నెల్లూరు

మార్పు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటిదాకా ఆడి ఆడి అలసిపోయిన భాస్కర్‌కు ఆకలి దంచేస్తా వుంది. పరుగు పరుగున వెళ్లి, ‘‘అమ్మా!... మో! కూడెయ్‌మా!’’ అన్నాడు.
కొడుకు అరుపు విని, ఆమె గబగబా పోయి ఒక సంగటి ముద్దను సగం తుంచి గినె్నలో వేసుకుని వచ్చింది. పాపం, భాస్కర్‌కు ఆ సంగటిని చూడగానే కడుపులో మండే ఆకలి సల్లగా ఎక్కడికో పోయింది. ఏడుపు మొహం పెట్టుకున్నాడు.
‘‘తినరా! అంది’’ అమ్మ.
‘‘నాకొద్దుపో, నే తిన్ను. నాకు కూడే కావాల’’ అన్నాడు భాస్కర్ మొండిగా.
‘‘తిను నాయనా! లేని కూడు, నేను యాడికిబోయి తెచ్చేదిరా!’’ అంది రత్నమ్మ.
‘‘ఇందాక నేను నీళ్లు తాగేదానికొస్తే... అక్క కూడతింటావుణ్నే. ఇప్పుడు లేదంటుండావే. నాకు సంగటొద్దు. కూడే గావాల’’ అన్నాడు భాస్కర్.
‘‘ ఒరే! అక్క కడుపుతో వుంది గదరా. ఆ యమ్మి సంగటి తినకూడదు. ఆ యమ్మి కోసమే చిట్టిడేసి వండినానురా!’’ అంది రత్నమ్మ.
‘‘అదేమో నాకు తెలీదు. నాకు కూడేగావాల’’ అన్నాడు భాస్కర్.
‘‘ఈ పూటకు ఎట్టోకట్ట తినరా. అట్టాగే రేపు మద్దినేళ కూడే తిందువులే’’ అని చెప్పింది.
ఇక చేసేదేమి లేక వౌనంగా, అయిష్టంగా కొంచెం సంగటిని తిని, చెంబుడు నీళ్లు గటగటా తాగాడు. కొంతసేపు నులక మంచం మీదపడి అట్టా ఇట్టా బొర్లాడి, ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగ సివాల్న పైకిలేచి, జేబులో నుంచి పడిన గోళీలను జవురుకొని, పిచ్చికుక్క తరిమితే పరిగెత్తినట్టు ఆటకు పరుగెత్తాడు.
రెండు సంవత్సరాలకు ముందు భారీగా కురిసిన వానకు చెరువుకు రెండు గండ్లు పడ్డాయి. ఊరును ఆనుకొని శివాలయం ముందుండే పెద్ద కొనేరుకు కూడా గండిపడింది. దాంతో మనుషులు, పశుపక్ష్యాదులకు నీటికొరత ఏర్పడింది.
ఊరికి కిలోమీటరు దూరంలో పొలంలో ఉండే బావినీరు తెచ్చుకోవలసి వచ్చేది. ఆ బావిలో కూడా నీళ్లు తగ్గిపోయినాయి. ఎవరు ముందుగా వెళితే, ఊరిన నీరు ఊరినట్లు తెచ్చుకునేవారు. ఒక బిందెడు నీళ్లు ఊరడానికి చాలా సమయం పట్టేది. పెద్ద కుటుంబంలోని వాళ్లు సరిపడా నీళ్లు తెచ్చుకోవడమంటే, యుద్ధంలో పోరాడి గెలిచినట్లుండేది. ఇక తిండి విషయంలో మనుషులు ఏదోరకంగా నెట్టుకొని వస్తున్నారు. కానీ పశువుల పరిస్థితి ఘోరంగా వుంది. మేత దొరకక కొన్ని మరణించాయి. దాంతో చాలామంది పశువుల బాధ చూడలేక ఒకటి సగంగా అమ్మేశారు.
రత్నమ్మ భర్త పేరు వీరభద్రయ్య. అందరూ అతన్ని భద్రయ్య అని మాత్రమే పిలిచేవారు. వీరభద్రయ్యకు పేరులో వీరత్వం ఉందేకాని గుణంలో మాత్రం శాంతమూర్తి. బతకడానికి ఏదో ఒక దారి వెతుక్కోవాలి. కాబట్టి భద్రయ్య బెంగుళూరు దగ్గర కూలిపనులు దొరుకుతాయని ఎవరో చెబితే అక్కడకు పోవాలనుకుంటాడు. ఆ సంగతి ఇంట్లో వాళ్లకు చెప్తాడు. వాళ్లు సరేనన్నారు. బెంగుళూరు వెళ్లి పనికోసం అక్కడ కూడా విచారిస్తూ నానాతంటాలు పడి చివరకు కూలీలను నియమించుకునే మేస్ర్తీని కలుసుకున్నాడు. ఆయనతో తనగోడు వెళ్లబోసుకుని, తనను కష్టాల నుండి గట్టెక్కించడానికి నీవే దిక్కని బతిమిలాడాడు.
