దక్షిన తెలంగాణ

కవిత్వంలో వాదాలు, ఇజాలు అవసరమే ( అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవిత్వంలో, రచనల్లో వాదాలు, ఇజాలు అవసరమేనని గట్టిగా విశ్వసించే ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు మెదక్ జిల్లా (ఇప్పటి సిద్ధిపేట జిల్లా) రావురూకుల గ్రామానికి చెందిన వారు.. 1974 నుండి నిరంతరం కవిత్వాన్ని పండిస్తున్న ఆయన..‘దివిటి’, ‘వయోలిన్ రాగమో వసంత మేఘమో’, ‘సందర్భం’, ‘కవ్వం’, ‘దహన కావ్యం’ దీర్ఘకవిత, ‘పీఠభూమి’, ‘వెనె్నల బలపం’, ‘రావు రూకుల’ మరియు ‘తెలంగాణ రథం’ కవితా సంపుటాలను వెలువరించి సాహితీ లోకంలో సమర్థ కవిగా గుర్తింపు పొందుతున్నారు. కవిత్వం నీటి బుడగలాగా వుండొద్దనీ.. అది ఓ ప్రవాహంలా పారుతూ ఉండాలని ఆకాంక్షించే ఆయన వివిధ సంస్థల నుండి అనేక అవార్డులను అందుకున్నారు. తెలంగాణ ఉద్యమానికి సైతం తమ కవిత్వం ద్వారా ఊపిరులూదారు..రచనలు నేల విడిచి సాము చేయరాదని భావించే ఆయన వృత్తిరీత్యా తెలుగు ఉపన్యాసకులు. ‘మెరుపు’ ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే..

* మీలోని కవికి ప్రేరణ ఏంటి?
మధ్యతరగతి దిగువ కుటుంబంలో జన్మించాను. కష్టనష్టాలను ఓర్చుకుంటూ చదువుసాగింది. ఒకానొక దశలో డిగ్రీ తదనంతరం చదువు ఆగిపోయింది. అలా డిగ్రీ వరకూ ఆగి, కొనసాగుతూ వచ్చింది. ఆ కష్టాల్లోంచి ఆ బాధల్లోంచి ప్రేరణ పొందే కవిత్వం రాయడానికి కారణమైంది.

* మీకు స్ఫూర్తినిచ్చే కవులు?
డాక్టర్ సి.నారాయణ రెడ్డి, వేముగంటి నర్సింహాచార్యులు, ఉమాపతి పద్మనాభశర్మ, శివారెడ్డి, దేవీప్రియ, దిగంబర, విప్లవ కవులు తదితరులు నాకు స్ఫూర్తినిచ్చే కవులు!

* మంచి కవిత్వానికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి?
ఒక నియమమైన ఒక నిబద్ధత కలిగిన కవిత్వమే గొప్ప కవిత్వం. వస్తువు నిర్దిష్టంగా ఉండి శిల్పం సమపాళ్లల్లో పోషింపబడాలి. శిల్పం ఎక్కువైనా వస్తువెక్కువైనా బండికి వలపటదాపట రెండెడ్ల లాగా నడుస్తూ పోతుండాలి! అదే కవిత్వానికి ఉండే మంచి లక్షణమని నా అభిప్రాయం.

* మీ మొట్టమొదటి రచన?
అచ్చుకాని నా మొదటి రచనల్లో ఒకటి ‘మా మిత్రద్వయం’ వచన కవిత, రెండు ఉత్పలమాల చివరి రెండు పాదాలు - ‘మా మిత్రద్వయం’ సిద్ధిపేటలో జరిగిన కవి సమ్మేళనంలో చదివింది. అచ్చయిన మొట్టమొదటి కవిత మాత్రం 1974 ఫిబ్రవరిలో ‘మాతృభూమి’ అనే వార పత్రికలో ‘అమరుడు’ అనే కవిత, ఘంటసాల పాటలు నాకు చాలా ఇష్టం. ఆయన చనిపోయిననాడు రేడియో వార్తలు విని కదిలిపోయి అలవోకగా ఆయన మీద రాసిన కవిత ‘అమరుడు’.

* ఇప్పుడొస్తున్న వచన కవితపై మీ అభిప్రాయం?
భిన్న ప్రక్రియల్లో భిన్న రూపాల్లో వచన కవిత వస్తోంది. ఎన్ని రూపాల్లో వచ్చినా మనసుకు తాకేట్టు ఉండాలన్నదే నా అభిప్రాయం. పాఠకులకు పరీక్ష పెట్టే విధంగా ఉండకూడదనేది నా అభిప్రాయం. ఎన్ని ప్రక్రియల్లో వచ్చినా కవిత నిలబడ గలగాలి. సమాజానికి ప్రయోజనకారిగా ఉండాలి. నీటి బుడగల్లాగా వచ్చేది కవిత్వం కాదు. ఒక ప్రవాహంలా కవిత్వం పారుతూ ఉండాలి.

