విశాఖపట్నం

గమ్యం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసలే వేసవికాలం.
సముద్రం ఒడ్డున కూడా చల్లదనం లేదు. సముద్రం వైపు నుండి వెచ్చని గాలులు వస్తున్నాయి. సాగరతీరం సందడిగా ఉంది. కింద సముద్రం నీలం పైన ఆకాశం నీలం. సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఆ కెరటాల వైపు నిశితంగా చూస్తున్న గోపాలంలో భావోద్వేగం. దానితో పాటే అతని ఆలోచనలు కూడా.
ప్రతి మనిషి ఒకలా జీవించాలనుకుంటాడు. మరోలా జరుగుతూ ఉంటుంది. వాస్తవాలకి మధ్య దూరం పెరిగే కొద్దీ జీవితం మీద మమకారం తగ్గుతుంది. నిరాశ అధికమవుతుంది. నిస్పృహ ఆవరిస్తుంది. అది మనోవైకల్యానికి కారణం కావచ్చు. ఆత్మహత్యకి దారి తీయవచ్చు.
దిగులు, అర్ధం లేని ఆలోచనలు, ఆత్మన్యూనత, నిస్సత్తువ, కుటుంబ జీవితమంటే నిరాశక్తత, ఒంటరితనం ఇవన్నీ మనిషిని కుంగుబాటుకి గురి చేస్తాయి. గోపాలం విషయంలోని అదే జరిగింది. అతని మనసు నిలకడగా లేదు. అతనికి ఏడుపొస్తోంది. ఆ సముద్రం ఒడ్డున కరవుదీరా ఏడవాలని ఉంది.
బకానొకప్పడు తను ఎలా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడు తను. తను కూడా తన కుటుంబంతో హాయిగా బతికాడు. తన ఇద్దరి కూతుళ్లకి పెద్ద చదువులు చదివించి పెళ్లిళ్లు చేశాడు. కొడుకుని కూడా చదివించి తను పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వేయించుకున్నాడు.
తను కంపెనీలో మంచి హోదాలోనే ఉండేవాడు. అక్రమంగా పై సంపాదనిక అలవాటు పడ్డాడు. ప్రతి మనిషికి బలాలు బలహీనతలు ఉంటాయి. అయితే మనిషి తన సుగుణాల గురించే చెప్పుకుంటాడు కాని తన బలహీనతల గురించి చెప్పుకోడు. తన బలహీనతల్ని చెప్పుకుంటే అందరూ తనని చిన్నచూపు చూస్తారన్న భయం. అయితే తన బలహీనతలేమిటి అని ప్రశ్న వేస్తే వెంటనే జవాబు దొరుకుతంది. తన బలమీనతల ఏమిటంటే తను, తన భార్యా పిల్లలు తన కుటుంబం చక్కగా ఉండాలి. హాయిగా ఉండాలి. అదే అతని ఆలోచన.
అందుకే తన జన్మినిచ్చిన తల్లిని కూడా తనింటికి రానీయలేదు. తల్లి తన అన్నయ్య దగ్గరే ఉండేది.
జీవితంలో తను అక్రమమో, సక్రమమో ఏదయితైనేమి బాగా సంపాదించాడు. తన అన్నయ్య చనిపోయిన తరువాత తల్లి వచ్చి తన దగ్గరే ఉంటే ఆమెను ఏం సుఖపెట్టాడు కనుక తను. ఆమెకి సరైన తిండి పెట్టకుండా కాల్చుకు తిన్నాడు. ఓ సందర్భంలో ఆమె మీద చేయి చేసుకున్నాడు. ఆమె ఎడల పశువులా ప్రవర్తించాడు.
తను చేసిన ఆ పని ఎవరూ చూడలేదు. ఎవరికీ తెలియదు అని మనం అనుకోవచ్చు. తను చేసిన పని ఆ సమయంలో తనకి బాధ కలిగించకపోవచ్చు. పశ్చాత్తపపడకపోవచ్చు. అయితే తను చేస్తే ఆ పనులు భగవంతుడు గమనిస్తూనే ఉంటాడు. తన భార్య కూడా తన తల్లిని విసుక్కుంటూ ఉండేది.