భద్రయ్య మాటతీరును, అతని వినయ విధేయతలను చూసి మరుసటి దినం నుండి పనిలోకి రమ్మన్నాడు. తనకెవరూ తెలిసినవారు లేరు. తాను ఉండడానికి ఏదైనా వసతి చూపించమని మేస్ర్తీని అడిగాడు. ఆయన ఫలానా చోటుకు వెళ్లు.. అక్కడ నీలాంటి వాళ్లు ఐదారుగురు చిన్నచిన్న డేరాలలో ఉంటారని చెప్పాడు.
భద్రయ్య మేస్ర్తీ చెప్పిన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్లగా డేరాలు కనబడ్డాయి. ఆ డేరాలు వుండే ప్రాంతమంతా చెత్తాచెదారాలను, మురికి గుంటలను ఆనుకుని వున్న ఒక ఫ్లై ఓవరు కింద వున్న ప్రాంతం. అక్కడివారితో తాను ఫలానా మేస్ర్తీ దగ్గర పనిలోకి కుదిరాను. నేను కూడా మీతో వుండటానికి ఎక్కడైనా కాస్తచోటు చూపించమని బతిమిలాడాడు. వాళ్లలో ఒకడు నీవేమీ బాధపడవద్దు. నేను కూడా ఆ మేస్ర్తీ దగ్గరే పనిచేస్తుండానని చెప్పి, భద్రయ్యను తమ డేరాలో వుండమన్నాడు. ఆ డేరాలో అప్పటికే ఐదుగురు వున్నారు. ఆరవ మనిషిగా భద్రయ్య చేరిపోయాడు. అక్కడున్న వాళ్లందరూ తక్కువ రకం బియ్యం కొనుక్కుని, తమ డేరాల ముందే వండుకుని తింటున్నారు. భద్రయ్య కూడా ఆ రాత్రి వాళ్లు పెట్టిన అన్నం తిని సంతోషంగా నిద్రపోయాడు.
ఆ నిద్రలో తనకు ఏవేవో కలలు వస్తున్నాయి. భావి జీవితంలో తన అప్పులన్నీ తీరిపోయి, తాను సంపాదించిన డబ్బుతో చిన్న వ్యాపారం ప్రారంభించి స్థిరపడినట్లు, ఒక మోస్తరు ఇల్లు కట్టుకుని సుఖంగా బతుకుతున్నట్లు ఒకటే కలలు. అలా కలల ప్రపంచంలో విహరించి ఎప్పుడో తెల్లవారుజామున మగత నిద్రలోకి జారుకున్నాడు. తెల్లవారబోతోంది. తన డేరాలోని వారు భద్రయ్యను కూడా నిద్రలేపి పనిలోకి పోవడానికి సిద్ధంకమ్మని చెప్పారు. అక్కడంతా ఒకటే హడావిడి. సందడి సందడిగా వుంది. ఆ వాతావరణం చూసిన భద్రయ్యకు అయోమయంగా ఉంది. ఎలాగో తాను కూడా కాలకృత్యాలను తీర్చుకుని పనిలోకి పోవడానికి సిద్ధమయ్యాడు.
ఉదయం 7.30 గంటల సమయానికి ఆ ప్రాంతానికి ట్రక్కులు, ఆటోలు కూలీల కోసం వచ్చాయి. తనతో వుండేవారితో భద్రయ్య కూడా బయలుదేరాడు. ట్రక్కులో ఆ విధంగా ప్రయాణం చేయడం భద్రయ్యకు అదొక మధురానుభూతి. ఇంతలో ట్రక్కులు పనిచేసే ప్రాంతానికి చేరుకున్నాయి. భద్రయ్య అక్కడి గుమస్తా దగ్గర తన పేరు రాయించుకుని పనిలోకెళ్లాడు. మధ్యాహ్నం పనిచేసే చోటుకు దగ్గరలో ఉండే మెస్‌లో భోజనం పార్శిల్ తెచ్చుకుని, దాన్ని ఇద్దరు ముగ్గురు సర్దుకుని తినడం అక్కడి కూలీల పరిస్థితి. భద్రయ్య కూడా తాను వారిలో ఒకడుగా కలిసిపోయాడు.
