విశాఖపట్నం

ప్రాణదాత (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫెళఫెళలాడుతున్న ఎర్రని రెండు గాంధీబొమ్మ నోట్లు పైజేబులో పెట్టుకుని హుషారుగా నా పల్సర్ బైక్‌పై స్నేహితుడు నరహరి పెళ్లికి వెళుతున్నాను.
‘ఒరేయ్ శేఖర్ పెళ్లి ఆదివారం కదా. నీకు సెలవు. పెళ్లి రాత్రి అయినా తెల్లవారినప్పటి నుండి నువ్వు నా పక్కన ఉండాలి. అసలే నీకు మతిమరుపు. మరిచిపోగలవు జాగ్రత్తరోయ్’ అంటూ హెచ్చరించిన స్నేహితుడి హెచ్చరిక గుర్తుకొచ్చింది.
అయితే నా హుషారుకు సెలవు పెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఆదివారం నాడు పెళ్లి జరగడం మాత్రమే కాదు. నాకింకా పెళ్లి కుదరలేదు. స్థిరంగా అంతో ఇంతో నికరాదాయం ఉన్న బ్రహ్మచారిని. ఈ పెళ్లిలోనైనా నా మనస్సుకు నచ్చే చెంపకు చారడేసి కళ్ల చామంతిలాంటి ముద్దుగుమ్మ కనబడుతుందేమోన్న ఆశ. మొత్తం మీద ఈ పెళ్లి ప్రయాణం నా ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది. నేను చేరాల్సిన గమ్యం ఎంతో దూరం లేదు. గట్టిగా చూస్తే 40 కిలోమీటర్ల లోపలే. నేను ఉంటున్న టౌన్ దాటి హైవే ఎక్కితే అంతా ఒక అరగంటలోపలే చేరవచ్చు.
వాతావరణం కూడా శ్రావణమాసం కావడంతో ముందు రోజు వర్షం పడి ఉండడంతో చల్లగా హాయిగా నా మనసులా ఆహ్లాదకరంగా ఉంది. అయితే హైవే ఎక్కగానే మొదటి కూడలిలోనే అవాంతరం ఎర్రటోపీల ఆసాముల రూపంలో ఎదురయింది. బండిని ఆపమని చెప్పడంతో ఉస్సూరంటూ బండి రోడ్డు పక్కన ఆపి నా డ్రైవింగ్ లైసెన్స్, బండికి సంబంధించిన సీబుక్ వగైరాలు పట్టుకుని వినయంగా తనిఖీ చేస్తున్న ఎస్సైగారి ముందు నిలుచున్నాను. నా ముందు వ్యక్తి తనిఖీ పూర్తయిన తరువాత అన్నీ పరిశీలించి ‘‘ ఇవన్నీ ఓకే గానీ మీ హెల్మెట్ ఏదీ?’’ అని ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తోచలేదు.
దాంతో నేను నాన్చడం చూసిన ఆ గుబురు మీసాల ఎస్సై ‘‘వెయ్యి రూపాయలు ఫైన్ కట్టండి’’ అంటూ హూంకరించాడు.
తర్వాత నా వెనకాల ఉన్న వారి కాగితాలు చూస్తున్నాడు.
‘నీకా శాస్తి జరగాల్సిందే’ అంటూ అంతరాత్మ కూడా రెండు మొట్టికాయలు వేసింది. ద్విచక్ర వాహనదారులంతా శిరస్త్రాణం ధరించాల్సిందే అంటూ ప్రభుత్వం చాలా కాలంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.
ఇదిగో కొందాం... అదిగో కొందాం అంటూ వాయిదా వేసిన నా నిర్లక్ష్యానికి శిక్ష వెయ్యి రూపాయల జరిమానా. ఈ వెయ్యితో ముందే ఒక హెల్మెట్ కొని ఉంటే సరిపోయేది కదా అని బాధపడ్డాను. ఇప్పుడు వెయ్యి రూపాయలు జరిమానా అంటే నా బోటి నెల జీతగాడికి ఎంత కష్టం. ఛీ ఏం పోలీసులో. పెద్దపెద్ద నేరస్తులను పట్టుకోకుండా నాలాంటి వారిని ఆ కాగితం లేదని, ఈ కాగితం లేదని, హెల్మెట్ వాడడం లేదని ఉత్త పుణ్యానికి వేధించడం. ఇదంతా డబ్బు దండడం కోసమే అని తిట్టుకుంటూ గత్యంతరం లేక ఒక గాంధీబొమ్మ నోటుని కిమ్మనకుండా అందించాను. అతను సీరియస్‌గా ఆ నోటు తీసుకుని జరిమానా రసీదు రాసి ఒక కానిస్టేబుల్ చేతికి ఆ రసీదు ఇచ్చి ‘‘సార్‌ని అటు తీసుకెళ్లు’’ అనగానే జరిమానా కట్టినా మరల ఇదోమిటో అనుకుంటూ ఆ కానిస్టేబుల్ వెంట నడిచిన నాకు మలుపులో ఆగిన పెద్ద వాహనాన్ని, అందులోని హెల్మెట్లను చూసి ఆశ్చర్యం వేసింది.
