విజయవాడ

విచిత్రదీవిలో వింత వస్తువుల వేట! (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల. రూ. 100
ప్రతులకు: మల్లెతీగ,
మన్నవవారి వీధి,
కృష్ణలంక, విజయవాడ.
చరవాణి : 9246415150
**
కథలు రాయటమే కష్టం. అలాంటిది జానపద నవల రాయటం అంటే కత్తి మీద సాములాంటిది. జానపద నవలలో గాని, కథలలో గాని సాహిత్యంతో పాటు గొప్ప సందేశం ఇమిడి ఉంటుంది. కథతో పాటు కథనంలో కూడా సందర్భాన్నిబట్టి అనేక మార్పులు వస్తుంటాయి. కథనంలో ఎక్కడా పటుత్వం తప్పకూడదు. ఈ కథలు, నవలలు చిన్న పిల్లల కోసమే అని చెప్పినా వయస్సులో పెద్దవారైనా ఆలోచనాత్మకంగా, ఆసక్తిగా చదువుతారు. కారణం కథనంలో చిత్రవిచిత్రాలు జరుగుతుండటమే. అవి పాఠకులను చదివించటానికి ఉత్సాహం పెంచుతాయి. అందుకే జానపద పాటలు, జానపద కథలు, జానపద నవలలు, చివరికి జానపద సినిమాలు ఎన్నో విజయవంతమయ్యాయి. అలాంటి జానపద నవలే ‘విచిత్రదీవి - వింత వస్తువు’. దీన్ని పిల్లల కోసం ప్రత్యేకంగా రాసిన రయిత మోహన వంశీ.
ఈ నవలను సమగ్రంగా చదివితే ఇది ఒక జానపద సినిమాలా అనిపిస్తుంది. రచయిత తన రచనానుభవంతో కథను మొదటి నుండి చివరివరకు ఎంతో సస్పెన్స్‌తో కొనసాగిస్తాడు. కథలోకి వస్తే.. మహాదేవపురం అనే గ్రామంలో సంకల్పసిద్ధడనే గురువు తన శిష్యులలో ఉత్తముడైన సత్యధర్ముడిని విచిత్రదీవికి పంపగా అక్కడ విశాఖదత్రుడనే మరో సన్యాసి సత్యధర్ముడికి పరిచయవౌతాడు. విశాఖదత్తుడు వింత వస్తువుల కోసం విచిత్రదీవికి వచ్చి కొన్ని కారణాల వల్ల ముందుకు వెళ్లలేకపోతాడు. సత్యధర్ముడు, విశాఖదత్తుడు కలుసుకోవటంతో ఆ వింతదీవిలో వారికి లభ్యమయ్యే వింత వస్తువుల గురించి సాగే కథనమే ఈ నవల. వింత వస్తువుల గురించి, వారు వాటిని సంపాదించటానికి పడిన కష్టాలను, వారు ఎదుర్కొన్న సంఘటనలు, యక్ష, గంధర్వులు, కింపురుషలను కలుసుకోవటం, ఆ వింత వస్తువులను పొందటం వంటి అంశాలతో నవల రకరకాల మలుపులు తిరిగి విచిత్రదీవి లో వింత వస్తువులు పొం దటంతో ముగుస్తుంది. ఆ వింత వస్తువులను పొందటానికి వారు పడిన అవస్థల ను తెలుసుకోవాలంటే ‘విచిత్రదీవి - వింత వస్తువులు’ జానపద నవల చదవాల్సిందే.

