రాజమండ్రి

అవినీతి చిరునామా (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాలుగు రోజులుగా అనుకుంటున్న పనులు ఈ రోజైనా ఆఫీసుకు వెళ్లేప్పుడు పూర్తిచేయండి’ గుర్తుచేసింది శ్రీమతి కృష్ణమూర్తి.
‘అలాగే ఈ రోజు ముఖ్యమైన రెండు పనులు పూర్తిచేస్తా’2చెప్పాడు కృష్ణమూర్తి.
కృష్ణమూర్తి తల్లి మూడు నెలల క్రితం స్వర్గస్తురాలయ్యింది. డెత్ సర్ట్ఫికెట్ కోసమని మున్సిపల్ ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చి నెల దాటింది. సర్ట్ఫికెట్ ఇవ్వడానికి గుమాస్తా వేయి రూపాయలు అడుగుతున్నాడు. డబ్బు ఖర్చవకుండా సర్ట్ఫికెట్ సంపాదించాలని కృష్ణమూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. రికమండేషన్ చేయించినా పని జరగలేదు. బ్యాంకులో తల్లిపేర ఉన్న డిపాజిట్లు విత్‌డ్రా చేయడానికి సర్ట్ఫికెట్ అవసరం. డబ్బు ఖర్చవనిదే పని జరగదని కృష్ణమూర్తికి అర్థమయ్యింది. ఈరోజు ఎలాగైనా మున్సిపల్ ఆఫీసులో పని పూర్తిచేసుకోవాలని కృష్ణమూర్తి నిర్ణయించుకున్నాడు.
ముఖ్యమైన మరో పని పెద్ద కొడుక్కి టెక్నో స్కూలులో సీటు రిజర్వు చేసుకోవడం. కృష్ణమూర్తికి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు ఐదో తరగతి చదువుతున్నాడు. మరో రెండు నెలల్లో సంవత్సరాంతం పరీక్షలయి, వేసవి సెలవులిస్తారు. ఆ తరువాత స్కూలు మార్చి కొడుకుని టెక్నో స్కూలులో ఆరో తరగతిలో చేర్చాలని కృష్ణమూర్తి దంపతులు నిశ్చయించుకున్నారు. కొడుకు ఇంజనీర్ అయి, అమెరికాలో ఉద్యోగం చేయాలని తల్లిదండ్రుల ఆశయం. గట్టి పునాది పడాలంటే మంచి స్కూల్లో చేర్పించక తప్పదుగా.
ఈ రెండు పనులు పూర్తిచేయాలని అనుకుంటూ కృష్ణమూర్తి బైక్ తీశాడు. మెయిన్ రోడ్డులోని మున్సిపల్ ఆఫీసు చేరుకునేలోపు పోలీసులు ఆపారు. అక్కడ డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సి, వెహికల్ ఇన్సూరెన్స్ చెక్ చేస్తున్నారు. కానిస్టేబుల్ కృష్ణమూర్తి డ్రైవింగ్ లైసెన్సు, ఆర్‌సి చూపించమన్నాడు. ఆ రెండూ ఇంటివద్దే ఉన్నట్టు కృష్ణమూర్తికి గుర్తుకొచ్చింది. అదే విషయం కానిస్టేబుల్‌కు చెప్పాడు. కేసు రాస్తానని బెదిరించాడతను. అతన్ని బ్రతిమలాడి, రెండొందలు చేతిలోపెట్టి, బైక్ స్టార్ట్‌చేశాడు కృష్ణమూర్తి.
ప్రొద్దునే్న లేచి ఎవరి మొహం చూశానో? రెండొందలు వదిలాయి. ఈ పోలీసులు తమ పవర్‌ని అడ్డుపెట్టుకుని ప్రజల్ని దోచేస్తున్నారు. ఈ దేశాన్ని బాగుచేయడం ఎవరితరం కాదు సణుక్కుంటూ మున్సిపల్ ఆఫీసు చేరాడు కృష్ణమూర్తి.
పదిన్నర కావస్తున్నా ఉద్యోగులెవరూ సీట్లలో లేరు.
కృష్ణమూర్తి విసుక్కుంటూ అటూ, ఇటూ తిరిగాడు ‘ఆఫీసుకి టైముకి రాని ఉద్యోగుల్ని డిస్మిస్ చేసిపారేయాలి’ కసిగా పెదాలు కొరుక్కున్నాడు కృష్ణమూర్తి.
మరో పది నిముషాల్లో గుమాస్తా వచ్చాడు.
అతని చేతిలో వేయి రూపాయలు పెట్టాడు కృష్ణమూర్తి.
