రాజమండ్రి

బాహుబలి! ( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంటి ముందు నీరజమ్మగారు వడియాలు, ఊర మిరపగాయలు ఆరబెడుతున్నారు. కాకులు రాకుండా క్యాట్‌బాల్ పెట్టి లోనకి వస్తుండగా కశ్యప్ గావుకేక వినబడింది.
‘అమ్మా! నేను ఇది లాగలేకపోతున్నాను’
‘ఏరా! అక్క పురిటికి వస్తుంది. నీవది ఊడదీయ లేకపోతే ఇంకా అది ఉతికి నీలిమందు బెట్టి ఆరవేసి ఉండచుట్టాలి. ఇంక నేనెంత కష్టపడాలి?’
‘ఏమైనా భారతంలో దుశ్శాసనుడే హీరో. బాహుబలి విసుగ్గా లాగుతూ అన్నాడు’.
‘మండినట్టే ఉంది తెలివి పొంతనలేని మాటలు నీవూనూ’
‘అవునమ్మా ఈ నవారుని నేనూడదీయలేకపోతున్నాను, అన్ని వేల చీరలు లాగాడంటే ఎంత శక్తి ఉండి ఉండాలి?’ కశ్యప్ నుదుట అంత చలిలోనూ చమటలు పట్టాయి.
‘ఆగరా బాబు మహానటుడు ఎన్‌టిఆర్ పుణ్యమా అని ప్రతి నాయకులను, నాయకులుగా ఇష్టపడే స్థితికి వచ్చాం. దయచేసి నువ్వు దుశ్శాసనుడిని కూడా హీరో చేసి మమ్మల్ని చంపకు’ నీరజమ్మ నవ్వుతూ అన్నది.
‘ఇంకా ఈ మంచాలేంటే? చక్కగా డబుల్‌కాట్స్, సింగల్ కాట్స్ వచ్చాక.. అది హాయి కదా’
‘అవున్రా బట్టలు తడిపితే పరుపుని ఎండలో పడేసి అదే మళ్లీ వేసుకుని అపరిశుభ్రంగా బ్రతకాలంటావ్’
హమ్మయ్యా! నాకు రెండు గంటలు పట్టింది. నేను ఇప్పుడే చెబుతున్నాను. అల్లడం విషయంలో నా సాయం ఖచ్చితంగా ఉండదు వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పాడు.
‘ఆ సంగతి అప్పుడు చూద్దాంలే!’ తేలిగ్గా నవ్వేసింది నీరజమ్మ.
విషయమేమిటంటే కశ్యప్ చెల్లెలు సాహితి నెలలు నిండి మరుసటిరోజు ప్రసవించటానికి పుట్టింటికి రాబోతుంది. అటక మీదున్న నవారు మంచం తీసి ఉతికి తను వచ్చేలోగా అల్లేయాలని నీరజమ్మ తపన. పూర్వం నులక మంచాలు నవారు మంచాలు వాడేవారని భవిష్యత్ తరానికి మ్యూజియంలో పెట్టి చూపాలేమో!! అంటుంటారావిడ. నీరజమ్మ నవారు అల్లడం నులక మంచం అల్లడం అన్నీ వాళ్ల బామ్మ దగ్గర నేర్చుకుంది. పరిశుభ్రత అంటే ప్రాణం పెడుతుంది. రానున్న చంటి బిడ్డకు కావలసిన కాటన్ చీరలు, కొన్ని బట్టలు చాకలితో ఉతికించి ఆమె పెట్టిలో ఇప్పటికే సర్దేశారు. మంచం ఊడదీయమన్నందుకు కశ్యప్ యొక్క ఆగడం చూసి ఆమె చిరునవ్వు నవ్వుకుంటుంది. ఇంట్లో ఏ పనైనా ఆమె స్వయంగా చేసుకుంటుంది. ఏదీ ఎవరి సాయం అడగదు. వర్క్‌షేర్ చేయవచ్చుగా అంటాడు భర్త భరద్వాజ్. ఇప్పుడు కూడా కశ్యప్‌ని ఆమె ఏమీ అడగలేదు. తల్లి మీద ప్రేమతో తనే ఊడదీస్తూ ఈ హఠం చేస్తూ డైలాగ్స్ విసురుతున్నాడు.
