రాజమండ్రి

చరిత్రకు చిగురు తొడిగే ‘చలసాని లేఖలు’ (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
ఎస్‌ఎన్ శర్మ,
జి-4, మానస నెస్ట్,
ప్లాట్ 1960-61,
కాకతీయ హిల్స్, ప్రగతినగర్,
హైదరాబాద్ -90,
సెల్ : 92920 55531,
పేజీలు -91
వెల - రూ.80/-
**

‘ఇంటికెళ్లగానే ఉత్తరం రాయండి.. ఎలా చేరారో’ అంటూ అతిథులు ఇంటి నుంచి సాగనంపేటప్పుడు కొన్ని అర్థింపులుండేవి.. దశాబ్దన్నరం వరకూ కుశలం తెలుసుకునేందుకు కుటుంబీకుల సంగతులు ఆరా తీయటానికి ఉత్తరాలు పెద్ద పాత్ర పోషించాయి. కుటుంబ చరిత్రలకు తార్కాణం ఉత్తరాలు. వ్యక్తుల మధ్య, సన్నిహితుల మధ్య అని నడిచినా గ్రామ, దేశ రాజకీయాలతో పాటు అంతర్జాతీయ పరిస్థితులు వాటిలో చోటుచేసుకునేవి. మనిషి అభిప్రాయాలే కాదు.. మనసు పొరల్లోని అభిమానాలు ఉత్తరాల్లో గోచరించేవి.
మనిషి యోగ క్షేమాలకు, యాతనా భరిత విషయాలకు ఉత్తర ప్రత్యుత్తరాలు ఎంతగానో తోడ్పేడేవి. కవులు, కళాకారులు, విద్యార్థులు, దేశాధినేతలు, రాజకీయ నేతలు ఒకరేమిటి ఒకరి భావాలు ఒకరు పంచుకునే వీలు కల్పించేవి. కుటుంబాల్లో సడలని ధైర్యాన్ని, మనో నిబ్బరాన్నిచ్చేవి. రాజకీయ కుటుంబాల్లో అయితే కర్తవ్యాన్ని, భావి ప్రణాళికల అవసరాన్ని తెలిపేవి.
ఉత్తరం అంటే అంతరంగ ఆవిష్కరణలకు ఆలవాలం అన్నమాట. ఇద్దరు సాహితీవేత్తల మధ్య నడిచిన క్రమం ‘చలసాని లేఖలు’ పుస్తకం లిఖించిన ఆలోచనల పుష్పం. ఎవరు చూసినా, తెరిచినా ఆ పుస్తకం పరిమళించాలన్న ధ్యేయంతో చలసాని తనకు రాసిన లేఖల్ని సన్నిధానం నరసింహశర్మ పుస్తకమే ‘చలసాని లేఖలు’. ఇవి కుటుంబ అవసరార్థితో సంక్షేమ సారానితో కాదు.. సాహితీ సుక్షేత్రంలో విత్తులు వేసిన ఆనవాళ్లు. సరికొత్త సాహితీ సంపదకు నకళ్లు.
మొఖం చూసి, చేతి రేఖలు చూసి మనిషి గుణాలు అంచనా వేయడం కాదు. అక్షరాల పోగుల్లోంచి అనితర సాధ్యమైన సాక్ష్యాలు ఈ లేఖలు. చలసాని ప్రసాదరావు అనగానే శ్రీశ్రీయే గుర్తొచ్చే చలన శీలి. శ్రీశ్రీ అముద్రిత సాహిత్యాన్నంతా ఓ చోట చేర్చి గ్రంథస్థం చేసిన గొప్ప మనిషి. అలాగే కొడవటిగంటి కుటుంబరావు రచనలను ఓ దరికి చేర్చి తెలుగు ప్రజలకు కానుకగా అందించిన అరుదైన శక్తి. చలసానికి ఏమికావాలో అడిగిందే తడవుగా గౌతమి గ్రంథాలయం ఉద్యోగిగా కాక సన్నిధానం ఆయా పుస్తక ప్రతుల్ని పంపించడం ఆ క్రమంలో జరిగిన భావ పరంపర సంగతులే ఈ లేఖలు.
ముందుతరం అందించిన సాహిత్యాన్ని తరువాత తరానికి అందించాలనే లక్ష్యంతో చలసాని ప్రసాద్ చేసిన తపన ఈ ఉత్తరాల్లో ప్రత్యక్ష పరుస్తాయి. సన్నిధానం గారికి చలసాని వారికి ఒక్క సాహిత్య సంబంధమే కాకుండా కుటుంబ సంబంధాన్ని, స్నేహ సంబంధాన్ని ఎంత గాఢంగా నెరిపారో ఉత్తరాలు చదివితే తెలుస్తుంది. రాజమండ్రి గౌతమి గ్రంథాలయంలో అర్ధ శతాబ్ధం పాటు గ్రంథాలయ ఉద్యోగిగా పనిచేయడంలో అపార సాహిత్య అపేక్ష ఉంది. అదే అందరితో ముఖ్యంగా కవులు, రచయతలు, మేథావులు, పరిశోధకులతో అనుబంధం ఏర్పడింది. సన్నిధానం పాత్ర చలసాని తపన మహాత్కార్యానికి దారితీసింది. పుస్తక సంపాదకుడు మలసాని శ్రీనివాస్ అన్నట్టు ‘శ్రీశ్రీ, కొడవటిగంటి కుటుంబరావులు రాసిన సాహిత్యాన్నంతటిని శ్రీశ్రీ, కొ.