‘‘ ఎంచుకోండి సార్’’ అని కానిస్టేబుల్ అనడంతో మరలా ఇదో అదనపు ఖర్చు కాబోలు అనుకున్నాను. ఇది కొంటే గానీ నన్ను ఇక్కడి నుండి వెళ్లనివ్వరు కాబోలు అనుకున్నాను. నా కళ్లకు వాళ్లు రక్షక భటుల్లా కాదు భక్షక భటుల్లా కనిపించారు.
నాకు సరిపడినది ఎంచుకుని ‘‘ఎంత?’’ అని అందులో ఉన్న కుర్రవాడిని అడిగితే ‘‘ఎందుకు? దీనికి మీరేం చెల్లించనవసరం లేదు. ఆల్రెడీ మీరు కట్టిన ఫైన్‌కి బదులుగా దీనిని అందిస్తున్నాం’’ అన్నాడు.
అది విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.
ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుంటూ బండి స్టార్ట్ చేసి అక్కడి నుండి ముందుకు కదిలాను.
‘‘ ఇప్పటి నుండైనా హెల్మెట్ లేకుండా బయటికి రాకండి’’ అంటూ ఎస్సై హెచ్చరించాడు.
ఈ తనిఖీ వల్ల చాలా సమయం వృథా అయింది అనుకుంటూ బండి వేగంగా డ్రైవ్ చేయసాగాను. మరి కొంచెం దూరంలో నేను వెళ్లాల్సిన ఊరు మలుపు కనిపిస్తోంది.
పోయిన ఉత్సాహం వచ్చినట్లు అనిపించింది.
హుషారుగా మలుపు తిప్పబోయేంతలో అటు నుండి వస్తున్న సైక్లిస్టుని తప్పించబోయాను. కొంచెం ఎడమకు వచ్చేటప్పటికి అదే వేగంతో మలుపు తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్ నా బండికి తగిలీ తగలడం, కన్ను మూసి తెరిచేంతలో బండి నా కంట్రోల్ తప్పడం, తిరిగి నాకు తెలివి వచ్చేటప్పటికి నెమ్మదిగా అమ్మ వెక్కిళ్లు, ‘‘ ఊరుకో’’ అంటూ నాన్న సముదాయంపు వినిపించాయి.
ఆ హెల్మెట్టే మీ అబ్బాయి ప్రాణాలు కాపాడింది. అది తలకి లేకుంటే మనం చేయగలిగేది ఏమీ ఉండేది కాదు’’ అంటూ డాక్టర్ అంటున్న మాటలు నా చెవిలో పడ్డాయి.
‘‘ప్రస్తుతానికి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. 3 వారాలు రెస్టు తీసుకుంటే సరిపోతుంది. కాలు కింద పెట్టడానికి మాత్రం కుదరదు’’ అంటూ ఆయన నా గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అమ్మానాన్నలకి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
నాకు ప్రాణదానం చేసింది ఎవరు? నేను భక్షక భటులుగా భావించి తిట్టుకున్న ఆ ఎస్సైనే కదా. అతని రూపం నా కళ్ల ముందు కదలాడింది. పోలీసులు నా బండిని ఆపి తనిఖీ చేయకుంటే ఆ రక్షణ కవచాన్ని నాకు ఇచ్చి హెల్మెట్ ధరించమని హెచ్చరించకుంటే నా అంతిమ యాత్రకు ఈ సరికి ఏర్పాట్లు జరుగుతుండేవి. తలచుకుంటేనే వెన్నులోంచి భయం పాకుతోంది. నా మనస్సంతా నాకు పునర్జన్మ ఇచ్చిన ఆ ఎస్సై పట్ల అంతులేని కృతజ్ఞతతో నిండిపోయింది. వ్యక్తిగతంగా ఆ ఎస్సైని కలసి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలని మనసులో బలంగా నిశ్చయించుకున్నాను.
మగతగా నిద్ర పట్టింది.

