నెల్లూరు

ఓరోజు... ఇలా (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది... గరిడి
ఒకప్పటి వ్యాయామ శాల. రంగు వెలిసిపోయి పాతబడిపోయింది. ఎలా ఉందంటే? ఒకప్పుడు రామారావు సినిమాలతో కళకళలాడి మూసేసిన సినిమా హాలులా ఉంది. ఆ గది లోపల పాత వ్యాయామపు సామానులేమీ లేవు. అవన్నీ ఎవరి ఆకలికో ఆహుతైపోయినట్టున్నాయి.
ఆ గదిలో ఓమూల పీర్ల పండక్కి ఊరేగించే పంజా, ఓ ఆంజనేయస్వామి పటము దుమ్ముకొట్టుకొనిపోయి ఉన్నాయి. ఒకప్పటి మత సామరస్యానికి ప్రతీకలుగా.
దానిముందు ఖాళీస్థలం. గదిముందు కూలడానికి సిద్ధంగా ఉన్న రెండు అరుగులు. చుట్టూ పెరగలేక పెరుగుతున్న టేకు చెట్లు. ప్రహరీ గోడనానుకొని ఉన్న రెండు చిన్న రేకు గదులు. వాటిని అద్దెకిచ్చారు. ఒకటి కిరాణా కొట్టుకు, మరోటి ఇస్ర్తి షాపుకు. ఇస్ర్తి షాపు గుర్నాధంది. వాళ్లకు అద్దెకిచ్చారనే కంటే, విధిలేక ఉన్నారనుకోవచ్చు. కారణం అద్దె తక్కువ కాబట్టి.
ఒకప్పుడు గ్రామంలోని యువకులు గరిడీకి వచ్చి విధిగా వ్యాయామం చేసేవారు. ఇప్పుడు ‘సెల్‌ఫోన్ ఆటలతోనే చెల్లిపోతోంది. కాదు కూడదనుకొనే యువకులు వేల రూపాయలు కట్టి జిమ్‌లకు వెళ్తున్నారు. ‘ఇవన్నీ కార్పొరేట్ల మాయాజాల ప్రభావాలే.
ఒకప్పుడు ఊరికి కాస్త దూరంగా ఉజ్వలంగా వెలిగిన గరిడి నేడు ఎత్తయిన భవంతుల మధ్య వెలవెలబోతున్నది. ఎంతోమందికి కండలను, గుండెబలాన్నిచ్చిన గరిడి ధైర్యం కోల్పోయి రేపో మాపో అన్నట్టుంది.
సిమెంటు రోడ్డుకు అవతల, గరిడి ముందు చెంగాళమ్మ మాను. బడికి సెలవేమో అక్కడ పిల్లలు గోలగోలగా ఆడుకుంటున్నారు. సైడు కాలువలోని మురుగునీరు పొంగి నెమ్మదిగా రోడ్డుపైకి వస్తోంది. గుడికెళ్తున్న పూజారి సుబ్బయ్యశర్మ దాన్ని దాటడానికి నానా తంటాలు పడుతున్నాడు. అంతలో ఓ కుర్రాడు వేగంగా బైకులో వెళుతూ ఆ నీళ్లను అందరిపైకి చిమ్మి వెకిలిగా నవ్వుతూ పోయాడు. ఏమనుకున్నాడో ఏమో కాని కిరాణా కొట్టు శెట్టి కోపంగా చూసి బండరాళ్లు అడ్డంపెట్టి అంగట్లోకి చక్కా పోయాడు.
ఒక నల్లకుక్క ఆ నీళ్లలో పడుకుని ఆకాశం వైపు చూస్తూ ఊళ పెట్టసాగింది. పక్కింట్లోని చెల్లమ్మ ఎవరికి చావొచ్చిందే? అట్లా అరుస్తున్నావ్ అంటూ బయటకొచ్చి తరిమింది. కుక్క భయంతో దూరంగా పోయి చెల్లమ్మ వైపు గుర్రుగా చూస్తోంది.
