విశాఖపట్నం

అస్త్రం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నట్లుండి ఎందుకో కథలు రాయాలనిపించింది వికాస్‌కి. డిగ్రీ అయ్యాక చెయ్యడానికి ఏ పనీ లేకపోవడంవల్లనేమో. కారణం ఏదైనప్పటికి ఓ మంచి రచన చెయ్యాలన్న సంకల్పం కలిగింది. ఠపీమని పెన్ను, కాగితం తీసాడు. ఎంత ప్రయత్నించినా కలం ముందుకు సాగడంలేదు. ఇక లాభం లేదనుకుని లైబ్రరీకి వెళ్లాడు. ఏక బిగిన ఓ అరడజను వార, మాస పత్రికలు తిరగేసాడు. లీలగా మదిలో ఏదో థీము మెదిలింది. మరి ఆలశ్యం చేయకుండా మదిలో అక్షర రూపమిచ్చాడు. ఎంచేతనో తను రాసింది తనకే ఎబ్బెట్టుగా తోచింది. తిరిగి దానే్న తిరగరాసాడు. కథ ఓ కొలిక్కి వచ్చింది. అప్పుడు అనుకున్నాడు కథ రాయడం అంత ఆషామాషీ కాదని. వెంటనే దాన్ని ఫెయిర్ చేసి ఏదైనా పత్రికకు పంపాలనుకున్నాడు. అయితే దానికి ముందు తన ప్రాణస్నేహితుడు ముకుందానికి చూపిస్తే బావుటుందేమో అనిపించింది. ఉన్నపళంగా మిత్రుణ్ణి కలిసి కథ చదివి వినిపించి ఎలా ఉందని అడిగాడు.
‘‘ఎక్స్‌లెంట్.... సూపర్బ్. పోటీకి పంపిస్తే ప్రథమ బహుమతి నీకే’’ అంటూ అతణ్ణి పొగడ్తలతో ముంచెత్తాడు.
‘‘నాపై ఉన్న అభిమానంతో నువ్వు సర్ట్ఫికెట్టు పారేసినంత మాత్రాన అది ఉత్తమ రచన అయిపోదు. ఎందుకైనా మంచిది మన వీధిలో ఉన్న రచయిత పరాంకుశం గారికి చూపిస్తే ఎలా ఉంటుందంటావ్?’’ అడిగాడు వికాస్.
‘‘వద్దు ఆ పని మాత్రం చెయ్యకు. ఆదిలోనే నీ ప్రయత్నం బెడిసి కొట్టగలదు’’ అన్నాడు ముకుందం.
‘‘అదేంట్రా అలా అంటావ్ కొన్ని వందల కథలు రాసిన వ్యక్తి. ఆయనకు ఓసారి చూపిస్తే ఏమవుతుంది? రచనలో లోటుపాట్లు ఏవైనా ఉంటే చెబుతారు కదా!’’
‘‘నువ్వు ఏమైనా అనుకో అతన్ని కలవడం వల్ల ఏ ప్రయోజనం ఉండదు. ఆయన సంగతి నీకు తెలీనట్లుంది. తనవద్దకొచ్చే కొత్త రచయితల్ని ప్రోత్సహించడం మాట అటుంచి నిరుత్సాహపరచి పంపిసాడని విన్నాను’’
ముకుందం మాటలు వికాస్‌కి రుచించలేదు. పెద్దాయన రచయితగా మంచి పేరున్న వ్యక్తి. తనకి నచ్చితే రచన బావుందంటాడు. లేకుంటే సలహాలేవైనా ఇవ్వొచ్చు. అంతే తప్ప వచ్చినవాళ్లని డిస్కరేజ్ చేసాడంటే తను నమ్మలేకపోతున్నాడు.
‘‘లేదురా ఆయన్ని కలవాలి. ఆ తర్వాతే రచన మీద ఏ నిర్ణయమైనా తీసుకునేది’’ అన్నాడు వికాస్.
‘నీ కర్మ’ అనుకున్నాడు ముకుందం లోలోపల. ఒకే వీధిలో ఉండటం వల్ల వికాస్‌కి ఇదివరకే పరాంకుశం గారితో అంతో ఇంతో పరిచయం వుంది. అందుకే అక్కడి నుంచి తిన్నగా వారింటికెళ్లాడు.