* నేటి తరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే ఏం చేయాలి?
చాలా మంచి ప్రశ్న. ఈ ప్రశ్న కవుల్ని, రచయితల్ని, సాహితీవేత్తల్ని అడగాల్సిన ప్రశ్న. అందరూ కలిసి ఆలోచించాల్సిన ప్రశ్న. అందరు కలిసి ఆలోచించే తీరిక లేకుండాపోతోంది సాహితీవేత్తలకు. అందుకే నేటితరం ఇతరేతర మార్గాలవైపు మళ్లుతున్నారు. నా మట్టుకు నేను చెప్పేదేమంటే సాహిత్య వాతావరణం లేకపోవటం, మీడియా బలమైంది కాబట్టి యువతరాన్ని లాక్కెల్లటం, అయితే చెప్పొచ్చు, సాహిత్యం మళ్లించటానికి ఎన్నో మార్గాలు, కాని ఆచరణ కష్టం. అలా అని ఊరుకోవద్దు. ప్రతి పాఠశాలలో ప్రతి కాలేజీలో ప్రైవేటు గాని, గవర్నమెంటు గాని సాహిత్య పోటీలు తప్పనిసరియై పెట్టాలి. మాతృభాషపట్ల అవగాహన పెంచాలి. వక్తృత్వ, వ్యాసరచన పోటీలు పెట్టాలి.
* కవిత్వంలో రచనల్లో వాదాలు, ఇజాలు అవసరమంటారా?
నా వరకైతే అవసరమనే అంటాను. ఎందుకంటే కవిత్వం నేల విడిచిసాము చేస్తుంది. ప్రయోజనకారి కాని కవిత్వమెందుకు? వినేది అనుభూతి అవసరం గాని, రాసేది అనుభూతితో పాటు ప్రేరేపించటం, ఆలోచించటమో కవిత్వానికి ఉంటేనే ప్రయోజనం.

* ఇప్పుడొస్తున్న పత్రికల్లో సాహిత్యానికి ఇస్తున్న ప్రాధాన్యతపై
మీ అభిప్రాయం?
దాదాపు నేడు అన్ని పత్రికలు సాహిత్యానికి సముచిత ప్రాధాన్యతనిస్తున్నాయి! పద్యకృతులు అనుకున్నంత వెలువడటం లేదు కారణం ఏమంటారు. పద్యకృతులు వెలువడకపోవడానికి ఛందస్సు గురించి ప్రయత్నం చేయకపోవడమే కారణం. పైగా గతంలో హైస్కూల్లో అందరు పండితులకు పద్యాలు రాయకపోయినా ఛందస్సు మీద పట్టు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

* మరుగున పడ్డ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి
రావాలంటే ఏమి చేయాలి?
పరిశోధకులు ముందుకు రావాలి. పేరుకోసం డాక్టర్ల బిరుదుల కోసం కాకుండా సాహిత్య చరిత్ర తవ్వితీసే ఓపిక, నిపుణత కావాలి. కొంత మంది తప్ప ఇన్‌స్టంట్ కాఫి లాగా అలా పరిశోధిస్తే ఇలా పేరు రావాలనే చూస్తున్నారు తప్ప లోతుకు దిగి అధ్యయనం చేయటం లేదు. కానీ శోధించి సాధించే పరిశోధకులు లేకపోలేదు. ఉన్నారు. వెలుగులోకి తెస్తారు.

* సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
న్యాయ నిర్ణేతలు న్యాయంగా వ్యవహరించినప్పుడు పురస్కారాలకు విలువ పెరుగుతుంది.

* ఇప్పటి కవులు, రచయితలకు మార్గదర్శనం చేయడానికి సాహితీ సంస్థల నుండి మీరు ఆశిస్తున్న కార్యక్రమాలు?
సాహితీ సంస్థలు వివిధ ప్రక్రియల్లో సమావేశాలను ఏర్పరచాలి! ప్రాచీన కవిత్వాన్ని, ఆధునిక కవిత్వాన్ని వాటి ప్రయోజనాన్ని, అవసరం ఎంత ఉందో తెలుసుకోవాలి. సాహితీ సంస్థలు గ్రూపు సంస్థలుగా మారిపోరాదు.
ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు?
ప్రాచీన కవిత్వం, సాహిత్యం, ఆధునిక కవిత్వం, సాహిత్యం క్షుణ్ణంగా చదువుకోవాలి. నేడు వస్తున్న వివిధ రకాల వాదాల గురించి గాని, ఇజాల గురించి పూర్తి అవగాహన చేసుకోవాలి. వస్తువుపరంగా రూపపరంగా ఏదీ తక్కువ కాకుండా తను రచిస్తున్న ఏ ప్రక్రియ ఐనప్పటికీ సమపాళ్లల్లో పోషించాలి. అయితే.. సామాజిక స్పృహతో కూడుకున్న చైతన్యవంతమైన విప్లవాత్మకమైన రచనవైపే మొగ్గు చూపాలనేదే నా అభిప్రాయం.

**

కందుకూరి శ్రీరాములు
503, సుహార్తి నెస్టు,
16-11-1/ఎస్/డి/2-3
సలీంనగర్, మలక్‌పేట,
హైదరాబాద్-36
సెల్.నం.9440119245
**

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544