చేసిన పాపాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి అని తను అనుకుంటాడు. తను చేసిన పాప ఫలితమో లేకపోతే విధి ఆడించిన వింత నాటకమో తన భార్య తనని ఒంటరి చేసింది. తన తల్లి కూడా చనిపోయింది. తల్లి చనిపోయినప్పుడు తను అంత బాధపడలేదు కాని భార్య చనిపోయినప్పుడు మాత్రం తనెంతో కుమిలిపోయాడు. తనకి నడ్డి విరిగినంత పనయింది. అందరూ ఉండి కూడా తను ఏకాకి అయ్యాడు.
భర్త చనిపోయిన తరువాత ఆడది తన పిల్లల దగ్గర జీవితం ఎలాగోలా గడిపేయగలదు కాని భార్య పోయిన తర్వాత మగవాడి పరిస్థితి హీనంగా తయారవుతుంది.
రోజురోజుకి తనలో వైరాగ్యం పెరుగుతోంది. ఈ భూమీద మనిషి జీవితం అశాశ్వమైనది. నీటి బుడగలాంటిది. నీటి బుడగ ఎప్పుడు పేలిపోతుందో తెలియదు. మనిషి జీవితం కూడా ఎప్పుడు ఏ క్షణంలో ముగుస్తుందో తెలియదు. జీవించి ఉన్నన్నాళ్లు సుఖం, దు:ఖం అనివార్యం. విషాదం, ఆనందం, అవమానం, అభినందన, నిరసన ఇవన్నీ తప్పనిసరి.
మనిషి భావోద్వేగాలు, భావోద్రేకాకి లోను కాకుండా ప్రశాంతంగా జీవిత లక్ష్యాన్ని ఒక్కసాగి అవగతం చేసుకుంటే అప్పుడు అశాంతి స్థానంలో శాంతి, నిరాశ స్థానంలో ఆశ, దు:ఖం స్థానంలో సుఖం కలుగుతాయి. అయితే భార్య చనిపోయిన తరువాత జీవితం ఎంత హీనంగా ఉందో తనకి తెలిసినప్పటికీ తను ఎంతో బాధపడ్డాడు. బాగా కుమిలిపోయాడు. కోడలికి తను ఇంట్లో ఉండడం ఇష్టంలేదు. తను కనిపిస్తే చాలా చిటపటలాడేది. కాకి మీద పెట్టి, కుక్క మీద పెట్టి తిట్టేది. తను పట్టించుకోలేదు. ఇలా కాదని దొంగతనం అంటగట్టడానికి ప్రయత్నించింది. తన పెన్షన్ కూడా ఇంటికే ఖర్చు పెడుతున్నాడు. అందుకే ఆమె మాటలు ఎవరూ నమ్మలేదు.
చివరికి తన మీద అమోఘమైన అస్త్రం ప్రయోగించింది. ఆ దెబ్బతోనైనా తన బాధ తొలగిపోతుందని కోడలి భావన. ఆ అస్తమ్రే తను ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడని. నాలుకకి నరం లేదంటారు.
ఆడదాని మాటలకి సమాజంలో విలువ ఉంది. మగవాడు నిర్దోషి అయినా అతను ఎంత మొత్తుకుని నిజం చెప్పినా ఎవరూ నమ్మరు. ఆడదాని మాటలే నమ్ముతారు. ఇది విని తన సంతానం, చుట్టుపక్కల వాళ్లు తనని అసహ్యించుకున్నారు. ఈ అభియోగం విని తన కాళ్ల కింద భూమి కంపించింది. కళ్లు బైర్లు కమ్మాయి. శరీరం గజగజ వణికింది.
అందరూ తనని అసహ్యించుకోవడం తట్టుకోలేకపోయాడు.
