నెల్లూరు

అబ్బ! ఎంత జ్ఞానో! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆయన చాలా శక్తివంతమైన స్వామీజీ!’’ చెప్పాడు అరవింద్. సుతారంగా చెంపల మీద చేతులతో తట్టుకుంటూ.
‘‘ ఏ రకంగా?’’ అడిగాడు నవకాంత్.
‘‘ఆయన తన వద్దకు వచ్చే భక్తుల నుండి ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా వారి కోరికలు తీరుస్తాడు.. అంటే... డైరెక్టుగా తీరుస్తాడని కాదు. ఆయా కోర్కెలు నెరవేరాలని మన తరపున ఆయన దైవ ప్రార్థన చేస్తాడు..
ఊళ్లోకి కొత్తగా వచ్చిన ఆ స్వామీజీ గురించి అప్పటికే చాలామంది ద్వారా చాలాచాలా గొప్పగా విని వున్న నవకాంత్ కుతూహలంగా అడిగాడు.
‘‘ఒక భక్తుడు ఎన్ని కోర్కెలు కోరుకుంటే అన్నీ తీరుస్తాడా?’’
‘‘కాదు.. అన్నిటికన్నా మనకు ఏది ముఖ్యం అనుకుంటామో అలాంటి ఒకే ఒక్క కోరిక కోరుకోవాలి...’’చెప్పాడు అరవింద్ భక్తిగా కళ్లు మూస్తూ, తెరుస్తూ..
‘‘నువ్ వెళ్లి వచ్చావా ఆయన దగ్గరికి?’’
‘‘ ఓ.. మొనే్న వెళ్లొచ్చా...’’
‘‘నువ్ ఏం కోరుకున్నావ్? నెరవేరిందా అది?’’ కొలీగ్ వంక ఆసక్తిగా చూశాడు నవకాంత్.
‘‘ఇంకా లేదు... దానికి కొంత సమయం పడుతుంది..’’
‘‘ఎంత?’’
‘‘కనీసం ఓ నెల!’’
‘‘అలాగని ఆ స్వామిజీయే చెప్పారా?’’
‘‘చెప్పుకోదగింది కాదు.. ఐమీన్ అందరికీ చెప్పుకోదగింది కాదు’’ అరవింద్ అలా అంటుంటే - ‘‘కొంపదీసి వీడుగాని మేనేజర్‌కి పక్షవాతం రావాలని కోరుకోలేదు గదా!’’ అనిపించింది నవకాంత్‌కి.
వాళ్ల మేనేజరు ఛండశాసనుడు, అతనంటే వాళ్లాఫీసులో ఎవ్వరికీ గిట్టదు. ఈ శనిగాడు ఎప్పుడు పోతాడా? అని ఎదరుచూస్తుంటారంతా. అందుకే నవకాంత్‌కి అలా అనిపించింది.
క్షణం తర్వాత అరవింద్ వద్ద వున్న చనువుకొద్దీ అదేమాట పైక్కూడా అనేశాడు... అడిగేశాడు.
‘‘్ఛ..్ఛ! అంత మహిమగల స్వామిజీ వద్ద అలాంటి చచ్చుపుచ్చు కోరికెందుకు కోరుకుంటాను? నా జీవితానికి సంబంధించిన ఓ అతిముఖ్యమైన కోరిక కోరుకున్నాను...’’ అప్పటికీ ఆ కోరిక ఏమిటో చెప్పకుండానే అన్నాడు అరవింద్.
‘‘ఇంతకీ నువ్వు ఆయన్ని చూడ్డానికి వెళుతున్నావా, లేదా?’’ అతనే అడిగాడు క్షణం తర్వాత.
‘‘ఇంతమంది ఇంత ఇదిగా చెబుతుంటే వెళ్లకుండా ఎలా ఉంటాను? ఇవ్వాళే వెళుతున్నాను..సాయంత్రం..’’ చెప్పాడు నవకాంత్.
అరవింద్ ‘దాట్స్‌గుడ్’ అన్నట్టుగా చూశాడు.
---
సుఖప్రదానంద స్వామీజీ వారు బసచేసిన ఆ ప్రాంగణమంతా చాలా హడావుడిగా వుంది.
జనం క్యూకట్టి నిలబడి.. ఒక్కొక్కరుగా వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి... ఆయన వౌనంగా ఆశీర్వదించాక ఆ పక్కనే వున్న కొన్ని డబ్బాల వద్దకు వెళ్లి వాటిలో ఏదో ఒక దానిలో తమ కోరిక రాసున్న చీటీని వేసిపోతున్నారు. కోరిక చీటీని ఏ డబ్బాలో వేయాలో అక్కడున్న స్వామీజీ శిష్యులు సూచిస్తున్నారు భక్తులకి.
అక్కడున్న వాళ్లందరూ వయోజనులే.. చిన్నపిల్లలకు ఆ ప్రాంగణంలో ప్రవేశం లేదు.
నవకాంత్ కూడా ఆ క్యూలో ఉన్నాడిప్పుడు.
ఓ అరగంట శ్రమించాక అతనికి స్వామీజీ పాదస్పర్శా భాగ్యం లభించింది.
