విశాఖపట్నం

బాధ పడితే గాని... ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శే్వత బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్... అందం, చదువు సాంప్రదాయం మెండుగా వుండే శే్వతను పెళ్లి చేసుకోడానికి, పెళ్లి కొడుకులు క్యూకట్టారు. మంచి మంచి సంబంధాలు వచ్చినా మేనత్త కొడుకు మధుసూదనరావునే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది శే్వత.
మధుసూదనరావు పక్కా పల్లెటూరు వ్యక్తి. పదెకరాల పొలం, ఒక పెంకుటిల్లు అతని ఆస్తి. తలిదండ్రులకు ఒకడే కొడుకు. బికాం చేశాడు.
శే్వత చూస్తే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. మధుసూదనరావు డిగ్రీ చదువుకున్న పల్లె యువకుడు. ఇద్దరూ ఒకరికొకరు యిష్టపడ్డారు కాబట్టి ఇరు కుటుంబాలకు అభ్యంతరాలు ఏమీలేవు కాబట్టి ఒక మంచి ముహూర్తం చూసి శే్వతకి, మధుసూదనరావుకి పెళ్లి జరిపించేశారు పెద్దలు.
‘‘మనకి పదెకరాలు పొలం వుంది. ఉద్యోగాలు... సద్యోగాలు ఎందుకు? యిద్దరూ పల్లెలో వుండి హాయిగా వున్న దాంతో సంతృప్తి పడండి’’ అన్నారు శే్వత, మధుసూదనరావు కుటుంబీకులు.
‘‘లేదు లేదు నేను కష్టపడి బి.టెక్ చేశాను. టిసిఎస్‌లో మంచి ఉద్యోగం, ప్యాకేజీ చాలా బాగుంది. భవిష్యత్‌లో మంచి పొజిషన్‌లోకి వెళ్లే అవకాశం వుంది. పొలం చూసుకోవడానికి మీరు ఎలాగూవున్నారు. మధు, నేను బెంగళూరులోనే వుంటాము. టిసిఎస్‌లోనే క్లరికల్ పోస్ట్‌లో మధుని చేర్చడానికి ప్రయత్నిస్తాను. వయసు, సమర్థత వున్నప్పుడే కష్టపడి సంపాదించాలి కదా! రేపు రాబోయే తరాలకు బాగుంటుంది. పైగా రుూ పల్లెల్లో ఏం చేస్తాం? పొలం గురించి మాకు అంతగా తెలీదు కదా’’ అంది శే్వత.
‘‘శే్వత చెప్పించి నిజమే కదా’’ అన్నాడు మధు.
‘‘మనమో పది పదిహేను సంవత్సరాల వరకూ మనం చలాకీగా వుండగలం పొలం వ్యవహారాలు చూసుకోగలం. ఈలోగా పిల్లలకి నచ్చినట్లు వాళ్లను వుండనిద్దాం. మనం మసలయిపోయి మంచాన పడితే అప్పుడు చూద్దాం... ఎలాగూ వాళ్లు ఇక్కడికి రాకతప్పదు ఎప్పటికయినా’’ అంటూ సానుకూల దృక్పథంతో ఆలోచించారు శే్వత, మధు కుటుంబ సభ్యులు.
శే్వత, మధు బెంగుళూరు చేరుకున్నారు. టి.సి.ఎస్.లో శే్వతకు మంచి పేరు పలుకుబడి వుండటంతో మధుకు క్లరికల్ పోస్ట్ రావడం పెద్ద కష్టం కాలేదు.
బెంగుళూరులో మంచి ప్రాంతంలో మంచి యిల్లు అద్దెకు తీసుకున్నారు ఆ నూతన దంపతులు. యిరుగు పొరుగు మంచి కుటుంబాలు కావడంతో పుట్టింట్లోనే వున్న ఫీలింగుతో సంతోషంగా వుండేవారు మధు, శే్వత. వాళ్లని ఆ కాలనీలో మేడ్‌ఫర్ ఈచ్ అదర్ అనేవారు అందరూ.
***
శే్వత టి.సి.ఎస్‌లో మంచి పొజిషన్‌లో వున్నప్పటికీ కంపెనీలో భర్తను చాలా గౌరవ మర్యాదలతో చూసేది. కంపెనీలో అందరికీ మధుని పరిచయం చేస్తూ మధులాంటి మంచి మనిషిని పెళ్లి చేసుకున్నందుకు తాను చాలా చాలా సంతోషంగా వున్నానని చెబుతుండేది.