- విష్ణ్భుట్ల రామకృష్ణ,
విజయవాడ.
చరవాణి : 9440618122
**

మనోగీతికలు

భావదారిద్య్రం

దండనాధికారం నాకుందంటాడు వాడు
దండుకోవటం నాహక్కంటాడు వీడు
ఇద్దరికీ లైసెన్సు అక్కర్లేదు!
భారతదేశ పౌరులుగా
పేటెంట్ తీసేసుకున్నారు
బలం బలగం ముందు మంది ఓడిపోతోంది
కలం కథనం మధ్యన మనసు మూగపోతోంది
ముందడుగేస్తున్నాం అనుకుంటున్నాం
మధ్యలోనే మునగదీసుక్కూర్చున్నాం
ముందువరసలోనే ఉన్నామనుకుంటున్నాం
మన ముందు వెనుక గోతులు తవ్వుకుంటున్నాం
చట్టాల్ని కాలనాళికల్లో పెట్టి గోతిలో పూడ్చేశాం!
మొట్టికాయలు పడ్డప్పుడల్లా
ఉలిక్కిపడి కళ్లు నులుముకుంటున్నాం
కౌరవ సభలో భీష్ముని పాత్ర మనది
అంపశయ్యకెక్కేదాకా ఆదర్శాలు పాటిస్తాం
కరపత్రాలు గోడపత్రికలు ఆవిష్కరించుకుంటాం
లిమ్కా, గిన్నిస్ రికార్డుల కోసం
రిక్తహస్తాలతో నుంచుంటాం!
లేకపోతే.. అంగట్లో అమ్మే అవార్డులో
రివార్డులో కొని పేరుముందు తగిలించుకుంటాం
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతో
పత్రికల నిండుగా పతాక శీర్షికలు
నలిగిపోతున్న జీవితాల చుట్టూ
వార్తాకథనాల రేటింగ్ ఆర్భాటాలు!
గుడ్లల్లో నీరు గుడ్లల్లోనే కుక్కుకొని
కుక్కినపేనుల్లా నాలుక చప్పరించుకుంటున్నాం
నిలబడటానికే భయంగా వుంది సారూ!
నిలదీయటానికి కలేజా ఎక్కడిది?
అయితేనేం! సమాజ జీవాలుగా ఎలాగోలాగ
బతుకీడ్చటం నేర్చుకున్నాం!
ఏటికొక్కసారి మేము బతికే వున్నామంటూ
లైఫ్ సర్ట్ఫికెట్టు తెచ్చుకుంటున్నాం
మేమే బడా బడుద్ధాయిలమంటూ
గుర్తింపు కోసం మైకులు విరక్కొడుతున్నాం
ప్రజాసంక్షేమ చట్టాలకు జల్లకొట్టి
బాధ్యత దులుపుకుంటున్నాం
స్వసంక్షేమ ఆర్థికాభివృద్ధికి
చేతులు కలుపుకుంటున్నాం
ప్రపంచ దేశాల ముందు దేహభుక్తులం-
అంటూ ఎలుగెత్తి చాటుకుంటున్నాం
‘దేహీ’ అంటూ భిక్షాపాత్ర పట్టుక తిరగటానికి
నామోషీపడం!
నల్లఖజానాకు గస్తీ తిరుగుతూ
అవినీతిపై ఆర్భాటాలు చేస్తుంటాం!
మేధావుల సంఘం సామూహిక
మూగనోముల వ్రతం పాటిస్తోంది
గాంధారీ సంతతి జబ్బలు చరిచి
దురాక్రమణ కొనసాగిస్తోంది
అయినా.. చూడలేం! వినలేం!
విన్నదాన్ని అనలేం!
మంచిచెడ్డల గురించి మచ్చుకైనా నోరుతెరవం
సభా గౌరవాలకు సంభావనలకు
ప్రతిభాపాటవాలను కుదువబెట్టాం
అన్నీ మాకు తెలుసు అనుకుంటూనే-
ఎలుక కోసం తవ్వుకుంటూ పోతున్నాం
శూన్యాన్ని ఆస్వాదిస్తూ..
శూన్యంలో నడకను కొనసాగిస్తున్నాం!
కరిగిపోతున్న ఆలోచనల
అంచులు పట్టుకుని వేళాడుతున్నాం!!

