విజయవాడ

ప్రాణదాత (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫెళఫెళలాడుతున్న ఎర్రని రెండు గాంధీబొమ్మ నోట్లు పైజేబులో పెట్టుకుని హుషారుగా నా పల్సర్ బైక్‌పై స్నేహితుడు నరహరి పెళ్లికి వెళుతున్నాను.
‘ఒరేయ్ శేఖర్ పెళ్లి ఆదివారం కదా. నీకు సెలవు. పెళ్లి రాత్రి అయినా తెల్లవారినప్పటి నుండి నువ్వు నా పక్కన ఉండాలి. అసలే నీకు మతిమరుపు. మరిచిపోగలవు జాగ్రత్తరోయ్’ అంటూ హెచ్చరించిన స్నేహితుడి హెచ్చరిక గుర్తుకొచ్చింది.
అయితే నా హుషారుకు సెలవు పెట్టాల్సిన అవసరం లేకపోయింది. ఆదివారం నాడు పెళ్లి జరగడం మాత్రమే కాదు. నాకింకా పెళ్లి కుదరలేదు. స్థిరంగా అంతో ఇంతో నికరాదాయం ఉన్న బ్రహ్మచారిని. ఈ పెళ్లిలోనైనా నా మనస్సుకు నచ్చే చెంపకు చారడేసి కళ్ల చామంతిలాంటి ముద్దుగుమ్మ కనబడుతుందేమోన్న ఆశ. మొత్తం మీద ఈ పెళ్లి ప్రయాణం నా ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తున్నది. నేను చేరాల్సిన గమ్యం ఎంతో దూరం లేదు. గట్టిగా చూస్తే 40 కిలోమీటర్ల లోపలే. నేను ఉంటున్న టౌన్ దాటి హైవే ఎక్కితే అంతా ఒక అరగంటలోపలే చేరవచ్చు.
వాతావరణం కూడా శ్రావణమాసం కావడంతో ముందు రోజు వర్షం పడి ఉండడంతో చల్లగా హాయిగా నా మనసులా ఆహ్లాదకరంగా ఉంది. అయితే హైవే ఎక్కగానే మొదటి కూడలిలోనే అవాంతరం ఎర్రటోపీల ఆసాముల రూపంలో ఎదురయింది. బండిని ఆపమని చెప్పడంతో ఉస్సూరంటూ బండి రోడ్డు పక్కన ఆపి నా డ్రైవింగ్ లైసెన్స్, బండికి సంబంధించిన సీబుక్ వగైరాలు పట్టుకుని వినయంగా తనిఖీ చేస్తున్న ఎస్సైగారి ముందు నిలుచున్నాను. నా ముందు వ్యక్తి తనిఖీ పూర్తయిన తరువాత అన్నీ పరిశీలించి ‘‘ ఇవన్నీ ఓకే గానీ మీ హెల్మెట్ ఏదీ?’’ అని ప్రశ్నించడంతో ఏం చెప్పాలో తోచలేదు.
దాంతో నేను నాన్చడం చూసిన ఆ గుబురు మీసాల ఎస్సై ‘‘వెయ్యి రూపాయలు ఫైన్ కట్టండి’’ అంటూ హూంకరించాడు.
తర్వాత నా వెనకాల ఉన్న వారి కాగితాలు చూస్తున్నాడు.
‘నీకా శాస్తి జరగాల్సిందే’ అంటూ అంతరాత్మ కూడా రెండు మొట్టికాయలు వేసింది. ద్విచక్ర వాహనదారులంతా శిరస్త్రాణం ధరించాల్సిందే అంటూ ప్రభుత్వం చాలా కాలంగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది.
ఇదిగో కొందాం... అదిగో కొందాం అంటూ వాయిదా వేసిన నా నిర్లక్ష్యానికి శిక్ష వెయ్యి రూపాయల జరిమానా. ఈ వెయ్యితో ముందే ఒక హెల్మెట్ కొని ఉంటే సరిపోయేది కదా అని బాధపడ్డాను. ఇప్పుడు వెయ్యి రూపాయలు జరిమానా అంటే నా బోటి నెల జీతగాడికి ఎంత కష్టం. ఛీ ఏం పోలీసులో. పెద్దపెద్ద నేరస్తులను పట్టుకోకుండా నాలాంటి వారిని ఆ కాగితం లేదని, ఈ కాగితం లేదని, హెల్మెట్ వాడడం లేదని ఉత్త పుణ్యానికి వేధించడం. ఇదంతా డబ్బు దండడం కోసమే అని తిట్టుకుంటూ గత్యంతరం లేక ఒక గాంధీబొమ్మ నోటుని కిమ్మనకుండా అందించాను. అతను సీరియస్‌గా ఆ నోటు తీసుకుని జరిమానా రసీదు రాసి ఒక కానిస్టేబుల్ చేతికి ఆ రసీదు ఇచ్చి ‘‘సార్‌ని అటు తీసుకెళ్లు’’ అనగానే జరిమానా కట్టినా మరల ఇదోమిటో అనుకుంటూ ఆ కానిస్టేబుల్ వెంట నడిచిన నాకు మలుపులో ఆగిన పెద్ద వాహనాన్ని, అందులోని హెల్మెట్లను చూసి ఆశ్చర్యం వేసింది.
