విజయవాడ

మంచివాడు పోయినా వున్నట్లే! ( చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! మీ ప్రభాకర్ అన్నయ్య బకెట్ తనే్నశాడట. మా ఫ్రెండ్ చెప్పాడు’ అన్నాడు రవి.
‘పిచ్చివాగుడు ఆపరా. మొన్నకూడా ఆ తాయారమ్మ గారు పోయారని చెప్పావు. ఆవిడ నాకు రామకోటిలో కనిపించింది. ఎందుకిలా అందరినీ చంపేస్తున్నావు? మావోడికి కొద్ది నోటిదురుసు. అందుకే అందరం దూరంగా వున్నాం. చచ్చిపోయినా చెప్పనంత కక్షలు మామధ్య లేవు’ అంది దుర్గాంబ కోపంగా.
‘వాడికి ఇప్పుడే ఫోన్ చేస్తా విను’ అని స్పీకర్ ఆన్‌చేసి ‘ప్రభాకర్ గారు చనిపోయి ఎన్ని రోజులైందిరా?’ అని అడిగాడు రవి.
‘ఇవాళ పదోరోజు. మా వీధంతా జనంతో కిటకిటలాడిపోతోంది. సందు మొత్తం షామియానాలు వేశారు. ఆయన పెద్దవాళ్ల తరఫున ఫీజు తీసుకోకుండా వాదించేవాడట. దేవుడులాంటి మనిషని చెప్పుకుంటున్నారందరూ!’ చెప్పాడు. ‘విన్నావా? మీ ప్రభాకర్ అన్నయ్య వీధిలోనే!’
‘ఊరుకోరా గాడిదా! పోయినవాడు లాయర్ ప్రభాకర్. ఆయన పేదలకి దేవుడు. అన్నదానాలు.. జన సందోహం! మీ మామయ్య పిల్లికి కూడా బిచ్చం పెట్టడు. ఆత్మస్తుతి, పరనింద. వాడికి ఆ రూటులో బంధువులే లేరు. వాడుపోతే సగం మంది కూడా వెళ్లరు. కొడుకులు ముగ్గురు, కోడళ్లు మాత్రమే హాజరవుతారు. మంచివాడు చనిపోయినా బతికి వున్నట్లే. చెడ్డవాడు బతికున్నా చచ్చినట్లే.. అని పెద్దలు చెబుతారు. మీ తాతయ్య పోయాక వాడు అందరికీ దూరమయ్యాడు. అయినా మీ అమ్మకి వాడంటే అభిమానమే. పిచ్చివాగుడు వాగి దాని మనసు బాధ పెట్టకు’ అని కసిరాడు శంకరం.
‘మా పెద్దమ్మ పోతూ వాడిని నువ్వు కొద్దిగా చూస్తుండు’ అని చెప్పింది. బాధగా అంది దుర్గాంబ.

