రాజమండ్రి

జీవిత పోరాటం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా దగ్గర ఇక డబ్బు లేదు. బ్రతకటం కూడా అనవసరమేమో’ బాధగా అన్నాడు సుబ్బారావు.
‘అదేంటండీ! విషయం చెప్పకుండా అలా మాట్లాడుతున్నారు... ఒరే చందూ, శిరీష రండి.. మీ నాన్నగారేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు’ అంది శాంతమ్మ.
‘ఏంటి నాన్నగారు! ఏమయ్యింది?’ కంగారుగా అన్నాడు చందు.
‘నాన్నగారూ ఒంట్లో బాగుందా’ శిరీష నుదురు తడుముతూ అంది.
‘ఆ! ఆ! బాగానే ఉంది. నేను వీడి చదువుకూ, నీ పెళ్లికి, పురుళ్లకూ, నా అనారోగ్యానికీ ఉన్న డబ్బంతా ఖర్చుపెట్టాను. ఈ రోజు మా ఆఫీసులో 58 నిండిన వాళ్లంతా రిటైర్ అవ్వాలని చెప్పారు. గౌరవంగా రిజైన్ చేయమని అడిగారన్న మాట’ బాధగా నుదురు పట్టుకుంటూ అన్నారు సుబ్బారావు గారు.
‘ఓస్ అంతేనా? అమ్మా, నేను ఉద్యోగం చేస్తున్నాంగదా! మీరు రెస్ట్ తీసుకోండి. ఇక మనకేం సమస్యలున్నాయి తేలిగ్గా అన్నాడు చందు. కాని అతని గుండెల్లో కూడా రాయి పడింది. తల్లి ఉద్యోగం చేస్తుంది. తండ్రి మందులకే అయిదువేలు. మరి తనకు ఇంకో ఏడాదికి గాని ఇంక్రిమెంట్ ఉండదు. ఇక కొత్తగా పెళ్లైన మరో అక్కకు ఇంకా రెండు పురుళ్లు పోయాలి. ముందుగా తేరుకున్నది శాంతమ్మ. ఆమెకు అత్తవారింటికొచ్చిన దగ్గర నుండే కష్టాలు పడీ పడీ కష్టం సుఖం ఒకేలా కనిపిస్తుంది. కష్టం గురించి ఆలోచించటం కంటే దానికి పరిష్కారమేంటో ఆలోచిస్తుంది. అందుకే ఆమె ధైర్యంగా సుబ్బారావుగారి భుజంపై చేయివేసి చెప్పింది.
‘మీరేం బాధపడకండి. పొలంపై వచ్చే డబ్బులు మీ ఎకౌంట్లో వేద్దాం. ఇక ఆర్‌డి రెండు నెలల్లో మెచ్యూర్ అవుతుంది. అది కూడా మీ ఎకౌంట్‌లోనే వేస్తాను. మీరేమి ఫీల్ అవ్వనవసరంలేదు. ఇక్కడున్నది అందరం మనుషులమే మృగాలంకాదు. అవసరమైతే మరో రెండు వేలు ప్రతినెలా వేస్తాను మీ ఖర్చుల కోసం, మందుల కోసం అవి సరిపోతాయి. మీరు మాకెవరికీ చేయి చాపి నోరు మెదిపి అడగవలసిన అవసరంలేదు’
‘శాంతా! ఎంత సులువుగా తీర్పు చెప్పేశావ్. నీ చదువుకి నేనెంత అడ్డుచెప్పాను. ఎన్నిసార్లు ఎదగనివ్వకుండా చేశాను. అయినా బ్రతిమాలో, బామాలో నీవు ఇంత ఎదిగావ్. అంతేకాదు నీవు ఎంత అందంగా నా సమస్యకు పరిష్కారం ఇచ్చావ్’ అతని కళ్లుచెమర్చాయి.
‘దీనినే కుటుంబం అంటారు. ఒకరికొకరు చేయూతనివ్వాలి. మీరు ఎన్నో అవసరాలు మానుకుని ఈ కుటుంబాన్ని పైకి తెచ్చారు. ఏ వ్యసనాలులేవు. ఇప్పటివరకు ఒకరికి ఇవ్వటమేగాని తీసుకోవటంరాదు. అలాంటి వాళ్లు ఒక్క రూపాయైనా అడగటానికి ఎంత బాధపడతారో నేనర్థం చేసుకోగలను’.