‘‘ ఎంచుకోండి సార్’’ అని కానిస్టేబుల్ అనడంతో మరలా ఇదో అదనపు ఖర్చు కాబోలు అనుకున్నాను. ఇది కొంటే గానీ నన్ను ఇక్కడి నుండి వెళ్లనివ్వరు కాబోలు అనుకున్నాను. నా కళ్లకు వాళ్లు రక్షక భటుల్లా కాదు భక్షక భటుల్లా కనిపించారు.
నాకు సరిపడినది ఎంచుకుని ‘‘ఎంత?’’ అని అందులో ఉన్న కుర్రవాడిని అడిగితే ‘‘ఎందుకు? దీనికి మీరేం చెల్లించనవసరం లేదు. ఆల్రెడీ మీరు కట్టిన ఫైన్‌కి బదులుగా దీనిని అందిస్తున్నాం’’ అన్నాడు.
అది విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను.
ఇది కూడా ఒకందుకు మంచిదే అనుకుంటూ బండి స్టార్ట్ చేసి అక్కడి నుండి ముందుకు కదిలాను.
‘‘ ఇప్పటి నుండైనా హెల్మెట్ లేకుండా బయటికి రాకండి’’ అంటూ ఎస్సై హెచ్చరించాడు.
ఈ తనిఖీ వల్ల చాలా సమయం వృథా అయింది అనుకుంటూ బండి వేగంగా డ్రైవ్ చేయసాగాను. మరి కొంచెం దూరంలో నేను వెళ్లాల్సిన ఊరు మలుపు కనిపిస్తోంది.
పోయిన ఉత్సాహం వచ్చినట్లు అనిపించింది.
హుషారుగా మలుపు తిప్పబోయేంతలో అటు నుండి వస్తున్న సైక్లిస్టుని తప్పించబోయాను. కొంచెం ఎడమకు వచ్చేటప్పటికి అదే వేగంతో మలుపు తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్ నా బండికి తగిలీ తగలడం, కన్ను మూసి తెరిచేంతలో బండి నా కంట్రోల్ తప్పడం, తిరిగి నాకు తెలివి వచ్చేటప్పటికి నెమ్మదిగా అమ్మ వెక్కిళ్లు, ‘‘ ఊరుకో’’ అంటూ నాన్న సముదాయంపు వినిపించాయి.
ఆ హెల్మెట్టే మీ అబ్బాయి ప్రాణాలు కాపాడింది. అది తలకి లేకుంటే మనం చేయగలిగేది ఏమీ ఉండేది కాదు’’ అంటూ డాక్టర్ అంటున్న మాటలు నా చెవిలో పడ్డాయి.
‘‘ప్రస్తుతానికి ప్రాణానికి ప్రమాదం ఏమీ లేదు. 3 వారాలు రెస్టు తీసుకుంటే సరిపోతుంది. కాలు కింద పెట్టడానికి మాత్రం కుదరదు’’ అంటూ ఆయన నా గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అమ్మానాన్నలకి చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు.
నాకు ప్రాణదానం చేసింది ఎవరు? నేను భక్షక భటులుగా భావించి తిట్టుకున్న ఆ ఎస్సైనే కదా. అతని రూపం నా కళ్ల ముందు కదలాడింది. పోలీసులు నా బండిని ఆపి తనిఖీ చేయకుంటే ఆ రక్షణ కవచాన్ని నాకు ఇచ్చి హెల్మెట్ ధరించమని హెచ్చరించకుంటే నా అంతిమ యాత్రకు ఈ సరికి ఏర్పాట్లు జరుగుతుండేవి. తలచుకుంటేనే వెన్నులోంచి భయం పాకుతోంది. నా మనస్సంతా నాకు పునర్జన్మ ఇచ్చిన ఆ ఎస్సై పట్ల అంతులేని కృతజ్ఞతతో నిండిపోయింది. వ్యక్తిగతంగా ఆ ఎస్సైని కలసి నా కృతజ్ఞతలు తెలుపుకోవాలని మనసులో బలంగా నిశ్చయించుకున్నాను.
మగతగా నిద్ర పట్టింది.

