నెల్లూరు

బంగారంలాంటి అల్లుడు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయగిరి దుర్గానికి దక్షిణం వైపునున్న దుర్గంపల్లె గ్రామమది. నరసయ్యకు కొండ చరియల మధ్య పాతిక సెంట్ల భూముంది. అందరిలాగే కొండవాగు నీళ్లతో కూరగాయలు పండిస్తాడు. నరసయ్య పెళ్లాం పండ్లు కోయడానికో, పిట్టల్ని పట్టడానికో, కట్టెలు కొట్టడానికో అడవికి పోతే, నరసయ్య పొలం పండిస్తూ సీజన్లో కూరగాయలు గంపనెత్తిన పెట్టుకుని ఉదయగిరి గ్రామంలో వీటిని అమ్ముకుని అంతో ఇంతో తెస్తుంటాడు. దుర్గంపల్లె కూరగాయలంటే ఉదయగిరి వాసులు చెవి కోసుకుంటారు.
ఆ రోజు నరసయ్య భార్య అడవిపండ్లు కోసుకురావడానికి చీకటితోనే లేచి మిగతా ఆడవాళ్లతోబాటు అడవికి వెళ్లింది. నరసయ్య కూరగాయల గంపతో ఉదయగిరి బయలుదేరాడు. సహజంగా ఉదయగిరికి గంపల్తో వెళ్లే వాళ్లందరూ ఒకరికొకరు తోడుగా అందరూ ఒకేసారి బయలుదేరుతారు. అలాంటి వారు రోజూ పాతికమందైనా వెళుతుంటారు. అందరి చేతుల్లో నెత్తిమీద గంపతో బాటు, చేతిలో నాలుగడుగుల పొడవైన గట్టికర్ర కూడా ఉంటుంది. దారిలో ఎదురయ్యే మృగాల నుంచి ఆత్మరక్షణ కోసం అది అవసరం. మసకచీకటితో బయలుదేరితే తప్ప తెల్లవారేసరికి గమ్యం చేరలేరు.
నరసయ్య ఆరోజు లేవడం కాస్త ఆలస్యమైంది. అప్పటికే అందరూ గంపలు నెత్తిన పెట్టుకుని వెళ్లిపోయారు. జనవరి నెల కావడంతో మంచుదట్టంగా ఉండి అవతల మనిషి కనపడని విధంగా ఉంది. వడివడిగా నడవడం మొదలుపెట్టాడు నరసయ్య. ఎంత వేగంగా నడిచినా ముందు వెళ్లే వాళ్ల అడుగుల చప్పుడు కూడా వినిపించడం లేదు. ఎంత కళ్లు చికిలించి చూసినా ఆ మంచులో ముందు ఎవరు వెళుతున్నారో కనిపించడం లేదు. కొద్దిసేపటికి అతని ప్రయత్నం ఫలించింది. ముందు ఎవరో పోతున్న అడుగుల చప్పుడు వినిపించింది.
‘‘ఎవురా మడిసి?’’ అరిచాడు నరసయ్య.
అవతల నుంచి సమాధానం లేదు. వినబడ లేదనుకున్నాడు. అడుగుల చప్పుడు మాత్రం వినిపిస్తోంది.
సామాన్యంగా అందరికంటే వెనుక వచ్చేది శివుడు. వాడు బాగా కష్టజీవి. వేకువజామునలేచి ఇంట్లో పనులన్నీ చేసి గాని బయలుదేరడు. వాళ్ల అన్నదమ్ములు నలుగురిలో వీడే మంచివాడు. వాళ్ల అమ్మానాయనకు వాడు వరపుత్రుడు లాంటివాడు. ఊరంతా వాడ్ని మెచ్చుకొనే వాళ్లే. కాయకష్టం చేసిన దృఢమైన శరీరంతో ఆరోగ్యంగా వుంటాడు.
‘‘శివుడూ’’ అంటూ పిలిచాడు నరసయ్య.
‘‘ఊ..’’ శివుడు మూలగడం వినిపించింది.
శివుడు చాలా మంచివాడు. వాడు ఎవరితో ఎక్కువ మాట్లాడడు. ఎవరితోనూ తగాదాలకు పోడు. ఎవరితోనూ కలవడు. వాడి పనేందో? వాడేందో? తను చేసే పనిమాత్రం పద్ధతిగా చేస్తాడు. వాళ్ల నాయన వాడికి పెళ్లి చేయాలని చూస్తున్నాడు. వాడికి తన కూతుర్నివ్వాలని నరసయ్య ఉబలాటం. తన కూతురు బాగా పనిపాటలు తెలిసిన పిల్ల. ఇద్దరికీ ఈడూజోడు చాలా బాగుంటుంది. ఎలాగయినా శివుడు చెవిలో తన కూతురు మాటేస్తే, తరువాత వాడి తల్లిదండ్రులతో మాట్లాడవచ్చు.