‘‘మీరు చేసిన పని తలచుకుంటనే కంపరంగా ఉంది. ఇంత నీచమైన పని ఎలా చేయగలిగారు? మీ అల్లుళ్లు రేప్పొద్దున ఏమంటారో తెలుసా? మీ నాన్న ఏంటి ఇంత చండాలంగా తయారాయ్యాడు? రేప్పొద్దున్న మనింటికి వస్తే తింగరి వేషాలు వేస్తాడేమిటో? అసలే మనింతో వయసు వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు అంటారు’’ అని కూతుళ్లు అనేసరికి వాళ్లు తనని ఇంతేనా అర్ధం చేసుకున్నారు? అనుకున్నాడు.
‘‘అవును నిజమే ఇతను ఇలా ప్రవర్తిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు’’ కొడుకు కూడా తనని నమ్మనట్లు అలా అనేసరికి బాధ తట్టుకోలేకపోయాడు.
తన పిల్లలే తనని దోషిగా నిలబడెతే మనసు అడుగు పొరల్లో దాగి ఉన్న బాధంతా పైకి తన్నుకొస్తోంది. పిల్లలు నానా మాటలు అన్నారు. తను వాళ్లకి ఎలాంటి జీవితం ఇచ్చాడు? వాళ్లకి ఏ కష్టం రానీయకుండా పెంచుకొచ్చాడు. వాళ్ల ఆలనాపాలనా అంతా చూసుకున్నాడు. వాళ్లు సమాజంలో ఇంత సుఖమైన జీవితం గడపడానికి మార్గదర్శకుడు తను. తను అవినీతితో సంపాదించిన డబ్బు వారు సుఖమైన జీవితం గడపడానికి ఖర్చు చేశాడు. అటువంటి తనని తన వాళ్లే నానా మాటలు అంటున్నారు. అదీ ఓ ఆడదాని అసత్య ఆరోపణలు విని. తండ్రిని అర్ధం చేసుకోలేదు.
తల్లి చనిపోగానే తను ఎంత అయిష్టుడు అయిపోయాడు వాళ్లకి. ఇలా ఆలోచిస్తున్న అతని మనసు బాధగా మూలిగింది. తను నిజం చెప్పినా వినే స్థితిలో లేరు. వౌనంగా ఆ నింద భరించి తల వంచుకునే స్థితి వచ్చింది. అందరి దృష్టిలో ఓ దోషి, నేరస్తుడు.
‘‘ఈ ముసలాడికి ఏం పోయేకాలమో కూతురు లాంటి కోడలి దగ్గర ఇలా ప్రవర్తిస్తాడా? అతనిది కాదు ఈ తప్పు అతనిలో దాగి ఉన్న వికృత పోకడలిది. ఉప్పూకారం తిన్న మనిషే కదా. అందులోనూ భార్య చనిపోయింది కూడా’’ ఇలా తలా ఓ మాట అంటూ ఉంటే అవమానం, క్షోభతో అతని మనసు నలిగిపోతుంది.
నరం లేని నాలుక తనిష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. ఈ విషయంలో ఎవరూ నిజం తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు.
‘‘ఈయన ఇక్కడ ఉన్నంతకాలం మా అమ్మాయిని ఇక్కడ ఉంచం’’ అన్న కోడలి పుట్టింటి వాళ్లు తమ కూతుర్ని తీసుకువెళ్లిపోయారు. చివరికి మిగలిన వారు తను, తన కొడుకు. కొడుకు కూడా తనతో అయిష్టంగానే మాట్లాడుతున్నాడు. ఒక విధంగా పరీక్షా సమయం. ఆపద సమయం. అటువంటి వాతావరణంలో తను ఉండలేకపోయాడు. తను ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలి. తన గమ్యం ఏది? తనకి అందరూ ఉన్నారు కాని తను ఎవరికీ ఏమీ కాలేడు.
ఈ సంఘటన జరిగిన తర్వాత బంధువులు, స్నేహితులు అందరూ తనని తప్పించుకు తిరుగుతున్నారు.
