విజయవాడ

అలుపెరుగని త్యాగధనులు ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భరతమాత మెడలో మణిహారంలా వెలిసిన
హిమాలయ సానువుల్లో
ఉత్తరాన నెలకొన్న ఉన్నత శిఖరాల్లో
అహరహం శ్రమించే
అలుపెరుగని ధీరులు మన సైనికులు
తలిదండ్రులను విడచి
భార్యాబిడ్డలను మరచి
కార్యదీక్షా పరాయణులై
కదనరంగంలో కదంతొక్కుతూ
హిమపాతమైనా జలపాతమైనా
విపత్కర పరిస్థితులెన్నైనా
విధికి ఎదురొడ్డి నిలిచే
మన వీరజవానులకు
ఒకటే కాంక్ష ఒకటే దీక్ష
అదే.. అదే..
భారత పతాక గగనమంతా ఎగరాలని
మువ్వనె్నల జెండా
ముదమారగ విరియాలని
శత్రువుల గుండెల్లో నిదురించే సింహాలై
మరణానే్న హారంగా ధరించి
ప్రాణాల్ని సైతం పణంగా పెట్టే
‘పరమవీరచక్ర’లు మన వీరజవానులు
భరత ఖండంలో ప్రజలు
భయం లేకుండా బతకాలని
నా జాతి ప్రజలు నిబ్బరంగా నిదురోవాలని
నిలువున కరిగే కొవ్వొత్తుల్లా
మంచుకొండల్లో మరణపుటంచుల్లో
మొక్కవోని దీక్షతో విధులు నిర్వర్తించే
వీర త్యాగధనులు మన వీరజవానులు
అందుకే భరతమాత బిడ్డలంతా
ప్రాణమున్నంత వరకూ
జైజవాన్ - జైకిసాన్ అంటూ నినదిద్దాం
చివరిశ్వాస వరకూ వారి త్యాగాలను కీర్తిద్దాం

- యనమాల సుందర్,
ఫిరింగిపురం, గుంటూరు జిల్లా.
చరవాణి: 9032319507
**

దీపం చెప్పే వేదం

కనగ‘ద’కారమే ప్రమిదగాగ ‘ఇ’కారము వత్తి, తైలమే
పొనరెడు భక్తి, పైనెగడు ‘పొల్లు’ప్రభలే విరజిమ్ము దీపమై
కనపడు దైవమై తిమిర కాననమున్ దహియించు జ్వాలయై
అనిశము మంగళప్రదమునై సదనమ్ము నలంకరించెడిన్!

ఎత్తిన శీర్షమున్ మరలనెన్నడు దించకు ఠీవినెక్కొనన్
హత్తివలెన్ గమించి, యనయమ్మభివృద్ధినె పొందుటందునన్
చిత్తము నుంచి సాగిన విశేష జయమ్ము లభించునంచు నె
ల్గెత్తుచు చాటు దీపము, తరింపగజేయును జీవితమ్మునే!

దీపమునందునన్ సకల దేవగణమ్ము సమాశ్రయింత్రు సం
తాపము మాయుకల్గవె నితాంత శుభాలు నమస్కరింప నా
దీపముపై మనంబిడి, స్వదేశ విదేశములన్ గలట్టి వే
వో పలు ఆలయమ్ములిక నొళ్లలయన్ గమియింప నేలకో!

వెలుగులు జిమ్ము దివ్వియలు గడపనుంచ
కన్నుదోయికి నిమ్ము కలుగుసుమ్ము
దేదీప్యమానవౌ దీపశిఖల జూచి
లచ్చిమగని పడంతి వచ్చు సుమ్ము
ప్రజ్వరిల్లెడి దీపపంక్తుల గాంచుచో
భయమను రాకాసి పారుసుమ్ము
దీధితుల నెగడు దీపకమ్ముల గాంచి
అజ్ఞానమే అంతమగును సుమ్ము
శుద్ధ చైతన్యరూపమ్ము, శుభమునిచ్చు
గృహ గృహమ్ముల దీపించు ఈ గృహమణి,
భారతీయుల ఆత్మయై పరగుజోతి
భాస్కరుని సాటి భారత ప్రజలకెల్ల!

తలకెడవైన దివ్వె విశదంబుగ చాటదె జీవితమ్మునన్
కలిగిన భ్రంశనమ్మునకు గాసివడన్ పనిలేదు, లేచి, యు
జ్వల బల సంపదన్‌గొని సజావుగ నుండుడటంచు; నావిధిన్
మెలగిన ఓటముండునె? అమేయ జయమ్ము లభింపకుండునే?

- కలవకొలను సూర్యనారాయణ,
గుంటూరు.
చరవాణి : 9849268659