మధు, శే్వత ఇంట్లో వున్నప్పుడూ శే్వత మధు మాట ప్రకారమే నడుస్తుండేది. యింటి పూర్తి యాజమాన్యం మధు చేతుల్లోనే వుంచేది. సాధారణ గృహిణి, సాంప్రదాయ భార్యగా మధుని గౌరవ మర్యాదలతో చూస్తూ హృదయపూర్వకంగా మధుని ఉన్నతంగా చూడాలని ఆశించేది శే్వత. ఎక్కువ చదువుకున్నా.... మంచి ఉద్యోగంలో వున్నా భార్య తనని చాలా గౌరవంగా చూస్తుందని, తనని ఎక్కడా తక్కువ చేయకుండా మంచిగా వుంటుందని మధు కూడా సంతోషంగా వుండేవాడు.
***
మధుసూదనరావుకే ఆర్థిక విషయాల యాజమాన్యాన్ని అప్పగించిన శే్వత తన డైలీ ఖర్చులకు మాత్రమే అతని నుండి డబ్బులు తీసుకునేది.
‘మేడం ఇంట్లో పిల్లి.... ఆఫీసులో పులి... ఆమె ఆటలు అయ్యగారి ముందు సాగవటకదా!.... అయ్యగారు ఆఫీసులో క్లర్క్.... ఇంట్లో బాస్’ అంటూ కంపెనీ లో గుసగుసలాడుకుంటున్నది శే్వతకు తెలిసినా ఆనందపడేది. భర్తదే తనకన్నా పైచేయి అని అందరూ ప్రత్యక్షంగానో.... పరోక్షంగానో అనుకోవడం తనకు ఆనందమే కదా అనుకుంటూ మురిసిపోయేది.
రెండు సంవత్సరాలు గడిచాయి. మధుసూదనరావుకి డబ్బు మత్తు ఎక్కువయింది. ఇద్దరు సంపాదిస్తున్న దానిలో నుండి తలిదండ్రులకు పైసా పంపనవసరం లేదు... పైగా భార్య శే్వత కూడా తలిదండ్రులకు ఏకైక కూతురు కావడంతో ఆమె తలిదండ్రుల తరుఫున కూడా చాలా ఆస్తి తనకు కలిసి వస్తుందన్న ధీమాతో పొదుపు జోలికి పోకుండా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండేవాడు మధు. వీకెండ్‌లో ఇంటి పట్టున వుండక ఫ్రెండ్స్‌తో పబ్బులు... క్లబ్బుల్లోనే కాలం గడుపుతుండేవాడు. సకల వ్యసనాలు సాగించేవాడు.
భార్యను కొట్టడం.... సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు. మధు ఆగడాలు ఒక్కోసారి మితిమీరిపోయేవి. శే్వత లగేజీని యింటి బయటపడేసి యిల్లు వదిలి బయటకు పోమ్మనేవాడు ఆమెను... యిరుగు పొరుగు వాళ్లవద్ద పరువు పోతుందని శే్వత భర్తని బ్రతిమిలాడుతూ సర్దుకు పోతుండేది.
కాలం గడుస్తున్నకొద్దీ మధు కాలయముడిలా తయారయ్యాడు. యింట్లో శే్వతకు నరకం చూపిస్తుండేవాడు, యింటినే క్లబ్బు.... పబ్బు చేసేస్తుండేవాడు.
మధు యిలా చేస్తున్నాడని ఎవరికీ చెప్పేది కాదు శే్వత. ముఖ్యంగా తలిదండ్రులకి, అత్తమామలకి అసలు చెప్పేదికాదు. మధు రోజూ తాగేసి ఆఫీస్‌కి వస్తుండేవాడు. అందరితో చీటికీ... మాటకీ గొడవపడుతూ శే్వత పరువు మర్యాదలకు భంగం కలిగించేవాడు. అకారణంగా శే్వతతో కంపెనీ అధికారులు, శే్వత కొలీగ్స్‌ని ముడిపెడుతూ అందరి ముందూ శే్వతను అవమానపరుస్తుండేవాడు.