మొదటిరోజు పని నుండి తిరిగివచ్చి ఏదో వండుకుని తిన్న తరువాత భద్రయ్యకు ఇంటిమీద గాలిమళ్లింది. తనను విడిచి వుండలేని కొడుకు, ఇంటి పని తప్పితే బటయపని తెలియని భార్య, అత్తవారింటి నుండి కాన్పుకు వచ్చిన కూతురు, వీరందరూ మదిలో మెదిలి కొంతసేపు మనసుకు బాధగా తోచింది. ఇది గమనించిన తోటివారు భద్రయ్యను ఓదార్చారు.
అలా నెలరోజులు గడిచిపోయాయి. భద్రయ్య నుండి ఇంటికి గాని, ఇంటి నుండి భద్రయ్యకు గాని ఎలాంటి సమాచారం లేదు. గుమస్తా కూలి డబ్బులు ఇస్తున్నాడు. అందరిలాగే వరుసలో వెళ్లి కూలి తీసుకున్నాడు. ఆరోజు ఎంతో ఆనందంగా వుంది భద్రయ్యకు. అందరికీ కూలి ఇచ్చిన తరువాత గుమస్తా వెళ్లిపోయాడు. భద్రయ్య మాటతీరు, పనిచేసే విధానం, కష్టపడి పనిచేసే తత్వం గుమస్తా దృష్టిని కూడా ఆకర్షించింది. భద్రయ్య తన కూలి డబ్బుల నుండి ఆటోచార్జి, మధ్యాహ్న భోజనంలో తనవాటా, రాత్రి వంటకయ్యే ఖర్చు ఎంతవుతుందో లెక్కలేసి, ఆ డబ్బులు మరియు చిన్న చిన్న అవసరాలకు వాళ్ల దగ్గర, వీళ్ల దగ్గర చేబదులుగా తీసుకున్నది, అంతా లెక్కించి ఎవరికి ఇవ్వవలసినది వారికిచ్చి మిగిలినది తాను ఊరికి వెళ్లేటప్పుడు తీసుకుంటానని చెప్పి గుమస్తా దగ్గరే దాచుకున్నాడు.
ఇలా రెండో నెలకూడా గడిచిపోయింది. మొదటినెల్లో తాను గుమస్తా దగ్గర దాచుకున్న కూలి, రెండవ నెలలో తనకు మిగిలిన కూలిని మరుసటి రోజు ఇంటికి మనియార్డరు ద్వారా పంపాలని, తాను పంపిన డబ్బుతో భార్యబిడ్డలు ఏదో నాలుగు మెతుకులు తినగలరని ఆశపడ్డాడు. మరుసటి రోజు ఉదయానికి భద్రయ్య ఆశలు అడియాశలయ్యాయి. తాను నిద్ర లేచి చూసేసరికి తన బ్యాగును ఎవరో తీసి, అందులోని డబ్బును స్వాహా చేశారు. భద్రయ్యకు పట్టరాని దుఃఖం వచ్చింది. ఏమిటి తన గతి. భార్యాబిడ్డల్ని ఎలా బ్రతికించుకోవాలని బోరున ఏడ్చేశాడు. తన డేరాలోని వాళ్లు, చుట్టుపక్కల డేరాలలోని వాళ్లు ఓదారుస్తున్నారే తప్ప తన కూలి డబ్బు దక్కదని తెలియగానే ఇంకా బాధపడ్డాడు. అలా ఏడ్చి ఏడ్చిన తరువాత చాలాసేపటికి తెప్పరిల్లి యథాలాపంగా అందరితో పాటు పనికి పోవడానికి తయారయ్యాడు.
అక్కడ పనిచేస్తున్న కూలీలలో చాలామంది మద్యానికి బానిసలుగా వున్నారు. కొందరేమో వచ్చిన కూలి వచ్చినట్లు సినిమాలకు, షికార్లకు ఖర్చుచేసి జల్సా చేస్తున్నారు. భద్రయ్య విలాసాల వైపునకు పోకుండా, తాగకుండా ఉండటాన్ని చూసి కొందరు ఎగతాళి చేసేవారు. పిసినారని కొందరు ముఖానే్న అనేవారు. అయినా భద్రయ్య పట్టించుకునేవాడు కాదు. డబ్బు పోగొట్టుకుని తన కుటుంబ పరిస్థితులను గూర్చి చెప్పుకుంటూ ఏడుస్తున్నప్పుడు అక్కడున్న వారి హృదయాలను కలచివేసింది. వారిలో కొందరు ఇలా అనుకోసాగారు.
