ఇస్తే మీ మేలు జన్మజన్మలకు మరిచిపోను’’ అన్నాడు సత్తిరాజు.
మేనేజర్ వరప్రసాద్ మనసులోనే ‘అలా రా దారికి’ అనుకుంటూ ‘‘సరే అలాగే కానిద్దాం’’ అన్నాడు.

- ఝుడ్తీల శ్రీనివాసరావు,
5-6-44, మెహర్‌కుటీర్,
పుణ్యపువీధి,
శ్రీకాకుళం-532001.
సెల్ : 9440755932.
**

మినీకథ

వాళ్లకీ ఓ రోజుండాలి

సర్వేశ్వరశర్మగారు పేరున్న ఉపాధ్యాయుడు, సాహితీవేత్త. ఈ మధ్యనే ఉద్యోగ విరమణ చేశారు. పిల్లలిద్దరూ పెళ్లిళ్లు అయి అమెరికాలో ఉన్నారు. పక్షవాతం వచ్చిన భార్యకు అన్నీ తానై సేవలందిస్తున్నారు. ఇతర పనులు పనిమనిషి చేస్తుంది. పాచిపనులు, పాకీపనుల వంటివి చేసే పనిమనుషుల పట్ల ఆయనకి మెల్లగా మంచి అభిప్రాయం కలుగుతోంది. గతంలో ఇంటి పనుల్లో జోక్యం చేసుకోకపోవడం వల్ల ఇవేవీ ఆయనకి తెలియదు. మనవాళ్లకి చేసే పనుల పట్ల కూడా కొన్నిసార్లు ఏవగింపు కలుగుతుంది. అలాంటిది పరాయివాళ్ల కుళ్లును, చెత్తను ఛీదరించుకోకుండా శుభ్రపరిచే పారిశుద్ధ్య పనివాళ్లు ధన్యులు అనుకున్నారు.
రెండు రోజుల నుండి మున్సిపాలిటీ వాళ్లు సమ్మెకు దిగడంతో ఇంటి ముందు చెత్త అలాగే ఉండిపోయింది. వీధులన్నీ అపారిశుద్ధ్యంతో నిండిపోయాయి. ఆ మర్నాటికి వారి సమ్మె విరమించారు. ఉదయం పారిశుద్ధ్య కార్మికుడు వచ్చి తడిచెత్తను, పొడిచెత్తను వేరు చేసి తొట్టెల్లో నింపుతున్నాడు. దానిని వీధి చివర ఉన్న బండిలో వేస్తూ చేతులకు ఏది అంటినా పట్టించుకోకుండా, అసహ్యమనేదే కనబడకుండా అత్యంత ఆరాధనాభావంతో పని చేస్తున్నాడు.
ఆ సమయంలో ఆ పారిశుద్ధ్య కార్మికుడు జుగుప్సాకరమైన సర్పాలను వళ్లంతా చుట్టుకుని లోకహితం కొరకు హాలాహలాన్ని మింగిన శివుడిలా కనిపిస్తున్నాడు.
మాస్టారికి మెదడులో ఆలోచన మెదిలింది. అన్ని వృత్తుల వారికి సంవత్సరంలో ఏదో ఒక రోజు ప్రత్యేక దినంగా ఉంది. కార్మికుల దిన్సోవం మే1న జరుపుకుంటున్నాం. ఈ కార్మికులు మిగతా కార్మికుల కన్నా భిన్నం. వీరి కొరకు ప్రత్యేక దినం ఉందా? అని గూగుల్‌లో వెతికాడు. ప్చ్! వీరిని గుర్తించే దినం లేదు. తనకు తళుక్కున ఉపాయం తట్టింది. అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జన్మదినం. ప్రధాని మోదీ స్వచ్ఛ్భారత్ కార్యక్రమం ప్రారంభించిన దినం. సహనమూర్తి జన్మదినాన్ని పారిశుద్ధ్య కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడం న్యాయమనిపించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్ గూగుల్, ఇతర సామాజిక మాధ్యమాలలో ఈ విషయాన్ని అందంగా ప్రతిపాదించాడు. తన విశే్లషణాత్మక వివరణ అందరినీ ఆకట్టుకుంది. లక్షలాదిగా లైక్స్ వచ్చాయి. ఈ ప్రతిపాదనను ప్రధాన మంత్రికి, రాష్టప్రతికి, ఇతర కీలక మంత్రులకు, సంఘ సేవకులకు లేఖల రూపంలో తెలియజేశారు. ఈ విషయమై దేశమంతటా చర్చ మొదలయింది. ప్రధాని అంగీకారంతో అక్టోబర్ 2నాడు స్వచ్ఛ కార్మికుల దినోత్సవంగా జరుపుకోవడానికి నిర్ణయించారు. ఆ రోజు మంచి పారిశుద్ధ్య కార్మికులను ఎంపిక చేసి ప్రతి పట్టణం, జిల్లా స్థాయిల్లో సత్కారాలు కూడా చేయాలని సూచించారు. శర్మ మాస్టారి మెదడులో ఓ ఆలోచనా విత్తనం ఉద్దీపన వృక్షమై, స్వచ్ఛమైన భావనలకు అర్ధవంతమైన ఫలాన్ని ఇచ్చింది. పారిశుద్ధ్య కార్మికులకూ ఓ రోజొచ్చింది.

- చావలి శేషాద్రి సోమయాజులు,
పాచిపెంట, విజయనగరం జిల్లా. సెల్ : 9032496575.