విజయవాడ

ఆరాధన (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆరాధన - భావం కాదు ఒక బంధం
మనసును వెలిగించే దీపం
ఆరాధన వసంతాల్ని పూయిస్తుంది
చీకటి అగాథాల్లో పయనించే కాలాన్ని
కౌగిలిలో బంధించి
ప్రాణవాయువు నింపుతుంది
ఆకాశాన్ని చుంబించి
నక్షత్రాల్ని తాకే శక్తినిస్తుంది
ప్రాణంలో ప్రాణమై
నిత్యనూత్నంగా ఆవిష్కరిస్తుంది నిన్ను
ఆరాధనను కప్పుకో.. అలసట ఉండదు
పెదవులపై చిర్నవ్వులు చెరగవు
నిన్ను రగిలిస్తుంది నీలో జ్వలిస్తుంది
నీ కోసం తపిస్తుంది
ఆరాధన మమతల తల్పం విరిసే పుష్పం
కలలు పూస్తాయి
అలలు పరుగెడతాయి
ఆరాధనలో హాయైన సంగీతం
హోరెత్తుతుంది
నిన్ను కనికట్టు చేసి నీ భావాలకు
పూలతో ఆనకట్ట కడుతుంది
ఆరాధన.. ఓ వెలుగు రేక!

- అమూల్యాచందు,
విజయవాడ.
చరవాణి : 9059824800
**
అక్షర తూణీరం

అణువుకన్నా చిన్నదిగా వుండి
విశ్వంకన్నా పెద్దదయ్యే లక్షణం
అక్షరానిదే!
ప్రపంచం
తన ప్రతిబింబాన్ని చూసుకోవాలనుకున్నప్పుడు
అక్షరాల అద్దాన్ని పట్టేవాడు కవి
అతను భావాల కిరణాల్ని ప్రసరించే రవి
ఊహల ఊటబావి
ఆ సాహితీ విలుకాని చేతిలోని అక్షరం
తూణీరమై
మెదళ్లను విస్మయపరుస్తుంది
విస్ఫోటనం చేస్తుంది!

- జి రామచంద్రరావు,
రేపల్లె, గుంటూరు జిల్లా.
చరవాణి : 8985894114
**
హృదయ విపంచి!

విశ్వంభరుడా విశ్వనాథుడా
విశ్వస్వరూపీ విశ్వాత్ముడా!
అఖిలాండ బీజాంకురా
సృష్టి, స్థితి, లయకారకా
ఆత్మరూపీ అల్ఫఒమేగా
సకలలోక ఆధారమా
సర్వకాల ఆరంభమా
ప్రాణికోటి ఆలంబనా
జనన, మరణ, భవ సంభవాదిపతీ!
వందనం, వందనం, అభివందనం!
నిఖిలాంబర కృతి ప్రకృతీ
అఖిల ప్రాణాంకురపతి ఆకృతీ
ప్రణవనాథ ప్రమోద బోధావేది
ప్రథమ జ్యోతి ప్రాభవ తేజోనిధి
నిర్గుణ, నిగమ, నిరంజన, నిర్జరా!
భావం, భాష్యం, భంగిమ, భాసురా!
ప్రేరణ, ధారణ, కారణ, ప్రేషితా
నిత్యమూ, సత్యమూ, మార్గమూ, జీవమా
ఆనందానికి రూపమా
అఖిలము నిండిన దీపమా!
అఖండ జీవుల మూలమా
అనంతశాంతి స్వరూపమా!

- బండి స్టాన్లీ,
విజయవాడ.
చరవాణి :
**
మది నివేదన

ఓ చెలీ!
నీతోటి యవ్వారం సంధ్యవేళ సింధూరం
నీ వయస్సు ఒయ్యారం అరవిరిసిన మందారం
అనురాగం ఎంత బలంగా ఉంటే
ఆప్యాయత అంత చిక్కగా ఉంటుంది
ఆకర్షణ ఎంత పదునుగా ఉంటే
జీవితం అంత మధురంగా మారుతుంది
నా జీవితంలో అఖండజ్యోతిలా
వెలుగొందుతావని ఆశించా
కాని ఆషాఢ మెరుపులా
అంతర్థానవౌతావనుకోలేదు
నీతో అందుకోని సుదూరతీరాలకు చేరి
పొదరిల్లు కడదామనుకున్నా
కాని ఆకాశంలో విహరించే నా ఆశల్ని
అగాథంలోకి నెడతావనుకోలేదు
నీ సన్నిధిలో గడిపిన ఆ యవ్వనకాలం
మరపురాని మధురానుభూతుల్ని మిగిల్చి
మరలిరాని లోకాలకు తరలిపోయింది
అందుకే చెబుతున్నా
వెనుదిరిగి చేసుకో ఆత్మపరిశీలన
అర్థం చేసుకొని ఇకనైనా
అందుకో నా మది నివేదన

- కట్టా శ్రీనివాసరావు,
శనగపాడు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9912450428
**

దీపావళి మెరుపు!

సీ. అమవస యెణుగని అల ‘కృష్ణపక్ష’ ‘దే
వులపల్లి’యై దివ్వె పొలిచెనొకటి;
మెదడుల లక్షలన్ కదలించగల సిరా
దీప్తియై యొప్పారె దీపమొకటి;
‘అగ్నిధార’ల మహోద్యమ ‘దాశరథి’చ
రవ్వలు రాల్చెను దివ్వెయొకటి;
‘సృష్టిలో తీయనిదే స్నేహమ’ను ‘ఇంద్ర
గంటి’యై దీపంబు గ్రాలె నొకటి;
సంఘ‘జీవన సమరంబు’ సలిపి సలిపి
‘జ్ఞానపీఠమా’యెను దీపకాంతి యొకటి;
అమృత మానంద మొసగెడు అక్షరాల
మెరుపు దీపావళియె ప్రజ మరువగలదె?
తె.గీ. ఉగ్రవాదాసురుని గూల్చ ఉర్వియెల్ల
మెచ్చ ఉవ్వెత్తుగా లేచె చిచ్చుబుడ్డి;
గుండెలన్ రైళ్లు పర్వెత్తదండి రేగె
మ్రోయు బాంబుల సైన్యంబులో యనంగ
దివ్య దీపావళిని నేడు తెలుగు ప్రజయె!!

- డాక్టర్ రామడుగు వేంకటేశ్వరశర్మ
గుంటూరు.
చరవాణి : 9866944287