ఉత్తర తెలంగాణ

జీవితమంటే..! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకరోజు బ్రతికే గడ్డిపూవునడుగు
జీవితమంటే ఏమిటో చెబుతుంది!
ఎంత కాలం బ్రతికావని కాదు..
ఎంత ఆనందంగా గడిపామన్నది ముఖ్యం!
ఎంత కాంతిలో ఉన్నావని కాదు..
ఇతరులకు ఎంత వెలుగును పంచావో ముఖ్యం
ఒకసారి నిశీధి రాత్రిలో..
నిశ్శబ్దంగా రాలిపోలే నక్షత్రాలనడుగు..
ఎంత అడుగున ఉన్నామని కాదు..
సహనంతో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చని..
అగాధాల అంచున మెరిసే
స్వాతిముత్యాన్ని అడుగు..
ఎన్నిసార్లు క్రిందపడినా..
అనుకున్నది ఎలా సాధించాలో..
ఒంటరిగా గూడుకట్టుకునే..
సాలె పురుగును అడుగు!

- టి.వసంత, నిజామాబాద్
**

గుండె పగిలిన దుఃఖం

దూలానికి హృదయం మొలిచినట్లు
రెండు పిచ్చుకలు కట్టుకున్న
కోటలాంటి
పిడికెడు ప్రేమ గూటిలో
దిగులు పిట్ట పొదిగింది
ఇల్లంతా ఆకాశంలా ఎగిరిన
అల్లరి పిచ్చుకలు
ముక్కులు వొంకర్లుపోయేలా
ముద్దు ముచ్చట్లు చప్పరించుకున్న
జంట పిచ్చుకలు
షికారు రెక్కలు తొడుక్కుని
ఎగిరిపోయే కూతఘనం పిట్టలు
ఏం మాటలు అనుకున్నాయో
పరిచయమే లేనట్టు
రహస్య ప్రేమికులులా, దూలంపై
దూరం కొలుచుకుంటూ కూర్చున్నాయి
ఎప్పుడు పడిందో
తల్లిరెక్కే తగిలిందో
తండ్రి కాలే తన్నుకొచ్చిందో
అప్పుడే రెక్కలొచ్చనట్టు కలకన్నదో
ఈ కాంక్రీటు ప్రపంచంలో
ఎలాగూబ్రతుకలేనని తొందరపడిందో
ఏమో
గూడునొదిలి గుడ్డు దేహమొకటి
నేలకు బాదుకున్నది
విషాదం పేలి ఎంతసేపయ్యిందో,
వలపు పంట చితికిన నేలపై
నాన్న పిచ్చుక
నిస్సహాయ చూపులు చల్లుతున్నది
తల్లి పిచ్చుక రెప్పపాటు ఎగురుతూ
మళ్లీ అక్కడే వాలుతూ
ముక్కలయిన బిడ్డ ముఖం చూసి
కడుపు కొట్టుకుని తండ్లాడుతున్నది
ఆ బాలింత కళ్లలో
కన్నీటి భాష పుడితే
కనురెప్ప కాపలా వొడిలోంచి
భావితరం జారిపోయిందని
దుఃఖం పంచుకునేది
పలికే నోరుంటే
నాతో చెప్పుకునేది
అన్నా గుండె పగిలిందే అని

- గజ్జెల రామకృష్ణ
భూదాన్‌పోచంపల్లి, నల్లగొండ జిల్లా
సెల్.నం.8977412795
**

పెన్ను

మామూలుగానే కనిపిస్తుంది
సరైన సమయంలో శక్తిని చొపిస్తుంది
గత కాలపు చరితను
వింతగొలిపేలా గురుతు చేస్తుంది
వర్తమానం వక్రమార్గానికి
వెళ్లకుండా వారిస్తుంది
మూడు కాలాల ముచ్చట్లనేగాక
ముదముతో రచనలను రాయిస్తుంది
అధికార మదముతో
అవినీతి చేపలకంటకాగిన
అసుర రూపుల పాలిట
నీతిశరంలా మారుతుంది
కాలాన్ని తనవెంట నడిపిస్తుంది
కొత్త ఒరవడిని సృష్టిస్తుంది
ఉద్యమాలకు ఊపిరినందిస్తుంది
అవినీతి అక్రమాలనెదిరిస్తుంది
సామాన్యుల సమస్యలను చర్చిస్తుంది
జనహితమును కోరుకుంటుంది
కొత్త ఆలోచనలను రేపి
సామాజిక స్పృహ రగిలిస్తుంది
కరవాలం చేబడితే కదనరంగం
కలం చేబూనితే సమాజహితం

- నూజెట్టి రవీంద్రనాథ్, జగిత్యాల, సెల్.నం.9948748982
**
ప్రజ్ఞావంతుడు

మూసిన పెదవులు
శాంతిని కల్పిస్తాయి
చిరునవ్వుల పెదవులు
ప్రశాంతిని ప్రకల్పిస్తాయి
విప్పారిన పెదవులు
విప్లవాన్ని సృష్టిస్తాయి
కంపించే పెదవులు
ప్రకంపనలెన్నో కల్పిస్తాయి
అందుకే.. అందుకే..
పెదవులను మూసి ఉంచటమే
ప్రజ్ఞావంతుని అసలుసిసలైన లక్షణమే

- నాగినేని లీలాప్రసాద్
సెల్.నం.9247335387
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net