రాజమండ్రి

సుక్కలాంటి సిన్నది..(కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒలియో... ఒలియో... ఒలియో... రాతేలగలవాడా రారా పోలిగాడా... పాట పాడుతూ సుక్క పోలిగాడిని బుగ్గమీద చిటికెవేసి నల్లని మేఘంలో మెరుపు మెరిసినట్టు నవ్వింది...
ఏటీ ఇయ్యాల మా జోరుగా ఉంది నీపని... సింత పూల రైక గట్టావు... కలవపువ్వు కొప్పులోబెట్టావ్... నెమలికంఠం సీర గట్టావ్... ఏదో ఇసేసముందన్నమాట...
లేము మామా... ఇసేసమేంలేదు... అహ ఉందిలే మావ!
లేదు.. ఉంది... ఏటే బాబు ఆ తిప్పలేటి... ఆ సిగ్గులేటి.. నా గుండె జారి నీ ఒళ్ళో పడద్దేబాబు...
పో మామ... నాయుడు బావను మించిపోయావు
నాయుడు బావా ఆడెవడే అమ్మగారు పనికెల్లినప్పుడు ఎంకి-నాయుడుబావ పాటలు పాడద్ది... మనం ఎంకి-నాయుడుబావలా ఉంటామట
గుండె గొంతుకలోన కొట్టాడుతున్నాదే అంటాడట...
ఓసోసి! నీకు సదువు కూడా నేర్పిత్తందన్నమాట అమ్మగోరు...
అదేం లేదుగాని ఒక ఇసయం చెప్పింది... అమ్మాయిగారి పెళ్లిరోజు, మన పెళ్లిరోజు ఒకటేనంట... అందుకే పాయసం, బిర్యానీ ఇచ్చారు... గారెలు కూడా ఇచ్చారు... ఈపూట నీవు పనిలోకి రావక్కర్లేదని పంపేశారు...
ఓసి పిచ్చిమొకం దానా.. అమ్మగోరు పంపేస్తే వస్తావేటే.. ఆయమ్మ పనికి ఎంత కష్టపడుద్ది.. ఏమైనా గినె్నలుంటే తోమేసిరా... అవునూ ఈ సీర అదీ కూడా అమ్మగోరే కొన్నారా...
అవును మావా... ఆమే ఇచ్చారు... అంది సుక్క సిగ్గుపడుతూ...
మరి నువ్వు అమ్మోరికేమిచ్చావే...
మనమేం ఇయ్యగలం మావా!
ఏమియ్యగలనో చూద్దువుగాని...
అలా పొలమెళ్ళొస్తానుండు...
సరే...ముందు తలంటుకుని భోంచేసి ఎల్లు...
ఏడి సల్లారకుండా పెట్టమంది అమ్మాయిగోరు అంది సుక్క...
పోలిగాడు భోంచేసి పొలం బయలుదేరాడు...
అమ్మగారికేమివ్వాలి... తాటి ఆకులతో ఏదైనా అల్లి ఇవ్వనా అనుకున్నాడు... లేదు ఎండిపోయి ముడుకుపోతాయి... ఏడిగట్టుకెళ్లి గవ్వలేరాడు.. కోయ బొమ్మల దుకాణానికి వెళ్ళి ఓ పెట్టి తయారుచేయించాడు... ఆ తలుపుని పట్టుకుని తీస్తున్నట్టు ఓ బొమ్మ... చిన్న చిన్న గవ్వలకు రంగులు పోశాడు.. అవన్నీ ఆ పెట్టెకు డిజైన్‌లా అతికించాడు... ఇక ఒకటే ఉంది.. అది చెయ్యాలంటే చీకటి పడాలి...
కొంచెం కష్టమే... అసాధ్యం కాదు... అవిసె పువ్వును కోశాడు...
ఒక కార్నర్‌లో పెట్టెపైన కనబడకుండా చంద్రవంకలా పేస్ట్ చేశాడు... అమ్మగారి దగ్గరకి ఎల్లేముందు చెయ్యాలాపని అనుకున్నాడు...
సుక్కా అమ్మగారి ఆశీస్సులు తీసుకుందాం పద అన్నాడు...
ఏంది మావా కండువా ఎనక ఏదో దాశావు... అంటూ సుక్క ప్రశ్న
ఏంలేదులేవే అమ్మగోరికి కానుక.. పోలిగాడు సంబరంగా అన్నాడు...
నాకు సీపియ్యవా మావా... సుక్క బతిమాలుతున్నట్లుగా అంది!
లేదెహె.. అది అమ్మగారి ముందు, అయ్యగోరి ముందే సూపించే ఇసయం పదపద... తొందరచేశాడు పోలిగాడు...
ఇంట్లో ఎవరైనా ఉన్నారా... నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు చూసి నిరాశపడుతూ అన్నారు పోలిగాడు, సుక్క
వాచ్‌మేన్... అమ్మగారేరి అంది సుక్క...
ఇప్పుడే గుడికెళ్లారు వచ్చేస్తారు చెప్పాడు వాచ్‌మేన్
ఓలిగాడు ఉసూరుమన్నాడు.. ఈ డబ్బున్నోళ్లకి కూడా గుళ్లూ గోపురాలు గుర్తున్నందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నా, తన కానుక వెంటనే చూపించలేనందుకు బాధపడ్డాడు...