‘‘నువ్వు నాకళ్ల ముందు వుంటే నాకు నరకంలా వుంది, నీతో కలసివుంటే ముళ్లకంప మీద కాపురమున్నట్లు వుంది. నువ్వు నా జీవితం నుండి దూరంగా పోతే నేను హాయిగా వుంటాను. దయ చేసి మర్యాదగా నాకు విడాకులు యిచ్చేయ్. లేకపోతే చంపేస్తాను’’ అని బెదిరించేవాడు మధు శే్వతని.
***
‘‘శే్వతగారూ మీరు కొన్ని నెలలుగా పని మీద కాన్‌సంట్రేషన్ చేయలేకపోతున్నారు. ఏమైనా పర్సనల్ సమస్యలున్నాయా... కావాలంటే కొన్ని రోజులు సెలవు తీసుకోండి...’’ అని సుతిమెత్తగా హెచ్చరించాడు ఆఫీసులో శే్వతబాస్. శే్వత అసలు విషయాన్ని ఇంక దాయలేకపోయింది. అన్నయ్యలాంటి ఆఫీసు బాస్‌తో విషయాలన్నీ పూర్తిగా చెప్పేసింది...
‘‘కానీ మధు అంటే నాకు చాలా యిష్టం... నేను జాబ్ మానేసి అతన్ని తీసుకొని పల్లెకు పోవాలనుకుంటున్నాను. అతన్ని మంచి మనిషిగా మార్చాలన్నది నా జీవిత ధ్యేయం...’’ అంటూ కంటతడి పెట్టుకుంది శే్వత.
‘‘శే్వతా నేను నీ శ్రేయోభిలాషిగా చెబుతున్నాను. నువ్వు మీ బావమీద పిచ్చి ప్రేమతో పగ్గాలు వదిలేశావు. ఆర్థిక యాజమాన్యం అంతా అతని చేతుల్లో పెట్టి తప్పు చేశావు. పాతకాలం నాటి మహిళలా యింట్లో నోట్లో నాలికలేని వనితగా అతని అహానికి మరికొంత చేదోడు వాదోడుగా నిలబడి అతన్ని పాడు చేసావు... నువ్వు మంచిదానివే కానీ అతి మంచిదానివిగా వుండకూడదు... నీవు నిజంగా అతన్ని బాగు చేయాలంటే కొన్నాళ్లు పాటు అతనికి దూరంగా వుండు. నాకు తెలిసి భార్య వారం రోజులు యింట్లో లేకపోతే చాలు భర్తకి ఆమె లోటు తెలుస్తుంది’’ అని చెప్పాడు శే్వత బాస్. బాస్ చెప్పింది బాగుంది అనుకున్న శే్వత పై అధికార్లను ఒప్పించి... అమెరికా వెళ్లిపోవడానికి సిద్ధమయింది. ఆమె ట్రాక్ రికార్డ్ మంచిది కాబట్టి ఆమెను అమెరికాలోని టి.సి.ఎస్.కంపెనీకి బదిలీ చేశారు కంపెనీవాళ్లు.
‘‘పో... పో నువ్వు లేకపోతే బ్రతకలేనా ఏంటి పో....’’ అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతూ... ఆమెను అమెరికా సాగనంపాడు మధు. భర్త ఉద్యోగం పోకుండా హామీ తీసుకుంది శే్వత కంపెనీ నుండి.
***
మధుసూదనరావుకి కష్టాలు మొదలయ్యాయి. బెడ్ టీ మొదలుకొని రాత్రి డిన్నర్ వరకూ, వంట చేయడం మొదలుకొని బెడ్‌షీట్స్ వరకూ వుతకడం, యిల్లు వూడ్చడం, అంట్లు తోమడం, బాత్‌రూం కడగడం యిలా అన్ని పనులూ తనే చేసుకోవలసి వస్తుంది. శే్వత వుంటే తనకు చిన్న పనికూడా చెప్పేది కాదు... నన్ను అపురూపంగా చూసుకునేది అన్నుకునేవాడు మధు. అయినా అహం అడ్డువచ్చి భార్యతో ఆ విషయం చెప్పలేదు... శే్వత ఫోన్ నెంబరు మారిపోయింది. నెట్‌లో కూడా మధుతో టచ్‌లో లేదు శే్వత. మధు జీతం తగ్గించేశారు కంపెనీవాళ్లు. యింటికి పోదామంటే పుట్టినింటి నుండి... మెట్టినింటి నుండి చీవాట్లు... చెప్పుదెబ్బలు తప్పవు... శే్వత అమెరికా వెళ్లిపోయి నెల... రెండు నెలలు ఏకంగా ఆరునెలలు దాటిపోయాయి. మధు పిచ్చివాడిలా తయారయ్యాడు... భార్య లేని లోటు తెలిసింది.
