దక్షిన తెలంగాణ

ధనికుడు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది గ్రామసభ. ఆ ఊరి ప్రజలందరూ చిన్నా, పెద్ద, ముసలి, ముతక తేడా లేకుండా హాజరయ్యారు. నాయకులు, అధికారులు ఆ సభకు వచ్చి ప్రసంగించాల్సి ఉంది. గంటలు గడిచిన కొద్దీ సహనం నశిస్తోంది. ప్రజలందరూ లాభం లేదని లేచి వెళ్లిపోదామని అనుకుంటున్న తరుణంలో రయ్ రయ్‌మంటూ ఓ అరడజను కార్లు, ఓ డజను జీపులు వచ్చి ఆగాయి. అందులో నుండి అధికారులు, రాజకీయ నాయకులు చోటా, బడా లీడర్లు అందరూ దిగారు. సభలో కలకలం మొదలైంది. వేదిక పైకెక్కాల్సిన వాళ్లు ఎక్కారు. సభలో కూర్చోవాల్సిన వాళ్లు కూచున్నారు. నిశ్శబ్దం, నిశ్శబ్దం అంటూ ముఖ్య నాయకుడు సభను ప్రారంభించాడు.
తమ ప్రభుత్వం బీదవాళ్లకు ఇస్తున్న హామీలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరించాడు. వేదికపై ఉన్న వాళ్లలో మాట్లాడవలసిన వాళ్లంతా అవాకులు, చవాకులు మాట్లాడారు.
చివరగా ముఖ్య నాయకులు లేచి ఆ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దుతామని, బీదవాళ్లనేవాళ్లు లేకుండా చేస్తామని, తన మాటలతో స్వర్గాన్ని తెచ్చి వాళ్ల ముందుంచారు. ముందుగా ప్రభుత్వమిచ్చే ఉచిత ఇంటికోసం అసలే ఇల్లులేని వాళ్లను స్థలం కూడా లేని వాళ్లను చేయి లేపి చెప్పమన్నారు.
అంతే.. సభలో కలకలం మొదలైంది. సభలోని వాళ్లందరూ చేతులెత్తారు, రాజయ్య అనే బిచ్చగాడు తప్ప.
స్థానిక నాయకుడు రాజయ్యను అడిగాడు. ‘నీవెందుకు చేయి ఎత్తలేదు?’ అందుకు రాజయ్య నిదానంగా లేచి ‘ఈ సభలో ఉన్న వాళ్లందరూ ఇల్లో, ముంగిలో ఉన్నవాళ్లే. ఖాళీ జాగాలు కూడా ఉన్నవాళ్లే ఆ విషయం మీకు తెలుసు! వీళ్లందరూ ఏమీ గతిలేని బీదవాళ్లైనపుడు నేనే అసలైన ధనికున్ని. నాకు గుడిసె లేకపోతే లేకపోవచ్చు. స్థలం లేకపోతే లేకపోవచ్చు. మానాభిమానాలు పుష్కలంగా ఉన్నాయి. సిగ్గువిడిచి ఉన్నవాళ్లందరూ గతిలేని వాళ్లైనపుడు ఏమీ గతిలేని నేనే వీళ్లందరికంటే ధనికున్ని’ అని కూచున్నాడు రాజయ్య.
ఆ సభలోని ప్రజలందరూ సిగ్గుతో తలదించుకున్నారు. ప్రభుత్వ ఉచిత గృహం రాజయ్యకొక్కనికే మంజూరయ్యింది. గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకూ ప్రతివ్యక్తిలో రాజకీయం ఇనుమడించి మానాభిమానాలు కనుమరుగైపోయినందుకు భరతమాత మనస్సు నొచ్చుకుంది.

- గరిశకుర్తి రాజేంద్ర కామారెడ్డి జిల్లా సెల్.నం.9493702652