మరునాడు నీరజమ్మగారు నవారు ఉండలు చుట్టి అల్లడం ప్రారంభించింది. కశ్యప్ డ్రాయింగ్ రూమ్‌లో ఏవో జర్నల్స్ తిరగేస్తున్నాడు. ఇంటెడు చాకిరి చేసి కూతురు వచ్చేలోపు ఆ మంచం అల్లేయాలని తాపత్రయ పడుతుంది. పని భారం వలన ఆమెకు నీరసంతో మూలుగు వస్తుంది. కశ్యప్ చదువుకోలేకపోతున్నాడు. దగ్గరకొచ్చి ఉండ చేతిలోకి తీసుకున్నాడు.
‘అమ్మా ఇటివ్వు! అరె నీకు చేతకాదురా’
‘ఈ బాహుబలికే చేతకాదంటివా? ఏమంటివి ఏమంటివి? ఎంత మాట ఎంతమాట! ఇది క్షాత్ర పరీక్షయేగాని క్షత్రియ పరీక్ష కాదు సుమా!’
‘సుమా! ఎవర్రా’ బాహుబలి నిన్న దుశ్శాసనుడన్నావ్? అంతలో ఈ మార్పు ఏమిటి?
‘నవారు మంచం ఊడదీసి ఎవరు అల్లుతారో వారే బాహుబలి’
‘నీ మొహమేంగాదు అంత అలసటలో ఆమె పకపకా నవ్వింది’
‘అవునమ్మా మగాళ్లయితే బాహుబలి అన్నాం. మరి నీవు ఎన్నో ఏళ్లుగా అల్లుతున్నావు కదా! నినే్నం అనాలి’.
‘నువ్వే చెప్పు అంది’.
‘బాహుబలశాలిని’ అనచ్చేమొ.
‘పోరా! నోరెపుడూ ఫ్లోర్ మిల్‌లా ఆడుతూనే ఉంటుంది నీకు.
అయ్యో ఏంట్రా ఒకటి పైకి మరొటి కిందకి అల్లాలి. లేకపోతే మంచిది కాదు.
‘ఇదిగో మొనే్నమొ మంగళ, బుధవారాలు అల్లకూడదన్నావ్. ఇప్పుడేమో పైకి, కిందకి రావాలని షరతు పెడుతున్నావ్’ ఇదేం బాలేదు.
‘నిజం రా! అలా అల్లటం మంచిది కాదు. పో బాబు నీవెళ్లి చదువుకో’ నేనే అల్లుకుంటా ఇలా డబుల్ వర్క్ నేను చేయలేను.
‘హెల్ప్ చేస్తామంటే వద్దనే అమ్మను నినే్న చూశాను’, ఈ పెద్దోళ్లున్నారే... అని ఉదయ్‌కిరణ్‌లా మాట్లాడటం మొదలుపెట్టాడు.
‘మాటలు బాగానే నేర్చావురా! ఆమె మురిపెంగా కశ్యప్ నెత్తిపైన మొట్టింది.
ఆఫీస్ నుండే భరద్వాజ్ వచ్చాడు. నెమ్మదిగా లేచి షింక్ దగ్గర చేతులు కడుక్కుని భర్తకు ఫ్రిజ్ వాటర్ ఇచ్చింది. భార్యవైపు అభినందన పూర్వకంగా చూశాడు. ఎంత పనిలో ఉన్నా ఆమె భర్తను శ్రద్ధగా చూసుకుంటుంది.
హాట్ ప్యాక్‌లో పెట్టిన జీడిపప్పు ఉప్మా ఆయనకిచ్చి పక్కన నిమ్మబద్ద పెట్టి స్పూన్ వేసి ఇచ్చింది.
‘ఏంటోయ్! ఈరోజు స్పెషల్! ఏమీ లేదండి. మంచం అల్లేటప్పటికీ వంట లేటవుతుందనీ..’
‘అంటే మళ్లీ అదనపు శ్రమన్న మాట. ఏ ఫ్రూట్సో తిని టీ తాగే వాడిని కదా!’
‘ఫ్రూట్స్‌కి కడుపేం నిండుతుందండీ’
‘అమ్మా! నాక్కూడా నీ అంత మంచమ్మాయి భార్యగా రావాలని ఆశీర్వదించు’
‘ఏడ్చావ్! ఇప్పుడు నీకు పెళ్లికి తొందరేమొచ్చింది. అక్కకు రెండు పురుళ్లు పోసిగాని నీ పెళ్లి విషయం ఎత్తను’ చిలిపిగా అంది నీరజమ్మ
‘అప్పటికల్లా నాకు ముప్ఫై వచ్చేస్తాయి’ గోముగా అన్నాడు.
‘ఆ వస్తే ఏమిటట? ఇంకా చిలిపిగా అన్నాడు భరద్వాజ్.
