రాజమండ్రి

మాధవుడి మాట (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బలరాముడు శయన మందిరంలో రత్నఖచిత ఆసనముపై ఆసీనుడయి వుండి తన తోబుట్టువు ముద్దరాలు సుభద్ర ఇంద్రప్రస్థ నగరములో సుఖ సంతోషములతో హాయిగా ఆనందముగా వుందా లేదా? అని సోదర వాత్సల్యముతో ఆరాటపడిపోతున్నాడు.
ఆ సమయములో వేంచేసిన రేవతీదేవి తన పతిదేవుడు మదిలోని ఆందోళన పసిగట్టి ‘నాధా! నా ఆడపడుచు సుభద్ర అత్తవారింట క్షేమముగా సుఖముగా ఉంటుంది. ఎందువలనంటే వలచి వలపించుకుని పరియణము చేసుకున్న నవ్యసాచి అపురూపంగా చూసుకుంటారు. సందేహము వలదు స్వామీ’ అని ఊరడించింది.
అయినా హలాయుధుడు స్థిమితపడలేదు.
‘సుభద్రార్జునులను ఏకం చేసిన మన మాధవుడు వారి యోగక్షేమములు పర్యవేక్షిస్తుంటాడు. మనకి తెలియకుండా మన కుశలములు కూడా గమనిస్తుంటాడు. గాన సుభద్ర మంచిచెడ్డలు గురించి చింతించనవసరము లేదు’ రేవతిదేవి మరల దృఢచిత్తముతో పలికింది.
అపుడు బలరాముడు ‘మన మాధవుడు భక్తుల పూజలు స్వీకరిస్తాడు. కోరికలు అనుగ్రహిస్తాడు. అష్టసఖుల అలకలు కోపతాపములు తీరుస్తాడు. వేలాదిమంది గోపికల అపార్థాలు తగాదాలు పరిష్కరించి ఆటపాటల్లో పాల్గొంటాడు. ఈ ఒక్కుమడి కార్యక్రమములు కారణముగా కృష్ణయ్యకు తీరిక వుండదు. ఆ రీత్యా సుభద్ర యోగక్షేమములు పట్ల కిరీటి శ్రద్ధ కనబరచలేదు’ అని వివరించి సందేహిస్తున్న భర్త సోదర ప్రేమకి రేవతిదేవి ముగ్ధురాలయింది. తర్వాత పతి ఆలోచన మరల్చడానికి ఇలా అంది.
‘నాధా! నా ధర్మసందేహమును అప్రస్తుత విషయముగా ఎంచక పూర్తిగా ఆలకించి నివృత్తి గావించి కోరుకుంటున్నాను’ అని తెలివిగా అర్థించింది. వెంటనే బలరాముడు సమ్మతించాడు.
‘మీరు వాక్రుచ్చినట్టు మన మాధవుడు ప్రధానముగా అష్ట అర్ధాంగుల ఆగ్రహాలు అలకలు, వేలాదిమంది గోపికల అభిష్టములు అపార్థములు సునాయాసముగా పరిష్కరించి సంతోష సాగరములలో స్నానమాడిస్తుంటాడు. మాధవుడులోని ఈ ప్రజ్ఞాపాటవాలకి మూలాధారమేమిటి నాధా?’ అని ప్రశ్నించింది.
వెంటనే బలరాముడికి తమ్ముడు గురించి తాను చెప్పింది స్ఫురించి అవును నిజమే సుమా అనుకుంటూ సందేహ నివృత్తి నిమిత్తం ఆలోచన ప్రారంభించాడు.
రేవతిదేవి తన యోచన ఫలించినందుకు ఆసక్తిగా చూడసాగింది.
బలరాముడు చాలా సమయం యోచించాక నివృత్తి సమాధానం తోచనందుకు క్షణక్షణం విస్తుబోయాడు. తర్వాత ధర్మ సందేహం రీత్యా మాధవుడు అంతమంది స్తీలనెలా సముదాయించగలుగుతున్నాడు? ఏవిధముగా ఓర్పు నేర్పు సాధ్యపడింది? అని తర్కించుకుంటూ అప్రయత్నంగా ‘కృష్ణా! మాధవా!’ అనుకున్నాడు.
‘అగ్రజా! ప్రణామం. మాతా! పాదాభివందనం. మీ పిలుపు విన్న వెంటనే అత్యవసరం అనుకుని శయన మందిరములో ప్రత్యక్షమైనందుకు క్షమించాలి... ఆజ్ఞాపించండి ఏమి శలవు?’ అన్న యశోదా తనయుడిని రేవతిదేవి దీవించాక సుభద్ర క్షేమం అడిగింది. క్షేమంగా కులాసాగా హాయిగా ఉంది అని చెప్పాడు.
బలరాముడు కూడా సంతసించి శ్రీకృష్ణుడిని ప్రేమగా చూసాడు.
అనంతరము వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టు సందేహ కారకుడు సమక్షంలో ఉన్నందుకు ఆనందించిన బలరాముడు రేవతిదేవి సందేహము తెలిసి నివృత్తిగావించమన్నాడు.
రేవతిదేవిలో ఆసక్తి ఇనుమడించి ఉత్సాహంతో చూడసాగింది.
తలుచుకున్న మరుక్షణం సాక్షాత్కరించి సుభద్ర క్షేమ సమాచారము తెలిపిన మాధవుడు రేవతిదేవి వాక్కు నిజం చేసినందుకు హలాయుధుడు మనసా ఆనందించాడు.
‘పెద్దలు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు. ఆ మంచి మాట స్ఫూర్తితో నేను ఎల్లప్పుడూ మనఃపూర్వక చిరునవ్వుతో ప్రతీవారిని మృదువుగా పలుకరించి మధురముగా సంభాషిస్తాను. ఆ విధముగా అర్ధాంగులను గోపకాంతలను లాలిస్తాను, ప్రేమిస్తాను, మురిపిస్తాను, స్పర్శిస్తాను. మరుక్షణము అలకలు కోపతాపాలు అపార్థాలు చిలిపి తగాదాలు మంచులా కరిగిపోతాయి... మృదుమధుర సంభాషణకి శత్రువు కూడా లొంగిపోతాడంటారు అని మీకు తెలిసి ఉండి కూడా నా నోట వినాలన్న కుతూహలముతో నన్ను తలిచారు. ఆలకించారు...’ అంటూ మాధవుడు అదృశ్యమయ్యాడు.
అనంతరము బలరామ దంపతులు మృదుమధుర సంభాషణకుపక్రమించారు.
(కల్పితము)

- కృష్ణ మాధవరపు కాకినాడ, సెల్: 8985492283