పాత చెక్కల తలుపు, తుప్పుపట్టిన తాళం, రేకుల కంతల్లో నుండి సూర్యుడు, వానదేవుడు ఇద్దరూ తొంగిచూస్తూనే ఉంటారు. లోపలేమో ఓ నాపరాతి అటకబండ, దానిపై కొన్ని బట్టలు, బాగా అడుక్కొచ్చిన బొగ్గుల బస్తా ఉన్నాయి. ఓమూల తాళ్లతో కట్టి నెట్టుకొస్తున్న పాత ఇస్ర్తి బల్ల, తరతరాల ఇస్ర్తిపెట్టె ఉన్నాయి. ఇక్కడ ఏమీ దొరకదని విసుక్కొంటూనే కాపురముంటున్న ఓ దిక్కులేని ఎలుక.
తన పిల్లలు చేసే ‘‘కిచ్..కిచ్ మనే శబ్ద సంగీతంలో ఓలలాడుతూ వుంటుంది విధిలేక. అదీ! సమాజం నుంచి బహిష్కరించబడ్డ మంచితనంలాగ. అందుకే కాబోలు బట్టల్ని అటకబండపై పెట్టుకున్నాడు గుర్నాధం. ఆ బండపైనే రంగు వెలసి మాసిపోయిన బ్యానర్, ‘‘మన ఊరు.. రజక సంఘం’’. ఊరిపేరేదైతేనేం ‘దారిద్య్రానికి పేరుతో పనిలేదు, పడదోసి చంపుకు తినడమే దానినైజం’. గుర్నాధం నెమ్మదిగా వచ్చి తాళం తీయబోయాడు. అది రాలేదు. పదినిమిషాలు కుస్తీపడి తీయగలిగాడు. అతని పెదవులపై ఓ చిరునవ్వు. యుద్ధంలో గెలిచిన సైనికుని విజయానందంలా వుందది. పెరిగిన గడ్డాన్ని గీక్కుంటూ, కావిగట్టిన బట్టలు, నుదుటిపై విభూదితో ధైన్యాన్నంతా తనచుట్టే దాచిపెట్టుకున్నట్టున్నాడు. నెమ్మదిగా తలుపుతోస్తే అది దడదడమంటూ, కిర్రుమంటూ విచిత్ర శబ్ధాలు చేస్తూ ఎట్టకేలకు తెరుచుకుంది. లోపలున్న ఎలుకలు వచ్చేశాడ్రోయ్ అంటూ కలుగుల్లోకి పారిపోయాయి. లోపలున్న చీపురు తీసుకున్నాడు. అది అరిగిపోయి చిన్న స్కేలులా అడుగు సైజుకొచ్చేసింది. పురావస్తు శాఖ గుర్తించిన ప్రాచీన సంపదలాంటి ఆ చీపురుతో బర్రుబర్రుమని చిమ్మసాగాడు. పక్కింట్లోంచి తెచ్చిన బక్కెట్టు నీళ్లతో షాపుముందు కడిగాడు.
అంగటి ముందు వేలాడుతున్న బూజులు మమ్మల్ని చూళ్లేదంటూ గాలికి కదుల్తూ వెక్కిరిస్తున్నాయి. గుర్నాధం లోపల నుంచి కాసిన్ని బొగ్గులు తెచ్చి పోగుగా పోసి కిరోసిన్‌తో మంటేశాడు. తాపీగా బీడీముక్క వెలిగించుకొని, దమ్ము లాగుతూ ఆలోచనల్లో పడ్డాడు. అంగడికొచ్చేముందు భార్య చెప్పిన మాటలే సినిమాలోలా ప్రతిధ్వనిస్తున్నాయి. రేషన్ బియ్యం అయిపోయాయి. రాత్రికి బియ్యం తెస్తేనే అన్నం, లేకుంటే లేదు అంది. పస్తులే.. పస్తులు.. ఏం చేస్తాం. అంతా పైవాడి దయ అంటూ పైకి చూశాడు. చెంగాళమ్మ మానుపై వున్న కాకి గుర్రుగా చూసి క్రావ్..క్రావ్ మంటూ కోపంగా అరవసాగింది.
బొగ్గులు బాగామండి నిప్పుకణికల్లా తయారయ్యాయి. గుర్నాధం బాగా తుప్పుపట్టి అదోరకం నలుపురంగులో వున్న ఇస్ర్తిపెట్టెను తోముడు బల్లపై నుంచి కిందికి దించాడు. దాన్ని పట్టుకునే పిడిచెక్క కొంత విరిగిపోయి వుంది. దానిని ప్లాస్టిక్ కవర్లతో చుట్టి వుంచాడు. దానిచుట్టూ బిగించిన కమ్ములను నెమ్మదిగా విప్పి నిప్పుల్ని బాగా అరిగిపోయిన, పెద్ద స్ఫూన్‌లా వుండే పట్టకారుతో వేశాడు. తరువాత దాన్ని తీసుకొని పైకెత్తి, నోటితో ఊపి బల్లపై పెట్టాడు. పెట్టెకున్న కన్నాలన్నింటిని సిగరెట్ ప్యాకెట్‌లోని తగరపు కాగితంతో కప్పేశాడు.