కు. సాహిత్య సర్వస్వాలుగా ప్రచురించాలన్న ఒక మహా కార్యాన్ని భుజాలకెత్తుకున్న చలసాని ప్రసాద్ గారికి సహజంగానే సన్నిధానం శర్మగారితో సాన్నిహిత్యం ఏర్పడింది’ అంటారు. అలాంటి ఆలోచన అంటూ తొడగటానికి జరిగిన ఉత్తర సంభాషణే ఈ లేఖలు. ఇంతకు ముంధు సన్నిధానం వారు ‘ఆరుద్ర లేఖలు’ పేర ఓ పుస్తకం తీసుకొచ్చారు. పుస్తకం ముందు మాటలో జయధీర్ తిరుమలరావుగారు ఓ మాట అంటారు. ‘ఆరుద్ర లేఖలు’ పుస్తకం పరిశోధనా క్షేత్రానికి సంబంధించింది. చలసాని లేఖలు సాహిత్యరంగానికి సంబంధించినవి’ అంటారు. ప్రసాద్, శర్మల మధ్య శ్రీశ్రీ కూడా అక్షరాలలో కనుపిస్తాడంటాడు. అయితే శర్మ పడ్డ శ్రమంతా చలసాని కోసమే కాని శ్రీశ్రీ కోసం కాదని తేల్చేస్తారు. ఉత్తరాలు సామాజికం అయ్యాయి వీరి నడుమ కనుకనే వాటిని బహిర్గత పరిచి లోకదర్శనం చేశారు. శ్రీశ్రీ సంపుటాల నిర్మాణం కోసం దాగిన శ్రమ ఇక్కడ కొంత కనిపిస్తుంది. అలాగే ఇంకా ఎంతోమందిని ఈ పనిలో వినియోగించుకున్న వైనం కన్పిస్తుంది.
ఇక్కడ చలసాని వారు సన్నిధానం వారికి రాసిన లేఖలతో విశదమైపోరు. కాకరాల రాసిన పనె్నండున్నర పేజీలు చదివితే చాలా అర్థం అవుతారు. రాజకీయ జీవితాన్ని సామాజిక జీవితాన్ని చక్కగా ఆవిష్కరింపజేశారు. ఈ పేజీల్లోని విషయాన్ని అవగతం చేసుకుంటేనే లేఖల ‘సారం’ ఇట్టే దొరుకుతుంది. కమ్యూనిస్టు పార్టీ విషయాలు తెలీని వాళ్లకు కొంత అసంగతమవుతాయి. ఆ లోటును తీర్చటానికి ఈ పెద్ద వ్యాసం కొరతను పూడుస్తుంది. ‘చలసాని ప్రసాదుకి ఆధునిక తెలుగు సాహిత్యం మీద చాలా లోతైన పరిశీలన ఉంది. అందులో చలం, గోపిచంద్, కొ.కు., శ్రీశ్రీ సాహిత్యాలు కరతలామలకాలు. ఇక కొ.కు. జగత్పరిశీలన మీద, శ్రీశ్రీ కవిత్వం మీద అపారమైన సరిగౌరవం. అనంతమైన సాగరంలో మునిగి తేలుతూ తనకి ప్రియమైన సాహిత్య ‘గంగల్లో’ ఈదులాడడం అతని దినచర్య’ అని కాకరాల కితాబునివ్వడం వెనుక చలసాని తాత్విక దృక్పథాన్ని అవగాహన పరిచింది.
1970 జూలై 4న విప్లవ రచయతల సంఘం శ్రీశ్రీ అధ్యక్షతన ఆవిర్భవిస్తే దాని వెనుక ఉండి నలభై ఆరేళ్ల విప్లవోద్యమంలో వివిధ రూపాల్లో సాహిత్యాన్ని సర్వోత్కృష్టం చేయడం అంటే మాటలు కాదు.
శాశ్వత చిరునామా గ్రంథం సన్నిధానం అంటారు సతీష్ చందర్. ఏ పుస్తకం ఎక్కడుందో అనే కాదు..ఏ పుస్తకంలో ఏముంధో కూడా చెప్పగల శర్మగార్కి చలసాని రాసిన ప్రత్యుత్తరాలే ప్రచురించారు.
ఆయన రాసిన ఉత్తరాలూ ముద్రించి ఉంటే మరింత బాగుండేది. సాహిత్య అభిమానులు కాక సాహిత్యకారులకు చారిత్రక ఆధారాలు దొరికేవి. చరిత్ర అధ్యయనపరులకు ముడి సరుకు లభించేది.

- రవికాంత్, 96424 89244
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- రవికాంత్, 96424 89244