‘మీరెంతమంది చేత చెప్పించినా ఇక్కడ పని జరగదు సార్ అనవసరంగా పాపం నాలుగుసార్లు తిరిగారు... ఈ పని ముందే చేసుంటే ఇన్నిసార్లు తిరగక్కరలేకపోను. పోనె్లండి ఇప్పటికైనా విషయం గ్రహించారు. ఇంకెందుకు ఆలస్యం సాయంత్రం వచ్చేయండి.. సర్టిఫికెట్ పువ్వుల్లో పెట్టి ఇస్తా’ నవ్వుతూ చెప్పాడు గుమాస్తా.
‘మళ్లీ పువ్వుల ఖర్చు నా దగ్గరే వసూలు చేస్తారేమో... మామూలుగా సర్ట్ఫికెట్ ఇవ్వండి చాలు... పువ్వుల్లో పెట్టి అక్కరలేదు’ జోక్‌చేశాడు కృష్ణమూర్తి.
‘అబ్బో ఏమో అనుకున్నా... సార్ హాస్య ప్రియులే’ నవ్వాడు గుమాస్తా.
అక్కడి నుండి బయలుదేరాడు కృష్ణమూర్తి.
హు... చిన్నపనికి వేయి రూపాయలు గుంజాడు.. అవినీతి చెదలు దేశాన్ని తినేస్తున్నాయి. ఈ దేశాన్ని బాగుచేయడం ఎవరితరం కాదు. గొణుక్కుంటూ సరస్వతీ టెక్నో స్కూలు చేరాడు కృష్ణమూర్తి.
ప్రిన్సిపాల్ తమ స్కూలు ప్రత్యేకతలు వివరించాడు. ‘ఇక్కడ చదివితే ఎంసెట్ వంద లోపు ర్యాంకు గ్యారంటీ. మా స్కూల్లో సీటు రిజర్వు చేసుకోవడమంటే ఐఐటిలో సీటు రిజర్వు చేసుకున్నట్లే’ అంటూ 50 వేలు డొనేషన్ కట్టి సీటు రిజర్వు చేసుకోవాలని చెప్పాడు.
పదివేలు అడ్వాన్సు కట్టి, మిగిలిన డబ్బు రెండు రోజుల్లో కడతానని హామీయిచ్చి, ఆరో తరగతి సీటు రిజర్వు చేసుకుని బయలుదేరాడు కృష్ణమూర్తి.
ఆరో తరగతికి 50వేలు డొనేషన్... టెక్నో స్కూలు అనడం జనాల్ని దోచేయడం... డబ్బుకు విలువ లేకుండా పోయింది... ఈ దేశాన్ని బాగుచేయడం ఎవరి తరం కాదు పళ్లు నూరాడు కృష్ణమూర్తి బైక్ తీస్తూ...
పనె్నండు గంటల ప్రాంతంలో తాలూకాఫీసు చేరుకుని బైక్ స్టాండులో పెట్టి, నేరుగా వెళ్లి తన సీట్లో కూర్చున్నాడు కృష్ణమూర్తి.
అతను తాలూకాఫీసు ఉద్యోగి
ఒక వృద్ధుడు వచ్చి నమస్కారం చేసి, చేతులు కట్టుకుని కృష్ణమూర్తి టేబుల్ ఎదురుగా నుంచున్నాడు.
విసుక్కుంటూ అతని వైపు చూశాడు కృష్ణమూర్తి.
‘అతను ప్రక్కవూరి నుండి వచ్చాట్ట... పది గంటల నుంచి నీ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎక్కడికెళ్లావ్... ఈరోజు లేటయిందేం’ అడిగాడు ప్రక్కసీటు గుమాస్తా.
‘ఈ రైతులకు పనీపాటా ఉండదు. ఇంకా పనె్నండవలేదు. ఏం కొంపలంటుకున్నాయని. రాత్రి దాకా ఇక్కడే ఉంటాం’ జవాబిచ్చాడు కృష్ణమూర్తి డ్రాయర్ తాళం తీస్తూ.
‘బాబూ పట్టాదార్ పాసు పుస్తకం కోసం రెండు నెలలుగా తిరుగుతున్నా... తమరు దయవుంచి...’ నసిగాడు వృద్ధుడు.
‘చూడు బాబూ నువ్వడగ్గానే ఇచ్చేయడానికి ఇది ధర్మసత్రం కాదు... ప్రభుత్వ కార్యాలయం... ఇక్కడ ప్రతి పనికీ ఎన్నో రూల్స్ ఉంటాయి... నీకు ముందే చెప్పానుగా... పాతిక వేలు ఇస్తేకానీ పని జరగదని... డబ్బు తేకుండా ఎన్ని నెలలు తిరిగినా ఇక్కడ పనికాదు... పద.. పద...’ ఖరాఖండీగా చెప్పాడు కృష్ణమూర్తి.
వృద్ధుడి కన్నీళ్లకు కృష్ణమూర్తి చలించలేదు.
‘తేరగా పనులు చేయించుకోవాలని తిరుగుతుంటారు... ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోరు... ఈ దేశాన్ని బాగు చేయడం ఎవరి తరం కాదు’ అనుకుంటూ ఫైల్స్ తీశాడు కృష్ణమూర్తి.