భద్రయ్యకు ఇన్ని కష్టాలు ఉన్నాయా? అతనెప్పుడూ ఎవరితోనూ చెప్పుకున్నట్లు గాని, బాధపడుతున్నట్లు గాని కనబడలేదు. ఎప్పుడు చూసినా సంతోషంగా గల గల మాట్లాడుతుండేవాడు. ఇతడేనా అని ఆశ్చర్యపోయారు.
వీరభద్రయ్య డబ్బును పోగొట్టుకుని నిరాశగా, ఏదో పరధ్యాన్నంగా ఉన్నాడు. డబ్బు పోగొట్టుకున్న విషయం తెలిసి కొందరు పరామర్శిస్తున్నారు. ఎంతో ఉత్సాహంగా వుంటూ ఎంత కష్టమైన పనినైనా అవలీలగా చేసే భద్రయ్య ఆరోజు పనిమీద శ్రద్ధ కనబరచలేకపోయాడు. అతని సహచరులు కూడా అతడిని ఏమీ అడగకుండా, అతని పనిని కూడా వాళ్లే చేసేవారు. ఆ రోజు ఆ విధంగా గడిచిపోయింది. భద్రయ్య మాత్రం బాధపడుతూనే వున్నాడు. సరిగా తినడం లేదు. సరిగా నిద్రపోవడం లేదు.
బెంగళూరులో పరిస్థితి ఈ విధంగా వుంటే, ఎవరో ఊరికి వెళ్లి వచ్చిన వారి ద్వారా భద్రయ్య కూతురుకు కాన్పు దగ్గర పడిందని, ఇంటి దగ్గర డబ్బుకు బాగా ఇబ్బంది ఉందని తెలిసింది. ఎంతో కొంత సొమ్మును తొందరగా పంపమని కబురందింది. అంతేగాదు భద్రయ్య కొడుకు భాస్కర్‌కు ఏదో విషజ్వరమొచ్చి 15రోజులుగా మంచం మీదనే బాధపడుతున్నాడని తెలియగానే భద్రయ్యకు ఎంతో దుఃఖమొచ్చింది.
భద్రయ్యకు గత జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. ఐదెకరాల మాగాణి. పాడి పంటలతో సంతృప్తిగా తిని, మరొకరికి పెట్టిన రోజులు గుర్తుకువచ్చి మరీ బాధించాయి. ఎవరినీ చేయిచాపి అడగని భద్రయ్య, ఈరోజు ఊరుగాని ఊరులో తనవారంటూ లేనివారి మధ్య వుంటూ, కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకున్నాడు. ఇంటికి చిల్లిగవ్వయినా పంపలేక, తన నిస్సహాయ స్థితికి ఛీ.. తన బతుకూ ఒక బతుకేనా? అని పరిపరి విధాల ఆలోచిస్తూ కన్నీళ్లతో లోకమంతా మసకమసకగా కన్పిస్తూ ఉండగా కొంత సమయం గడచిపోయింది.
అంతలో లక్ష్మయ్య అనే వ్యక్తి అక్కడకు వచ్చి ‘‘్భద్రయ్యా! నన్ను క్షమించు. నాకు మందు కోసం డబ్బులు ఎక్కడా దొరకలేదు. అందువల్ల నేనే నీ డబ్బును ఎత్తుకున్నాను. నీ బాధను చూశాక, నా మనస్సుకు కూడా బాధకలిగింది. కొంత డబ్బును నేను ఖర్చుచేసేనాను. ఆ డబ్బును నా కూలి డబ్బులు వచ్చాక తీరుస్తాను. అంతేకాదు ఈరోజు నుండి మందు తాగనని ఒట్టేసి చెబుతున్నాను’’ అని చెప్పాడు.
లక్ష్మయ్య, భద్రయ్య మాట్లాడుకోవడం చూసి కూలీలు ఒక్కొక్క రు వచ్చి వింటున్నారు. ఆ మాటలు విన్నవారి మనసులో కూడా ఏదో మార్పు కలిగింది.
‘‘్భద్రయ్యా! లక్ష్మయ్య ఖర్చు చేసిన డబ్బును ప్రస్తుతం మేం సర్దుబాటు చేస్తాం. నువ్వు ఇంటికి వెళ్లిరా’’ అని చెప్పారు.
