దక్షిన తెలంగాణ

ఆకాంక్ష (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాగ్దేవి పిల్లలం
ఆదిలాబాదు వాసులం
అక్షర క్రమంలో వలె
ఆదిలాబాద్ జిల్లాను
తెలంగాణ రాష్ట్రంలో
ప్రథమంగా చేర్చుదాం
తెలంగాణ సాధనలో
అలుపెరుగక పోరాడిన
ఘనచరిత గల మనమంతా
ఏకమై మసితలోన వెలుగుదారి
కొమురం భీం ఆశయాలు
సాధించగ తరలు దారి
వరదన్నల సదాశివల
స్ఫూర్తితో ఎదుగుతూ
సాహిత్య సోయగాలు
దశ దిశలా చాటుతాం
భావి తరాలకు బాటలుగా మారదాం
కానలోన వన్య వన సంపదల
కవ్వాల్ అభయారణ్యపు
అందాలను కాపాడి
సాత్నాల కుంటాల గలగలల
సిరిమువ్వల నాదాలకు
సొబగులద్ది బాణీలను కూర్చుదాం
వాగ్దేవి పిల్లలం
ఆదిలాబాద్ వాసులం

- ల్యాదాల గాయత్రి, కాగజ్‌నగర్, కొమురం భీం జిల్లా, సెల్.నం.9949431849
**
పన్ను పన్నాగాలు

పన్నులోయమ్మా పన్నులు!
ఎడా పెడా ఇంటా బయట
ఊపిరి సలుపుకోనివ్వకుండా
పైనా లోనా గుట్టుగా
మూలిగే నక్కపై తాటిపండులా
పన్నులోయమ్మా పన్నులు!
చాయ్ తాగితే టిఫిన్ తింటే
కొబ్బరి బోండాం తాగితే
జుట్టు కట్ చేసుకుంటే
ఫేలాలపై
చిట్ట చివరికి వదలకుండా
గోమూత్రంపై గూడ పనే్నసి
పళ్లూడగొట్టి నవ్వుతున్నారు
శాడిస్టు పాలక ప్రబుద్ధులు
పనె్నగ గొట్టే మూల్యాల్ని కుబేరుల్ని
సునాయాసంగా తప్పించుకొనిస్తారు
గరీబోడి రొట్టెపై గూడా పనే్నసి
ముక్కు పిండి మరీ వసూలు చేస్తారు
ఈ పన్ను పన్నాగాల్నుంచి
తప్పించుకునే మార్గానే్వషణ అమలు
ఎంత జల్ది సాధించుకుంటే అంత మంచిది!
లేకుంటే బతికి ఉన్న
మన బంధుజనాన్ని శ్రేయోభిలాషుల్ని సైతం
ఇబ్బందుల చట్రంలో ఇరికిస్తారు
మన శవాల మీదా పనే్నస్తారు నిస్సిగ్గుగా..

- డాక్టర్ దామెర రాములు, నిర్మల్, సెల్.నం.9866422494
**

నాకూ తెలియదు!

గుండె గొంతుకకు తెలియదు
ద్రవించే గుణమున్నదని!
కనురెప్పలకూ తెలియదు
చూపును శాసిస్తాయని!
బాధాతప్త హృదయాలకు తెలియదు
బంధాలకు బలి అవుతామని!
అబద్ధానికి తెలియదు
నిజాన్ని మరుగున పడేస్తన్నానని!
పుడమికి మాత్రం ఏం తెలుసు?
చల్లిన విత్తనాలన్నీ
కొన్ని మొక్కలుగానే మిగిలిపోతాయని!
దీపంలోని వత్తికి సైతం ఏం తెలుసు?
చమురు వున్నంత వరకే వెలుగుతానని!
స్రవించే అశ్రుధారలకూ తెలియదు
అన్ని ఆనంద భాష్పాలుగా మారవని!
కన్నవాళ్లకు మాత్రం ఏం తెలుసు?
ఆశించిన మమతలన్నీ
ఆవిరై పోతాయని!
నాకూ తెలియదు
ఇన్ని జీవన సత్యాలున్నాయనీ!!

- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.984967551
**

నేత్రద్వయం

నవ మాసాలు మోసి జన్మనిచ్చేది అమ్మ
నవ వసంతంలో ఓలలాడించేది ఆలి
గోరుముద్దలు తినిపించేది అమ్మ
గోముగా ముద్దులు కొసిరేది ఆలు
పస్తులుండి కడుపునింపేది అమ్మ
పరుగులు పెడుతూ జేబునింపేది ఆలు
దేహాన్నిచ్చేది అమ్మ
దేహంతో సగభాగం ఆలు
లాలించేది పాలించేది అమ్మ
మురిపించేది మైమరపించేది ఆలు
ఒక నేత్రం అమ్మైతే
మరో నేత్రం ఆలు
అవి ఎప్పుడూ ఒక దానిని మరొకటి
చూడకపోయినా
రెండూ ఒకే చూపునిచ్చే నేత్రద్వయమని
మరువకు నేస్తమా!