- బిఎస్ నారాయణ దుర్గ్భాట్టు,
బాపట్ల, గుంటూరు జిల్లా.
చరవాణి : 9346911199
**

ఈ రేయి...

నింగిలోని జాబిలి
నీటిలోని కలువ
జతగూడాయ
ఈ రేయిని వెలిగింప

యమునా తరంగాలపైన
యవ్వనాల వెనె్నల మెరిసె
ఆ గలగలలు ఆ తళతళలు
ఈ రేయిని వెలిగింప ప్రవహించె

బృందావన పువ్వులపైన
అందమైన వెనె్నల కురిసె
ఆ కళకళలు ఆ మిలమిలలు
ఈ రేయిని వెలిగింప ప్రసరించె

వేణుగానం వినినంతనే
వేచిన రాధ వెన్నలా కరిగె
ఆ మధురిమలు ఆ ఘమఘమలు
ఈ రేయిని వెలిగింప పరవశించె!

- డి వెంకట్రావు,
ఉయ్యూరు, కృష్ణా జిల్లా.
**
పతనం

ఒకనాడు
వాడో విప్లవ శంఖం
వాడి కవిత్వం తూటాలై
పాలకుల గుండెల్లో విహరించేవి
అభాగ్యుల జీవితాల్లో
అమృతపు జల్లులు కురిసేవి
వాడి పాట
కుర్రకారు కాళ్లల్లో కదనుతొక్కేది
వాడు సైగజేస్తే
సమాజమే సైన్యమై
కదనరంగానికి కాలుదువ్వేది
ఇప్పుడు వాడు
పాలకులకు గులాము
అయ్యగారి ఘనకీర్తుల్ని
గానం చేసే దివాలాకోరు
అమ్మగారి కాలిఅందెల మీద
ఆటవెలదులు అల్లుతాడు
బాబుగారి బుద్ధి మీద
ఆశుకవిత్వపు బావుటా
ఎగురవేస్తాడు
జనం ఛీత్కారాలే
అవార్డులూ, రివార్డులూ అంటూ
అవాకులు చవాకులు పేలుతాడు
పదవి కోసం పాకులాడిననాడే
పతనం వాడి ఇంటి పత్తా అయింది!

- మండవ సుబ్బారావు,
కొత్తగూడెం, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9493335150
**
కాసు - తిరకాసు

ఆ.వె: బ్లాకుమనియె తీయ బ్లాకయ్యె అసలైన
వయిటు మనియు - మనిషి వెయిటదెల్ల
అరరె! లిఫ్టునందు ఎఱుకలేకొక్కింత
ఇరుకుకొన్నవాడె ఈ నరుండు!

ఆ.వె: నల్లబాపు బ్రతుకు తెల్లారగా తెల్ల
వోయెగా! హఠాత్తుగా; ఇదేమొ?
చిక్కెనట్టి బాపె చిల్లర ‘హుష్‌కాకి’
రూపమగుచు - కష్టశాపమగుచు!

సీ: పాలవాడో - మురిపాలు పోయుట మాని
గునపాలు గుండెలో గ్రుచ్చుచుండె,
మా పనిమనిషేమొ - మాపు - రేపని లేక
చిల్లర ధ్వనుల గినె్నల్ల తోమె
లాండ్రి చేసేడివాడు గాండ్రించి వస్త్ర మి
స్ర్తికాక - ననె్న ఇస్ర్తిని చేసె
కూరగాయలును మహోరగాలేచ
వెసవెస చిల్లర బుసలుకొట్టె
నోట్ల చిల్లర కోసము పాట్లు ఎన్నో!
ఫీట్లు-గ్రహపాట్లు ఎన్నగానెట్లు తరము?
ఉన్నవాడును - పేదయు ఒక్కటాయె;
కడకు కాసెంతగా తిరకాసు తెచ్చె
వడికాసుల వాడ! కాపాడుమయ్య!

- ‘విశాఖ’,
గుంటూరు.
చరవాణి : 9866944287
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net