- ఇంద్రగంటి నరసింహమూర్తి
అశోక్‌నగర్, కాకినాడ
***

మనోగీతికలు
**
ప్రతిఫలాన్ని ఆశించవు

మధురమైన ఫలములనిచ్చి
ఆకలి తీర్చే పచ్చనిచెట్లు
పరిమళాల పువ్వులు పూసి
ఉల్లాసంగా ఉంచే పచ్చనిచెట్లు

కార్బన్ డై ఆక్సైడ్ వాయువుని పీల్చి
జీవవరణానికి మేలుచేసే పచ్చనిచెట్లు
ఆక్సిజన్ వాయువునిచ్చి
ప్రాణదాతలయ్యే పచ్చని చెట్లు

ఏ దేశంలో ఉన్నా
చల్లని నీడను ఇచ్చే పచ్చనిచెట్లు
ఏవేళ చూసినా
కనువిందు చేసే పచ్చనిచెట్లు

ప్రకృతికి అందాన్ని తెస్తాయి
చల్లని గాలి వీచి ఆహ్లాదం కలిగిస్తాయి
ఫలాలనిస్తాయి కాని
ప్రతిఫలాన్ని ఆశించవు పచ్చనిచెట్లు

పచ్చని చెట్లు మనం నాటాలి
పర్యావరణ పరిరక్షణ గురించి చాటాలి
పచ్చని చెట్ల మీద వేస్తే వేటు
పర్యావరణానికి చేటు

- మేడిచర్ల సూర్యప్రకాశరావు,
రామరాజులంక, మలికిపురం మండలం
సెల్: 9640097161, 9553350189
***

విజయగీతి

గగనాన నీ ‘కమోవ్’ కనిపించినంతనే
తోక ముడిచిపోవు పాకి జట్టు
భూతలాన నెదిర్చి పోరు సల్పగలేక
ఆజినాపి శరణమను ‘నవాజు’
సంద్రాన నీనౌక సంధించిన వలలో
ఉన్నపాటున చిక్కు ఉగ్రఘషము
లోకాన నీశక్తినేక కంఠము తోడ
పాడ దీపావళి పండగౌను