‘ముప్ఫై ఏళ్లు వచ్చాక పై బట్టా, కింద పొట్టా తప్ప మరేం మిగలవు’ నవారు ఉండని కాలుతో తన్నుతూ వెళ్లిపోయాడు డ్రాయింగ్ రూమ్‌లోకి.

ఇద్దరూ పకపకా నవ్వారు. టిఫిన్ తినేసి భరద్వాజ్ సాయం చేస్తుంటే నీరజమ్మ మంచం అల్లేసింది. కశ్యప్‌కి ప్రస్తుతం ఇరవై ఆరేళ్లు ఉద్యోగం కూడా వచ్చేసింది. అతడు క్యాజువల్‌గా అన్న మాట ఇద్దరిలోనూ కలవరం రేపింది. మధ్యతరగతి గుమాస్తా భరద్వాజ్. పెళ్లికి చేసిన అప్పులు ఇంకా తీరలేదు. బంగారమంతా బ్యాంకులోనే ఉంది. మరలా సీమంతం ఖర్చు, పురిటి ఖర్చు, తరువాత పిల్లవాడికి పెట్టే బంగారం, అన్నప్రాశన ఇవన్నీ ఇద్దరికీ మనసులో మెదిలాయి. నిజంగా కొడుకు స్నేహితులందరికీ పెళ్లిళ్లయ్యాయి. నీరజమ్మ అల్లడం పూర్తయ్యాక నడుంవాల్చి చటుక్కున లేచింది. కొడుకు రూమ్‌లోకెళ్లింది.
‘ఏంటమ్మా! కాసేపు పడుకోలేకపోయావా?’
కర్చ్ఫితో అమ్మ నుదుటి చెమట తుడుస్తూ అన్నాడు.
‘అది కాదురా అని ఏదో చెప్పాలని సంశయిస్తూ పైటకొంగును చూపుడు వేలుకు చుడుతుంది’.
‘ఏంటి?మా కూర్చో బెడ్‌పై కూర్చోబెట్టి ప్రేమగా ఆమె నుదుటి పైన ముంగురులు వెనక్కి నెడుతూ అన్నాడు’.
‘నీ దృష్టిలో ఎవరైనా అమ్మాయుంటే నీకు పెళ్లి చేసేస్తాం రా చెప్పు’ మా అప్పులవి ఎప్పుడూ ఉన్నవే. నీపై రుద్దటం కరెక్టుకాదు, మీరు హ్యాపిగా ఉండండ్రా ఆమె గొంతు గాద్గదికంగా మారింది.
‘అమ్మా నీవెప్పుడూ ప్రతీదీ సీరియస్‌గా తీసుకుంటావ్, నేనెవరినమ్మా! నీ కొడుకుని కదా! మా అప్పులంటున్నావేంటి? మన అప్పులమ్మ. ఈ శరీరం, ఈ మనసు మీరిచ్చినేనమ్మా. నా జీవితం ఉన్నంతవరకూ సుఖసంతోషాలే కాదు కష్టనష్టాలు కూడా నేనే భరిస్తాను. ఏదో సరదాగా జోక్ బాగుందని అన్నాను. మీ ఇద్దరికీ కష్టం కలిగితే నన్ను మన్నించండి. మీ బరువు బాధ్యతలన్నీ నా భుజస్కంధాలపై పెట్టి మీరు విశ్రాంతి తీసుకోండి. ఇక్కడ ఉంది ఎవరు? ‘దిగ్రేట్ మహర్షి కశ్యప్ నాటకీయంగా అన్నాడు.
భుజస్కంధాలపై పెట్టమనే నీవేరా మా నిజమైన బాహుబలివి అని నీరజమ్మ దగ్గరకు భరద్వాజ్ వచ్చి కొడుకుని భార్య రెండు చేతులతో దగ్గరకు చేర్చుకుని నుదుటిపై ముద్దుపెట్టుకున్నాడు ప్రేమగా.