అసలు ఎన్నిసార్లు తిరగాలయ్యా? ఇప్పటికే రెండుసార్లు తిరిగా అంటూ బిగ్గరగా పిలిచినట్టు అరిచింది రాజేశ్వరమ్మ. లేదమ్మా! ఈ పూట ఆలస్యమైందమ్మా అంటూ నసిగాడు. ఆయన ప్యాంటు బాగా ఇస్ర్తి చేయలేదని నన్ను కేకలేశాడు. కాస్త జాగ్రత్తగా చూసి తోము అంది రాజేశ్వరమ్మ. అలాగేనమ్మా!అంటూ బట్టలు తీసుకున్నాడు. ఈయమ్మ నోరు పెళుసే గానీ, మనసు మాత్రం చాలామంచిది అనుకున్నాడు.
సుమారు పదిగంటలు కావస్తోంది. పక్కవీధిలోని ఇంజనీరు భాస్కరరావు ఈ బట్టల్ని ఇస్ర్తి చేసి ఇంట్లో ఇచ్చేయ్ అని హుకుం జారీ చేసినట్లు మాట్లాడాడు. మరచిపోయేవు గుర్నాధం రేపు ఊరి ప్రయాణం వుంది జాగ్రత్త అంటూ వెళ్లిపోయాడు. భలే అనుమానం మనిషి. ఆఫీసుకు వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లో వుంచి, తాళం వేసుకొని వెళతాడు. ఆయన భార్యేమో గొప్ప అందగత్తె. కాకి ముక్కుకు దొండపండులాంటి జంట.
వేప చెట్టుపైనున్న పావురాళ్లు టపటపా రెక్కలార్పుతూ లేస్తున్నాయి. ఎంతో ముద్దుగా వుంటాయవి. ఎదురింటి వీర్రాజు వాటిని పెంచుకోవడానికని తీసుకెళుతుంటారు. గుర్నాధం వాటివైపు తృప్తిగా చూసి తిరిగి పనిలోబడ్డాడు.
భాస్కర్రావు బట్టల్ని తోముతుంటే ఫైనాన్స్ ఇచ్చిన సత్యం వచ్చి, ఏం గుర్నాధం మూడ్రోజుల్నుంచి కట్టడం లేదు. ఈరోజు ఇస్తేనే ఇక్కడ్నుంచి కదిలేది లేకుంటే లేదు అన్నాడు కోపంగా. సత్యమన్నా! ఇంకా బోణీ కూడా కాలేదన్నా.. సాయంత్రం ఖచ్చితంగా ఇస్తానన్నాడు. అంతలో కరీమ్ సాయిబు మనవడొచ్చి మీరు అద్దె ఇస్తే గరిడీకి సున్నమెయ్యాలని బాబా చెప్పాడు. ఎల్లుండికి కావాలంటూ చక్కాబోయాడు. అబ్బా! ఉరుము మెరుపు లేకుండా వానకురిసినట్టుంది అనుకున్నాడు గుర్నాధం.
చెంగాళమ్మ మానుపై వున్న ఉడుతొకటి అరుస్తూ కొమ్మలన్నీ కలియ దిరుగుతోంది. గుర్నాధం తననే వెక్కిరిస్తోందని మూతి తిప్పుకున్నాడు. కొంతసేపటికి రాజేశ్వరమ్మ వచ్చి ముప్పైరూపాయలిచ్చి బట్టల్ని తీసుకెళ్లింది. తరువాత బట్టల్ని తీసుకొని భాస్కర్రావింటికి వెళ్లి కాలింగ్‌బెల్ నొక్కాడు. కాసేపటికి భాస్కర్రావు భార్య బిత్తరచూపులు చూస్తూ కిటికిలోనుంచి చూసింది. బట్టలమ్మా అన్నాడు. ఇలా తే అంది. అప్పుడు పరిశీలనగా చూస్తే లోపల ఓ కుర్రాడున్నాడు. బయట తలుపు తాళం వేసింది. గుర్నాధం కిసుక్కుమంటూ నవ్వుతూ అటువంటి అనుమానం మనిషికి ఇలాగే జరగాలనుకున్నాడు. కిటికీలోంచి ఆమె దీర్ఘనిశ్వాసాలు ఇంకా వినబడుతూనే వున్నాయి. చిలిపిగా నవ్వుకుంటూ, ఆమె ఇచ్చిన డబ్బులు చూస్తూ మెట్లు దిగసాగాడు.