- మండా శ్రీ్ధర్, గోవింద్‌నగర్‌కాలనీ,
శ్రీకాకుళం-532001. సెల్ : 9493309030.
**

మనోగీతికలు

స్వధర్మే నిధనం శ్రేయ:

వేలెడంత లేదు కాని
బోలెడన్ని అక్షరాల వెలుగురవ్వల్ని రాలుస్తుంది
పొట్ట చీరితే
అంతా పొడిపొడే
మామూలుగా అదిజడం
అయినా
ఎన్నో పదాలను, అర్థాలను సృష్టిస్తుంది
తాను క్షరవౌతు
ఎన్నో అక్షరాలకు రూపాలనిచ్చే
ఆ బలపం ముక్క
నిజంగా ఎంత గొప్పది
దాని గొప్పతనం చెప్పాలంటే
భాషకున్న 56 అక్షరాలు సరిపోవు
కొవ్వొత్తి కరిగి కరిగి
అంధకారాన్ని తొలగిస్తే
ఇది అరిగి అరిగి
మన గుండెల్లో
జాన జ్యోతిని వెలిగిస్తుంది.
స్వధర్మే నిధనం శ్రీయ:
అన్న సూక్తి సుధారసధారతో
మన హృదయాలను నింపుతుంది

- కె. శారదా ప్రసాద్, విజయనగరం.
సెల్ : 7386962424.
**
ఎక్కడున్నావ్?

ఎక్కడున్నావ్ నువ్వు...?
గతాన్ని మూటగట్టి దాచేశావా..?
ఈ మాయా ప్రపంచానికి భయడి
ఎటు వెళ్లాలో తెలియక
తికమక పడుతున్నావా ఆధునికతతో
చాదస్తపు పరదా కప్పుకున్నావ్
నీలో, నాలో సామాజికత లేదు
ఆధునికంగా ఉన్నామనుకుంటున్నాం
మనందరం తోడుదొంగలమే...!
జాతికి, పరువు - ప్రతిష్ఠలకి తలవంచి
సంస్కారపు సంకెళ్లు బిగించుకున్నాం
ఒక్కటి గుర్తు పెట్టుకో...!
అందరి భావజాలం ఒక్కటే
ఈ నవీనమంతా ప్రలోభాల వలయం
ప్రతి ఒక్కరి దగ్గర
ఆకర్షిత గొడుగుంటుంది
దేనినీ నువ్వు నమ్మకు
సభ్యత లేని ఈ కుల సమాజం
కుటుంబ గౌరవంతో ముడిపడి ఉంటుంది
ఇక్కడ మునుషులు,
మనసులు ముఖ్యం కాదు
జాతులు - అంతస్థులే ముఖ్యం
మంచికోసం వౌనంగా ఉంటే
చేతకాని తనమని వెక్కిరిస్తారు
అదే మంచి కోసం విజృంభిస్తే
బరి తెగించామంటూ దిగజార్జుతారు
అందరూ తలవంచేది ఈ మూర్ఖత్వానికే
సమాజంలో అందరూ త్యాగమూర్తులే
కానీ సహజమైన న్యాయ సమాజానికి
మాత్రం అందరూ ద్రోహులే...!
ఇప్పుడు తెలిసిందా ఎక్కడున్నావో
కుల సమాజాన్ని విడిచిపెట్టి
సమసమాజాన్ని స్థాపించు
జాతి విలువను కాదు
మానవజాతి విలువను పెంచు...!!

- పరిమళ.
సెల్ : 9392033692.
**

సమగ్రత..

సమైక్యత
మొన్న...

స్వాతంత్య్ర సంగ్రామాన
సమరసతా పంథాన
ఏకతాసూత్రంతో ఉద్యమించినా
తెల్లవారిని తరిమిన
మనమంతా ఒకేటేనన్న భావన
విజయభేరి మ్రోగించిన
‘ఐక్యతే’ మన నినాదమన్న

నిన్న..

దాయాది దేశం ‘దండు’ వచ్చినా
‘పెద్దన్న’ దేశం అందుకు ‘సై’ అన్నా
ముష్కురులు ‘మత’ చిచ్చు రగిల్చినా
మూర్కులు ‘దైవదూత’ ముసుగులు వేసుకున్నా..
‘మనం’ మతసహనం వీడలేదన్నా
‘ఐక్యతే’ మన మతమన్న

వర్తమానంలో...

పెద్దనోట్ల ‘రద్దన్నా’
‘వెత’లు తప్పకున్నా
‘వేతనాలు’ అందకున్నా
అక్కడక్కడా
ప్రాణాలు పోతున్నా
కష్టాలు-కన్నీళ్ళు ఆగకున్నా
‘ఆశ’ మనబ్రతుకన్న
‘ఐక్యతే’ మన బాసన్న
సమైక్యతే... మన బాటన్న
నిన్న... నేడు.. రేపు
మనమంతా భారతీయులమన్న
‘ఐక్యతే’ మనజాతి గీతమన్న

- భమిటిపాటి గౌరీశంకర్,
సెల్ : 9492858395.