- వి రాధాకృష్ణ, నోవా కాలేజీ, విజయవాడ.
***

వెంటాడే కవులు

వీరరాఘవ కవితా విలాసం

సుమారు వందేళ్ల క్రితం ప్రకాశం జిల్లా పొదిలిలో శతావధానం జరుగుతోంది. పండితులైన పృచ్ఛకులొకరు ‘విధవను జూచి భర్త యురివేసుకు చచ్ఛెను చూడగా జనుల్’ అని సమస్యను ఇచ్చారు. భర్త చనిపోయిన స్ర్తిని ‘విధవ’ అని అంటారు. అలాంటి విధవను చూసి ఆమె భర్తయే ఉరి వేసుకొని మరణించడం అసలు ఎలా కుదురుతుంది? ఎంత విరుద్ధమైన సమస్యాపాదమో చూడండి. దీనిని ఆ అవధాని సులభంగా ఎలా పూర్తిచేశారో గమనించండి.
‘అధములు చచ్చెఁజచ్చెనను నాఱడికూత నిజానిజంబులే
విధములొ నిర్ణయింపక వివేక విహీనులు వాని కోమలిన్
విధవనొనర్చియుంచిరట; వేడుకఁ గొన్నిదినాల నాటికా
విధవను జూచి భర్త యురివేసుక చచ్చెను జూడగా జనుల్!’
ఈ సమస్యను పూరించడానికి కవి ఓ సన్నివేశాన్ని కల్పించారన్న మాట. పూర్వం సంపాదన కోసం భర్తలు దేశాంతరాలకు పోతుండేవారు. అలా వెళ్లిన ఒకామె భర్త కొంతకాలానికి చనిపోయాడనే వార్తను పుట్టించారు. అందలి నిజానిజాలను గుర్తించక ఆమె బంధువులామెను విధవను చేశారు. కొంతకాలానికామె భర్త తిరిగి వచ్చాడు. విధవగా ఉన్న తన భార్యను చూసి బాధతో ఉరివేసుకుని మరణించాడు. ఇలా సన్నివేశ కల్పన వల్ల పూరణలో చమత్కారమేర్పడింది.
‘పార్వతి దశరథుని తనదుపతిగా కోరెన్’ అని ఆ అవధానిగారికొక చోట ఇచ్చిన సమస్యను -
‘పూర్వాచారపరాయణ! ధూర్వహ కౌసల్య నెంతదూర మడిగినన్
గర్వగ్రంథులఁబోవిడి! పార్వతి! దశరథుని తనదు పతిగాఁగోరెన్’
అని పూర్తిచేశారు. ఇక్కడ పార్వతి కాదు దశరథుణ్ణి పెండ్లి చేసుకుంది - కౌసల్యయే. ‘ఓ పార్వతీ! కౌసల్య తన అభీష్టాన్ని అనుసరించి దశరథుణ్ణే తన పతిగా కోరింది’ అని శివుడు పార్వతిని సంబోధిస్తూ కథను చెబుతున్నట్లుగా పూర్తిచేయడం వల్ల సమస్యలోని వైరుధ్యం తొలగిపోయింది.
ఇలా అలవోకగా సమస్యా పద్య పూరణల్ని గావించినవారు ఎవరో కాదు ‘పేరా? ‘రాఘవ శాస్ర్తీ’ ‘గాడెపలి’యన్ పేరింటి పేరింక; మా
యూరా? ‘రక్తనగా’ఖ్య పట్టణము’; మాయుద్యోగమా రాట్య భా
స్తారుల్ మెచ్చ శతావధాన కవితా సందర్భముల్ చూపి స
త్కారంబందుట; ‘గద్దువాల్’నృపతి యాస్థానంపు విద్వత్కవిన్’ అని ఒక సందర్భంలో చెప్పుకొన్న శతావధాని శ్రీ గాడేపల్లి వీరరాఘవ శాస్ర్తీగారు. ‘రక్తనగాఖ్య పట్టణం’ అంటే ‘ఎఱ్ఱగొండపాలెం’ అని అర్థం. ఈ పేరునకు సంస్కృతాకరణమిది.
గద్వాల సంస్థాన విద్వత్కవులు మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్య శాస్ర్తీగారు, మున్నగువారు వీరి శిష్యులు. భారతుల నరసింహశాస్ర్తీగారు వీరి గురువర్యులు.
1928లో శ్రీరామ నవరాత్రోత్సవ సభలో ‘దివ్వె వెలుగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్’ అన్న సమస్యను ఇవ్వగా వీరరాఘవ శాస్ర్తీగారు తమ ప్రతిభాపాటవంతో నాలుగైదు రకాలుగా పూరణ గావించారు. అందులో ఒక దానిని చిత్తగించండి:-
‘నవ్వను మందగించితివి; నాచును మించిన కేశపాశమున్
రివ్వున జార్చియుంచితివి; రేపితి మోమున కమ్మ కస్తురిన్
మవ్వపుఁజూపులం జొనిపి మంచియుపాయముఁజేసితే! చెలీ!
దివ్వె వెలుంగుచుండిన గదిన్ నలువంకల నిండెఁ జీకటుల్’!
దీపం వెలుగుతున్న గదిలో చీకట్లుండవుగదా! ఇది సమస్య. ఒక నాయిక తన శృంగార చేష్టల ద్వారా గదిలో చీకట్లను వ్యాపింపచేస్తోందని నాయకుడామెను ప్రశంసిస్తున్నట్లుగా శాస్ర్తీగారు చమత్కారంగా పూర్తిచేశారు. తెలుగువారి స్వతంత్ర ప్రక్రియ అయిన అవధానంలో శ్రీ వీరరాఘవ శాస్ర్తీగారు తిరుపతి వేంకట కవులు, కొప్పరపు కవుల కోవకు చెందినవారు. వీరు ‘శ్రీ త్రిపురాంతక స్థల మహత్మ్యం’ వంటి రసవత్తర పద్యకావ్యాలను గూడా రచించారు. అందులోనిది మచ్చుకో పద్యం- అభిషేక ప్రియుడైన శివునికి ఈ కవీశ్వరుడేవిధమైన అభిషేకాన్ని చేస్తున్నారో గ్రహించండి:
‘నెత్తిని స్వర్గగంగ గల నీకభిషేక మొనర్తునంచుఁ గే
లెత్తి ధరాస్థలిన్ గలుగు నీయపవిత్ర జలంబు లుంపగాఁ
జిత్తము సమ్మతింపక ప్రసిద్ధ కవిత్వ రసప్రసక్తిఁ గిం
చిత్తు నొసంగుచుంటి; నభిషేకమిదే; త్రిపురాంతకేశ్వరా’ ఇదీ వీరరాఘవ కవితా విలాసం.

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net