భళిర భారత సైనికా! భవ్యశౌర్య
గీతమాలపించగ మాకు చేతము పులకించు
సత్యమేవ జయతే యంచు జగతి
త్వదభినవశక్తిగని ‘నమో’వాక ముఖడు

- తటవర్తి రాఘవరాజు
రామచంద్రపురం
సెల్: 9963610243
***

తెలుగును నమ్ముకో..

తే.గీ. అందఱును కట్టగుట్టుకు అమెరికాకు
పొండిరా నేను మీ చెల్లి ఇండియాలొ
కలియొ గంజియొ ద్రావుచు తెలుగుభాష
కొఱకు కృషిచేసెదము శక్తికొలది యిచట

సీ. మల్లాది వారును మల్లాప్రగడ వారు
గరికిపాటి యువద్దిపర్తి వారు
చాగంటి వారును సామవేదము వారు
మహతిశంకరు గారు మైలవరపు
మేడసాన్యవధాని మాడుగులవధాని
మంజులశ్రీ అన్నమయ్యవారు
గజలు శ్రీనీవాసు కందాళె వారును
కొలకులూరు ఇనాకు కులపతులును

తె.గీ. వీరు తెలుగును నమ్ముకొన్నారు గాదె
వీరినీ తెల్గు రాష్ట్రాల వారు ప్రేమ
మీరగా గౌరవించుచున్నారు గాదె
ఈ మహద్భాగ్యమమెరికా ఈయగలదె?

సీ. తిక్కన్న కలములో తీయందనాలను
రుచిచూడని నరుండులుబ్ధకుండు
త్యాగయ్య గొంతులో తారాడునాదాలు
ఆలకించనివాడు వ్యర్థజీవి
బమ్మెర పోతన భగవత్క్థాసుధా
పానమొల్లనివాడు పామరుండు
ఎంకి పాటలలోని హృదయంగమ ప్రేమ
చవిచూడని నరుండు చచ్చుమనిషి

తే.గీ. మందరము కల్పవృక్షము మల్లెమాల
రంగనాథాది శ్రీరాము రమ్యమైన
రచనలు జద్వకయె నాల్గురాళ్ల కొఱకు
భరతభుని వీడువాడు వానరుగాడె!

- డా. రామసుందర్రావు,
విజయవాడ.
చరవాణి : 9441026360
***

కొత్త ఇల్లు

అక్షరాలను కూర్చికూర్చి
పదాల ఇటుకలు పేర్చిపేర్చి
ఉపమానాల సిమెంట్ అద్ది
అర్థవంతమైన గోడలు కట్టి
శీర్షిక అనే స్లాబు వేశాను!
ఎత్తుగడల గదులు కట్టి
ప్రాసల ప్రాకారాలు పెట్టి
కొసమెరుపుల రంగులు కొట్టి
ఆశ్చర్యాల అంతర అలంకరణలతో
మెరుపుల విద్యుత్తు దీపాలతో
అందమైన ఇంటిని నిర్మించాను!
ఆహ్వాన పత్రికలను ముద్రించి
సాహితీ పత్రికలకు పంపితే
ఆహ్వానం అందిందో లేదో అనుమానం
అతిథ్యానికి వస్తారో లేదో అనిశ్చితి
ఆలోచనల రంగులు వెలసి
మస్తిష్కపు పెచ్చులు ఊడి
గృహప్రవేశం ఇంకా జరగని
నవ నిర్మాణాలను వీక్షిస్తుంటే
పడిన కష్టం పదిమందీ చూస్తే
బాగుండుననిపిస్తుంది.

- డా. మక్కెన శ్రీను,
విజయవాడ.
చరవాణి : 9885219712