‘‘శివుడూ.. నీ పెళ్లి సంగతి ఎంతదూరం వచ్చిందిరా’’
‘‘ఊ...’’ అనే శబ్దం తప్ప మరేమాటా వినిపించడం లేదు. ముందే ఇతరులతో మాట్లాడడానికి సిగ్గుపడే శివుడు పెళ్లి మాట ఎత్తేసరికి అసలు మాట్లాడడం మానుకున్నాడనుకున్నాడు నరసయ్య.
‘సరే..వాడి సిగ్గుతో మనకెందుకులే’ అనుకున్న నరసయ్య తన కూతురు గురించి చెప్పడం మొదలుపెట్టాడు.
‘‘ ఒరే నా పెద్ద కూతురు కిష్టమ్మను సూసినావు గదా. మంచి పిల్లరా. నీలాగా కష్టపడి పనిజేసే పిల్ల. నా కూతురంటే నాకు శానా ఇస్టం. దాన్ని సేసుకుంటానని ఒక్క మాటన్రా. మీ నాయనతో నేను మాట్లాడతాను’’
అవతల నుంచి ‘‘ఊ...’’ అన్న శబ్దం మాత్రం వినిపించింది. ‘‘రేయ్ అమ్మికి బంగారు ముక్కుపుడక, సెపులకు బంగారు కమ్మలు సేయిత్తా. పెళ్లి బెమ్మాండంగా సేత్తా’’
నరసయ్య మాటలకు అవతల నుంచి ‘‘ఊ..’’ అన్న శబ్దం తప్ప మరేమాటా వినిపించలేదు. దానికే మహదానందపడిపోయాడు నరసయ్య.
‘‘రేయ్ శివుడూ.. ఈ రోజు నా బొడ్లో రెండు దమ్మిడీలుండాయి. ఉదయగిరి బూబమ్మ అంగట్లో మనం కడుపునిండా దోసెలు తిందాం. ఏమంటావు’’ ఊరించాడు నరసయ్య. ఎలాగయినా వాడి మనసు మార్చి బంగారంలాంటి వాడ్ని తన అల్లుడుగా చేసుకోవాలనేది అతని ధ్యేయం.
నరసయ్య పట్టుపట్టాడంటే వదిలే రకం కాదు. ఈ విషయంలో కూడా అంతే చేసాడు. ఉదయగిరిలో అమ్మకాలయిన తరువాత శివుడికి దోసెలు పెట్టించి మరీ మంచి చేసుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు.
పల్లెలోకి రాగానే వాడి తండ్రి నారాయణను కల్లు అంగడికి తీసుకుపోయాడు. నాలుగు ముంతలు కల్లు పోయించి డబ్బు తానే ఇచ్చాడు.
మురిసిపోయిన నారాయణ ‘‘నీలాంటి మంచోడు ఈ పెపంచకంలో ఎవుడూ లేడురా’’ అంటూ మెచ్చుకున్నాడు.,
మళ్లీ ఇంకో ముంత కల్లు తాగాడు. దానికి కూడా డబ్బు నరసయ్యే ఇచ్చాడు. ఇద్దరూ తిరిగి ఇంటికి బయలుదేరారు.
మంచి చేసుకోవడానికి రోజూ తనతోబాటు కల్లుకు తీసుకెళ్లి పీకలదాకా కల్లు పోయించి తనే డబ్బులిచ్చేవాడు. ఇద్దరికీ మంచి స్నేహమయ్యింది. ఇలా ఒకవైపు శివుడ్ని, మరోవైపు వాడి తండ్రిని మంచి చేసుకున్నాడు. ఇప్పుడు నరసయ్య ఏంచెబితే అది వినడానికి సిద్ధంగా ఉన్నాడు శివుడు, వాడి తండ్రి నారాయణ కూడా అంతే. ఇక నారాయణ భార్యకు నారాయణ ఎంత చెబితే అంత. కాబట్టి ఆమెతో ఇబ్బంది లేదు.
రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు ఉదయం పూట ఉదయగిరిలో కూరగాయల అమ్మకాలకు ఇతరులతో పాటు కలసిపోవడం లేదు నరసయ్య. వాళ్లను అలా వెళ్లనిచ్చి శివుడు, నరసయ్య ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ వెళుతున్నారు.
ఒకరోజు బూబమ్మ అంగట్లో దోసెలు తిన్నాక శివుడికొక బీడి అందించి తనొక బీడి ముట్టించి దీర్ఘంగా పొగ వదలసాగాడు. శివుడు కూడా బీడి ముట్టించి పొగ వదులుతూ, ‘‘ఏంది మావా. శానా ఆలోసనల్లో ఉండావు’’ అనడిగాడు.