‘యింతకాలం ఆమెను రాచిరంపాన పెట్టాను. యిప్పుడు ఆమె విలువ తెలుస్తుంది’ అనుకుంటూ ... నేరుగా శే్వత బాస్ వద్దకుపోయి అతనితో మనసు విప్పి మాట్లాడాడు.
‘‘శే్వత మంచి అమ్మాయి. దానికితోడు బాగా చదువుకుంది. సిన్సియర్ ఉద్యోగి, ఆమె మనసు బంగారం, మహిళ అంటే యిలాగే వుండాలి అన్న పద్ధతిలో వుంటుంది ఆమె. అలాంటి అమ్మాయిని వేధించి... బాధించి ఆమె విసిగి వేసారి పారిపోయేటట్లు చేశావు. యిప్పుడయితే ఆమె ఎక్కడుందో నాకూ తెలీదు’’ అని కొంచెం నాటకమాడాడు శే్వత బాస్.
శే్వత అడ్రస్, ఫోన్ నెంబరు గురించి ఆఫీసులోనూ.... కంపెనీలోనూ అందరి చుట్టూ తిరిగాడు మధు... భార్యలేని లోటు తెలిసి తాగుడు మానేసి బుద్ధిగా వుండటం నేర్చుకున్నాడు. శే్వత తలిదండ్రులకు, అత్తమామలకు విషయం తెలిసినా మధుని ఓదార్చడానికి ప్రయత్నించలేదు వాళ్లు. శే్వత ఏం చేసినా మంచే చేస్తుందన్న నమ్మకం వారిది. ఎవరి నమ్మకం వారిది. ఏనాటికైనా మధు... శే్వత సుఖంగా వుంటారనే ఆశ వారిది.
‘‘శే్వతకు నా మీద కోపం తగ్గిపోయి మళ్లీ వస్తుంది... మాకూ మంచి రోజులొస్తాయి’’ అంటూ మిత్రులతో చెబుతుండేవాడు మధు.
‘మధు నూరు శాతం మంచి మనిషి అయ్యాడు... కడిగిన ముత్యంలా తయారయ్యాడు’ అన్న వార్తను ఆఫీసు బాస్ ద్వారా తెలుసుకున్న శే్వత రెక్కలు కట్టుకొని అమెరికా నుండి బెంగుళూరులో వాలింది. నేరుగా యింటికి చేరింది. ఆ సమయంలో భర్త వంటింట్లో వున్నాడు.... మురికి పట్టిన లుంగీ, మసిపట్టిన టవల్..... మాసిపోయిన బనియన్... పెరిగిన గెడ్డం... తైల సంస్కారం లేని జుట్టు చూడ దరిద్రంగా వున్నాడు. గరిట పట్టి పడరాని పాట్లు పడుతున్నాడు. భర్తని ఆ స్థితిలో చూసే సరికి శే్వతకి కన్నీళ్లు ఆగలేదు. శే్వతను చూడగానే మధు కళ్లల్లో నీటి సుడులు తిరిగాయి. ఇద్దరి మధ్యా కాసేపు వౌనం. తరువాత ‘‘నన్ను విడిచిపోవద్దు శే్వతా. నేను నువ్వు చెప్పినట్లే వింటాను’’ అన్నాడు మధు నెమ్మదిగా.
శే్వత ఆనంద భాష్పాలు రాల్చింది. ఒకరినొకరు ఓదార్చుకున్నారు. ఆ రోజంతా కష్టసుఖాలు మాట్లాడుకున్నారు. అక్కడ అప్పుడు ఆ గదిలో భార్యాభర్తల గులాబీ గుబాళించింది.

- మీగడ వీరభద్రస్వామి, చోడవరం, విశాఖజిల్లా-531036. సెల్ : 9441571505