ఉత్తర తెలంగాణ

ఆమె దుఃఖం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దునే్న, ఆమె చీపురు పట్టుకొని
వాకిట్లో నాట్యమాడుతున్నది,
నెమలిలా..
నిన్నటి రాత్రి
మాటలు కలెబడ్డ దుర్ఘటన
నివ్వెరపోయి చూస్తున్న రెండు బాల పిచ్చుకలు
సింహం జూలు గుంజనట్టు
గుర్రుమన్న మగ అహంకారం
సన్నజాజి వొంటిపై విరుచుకుపడ్డ
నిప్పు కణికల ఆగ్రహం
పిట్టగూటిలో కన్నీటి జడివాన
ఇల్లంతా విరబూసిన వౌనం
ఒంటిపై పల్లేరు గాయాలు మొలిచినట్టు..
ఉత్తర దక్షిణాలుగా విడిపోయిన
రాజీ కుదరని దేహ పారిజాతలు
ఆనందం అటకెక్కిన నిన్నటి రాత్రి దృశ్యాలు
ఆమె అశ్రు ధారలు పట్టుకొని దునుకుతూవుంటే..
రాలిన కన్నీళ్లు పోగు చేసి
దుఃఖం ఊడ్చుకున్నాం!
వాకిలి వొళ్లు కడిగి ముగ్గు పూయించి
వంటింట్లో ఉడుకుతున్న
అన్నమయ్యింది!
- గజ్జెల రామకృష్ణ, భూదాన్‌పోచంపల్లి, నల్లగొండ జిల్లా, సెల్.నం.8977412795
**

ఓ ధిక్కరణ గీతం!

మెరుపు మెరిసిన రాత్రి
అమావాస్యకు తుది రోజులని భావించాను
కానీ..
తెల్లవారే రేప్ జరిగిన వార్త
ఇది తెల్లవారటం కాదు
కోడి కూసిందని నిద్రలేచాను
కానీ..
ఎంతకూ తూర్పు విచ్చుకోదు
సంతోషం ఆవిరయిన మెలకువ!
పప్పుల ధరలు పెరిగాయనే వార్త
ఫర్వాలేదు సూర్యుడు కనిపిస్తున్నాడని
తూర్పు దిక్కు దండం పెట్టి
ఓ ఎరుపు పాట ఎత్తుకుంటే..
అన్నం పెట్టే రైతు ఆత్మహత్య వార్త!
చీకటికి వ్యతిరేక పోరాటం
నలుపుకు నిరసన ఉద్యమం!
శత్రువు ఆయుధమేమి చేస్తుంది
ప్రజలంతా ఒకటైతే ఓ ప్రశ్నతో
పిడికిలిని నినాదం చేస్తే..
రాజ్యాంగం పేరుతో
నిలువునా కాల్చిన కుట్ర!
ఎంతకాలం?
తలవంచినంత కాలం!

- సిహెచ్.మధు, నిజామాబాద్
సెల్.నం.9949486122
**

వలసల బాటలో..

ఆధునిక జీవనం అవతరించి
కన్న తల్లికీ పల్లెటూరికీ మధ్య బంధం
కడుపుల బిడ్డకు బొడ్డు తాడు మెడకు వడ్డట్టయంది
కష్టాల కడగండ్లను దాటుకుంటూ బిడ్డల్ని
కంటికి రెప్పలా కాపాడి పెంచి పెద్దగ జేస్తె
ఉడుకు రక్తపు యువత
వలసల బాటలో వాడిపోయిన తీగలైనయి
ఉద్యోగాల ఉచ్చులో రొచ్చులై..
విదేశాల మోజులో గాజుబొమ్మలై..
పింగాణి పెంకుల్లో రొట్టెముక్కలు
కత్తులు పట్టి కుచ్చుక తినుడు
సీసపు గిలాసల జ్యూస్ తాగుడు
ఒంటికి జానెడు బట్ట..
రొమ్మును రొయ్యల మొలతాడంత
దిగంబర జీవితాలతో మురిపాల సంబరాలు!
పల్లె తల్లి కడుపు కోతకు మరయంత్రమైతుండ్రు
కడగంటి చూపుకందక
కన్నవారిని కాటికంపుతున్న కటిక జీవితాలు
పాడుబడ్డ బాయిల గబ్బీలాల బతుకులు!
తల్లి ఏడుపు పల్లె విలవిలలు
ఎన్నటికీ అర్థం కావు..

- చిందం సునీత
కోరుట్ల, సెల్.నం.9701075502
**

అమ్మా... క్షమించు!

అమ్మా! మాకు జన్మనిచ్చిన అమ్మవై
ధరణి లాంచి ఓరిమి గల మా అమ్మ!
పదిమందిని కని పెంచిన మాయమ్మ!
మేమేడ్చినప్పుడు మాతో నీవేడ్చి
మేము నవ్వితే నీవూ నవ్వి
మా జీవితాన వెలుగునింపిన
నీవు ధన్యజీవివమ్మా!
అన్నింటికీ ఓర్చి ప్రేమతో పెంచిన నీకు మేమేమివ్వగలిగాం
కళత్రం మోజులో పడి
మా కింకేమిస్తావనే ఆలోచన తప్ప
తలో మాసం నిన్ను పంచుకొనే
అన్నదమ్ములమే గానీ
నీ అభిప్రాయం ఆలకించలేదమ్మా!
స్వార్థం పడగ నీడలో..
మేమూ మా కుటుంబం తప్ప..
నీవూ మా కుటుంబంలో
ఒక దానివనే జ్ఞానం
మాకు కలగనందుకు
సిగ్గుపడుతున్నాం!
అమ్మా! మమ్మల్ని క్షమించమ్మా!