మిగతా కూలీలలో వ్యసనపరులైనవారు భద్రయ్యలాగా తాగకుండా, దుబారా చేయకుండా పొదుపు చెయ్యాలనే ఆలోచనకు వచ్చారు. రావడమే కాదు, వారి వారి మనసుల్లో గట్టి నిర్ణయం తీసుకున్నారు.
పోయిన డబ్బు దొరకడం, కూలీలు అండగా వుండడంతో భద్రయ్య ఏనుగునెక్కినంత ఆనందం కలిగింది. మనిషిలో కొంచెం హుషారు వచ్చింది. కూలీలతో పాటు వెళ్లి యజమానిని కలిసి ఊరెళ్లి వస్తానని చెప్పడానికి వెళ్లాడు. అక్కడ గుమస్తాకు జరిగిన సంగతంతా చెప్పాడు. ఆయన కూడా సంతోషించి ఇలా అన్నాడు.
‘‘్భద్రయ్యా! మంచివాడికెప్పుడూ మంచె జరుగుతుంది. నువ్వు కష్టపడి సంపాదించిన సొమ్ము నీకు దక్కింది. నేను కూడా కొంత డబ్బు ఇస్తాను. ఆ మొత్తాన్ని నెలనెలా నీ కూలీలో పట్టుకుంటాను. సరే, నీవు ఇంటికెళ్లి అబ్బాయిని మంచి ఆసుపత్రిలో చూపించి, ఇంట్లో వాళ్లకు మంచిచెడ్డలు చూసిరా’’ అని చెప్పాడు.
గుమస్తా మాటలకు సంతోషించి, ఆయనకు ధన్యవాదాలు తెలియజేసి వెనుదిరిగాడు. తాను వుంటున్న ప్రాంతానికి చేరుకుని, బట్టలు సర్దుకుని ఊరికి బయలుదేరాడు.
ఇంటికి చేరగానే కొడుకుని చూసి కడుపు తరుక్కుపోయింది. భద్రయ్య చాలా బాధపడ్డాడు. భర్త బాధపడడం చూసి రత్నమ్మ కూడా దుఃఖం ఆపుకోలేకపోయింది. బోరున విలపించింది. అమ్మనాన్నలు బాధపడుతుంటే గర్భవతియైన కూతురు కూడా బాధపడింది. తేరుకున్న దంపతులు ‘‘అమ్మా! నువ్వు ఈ సమయంలో బాధపడకూడదు. మా బాధలు మాకుంటాయి. అవేవో మేంపడతాం నువ్వు మాత్రం అవేవీ పట్టించుకోకుండా సంతోషంగా వుండమ్మ’’ అని చెప్పాడు.
వీరభద్రయ్య దంపతులు కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టరు పరీక్షించి ‘‘టైఫాయిడ్ బాగా ముదిరిపోయింది ఇన్ని రోజులు ఏం చేస్తున్నారు’’ అని అరిచాడు. వారు జరిగిన విషయం చెప్పారు. డాక్టరు మంచి మందులు వాడి, వారానికి భాస్కర్ ఆరోగ్యం మెరుగుపరిచాడు. సంతోషించిన వీరభద్రయ్య దంపతులు డాక్టరు గారికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టరు కూడా వారి దగ్గర తగు మాత్రం ఫీజును తీసుకున్నాడు.
అంతలో ఎవరో వచ్చి మీ అమ్మాయి ప్రసవ వేదనతో ఉండడంతో డాక్టరు దగ్గరకు తీసుకెళ్లారని చెప్పారు. భద్రయ్య ముందు వెళ్లగా భాస్కర్‌ను వెంటబెట్టుకుని నెమ్మదిగా వెళ్లింది రత్నమ్మ. వీళ్లు వెళ్లేటప్పటికి భద్రయ్య నవ్వుతూ ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఏమైందని అడగ్గా మహాలక్ష్మిలాంటి పాప పుట్టిందని చెప్పాడు. ఒకపక్క కుమారుని ఆరోగ్యం బాగుపడడం, మరోపక్క కూతురుకు సుఖప్రసవం కలిగి పండంటి ఆడపిల్ల పుట్టడంతో భద్రయ్య కుటుంబం ఎంతో ఆనందంగా వుంది. మంచివారికి అంతా మంచే జరుగుతుంది అని మరోసారి రుజువైంది.

- ఆడేరు చెంచయ్య నాయుడుపేట, చరవాణి : 9492331449