- మండా శ్రీ్ధర్,
సెల్ : 9493309030

***
మనోగీతికలు

ఆమె

అబల కాదు ఆమె
సృష్టిలోని ఒక అద్భుత శక్తి
పెట్టని ఆభరణాలుగ పుట్టుకతో తెచ్చుకున్న
ప్రేమానురాగాల గని
ఆత్మాభిమానమే అందమైన ఆభరణంగా
మాటల్లో మన్నన, చేతల్లో చాతుర్యం
విధి నిర్వహణలో విలువలు నిండిన మెలకువ
వెన్నతో పెట్టిన విద్యలు ఆమెకు
కదలికలో హొయలొలికిస్తూ
కనులతో భావాలు పలికిస్తూతూ
అరనవ్వుతో అనురాగ బంధం వేస్తూ
నడిచే శృంగార శిల్పం
నవమన్మథుడొదిలిన బాణం
చూపరుల కంటె కొలనులో
విరిసిన నవ కమలం
లక్కపిడతలలో వండివార్చే నాటినుండి
నడుం వంగేదాకా వండి ఆకలి తీర్చే అమ్మ
భార్యయై, సంసార రథచక్రమై
బతుకుబండి కడదాకా నడిపే సహచరి
చెల్లియై, స్నేహితగా సన్నిహితయై
సలహా సంప్రదింపులతో పెనవేసే స్నేహలత
మారే కాలంతో పాటు వేవేగంగా అడుగులేస్తూ
వినూత్న భావాలతో విశాల దృక్పథంతో
అన్నిరంగాల్లో నాదే అందెవేసిన చెయ్యంటూ
చేతల్లో నిరూపించిన వినూత్నశక్తి ఆమె
ఇంతటి అమూల్య అద్భుత స్ర్తిశక్తిని
కడుపులోనే కడతేరుస్తూ
పసికూనలని ముళ్లపొదల్లోకి విసిరేస్తూ
అత్యాచారాలు, హత్యలతో కడతేరుస్తూ
వరకట్న వేధింపులతో వేదనలపాల్జేసి
గృహహింసతో నిత్యనరకం చూపిస్తూ
పెడుతున్న చిత్రహింసలు అన్నీఇన్నీ కావు
తల్లిగా, భార్యగా, సోదరిగా, స్నేహితగా
ఒక అపురూప సంపద ఆమె
ఆమె లేని ఇల్లు వెలుగుచూడని చీకటి కొంప
నైరాశ్యంతో నిండిన శ్మశానవాటిక
అర్థం చేసుకొని ఆదరిస్తే
ఆ గృహమే స్వర్గసీమ
ఆ వనితే సిరులపంట!