- యెనిశెట్టి గంగాప్రసాద్
కామారెడ్డి
సెల్.నం.9866447234
**

కడపటి నమస్కారం

వంటింటి సరుకులన్నీ ఆకాశంలో చక్కర్లు కొడుతోంటే
దిగిరాని ధరలూ, పూర్తిగా కానరాని సరుకులూ
ఈ పచ్చి నిజాలను చూస్తూ ‘అచ్చేదిన్’ నిజం
కావాలను కోవడం ఒక పెద్ద అబద్ధం!
ఇల్లాళ్లంతా ఖర్చులు తగ్గించుకుంటూ
ఇంటాయనలంతా రాబడెలా పెంచాలా అనుకుంటూ
జీవితాన్ని మలుపులు ఎన్ని తిప్పినప్పటికీ..
మట్టి పొరలు చీల్చుకొచ్చిన పంటలు
ధర దిగి రానంటున్నాయి.
పండగ పబ్బాలు వస్తోంటే
షాపులన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తోంటే
ఇంటామె అరచేతి మందం పౌడర్ కొట్టి,
క్యారీ బ్యాగులు చేత బట్టి,
అమ్మయ్యొ అనే రీతిలో బోర్డులు చదివింది.
ఏవో కొనాలని, ఏవో కొని
పనికి రాని చెత్తంతా నెత్తికెత్తుకుంది
భరించే వాడైన భర్త
పంచదారలోని చేదును
టీ పొట్లంలోని రంపం పొట్టునూ
బియ్యంలోని ప్లాస్టీకునూ
పాలల్లోని యూరియానూ
నూనెల్లోని జంతు కొవ్వునూ సంచీల్లో నింపుకొచ్చాడు
ఆరోగ్యంగా జీవించే కలను ఛిద్రం చేస్తూ
కలత నిద్రలో పీడకలగా వస్తే కుటుంబం
గంగవెర్రులెత్తి హాహాకారాలు చేస్తోంది!
ధరలు తగ్గవు, కల్తీ తప్పదు, కాలుష్యం అనివార్యం
కొత్త జీవితం, కొత్త జీవితమని ఉగాది కవితల్లో
ఊదర కొడుతుంటారు కవివరేణ్యులు
మునిగిపోయే వానలు, గడ్డకట్టే చలీ
రోగానికి మందుల్లేక కునారిల్లుతూ
తినడానికి మంచి తిండిలేక కరువు పీడితులై
అణిచివేయబడ్డ వాళ్లందరికీ
దుర్మరణం పాలయ్యే అభాగ్యులందరికీ
దుఃఖంతో తలవాల్చి విచారం తెల్పుతున్నాను.

- తుమ్మెర రాధిక
తొర్రూరు, వరంగల్ జిల్లా సెల్.నం.9440626702
**

రైతు ఉగాది

సంవత్సరాలు యథాలాపంగా మారిపోతున్నాయి
రైతు సంక్షేమం యాతన పడినా మారటం లేదు
ఉగాది వెనక ఉగాదిని
ఉత్త క్యాలెండరీలా తిరగేస్తున్నాం
తిరగబడిన రైతు బతుకు తీరు మాత్రం
మారటం లేదు
జయనామ సంవత్సరం వచ్చింది
రైతుకు జయం జరిగిందేమి లేదు
మళ్లీ మన్మధనామ ఉగాది వచ్చింది
మట్టి మనిషికి పెద్దగా ఒరిగిందేమి లేదు
ఇప్పుడు ఈ దుర్ముఖి వచ్చి చేరింది
ఏ దుర్వార్తలు వినాల్సివస్తుందోనని
భయంతో వేడుకునే వేదన ఇది
ఓ దుర్ముఖీ..
షడ్రుచుల సమ్మేళనమైన
ఉగాది పచ్చడితో మా అందరికీ
ఊరించే ఉత్సాహాన్నిస్తూ
రైతుకు మాత్రం పురుగుమందుల
విషపు రుచిని మిగలనివ్వకు!
పచ్చని చెట్టుపై ప్రాతఃకాలాన
కూ..అంటే కుహూ అంటూ
తీయగా పాడే మత్తకోకిల గానాన్ని
ఇకముందు ఏ రైతు చావుకు
మరణవాంగ్మూలం కానివ్వకు!
పంచాంగం ప్రకారం
ఆదాయం వ్యయం అకౌంట్
యెవరికి యెలా వున్నా
అన్నం గింజలు పండించే రైతు
ఆస్తులు పుస్తెలు తాకట్టుపెట్టి
అప్పుల ఊబిలో కూరుకుపోనివ్వకు!
ఏ రాశి వారికి ఫలితాలు
ఎలా ఉండబోతున్నాగానీ
ధాన్య రాశులతో నిండని
గాదెల్ని గోదాముల్ని మళ్లి
మా రైతు ఇంట కానరానివ్వకు!
ఐదు రకాల జబ్బులు (పంచాంగంలో చెప్పారు?)
మాపై ఆధిపత్యం వహించినా తట్టుకుంటాం
ఐదు వేళ్లు నోట్లోకి నోచుకోని
అన్నదాతల కుటుంబాలకు మాత్రం
కరువు జబ్బు రానివ్వకు!
ఓ దుర్ముఖీ..
ఇనే్నళ్లు పట్టిన దురదృష్టపు
చీడ పీడను దునుమాడి
రైతు బతుకు చిత్రముఖాన్ని మార్చి
అన్నదాతల ఇళ్లల్లో ఆనందం
కొలువయ్యేలా ఆశీర్వదించు!!

- పెనుగొండ బసవేశ్వర్, కరీంనగర్, సెల్.నం.9059568432