- సుధా శశిరేఖ
సెల్: 9441599321
**

పుస్తక సమీక్ష
సామాజిక చైతన్యమే కవిత్వ ప్రతిబింబం

కవిత్వం రాయడానికి వయసుతో సంబంధం లేదు. ఈ సృజనాత్మకత సహజంగా రావాలి. రాటుదేలిన ఊహాశక్తి అక్షరాలలో ప్రతిబింబించాలి. ఇలా రూపుదిద్దుకున్నదే వర్తమాన కవిత్వం. వచనంలో వ్యక్తీకరించడానికి తగినంత అనుభవసారాన్ని ఆకళింపు చేసుకోవాలి. ఈ ప్రయత్నం ఎవరైనా చెయ్యొచ్చును. కానీ బాల్యపు ఛాయలు వదలక ముందే కలాన్ని పట్టుకుని దృశ్యాల్ని చిత్రీకరిస్తుంటే ఆ నేర్పరితనమే వేరు. సుకుమారపు భావాలను సున్నితంగా తడిమి సుతిమెత్తని ఆలోచనలకు బీజప్రాయమైన పునాది వేస్తుంది. ఈ ప్రయత్నం భవిష్యత్తు తలుపులు తెరిచి సంఘర్షణ పూరితమైన సామాజిక చైతన్యానికి పురిగొల్పుతుంది. అలాంటి తడుములాట లోంచి వెలుగు చూసినదే చిన్నారి కూరెళ్ళ శ్రీశ్రేయ కవిత్వం ‘ఎంత బాగుంటుందో’. దశాబ్ద క్రితం మొదలుపెట్టిన కవిత్వ రచనలో తనదైన సొంతశైలి, భాష, వస్తువు దర్శనమిస్తాయి. లేలేత భావకుసుమాలతో పల్లవించి, వర్తమాన సమాజాన్ని నిజాయితీతో దర్శించి, కవిత్వమయం చేస్తుంది. 32 కవితల సమాహారంతో పలు కవితా వస్తువులకి ఊపిరి పోస్తుంది.
‘ముసలి పిక్కల్ని ఓల్డేజ్ హోమ్‌లకు
పసిపిక్కల్ని చైల్డ్ కేర్‌సెంటర్లకు
సంతకి తీసుకెళుతున్న కూరగాయల్లా మాటలతో సహా విసిరేస్తుంటే’ అని ‘సపోటా పిక్కలు’ కవితలో ఎద్దేవా చేస్తుంటే వర్తమాన విషాద వాస్తవికత కళ్ల ముందు కదులుతుంది. అక్షరాలలో పైకి ధ్వనించే వ్యంగ్యం మనసుని మెలిపెడుతుంది. కవయిత్రి శ్రేయలో అంతర్లీనంగా గూడుకట్టుకున్న ఆర్ద్రపూరిత ముఖచిత్రానికి ఇది ప్రతిబింబంగా నిలుస్తుంది.
‘అవిటితనంతో తన శరీరమే
తనకు శత్రువుగా మారినప్పుడు చేతికి ఒక రూపాయి అందుతుందేమో అని అతని కళ్ళలో ఆశ’ అంటున్నపుడు డబ్బుకు దాసోహమైన లోకనైజం బయటపడుతుంది. మానసిక వైకల్యం ముందు శారీరక వైకల్యం ప్రధానలోపంగా బిక్షగాడి కళ్లలో ఆశగా కదలాడుతుంది. యాచకత్వంలో ఉన్న కష్టనష్టాల తడి రుచిని సామాజిక దృష్టి కోణం లోంచి పరిశీలిస్తుంది. ఈ అవగాహనా స్థాయిని అంచనా వెయ్యడానికి లోచూపు చాలా అవసరం. దీనిని సమర్థవంతంగా అందిపుచ్చుకుంది కవయిత్రి శ్రేయ. ‘మా ఇంటికి ఉగాది వచ్చింది’ కవితలో ‘అమ్మెప్పుడూ చెబుతూ వుంటుంది/ వాళ్ల ఊళ్లో ఉగాది ఎంత బాగా జరిగేదని’ అంటూనే ఆశ్చర్యకరమైన ముగింపుతో కొసమెరుపు మెరిపిస్తుంది శ్రేయ. ‘నా తెలుగు భాష’ శీర్షికలో మాతృభాష గొప్పతనాన్ని తేట తెలుగులో ప్రస్తావిస్తుంది.
‘కోకిల పాటలా తీయని తేనెలా
అమ్మచేతి గోరుముద్దలా నాన్నప్రేమ పిలుపులా
అమ్మమ్మ చెప్పే కథలా తాతయ్య దీవనలా
నా తెలుగు భాష’ అంటూ వుంటే తెలుగుదనం సంస్కృతి, సాంప్రదాయం, మమకారం, ఆప్యాయత, కలుపుగోలుతనం అడుగడుగునా వ్యక్తమవుతాయి.
వైవిధ్య పూరిత సామాజిక వస్తువులను కవితాంశాలుగా స్వీకరించి రచన చేపట్టిన శ్రేయకు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆకాంక్షిస్తూ అభినందిద్దాం!

- మానాపురం రాజా చంద్రశేఖర్,
సెల్ : 9440593910