- లక్కరాజు వాణీసరోజిని,
విజయవాడ.
చరవాణి : 9346978829
**
కలల ప్రపంచం

నా కౌగిలి లోగిలిలోకి ఆహ్వానించి
నీ కనురెప్పలపై సున్నితంగా స్పృశించిన
మధురానుభూతి మరుజన్మ దాకా
మధురక్షణాలై నిలిచిపోతే ఎంత బాగుండు!
ఆ కళ్లలోకి తొంగిచూసి వెనె్నల కాంతుల్లో
ఆశల్ని దోసిలి నిండా నింపుకొని
నీతో పంచుకున్న ఆ పున్నమి రాత్రులు
కరిగిపోకుంటే ఎంత బాగుండు!
మనసుతో చెప్పుకున్న ఊసులు
చేసుకున్న బాసలు
చెదిరిపోకుంటే ఎంత బాగుండు!
కలలుకనే ఆ కళ్లకు
చెక్కిలిపై చుక్కనై ముద్దాడి
తేనెలొలుకు సోయగాల
ముద్దుగుమ్మ మనసు
దోచుకుంటే ఎంత బాగుండు!
ఇది ఊహల ప్రపంచం
ప్రేమ పక్షకులకు అందమైన ఉద్యానవనం
నిదురలోనే కలల్నికనే కలల ప్రపంచం
ఇక్కడ ప్రేమికులకు తప్ప వేరెవ్వరికీ చోటులేదు
ఎవరూ ఎవరినీ విడదీయలేరు
మనసుల్ని మమతల్ని పంచుకొని
స్వేచ్ఛా విహంగాలై ఎగరొచ్చు
అందంగా విరబూసిన పూదోటలో
రంగురంగుల సీతాకోకచిలకలు వాలుతాయి
మదినిండా హాయి నింపుకొని ఎగిరిపోతాయి.
ఎటుచూసినా ప్రేమమయం
విరబూసే అంతరంగ సుమాలు
ఆస్వాదించే పరిమళాలు వెదజల్లి
ఏడేడు జన్మలదాకా వీడనిబంధమైతే
ఎంత బాగుండు!
కావలసినన్ని కలలు కబుర్లు
అనార్ ప్రేమలా బందీ చేయలేరు
ముంతాజ్ మహల్‌లా సమాధి కట్టలేరు
ఇక్కడ ద్వేషాలు, స్వార్థాలకు చోటులేదు
అభిరుచులు అనుబంధాలు కలబోసుకోవచ్చు
ఇది ప్రేమికుల కోసం నిర్మింన ప్రేమమందిరం
ఇదొక ఊహల ప్రపంచం
రంగు రంగుల కలలకు
రంగుల ప్రపంచం
వాస్తవంలో సాధ్యపడని
అరుదైన ప్రేమలోకం!

- తాటికోల పద్మావతి,
గుంటూరు.
చరవాణి : 9441753376
**
దర్పణ శకలం

జీవనదై సదా సాగుతాను
ఒక ఎడారి మలుపులో ఆగుతాను
నా మనోదుఃఖాన్ని మండించి, కవితలు-
పండించి గాలిబ్‌కు తూగుతాను
గుప్పెడు పూల సంతోషాల కోసమే
గుక్కెడు కన్నీళ్లు తాగుతాను
గాయం నయంకాని ప్రేమ నాది; చిగుర్చు-
జ్ఞాపకాన్నై చెలరేగుతాను
ఎదపెడితే పాట ఎవరికైనా
కానవస్తుంది; కోకిలై దాగుతాను
బతుకు చేదు నిజాన్ని మరిచి కాసేపు
నీ ఊహలు పట్టుకు ఊగుతాను
వానెంతగా నన్ను తడిపిపోతుందనీ
రేపు వేసంగిలా వేగుతాను
నా పదాలు నదాలు కడతాయి చరితన
మట్టిబొమ్మై నేను వీగుతాను
నిస్సడిగా ఎలా నిష్క్రమించేది ‘ఫైజ్’
దర్పణ శకలాన్ని మోగుతాను!
- ఫైజ్, ఖమ్మం,
చరవాణి: 9581219058