‘‘ఒరే.. నా బాధలు నాయి.. ఎవురు తీరస్తారురా’’
‘‘మావా. నువ్వేం సెయ్యమన్నా సెయ్యడానికి నాను సిద్ధం. నీ దిగులేంటో సెప్పు మరి’’
పొగ వదులుతూ ‘‘నా దిగులంతా నా కూతురు కిష్టమ్మ పెళ్లి గురించేరా. ఆయమ్మంటే నాకు శానా ఇష్టం. ఆయమ్మి పెళ్లిజేసేస్తే నాకే దిగులు ఉండదురా’’
‘‘కిష్టమ్మ నాకూ శానా ఇది మావా. ఆయమ్మిని నేను సేసుకుంటానని సెప్పాన గద మావా’’ అన్నాడు శివుడు సిగ్గుపడుతూ.
‘‘మరి మీ నాయనా, అమ్మ ఒప్పుకోవద్దా’’
‘‘ఆళ్లేంది మావా ఒప్పుకొనేది. ఇచ్చేది నువ్వు, సేసుచొనేది నేను. మద్దె ఆళ్లెవురంటా’’
‘‘అట్ట కాదులేరా. పద్దతంటే పద్దతే. మీ అయ్యతో ఇయ్యాల సాయంత్రం మాట్లాడతా’’ అన్నాడు నరసయ్య.
ఆ సాయంత్రం తాటిచెట్టు కింద కల్లు తాగుతూ, ‘‘నా కోరికొకటి తీరుస్తానని మాటియ్యి మావా’’ సందేహంగా నారాయణను అడిగాడు నరసయ్య.
అప్పటికే నిషా తలకెక్కిన నారాయణ, ‘‘ఒక కోరికేందిరా నరసా, ఎన్నయినా కోరుకో’’ అంటూ అభయమిచ్చాడు.
ఇదే సమయమనుకున్న నరసయ్య. ‘‘శివుడికి నా కూతుర్ని సేసుకో మావా’’ అన్నాడు.
‘‘నేనూ, మీ అక్కా అదే అనుకుంటుండామురా. తొందర్లో మూర్తాలు ఎట్టుకుందాం’’ అసలు విషయం చెప్పాడు నారాయణ.
అనుకున్నట్లే ఆ మాఘమాసం పోయిన తరువాత ఉదయగిరి దుర్గం ఎక్కేదారిలో ఉన్న వల్లభరాయుని ఆలయ మండపంలో శివుడికి, కిష్టమ్మకి పెళ్లి వైభవంగా జరిగిపోయింది.
పెళ్లిబట్టల్లో తనకూ, తన భార్య కాళ్లకు మొక్కిన కొత్తదంపతులను నిండు నూరేళ్లు వర్థిల్లమన్నట్లు ఆశీర్వదించారు నరసయ్య దంపతులు.
‘‘చూసావా. బంగారం లాంటల్లుడ్ని తెచ్చాను’’ అంటూ భార్యవైపు చూసి కన్నుగీటాడు నరసయ్య.
‘‘నిజమేనయ్యా.. మనల్లుడు బంగారమే’’ మెచ్చుకుంది అతని భార్య.
... భయంకరమైన పెడబొబ్బ విని ఈ లోకంలోకి వచ్చాడు నరసయ్య. ఎదురుగా బలిష్టమైన ఐదడుగుల ఎత్తున్న ఎలుగుబంటు తన నోరు తెరచి తెల్లని కోరల్ని బయటపెట్టి దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. అప్పటికే తన కలలాగే మంచు కూడా కరిగిపోయి సూర్యోదమయింది.
ఇప్పటివరకు తను మాట్లాడాననుకున్నది శివుడితో కాదని, మంచుతెరల మాటున కనిపించని ఎలుగుబంటు అడుగుల చప్పుడు తను శివుడివిగా అనుకున్నానని, ఎలుగుబంటి ఉఛ్వాసనిశ్వాసలను ఊకొడుతున్న శివుడిగా భ్రమసానని, తన ఊహాలోకంలో దానికి తన కూతురుతో పెళ్లి కూడా చేసానని తెలుసుకుని, ఒక వెర్రికేక పెట్టాడు నరసయ్య. గంప కింద పడేసి ఊరివైపు పరుగులు తీసాడు. ఊరు గమిడి వరకూ నరసయ్యను తరుముకున్న ఎలుగుబంటు ఊళ్లోకి రాకుండా తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది.
నరసయ్య చెప్పిందంతా విన్న ఊరిజనం, పడీపడీ నవ్వారు. ‘‘ఒరే బంగారంలాంటల్లుడ్ని పోగొట్టుకున్నావు గదా. పదిమంది తిండి, పాతికమంది కోపం ఉండే ఎలుగుబంటి అల్లుడ్ని పోగొట్టుకున్నావు కదరా’’ అంటూ వరసైన వాళ్లు గేలి చేశారు.
కిష్టమ్మ అదృష్టం బాగుంది, ఊళ్లో జనమంతా ఒకటై నారాయణకు కల్లు పోయించకుండానే, మూడు నెలల తరువాత శివుడితో కిష్టమ్మకు పెళ్లి జరిపించేశారు.

- పోట్లూరు సుబ్రహ్మణ్యం, నెల్లూరు చరవాణి : 9491128052