అసలు అయినా అమ్మగోరు వేరు అనుకున్నాడు...
గుడి నుండి వచ్చిన సుమలత ప్రసాదం ఇస్తూ ఏరా ఎంతసేపయింది వచ్చి... సినిమాకెళ్లమని డబ్బులిచ్చానుగదే చుక్కా అంది...
అవును సినిమాకెళ్లి ఎంజాయ్ చేయక మీరేంటిక్కడ అన్నాడు వాత్సవ్
పోండి అయ్యగారు.. ముందు నేను సెప్పిన మాటినాల... నేనో కానుక తెచ్చా.. అది మీరు భోజనాలయ్యాక మీ పడగ్గదిలో తెరవాల...మాటిత్తారు గదా.. చెయ్యిజాపాడు పోలిగాడు... సీకట్లో తెరవాల...
చేతిలో చెయ్యి వేశాడు వాత్సవ్ నవ్వుతూ...
కండువా కింద నుండి తీత్తన్నాను.. తీత్తన్నాను.. తీసేసినాను... పెట్టి బయటపెట్టాడు...
సుక్కకు ఆ పెట్టి చూడగానే మాట రాలేదు...
అబ్బ ఎంతందంగా ఉంది... అమ్మగోరిచ్చిన సీరకంటే దీటుగా ఉంది... నా బావ మనసులాగా.. ఆడి ఫేసులాగా అనుకుంది.
కానీ అందులో కిటుకేంటో అర్థంగాలా...
మావా! ఇలాంటిది నాకెప్పుడన్నా ఇచ్చేవా అంది గోముగా...
ఇప్పుడిత్తానే పద ఇంటిదగ్గర నీకూ ఉంది సర్‌ప్రైజ్...
అమ్మగారు ఓసారి అంటం ఇన్నాడు తాను...
లతా పాలిగాడి సర్‌ప్రైజ్ ఏంటో నాక్కూడా చూడాలనుంది.. త్వరగా భోంచేద్దాం అన్నాడు వాస్తవ్!
నిజమేనండి ఎంత కష్టపడ్డాతో ఆ గవ్వలు, రంగులు ఇది బజారులో పెడితే ఎంతో ధర పలుకుతుంది... వాడి కళాత్మక దృష్టికి జోహారులు
సుమలత మల్లెపువ్వులాంటి నైటీ వేసుకుని, సన్నజాజులు జడలో తురుముకుని తాంబూలం వేసుకుని వచ్చింది... ఏంటో ఆ పెట్టె తెరవండి అంది..
సుమా నీవు ఒక్క విషయం మరిచావు... వాడు చీకట్లో తెరవమన్నాడు... ముందు సెల్‌టార్చ్ వెయ్యి అన్నాడు నవ్వుతూ...
సరే అంటూ వేసి ఇచ్చింది... తలుపు తెరవగానే ఆవిసె పువ్వు అర్థచంద్రాకారంలా... దానిపైన నక్షత్రాల్లా మిణుగురులు మెరుస్తూ ఎన్నో... ఎనె్నన్నో.. తమకింత ఆనందం ఎప్పుడూ కలగలేదు... ఫ్యాను ఆపేసి ఎసి వేసింది... తమకు ఇంత మంచి గిఫ్టు ఎవ్వరూ ఇవ్వలేదు... అద్భుతంగా అనిపించింది...
హౌ రొమాంటిక్! వాత్సవ్ సుమలతను సంతోషంగా హత్తుకున్నాడు...
ఇక్కడ సుక్కను కూడా పోలిగాడు అలాంటి ఎగురుతున్న నక్షత్రాల భరెణ ఇచ్చాడు... సుక్కకు మాట రాలేదు...
అక్కడ అమ్మాయిగారు గురించి తలుచుకుని సిగ్గుల మొగ్గయ్యింది..
మావా! నీకంటే గొప్పోడు ఎవడూ ఉండడు... తెలుసా అంది లక్కపిడతలాంటి నోరు తెరిచి...
సుక్క నల్లగా ఉన్నా దాని పెదవులు దొండపండులా ఉంటాయి...
రంగేసుకుంటావేటే అనేవాడు కొత్తలో పోలిగాడు తెలియక...
మరేటనుకున్నావ్... అమ్మాయిగారు మనకింత సంతోషం ఇచ్చినపుడు నేనూరుకుంటానేటే! అన్నాడు... బుగ్గమీద చిటికేస్తూ...
మావా! నువ్వు శానా మంచోడివి అంది బుగ్గపైన ముద్దుపెట్టి సుక్క
నాకు సిగ్గేస్తందెహె ఆపు నీ మాటలు...
పోనీ పాట పాడనా మావా...
ఆ మొక్కజొన్న తోటలో ఆ పాట పాడే ముక్కెంగా సుక్కలన్నీ కొండమీద సోకు జూసుకొనే ఏల అని నువ్వు పాడుతుంటే ఆ కొండమీద నా సుక్కే సోకుజూసుకుందనిపిస్తదే... పాడవే పాడవే నా బంగారం గదూ...అని బతిమాలుతున్న పోలిగాడికి గిలిగింతలు బెట్టి పక పక నవ్వింది... ఏయ్ పాడవా అంటూ పోలిగాడు దానివెంట పడుతుంటే రొప్పుతూ అతని కౌగిలిలో ఒదిగి పాట మొదలుపెట్టింది ఆ సుక్క... సుక్కలాంటి అమ్మాయి.