‘అవును నాన్నా! మీరేదైనా చేయాలనుకుంటే చేయండి. లేకపోతే విశ్రాంతి తీసుకోండి. లేదా ఏదన్నా జిరాక్స్ షాప్ లాంటిది పెడదాం. మీకు టైమ్‌పాస్ అవుతుంది. లేకపోతే మీ ఇష్టం’ తల్లితోపాటు చందూ కోడా సపోర్టు ఇచ్చాడు.
‘అదేం వద్దురా. ఒకవేళ నాన్న అడిగితే అప్పుడు చూడొచ్చు. టెన్షన్ పడతారు, నువ్వూరుకో’
‘టెన్షన్ ఏముంది నాక్కూడా ఇంట్లో ఉండాలనే భావన చాలా కష్టంగా ఉంటుంది శాంతి’
భర్త ఆ ఉద్యోగం చేయడంలో ఎంత గౌరవం ఉండేదో. ఆయన పూర్వాశ్రమంలో ఏ ఉద్యోగంలో ఇమడకుండా ఎన్నో సంవత్సరాలు గడిపిన వైనం. కుటుంబాన్ని ఇబ్బందులపాల్జేయడం, ఐదేసి సంవత్సరాలు ఖాళీగా కూర్చుని పురాణ ప్రవచనాలు చెబుతూ గడిపేయటం అన్నీ సినిమా రీళ్లలా గుర్తొచ్చాయి. పిల్లల ముందు తనను చులకన చేయకుండా తాను ఇన్నాళ్లు అతని గౌరవం నిలపటం, ఆడపడుచుకు శక్తికి మించిన మర్యాదలు అత్తగారు, ఈయన జరిపించటం, ఆ అప్పులు తీర్చడానికి నాలుగేళ్లు పట్టడం, తాను ఉద్యోగం, ట్యూషన్లతో అనారోగ్యం, శక్తిహీనత తెచ్చుకోవటం, ఇగోప్రాబ్లంతో తనను నలుగురిలో చుట్టాలలో పలచన చేయటం అన్నీ గుర్తుకొచ్చాయి.
‘ఏం ఫరవాలేదు. మీరు స్వచ్ఛంద సంస్థలలో చేరి ఓపికున్నంత వరకూ ప్రజాసేవ చేయండి. ఆధ్యాత్మికత అంటే మీకు ఇష్టమే కదా!’ అతని వాగ్ధాటిని, సమయస్ఫూర్తిని గుర్తు తెచ్చుకుంటూ అంది.
‘సరే ఏదో ఒకటి ఆలోచిద్దాంలే. పదండి నాన్న భోజనానికి’ అంది శిరీష.
శాంతి ఆలోచిస్తోంది. రేపటి నుండే తాను చేయబోయే పథకాలు, ఇంకా ఏ రంగంలో డబ్బు ఎలా సంపాదించవచ్చు. కుటుంబాన్ని గౌరవంగా నడిపే విధానంలో తను ఓడిపోకూడదు. తన చూపు గెలుపుపైనే ఉంటుంది. అవును తను ఎంతోమంది విద్యార్థులను, వారి మనస్తత్వాలను పరిశీలించింది. ‘వ్యక్తిత్వ వికాసం’పై బుక్స్ వ్రాయాలి. పబ్లిషర్‌ని కలవాలి. ఖర్చులు ఎటూ తగ్గవు. సంపాదనే పెరగాలి. ఆర్థికంగా బలపడాలి. అందుకే తాను సిపాయిలా పోరాడాలి. బ్రతుకులో భవితను తీర్చిదిద్దుకోవాలి.. అంటూ ముందడుగు వేసింది. ‘జీవితమంటే అంతులేని ఒక పోరాటం..’ పాట వింటూ సాగుతుంది.

- బి.హెచ్.వి.రమాదేవి, సెల్: 9441599321