స్వామీజీ అతన్ని వౌనంగా ఆశీర్వదించి, ‘అదిగో ఆ డబ్బాల దగ్గరికి వెళ్లమన్నట్టుగా, చేత్తో సైగ చేయగా - ‘అలాగే’ అన్నట్టు తలాడించి అటుకేసి నడిచాడు నవకాంత్.
అతను తన జేబులోంచి తన కోరిక చీటీని బయటికి తీసి చేత్తో పట్టుకోగానే - ‘‘మీకు పెళ్లయ్యిందా?’’ అనడిగాడు స్వామీజీ శిష్యుల్లో ఒకడు - మొత్తం నలుగురున్నారు వాళ్లు.
‘‘అయ్యింది...’’ చెప్పాడు నవకాంత్.
‘‘అయితే, మీ చీటీని ఆ ఎర్రడబ్బాలో వెయ్యండి..’’ చెప్పాడు శిష్యుడు.
‘‘ఈ పచ్చ డబ్బాలో వేస్తే ఏం?’’ కుతూహలంగా అడిగాడు నవకాంత్.
‘‘ఇది పెళ్లికాని మగవాళ్లకు సంబంధించింది. ఆ పసుపుడబ్బాయేమో పెళ్లయిన స్ర్తిలకి సంబంధించింది.. ‘‘ఓపిగ్గా చెప్పాడా శిష్యుడు..అలవాటయిన ధోరణిలో.
‘‘ఇలా వేర్వేరు డబ్బాలు పెట్టడం దేనికి?’’ చీటీని ఇంకా అలాగే చేతబట్టుకుని అడిగాడు నవకాంత్.
‘‘ ఏమో? అదంతా స్వామి వారికే తెలుసు..’’ కాస్త విసుగ్గా చెప్పాడా శిష్యుడు.
‘‘మీకు తెలియదా?’’ అడిగాడు నవకాంత్ - తన గొంతులో వ్యంగ్యాన్ని అతను పసిగట్టకుండా!
‘‘ ఊ..హూ..’’ అడ్డంగా తలాడించాడు శిష్యుడు.
సరే అతన్ని మరింత విసిగించటం దేనికీలెమ్మని తన కోరిక చీటీని ఆ ఎర్రడబ్బాలో పడేసి వెళ్లిపోయాడు నవకాంత్.
ఆ సాయంత్రం భక్తులందరూ వెళ్లిపోయాక -
సుఖప్రదానందస్వామీజీ వారు పచ్చడబ్బా ముందు నిలబడి ఇలా ప్రార్థించాడు. ‘‘్భగవాన్! ఈ డబ్బాలో చీటీలు వేసిన వాళ్లందరూ మంచి భార్య లభించాలని కోరుకుంటున్నారు. వీలైతే వాళ్ల కోరికను నెరవేర్చు స్వామీ!
దరిమిలా నీలిరంగు డబ్బా ముందు నిలబడి.. ఇలా ప్రార్థించాడు. ‘‘్భగవాన్! ఈ డబ్బాలో చీటీలు వేసిన వాళ్లందరూ మంచి భర్త లభించాలని కోరుకుంటున్నాడు. వీలయితే వాళ్ల కోరికను నెరవేర్చు స్వామీ!’’
ఆ తర్వాత ఆయన పసుపు డబ్బానీ, ఎర్రడబ్బానీ పట్టించుకోకుండా తన విశ్రాంతిగదికేసి వెళ్లిపోతుంటే - ఇందాక నవకాంత్‌తో మాట్లాడిన శిష్యుడు అడిగాడాయన్ని.
‘‘ ఆ రెండు డబ్బాల ముందూ నిలబడి ప్రార్థన చెయ్యలేదేంటి స్వామీ?’’
దానికి స్వామీజీ వారు చిద్విలాసంగా నవ్వి ఇలా చెప్పారు. ‘‘నాయనా! పసుపు డబ్బా పెళ్లయిన స్ర్తిలకు సంబంధించింది. అందులో వున్న అన్ని చీటీల్లోనూ ‘నా భర్త ఎప్పటికీ ఇలాగే నా చెప్పుచేతుల్లో ఉండేలా చూడు స్వామీ!’ అనే కోరిక ఉంటుంది. అది నేను ప్రార్థన చెయ్యకపోయినా నెరవేరే కోరిక కాబట్టి ఆ డబ్బాని వదిలేశాను.
‘‘ మరి ఎర్రడబ్బా?’’
‘‘అది పెళ్లయిన మగవాళ్లకి సంబంధించింది. అందులో వున్న అన్ని చీటీల్లోనూ నా భార్యకు ఎప్పటికయినా సరే మంచిబుద్ధి ప్రసాదించుస్వామీ! అనే కోరిక ఉంటుంది. అది భగవంతుడు కూడా తీర్చలేని కోరిక కాబట్టి ఆ డబ్బానీ వదిలేశాను..’’ చెప్పి సుఖప్రదానంద స్వామీజీ వారు ముందుకు సాగిపోతుంటే-
‘అబ్బ! ఎంత జ్ఞాని!’ అనుకున్నాడు శిష్యుడు - కళ్లని ఆల్చిప్పల్లా టపటపలాడించుకుంటూ-
*

- కోలపల్లి ఈశ్వర్ చరవాణి : 8008057571