- బిహెచ్ రమాదేవి, 94415 99321
**

మనోగీతికలు

మహోన్నత స్థానం

స్ర్తి అద్భుత సౌందర్య వర్ణనలే
ప్రబంధ కవుల పద్యప్రవాహం
పావని పాతివ్రత్య మహిమలే
పురాణ కథల ప్రాబల్యం
సుదతి సున్నిత మనస్తత్వమే
వచన కవితల వ్యాకరణం
తరుణి త్యాగమయ జీవనమే
ఆధునిక కథా ఆవిష్కరణం
వనిత వాక్పటిమయే
చలనచిత్ర ఘనచరితం
ఆడపడుచుల ఆగ్రహావేశాలే
ధారావాహికల ద్యోతనం
గృహిణి వ్యక్తిత్వ వికాసమే
గృహస్థు విజయసోపానం
భూదేవి ఓర్పు - వాగ్దేవి నేర్పు
లలిత లావణ్యం - మనసు మార్దవం
సాధ్వి సహజ సోయగం
సృష్టిలో - కవితా దృష్టిలో
మహిళలదే మహోన్నత స్థానం

- ఇంద్రగంటి నరసింహమూర్తి, అశోక్‌నగర్, కాకినాడ
**

కాసు - తిరకాసు

ఆ.వె: బ్లాకుమనియె తీయ బ్లాకయ్యె అసలైన
వయిటు మనియు - మనిషి వెయిటదెల్ల
అరరె! లిఫ్టునందు ఎఱుకలేకొక్కింత
ఇరుకుకొన్నవాడె ఈ నరుండు!