‘‘మనం ఏమాత్రం మాట్లాడినా మన మీద వాలిపోతాడు. అసలే నైతికత లేని మనిషి కదా’’ ఇద్దరు ముగ్గురు అనుకున్న మాటలు తను విన్నాడు. ఇలా సాగిపోతున్నాయి గోపాలం ఆలోచనలు.
ఎదురుగా సముద్రహోరు. ఓ స్థిర నిర్ణయంతో సముద్రం ఒడ్డుకు వచ్చిన గోపాలం లేచి నిలబడ్డాడు. అతని మెదడు నిండా సమాధానం లేని ప్రశ్నలు. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? తను ఎక్కడికి వెళ్లాలి? తన జీవనయాత్ర ఎలా సాగిపోవాలి? తన గమ్యం ఏమిటి? సమాధానం దొరకని ప్రశ్నలు. అంతలోనే ఓ స్థిర నిర్ణయం.
వెనె్నల వెలుతురులో కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. జన సంచారం లేదు. ఏదో తెలియని మైకం. తన గమ్యం ఎటు వైపో తెలిసింది. సముద్రం వైపు నడిచాడు గోపాలం. కెరటాలు అతడిని చుట్టుముడుతున్నాయి. తమతో పాటే కెరటాలు గోపాలాన్ని సముద్రంలోకి లాక్కుపోతున్నాయి.
ఇదే నీ గమ్యం అన్నట్లు...

- గూడూరు గోపాలకృష్ణమూర్తి,
పాల్‌నగర్, విజయనగరం-3.
సెల్ : 7382445284.
**

స్మార్ట్‌గా

స్మార్ట్ సాంకేతికం

నేడు మనిషికి సాంకేతికాలతో సూర్యోదయం, సూర్యుడు అస్తమించినా, అర్ధరాత్రి అయినా తెలియడంలేదు. స్మార్ట్ సాంకేతికాలతో గడిపిందే ఎక్కువ. నిద్రావ్యాపకాలన్నీ వాటితోనే. ఒకనాడు అయితే దూరవాణి (రేడియో)యే వినోదం. ఇప్పుడయిదే దూరదర్శిని (టివి)తోనే సమస్తం. సాధారణంగా దూరదర్శిని లేని ఇల్లు ఉండదు. అందరూ దూరదర్శిని ప్రేమికులు, ఆకర్షితులే. ల్యాండ్‌ఫోన్, సెల్‌ఫోన్, ఒకప్పటి వాడుక. ఈ ఫోన్లతో మనుష్యులు మాట్లాడుకోవడం జరిగేది. నేడు స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. అవే స్మార్టయి మనుషుల్ని నడిపిస్తున్నాయి.
మనిషికి స్మార్ట్ఫోను లేనిదే జీవితం లేనట్లనిపిస్తోంది. తనున్న చోటు నుండే అన్ని పనులు చేసుకునే వీలుండడంతో ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏదైనా చేసుకోగలగడంతో ప్రపంచం మనిషి అరచేతిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మనిషి మనిషికి సంబంధం తగ్గిపోతుంది. ముఖపుస్తకంలో పలకరింపుల విశేషాలు, వాట్సప్‌లో సందేశాలు, సమాలోచనలు జరుగుతున్నాయి. నచ్చినవి పంపడం, వచ్చినవి చూసుకోవడంతోనే విలువైన కాలం కాస్త ఆవిరైపోతుంది. యువత ఎక్కువగా స్మార్ట్ సాంకేతికాలకు అలవాటు పడుతోంది. ల్యాప్‌టాప్, ఇంటర్‌నెట్ ద్వారా అన్నీ అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. అనుబంధాలు కూడా సాంకేతికానికే పరిమితం అవుతున్నాయి. ప్రేమ, స్నేహం, బంధం వంటివి యాంత్రికమైపోతున్నాయి.

- గంటి కృష్ణకుమారి,
బాబామెట్ట,
విజయనగరం.
సెల్ : 9441567395.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.