మిట్టమధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిమీదకొచ్చాడు. చుర్రుమనే ఎండను చూసి, ఈ సూర్యుడికన్నా నా ఇస్ర్తిపెట్టే నయం కాసేపన్నా ఖాళీగా వుంటుంది. ఈయనగారు ఎప్పుడూ మండుతూనే వుంటారు. అనుకుంటూ దార్లో రాజేశ్వమ్మిచ్చిన చద్దన్నం తిని, చెంగాళమ్మ మానుకింద నడుం వాల్చాడు.
నిద్రలేచేటప్పటికి సమయం మూడుగంటలైంది. ఎదురుగా పుట్టయ్య వస్తున్నాడు. ఏం పుట్టయ్యా! ఏం విశేషం అన్నాడు గుర్నాధం. నువ్వు మర్చిపోయినట్లున్నావ్. ఈరోజు సాయంత్రం మన సంఘపోళ్లు మీటింగు కదా! ఆ... అవునయ్యా మర్చేపోయానే అంటూ అటక బండపైనున్న పాత బ్యానరు బయటకు తీసి దుమ్ము దులపసాగాడు. ఇద్దరూ వెళ్లి గరిడీలోని అరుగుపైనున్న కిటికీకి కట్టారు. ఆ బ్యానరు లాగానే ‘‘వాళ్ల జీవితాల్లో మెరుపులేదు, అలాగని మరపూరాదు’’.
ఏం గుర్నాధం ఏమన్నా మంచీచెడ్డా లేదా అన్నాడు పుట్టయ్య. ఆ ఇప్పుడెక్కళ్లే పుట్టయ్యా అన్నాడు గుర్నాధం. మనోళ్లొచ్చేదానికి ఇంకా టైముంది పోదాంపద అన్నాడు. కాళ్లు ఆ వైపుకే లాగాయి. తిరిగొచ్చేటప్పటికి మీటింగు ప్రారంభమైది. ఆ మీటింగులో ఇళ్లస్థలాలు, రుణాలు మొదలైన వాటిపై వాడిగావేడిగా ప్రసంగాలు సాగాయి. మీటింగు ముగిశాక ఎప్పట్లాగానే అందరూ వెళ్లిపోయారు.
గుర్నాధం బ్యానరు మడిచి షాపులో పెట్టి తలుపువేశాడు. దూరంగా వస్తున్న సత్యమన్నను జూసి చీకట్లో దాక్కొన్నాడు. కొంతసేపటి తరువాత అతనికి బియ్యం విషయం గుర్తొచ్చింది. ఏం చేయాలో పాలుపోలేదు. రాజేశ్వరమ్మనడిగాడు. ఆమె తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి చేబదులుగా యాభైరూపాయలిచ్చింది. దాంతో బియ్యం కొనుక్కెళ్లాలని వెళుతుంటే, దార్లో గాయత్రీవైన్స్ ప్రేమగా పిలిచినట్టనిపించింది. తన ప్రమేయం లేకుండానే కాళ్లు అలాగేసాగాయి. ఆక్షణాన అతనికేమీ గుర్తురాలేదు. బలహీనతకు బానిసత్వానికి దగ్గర సంబంధం వుంది. దానిపై మనం స్వారీ చేయాలిగానీ, అది మనపై స్వారీ చేస్తే బానిసత్వమే మరి.
తూలుతూ ఇంటికెళ్లే సరికి పిల్లలు బయటే ఆకాశం వైపు చూస్తూ చుక్కలు లెక్కబెడుతున్నారు. చుక్కలు లెక్కపెట్టకూడదని వాళ్లమ్మ అరుస్తుంది. ఆ పిల్లల కడుపు మరోసారి మంచినీళ్లతో నిండిపోయింది.

- కావేరిపాకం రవిశేఖర్, నాయుడుపేట చరవాణి : 9849388182