*** *** ***
‘‘సర్‌ప్రైజింగ్ న్యూస్ ఈమధ్య పరాంకుశంగారు కొత్త రచయితలకు ఎంతగానో ప్రోత్సాహం ఇస్తున్నారంట. అంతేకాదు మొన్నీమధ్య యువ రచయితలనందర్నీ సమావేశపరచి కథలు ఎలా రాయాలో వివరంగా చెప్పారంట. వారిలో నూతనోత్సాహాన్ని నింపారని అంతా అనుకుంటున్నారు. నువ్వు ఏ మంత్రం వేసావో గాని ఆయన పూర్తిగా మారిపోయారు. అందుకు నువ్వు ప్రయోగించిన అస్త్రం ఏంటో కాస్త చెబుదూ’’ బ్రతిమాలుతున్నట్లు అన్నాడు ముకుందం.
‘‘మంత్రం లేదు తంత్రం లేదు. నువ్వు అడిగావు గనక చెబుతున్నాను విను’’ అంటూ నోరు విప్పాడు వికాస్.
*** *** ***
‘‘నమస్తే’’ వినయంగా రెండు చేతులు జోడించాడు వికాస్
‘‘నువ్వా?..... ఏంటి ఇలా వచ్చావ్? నీ ఉద్యోగ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది’’ అడిగారు పరాంకుశంగారు.
‘‘కనిపించిన ప్రతి ఉద్యోగానికి రెజ్యూమ్ పంపిస్తూనే ఉన్నాను. పిలిచిన ప్రతి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతూనే ఉన్నాను. ఇంకా ఏదీ ఫలించలేదు. ఆ విషయం పక్కన పెడితే నేనో కథ రాసానండి. దాన్ని మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. ఇందులో ఏవైనా...’’ అంటూ నసిగాడు వికాస్.
‘‘ఏంటి!.... రచయిత అయిపోదామనే’’ అంటూ అతడి చేతిలో నుంచి కథ లాక్కుని కళ్ళద్దాలు సవరించుకున్నారు పరాంకుశంగారు.
బిత్తర చూపులు చూస్తూ నిలబడ్డాడు వికాస్.
‘‘ఏంటయ్యా కథ ఇలాగేనా రాసేది? ఇందులో శిల్పం ఏది? శైలి ఏంటి ఇంత నాసిగా వుంది? ముగింపైనా ముచ్చటగా ఉంటుందేమో అనుకుంటే అదీ అఘోరించినట్లే వుంది’’ చీవాట్లేస్తున్నట్లు అన్నారు పరాంకుశంగారు.
‘‘అందుకేసార్ మీకు చూపించింది. మీరు ఉన్న ముక్క సూటిగా చెప్పారు. అందుకు ధన్యవాదాలు. నా రచన చదివినవాళ్లంతా పొగడ్తలతో ముంచెత్తుతున్నారే తప్ప ఏ ఒక్కరు అందులో లోపాల్ని ఎత్తి చూపడం లేదు. నిజంగా మీరు నాకెంతో ఉపకారం చేసారు. నాకెంతో సంతోషంగా వుంది. తప్పకుండా నా లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తాను. మీమేలు ఈ జన్మలో మరచిపోలేను. వస్తానండి సెలవ్... పత్రికలో కథపడ్డాక మళ్లీ మీదగ్గరకొస్తాను’’ అంటూ చకచకా అక్కడి నుంచి బయటపడ్డాడు వికాస్.
ఎప్పటిలాగే వచ్చిన వాణ్ణి మాటలతో చిన్నబుచ్చుకునేటట్లు చేసి పంపించాలనుకుంటే అతడి ముందు తనే చిన్నబుచ్చుకోవలసి రావడంతో జ్ఞానోదయమైంది పరాంకుశానికి. అంతే నాటి నుంచి తను పూర్తిగా మారిపోయాడు. కొత్త రచయితలకు చక్కటి సలహాలు సూచనలు ఇస్తూ అందరి ప్రశంసల్ని పొందాడు.

- దూరి వెంకటరావు,
25-10-30, దాసన్నపేట, మెయిన్‌రోడ్
కనకాంబ నిలయం, విజయనగరం-2
సెల్ : 9666991929.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.