- సిరిపురం వాణిశ్రీ
రేకుర్తి గ్రామం
కరీంనగర్ జిల్లా
సెల్.నం.9392023988
**

ప్రణయం!

ప్రియా...
నా కలువ కన్నులలో ప్రతిబింబమై
ఆశల ఊసులు రేపుతూ అడుగడుగునా నాతోనే నాలోనే..
నా ఊపిరి బరువైందా...
అది నీ ఎడబాటుకి చిహ్నం!
నా ప్రాణం గాలిలో తేలియాడుతూ,
ఆనందపద సంకీర్తనం చేసిందా...
అది నా హృదయం నీ హృదయంతో చేసిన సాంగత్యానికి చిహ్నం!
అభినవ సుందరినై నీ హృదయ పల్లకిలో
ఊరేగుతూ అరమోడ్పు కన్నులతో
మత్తుగమ్మత్తులో మునిగి
సాగు అభ్యంగనం చేస్తున్న
నీవు నాతో లేవని
నను విడిపోతున్నావనే భావన
నను నిరాశలోకి నెట్టి
నేత్రాంచలాల్లో కలువకన్నీరు
ఏరులై పారి అసంతృప్త ఆర్తనాద వ్యథతో స్నేహం చేస్తూ..
కృశించే విరాగినౌతున్నా.. ప్రియా!

- సంకెపల్లి కీర్తనారెడ్డి
మహబూబాబాద్
సెల్.నం.9912134309
**

రాయినయ్యానేమిటి?

మాట్లాడగలను..
నవ్వించగలను..నవ్వగలను..
మనసుంది..ఆత్మకూడా ఉంది!
అన్నీ ఉండీ యంత్రంలా ఎందుకు మారాను?
ఓటు వేయగలను..గెలిపించగలను..
రాజ్యం నాది అంటే.. తలాడించగలను!
రాజ్యాంగం నాదేనంటే
ఎగిరి గంతులేయగలను!
అంతా బాగానే ఉంది కానీ..
కాళ్లు చేతులు ఏవీ ఆధీనంలో లేవెందుకనీ?
గతంలో ఇదంతా..
భగవంతుని ఆటగా కొందరన్నారు!
ప్రారబ్ధం అని మరికొందరు తత్వం చెప్పారు!
తలరాతంటూ తలపట్టుకున్నాం
ఇప్పుడంతా మారింది!
అమెరికా ఆట.. మన పాలకుల పాట!
ప్రపంచీకరణ వేట
కొత్త మాటల మధ్యన
డబ్బుకు నోరు తెరిచే..
రాయినయ్యానేమిటి?

- సిహెచ్.మధు
నిజామాబాద్
సెల్.నం.9949486121
**

అనాధను చెయ్యకు కొడుకా..

ఊరు పొమ్మంటుంది
కాడు రమ్మంటుంది
నన్ను అనాధ శరణాలయానికి
పంపకు కొడుకా..
కడుపులో నువు అడ్డం దిర్గినపుడు
నన్ను దీస్కపో నా కొడుకును బతికియ్యమని
ఎములాడ రాజన్నకు మొక్కినగాదు కొడుకా..
నన్ను అనాథను జెయ్యకు కొడుకా..
సర్కారీ బల్లె శెరీకు జేపిత్తా అంటే
ఇంగిలీసు బడికోతా అని నువ్వంటే
కాన్గీబల్లె శెరీకు జేపిచ్చిన కాదు కొడుకా..
నన్ను అనాథను జెయ్యకు కొడుకా..
పది మందిల నువు రాజోలే ఉండాలని
పదిండ్లల్ల ఊడ్చిసల్లి
నిన్ను పువ్వు పువ్వోలె జూసిన కాదు కొడుకా
నన్ను అనాథను జెయ్యకు కొడుకా..
పుస్తకాలు కావాలని పుస్సపుస్స
నువు బల్లెకెల్లత్తె
పుస్తెలమ్మి కొనిచ్చిన కాదు కొడుకా..
నన్ను అనాథను జెయ్యకు కొడుకా..

- గుర్రాల మాధవ్
కరీంనగర్, సెల్.నం.9492648887