ఆ.వె: నల్లబాపు బ్రతుకు తెల్లారగా తెల్ల
వోయెగా! హఠాత్తుగా; ఇదేమొ?
చిక్కెనట్టి బాపె చిల్లర ‘హుష్‌కాకి’
రూపమగుచు - కష్టశాపమగుచు!

సీ: పాలవాడో - మురిపాలు పోయుట మాని
గునపాలు గుండెలో గ్రుచ్చుచుండె,
మా పనిమనిషేమొ - మాపు - రేపని లేక
చిల్లర ధ్వనుల గినె్నల్ల తోమె
లాండ్రి చేసేడివాడు గాండ్రించి వస్త్ర మి
స్ర్తికాక - ననె్న ఇస్ర్తిని చేసె
కూరగాయలును మహోరగాలేచ
వెసవెస చిల్లర బుసలుకొట్టె
నోట్ల చిల్లర కోసము పాట్లు ఎన్నో!
ఫీట్లు-గ్రహపాట్లు ఎన్నగానెట్లు తరము?
ఉన్నవాడును - పేదయు ఒక్కటాయె;
కడకు కాసెంతగా తిరకాసు తెచ్చె
వడికాసుల వాడ! కాపాడుమయ్య!

- ‘విశాఖ’,
గుంటూరు.
చరవాణి : 9866944287
**

రైతే రాజు

పంచ భూతాలకు
పరమావధిగా
ధరణి గర్భాన
పుట్టిపెరిగే సస్యములకు
పుడమిపై ప్రాణికోటికి
ఆహారపు అంతర్యామిగా
హాలికుడనే రైతన్నకు
నింగిలోని తారకలు
దారిచూపు రాణులుగా
పంట క్షేత్రాలందించిన
నవధాన్యపు ఫలాలను
విత్తన శుద్ధి రక్షణతో
రైతన్నలకు సాయంగా
చికటిలో వెలుగులను
అందించే మిణుగురుల
సృష్టిమాత దీవెనతో
స్వయం ప్రకాశాలుగా
రైతన్నకు దారిదీపాలు
హితులాయెను అవనిలోన
నాగరికతన నగరాల
వెలుగులన్నీ ప్రజలకైతే
సస్యములను పోషించే
రైతులకు చీకటులు
ఎరువులు, మందులు
మంచి విత్తనాలూ
సమకూర్చండి సవ్యంగా
ప్రజలు బాగుంటేనే
దేశం బాగుపడుతుంది
పాలించే ప్రభువులు
ఆలోచనలు చేయండి
పాలితులకు పాలకులకు
అసలు సిసలైన
హాలికుడే రాజు కదా
దేశ రక్షకుడు జవానైతే
ప్రజారక్షకుడు కిసానుకదా
అందుకే అన్నారు
రక్షించేవాడు జవాన్
పండించేవాడు కిసాన్
జైజవాన్.. జైకిసాన్
రేరాజుకు, రారాజుకు
అందరికీ రైతేరాజు!

- తన్నీరు సీతారామాంజనేయులు, చరవాణి : 8332824726
**

ఈ రేయి...

నింగిలోని జాబిలి, నీటిలోని కలువ
జతగూడాయ - ఈ రేయిని వెలిగింప

యమునా తరంగాలపైన
యవ్వనాల వెనె్నల మెరిసె
ఆ గలగలలు ఆ తళతళలు
ఈ రేయిని వెలిగింప ప్రవహించె

బృందావన పువ్వులపైన
అందమైన వెనె్నల కురిసె
ఆ కళకళలు ఆ మిలమిలలు
ఈ రేయిని వెలిగింప ప్రసరించె

వేణుగానం వినినంతనే
వేచిన రాధ వెన్నలా కరిగె
ఆ మధురిమలు ఆ ఘమఘమలు
ఈ రేయిని వెలిగింప పరవశించె!

- డి వెంకట్రావు,
ఉయ్యూరు, కృష్ణా జిల్లా.