విజయవాడ

స్తుతిగత శృంగారం - పోతనామాత్యుని భాగవతం (వెంటాడే కవులు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహాకవి, భక్తకవి, సహజ పాండిత్యుడుగా పేరొందిన పోతన మహాకవి రచించిన భాగవతం వేదవ్యాస మహర్షి భాగవతానికి అనుసృజనగా విస్తృతమైంది. 14, 15 శతాబ్దాల కాలంనాటి సాహిత్యం, సమకాలీన రాజకీయ, మత పరిస్థితులు, సాంఘిక జీవన ప్రమాణాలు ప్రజల శృంగారాభిరుచికి దోహదం చేశాయి. ఆపై శృంగార రస పోషణలో ఆయనకున్న సునిశిత కౌశలం మరో ప్రధాన కారణం. పోతనను లోకం భక్తకవిగా శంఖచక్ర ముద్రాంకితుడిని చేసినా ఆయన అంతరంగంలో మాత్రం శృంగార రసాసక్తి భద్రంగానే ఉంది. అందువల్లనే భాగవతం అంతటా శృంగార రసం దివ్యదర్శనమిస్తుంది. అందులోనూ శృంగార రస సర్వస్వమైన శ్రీకృష్ణుడి (విష్ణు) కథాపరంగా అది బహుముఖీనంగా సాగింది. వాటిలో ఒకటైన స్తుతిగత శృంగారాన్ని పరిశీలిద్దాం. స్తుతి అనే పదానికి ప్రార్థన, పొగడ్త, స్తుతి, నుతి, నతి, ప్రశంస, వినుతి, స్తవం, కీర్తనం వంటి అర్థాలు మనకు నిఘంటువుల్లో కనిపిస్తాయి. ప్రతాప విభూతి మూర్తి గుణ కీర్తనాదిక స్తుతి వల్ల ఇష్టకార్యసిద్ధి కలుగుతుంది. స్తుతులలో వారివారి శృంగార లీలలను కీర్తించడం కూడా కద్దు. అందుకు భాగవతమే ఒక నిదర్శనం. సౌందర్యలహరి, శ్యామలా దండకం, శ్రీకృష్ణ కర్ణామృతం వంటివాటిలో సుకుమార శృంగారం వుంది. భాగవతంలోని కొన్ని భావాలు వ్యాసప్రోక్తాలైతే మరికొన్ని పోతన ప్రోక్తాలు. స్వభావం రీత్యా పోతన భావకవి. భక్తి, శృంగారాలు వర్ణించే విషయంలో ఆయన భావలోలుడు. ఆ ఘట్టాల్లో ఆయన ఆత్మభావమే ప్రతిఫలిస్తుంది. పోతన భాగవతంలో పాత్రగత అవస్థ్భాదాల్ని బట్టి అనేక స్తుతి భేదాల్ని గుర్తించవచ్చు. అన్నింటిలోనూ శృంగారం కనులకు కట్టినట్టుగా కనిపిస్తుంది. కల్పవృక్షం కోరిన ఫలాన్నిస్తుంది. భావుకుడు శృంగార రసాన్ని భావిస్తే దానే్న ప్రసాదిస్తుంది పోతనగారి ‘్భగవతాఖ్య కల్పతరువు’. మత్తే-లలిత స్కంధము గృష్ణమూలము శుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరో జ్జ్వలవృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువుర్విన్ సద్విజశ్రేయమై! శృంగార పరంగా పై పద్యానికి అర్థం చెప్పుకుందాం. భాగవతమనే కల్పవృక్షం కామోత్కంఠమైన గోపికాది స్ర్తి జన కళాస్థానాలుగా పరిగణించే అంస భాగాలు గలది. ఆ గోపికలకు శ్రీకృష్ణుడు ఆలంబనగా గలదీ. ఉద్దేపన విభావాలైన శుక పికాల కలస్వనాలతో అందంగించినదీ. నాయికా నయన సదృశమైన పూలతీవలతో సుమనోజ్ఞంగా విరాజిల్లుతూ వున్నదీ. మంచి రంగు కలిగినదీ మన్మథ బాణాల వంటివీ అయిన పూలు గలిగినవి. పై ఆలంబన ఉద్దీపనాలతో ఆస్వాదింపదగినదీ, ఆదరణీయమైన శృంగారరస నిర్భరమైన కథ కలదీ. అఖండ రసానందమే ఫలంగా గలదీ, స్వచ్ఛమైన శృంగార రస భేదాలకు నిలయమైనదై సహృదయులకు మేలు కలిగించేదిగా జగత్తులో విరాజిల్లుతుంది. ఇలా బమ్మెర పోతన భావగతాన్ని వ్యవసాయ సేద్యంలో శృంగార రసాన్ని నిక్షేపించాడు. పోతన భాగవతంలో వాణీధవులను స్తుతి సర్వాంగ సుందరంగా మలచాడు. విధాతను ‘్భరతీ హృదయ సౌఖ్యవిధాత’గా భావించాడు. ఇక్కడే ఉంది అసలు సిసలైన దాంపత్యోపనిషద్రహస్యం. భర్త ఎప్పుడూ భార్య హృదయ రహస్యానె్నరిగి కరిగించాలని సూచన. ‘సరస్వతిని తోయ జాత భావచిత్త వశీకరణైక వాణి’గా చెప్పటంలో మాటామన్ననలతో భర్త మనస్సును వశం చేసుకునే నేర్పు భార్యకుండాలని సూచించాడు. సరస్వతీదేవిని గూర్చి ప్రత్యేకంగా -
క్షోణితలంబు నెన్నుదురు సోఁకఁగ మ్రొక్కినుతింతు సైకత
శ్రోణికిఁ జంచరీకచయ సుందర వేణికి రక్షితామర
శ్రేణికి ఁదోయ జాతభవ చిత్తవశీకరణైక వాణికిన్
వాణికి నక్షదామ శుక వారిజ పుస్తకరమ్య పాణికిన్!
అని స్తుతించడం సురుచిత శృంగార సరళి. ఆమె ఇసుక తినె్నల వంటి పిరుదులు కలది. అందమైన తుమ్మెదల బారు లాంటి వేణి (జడ) కలది- అంటాడు. ఇది ఆమె ఆంగిక శృంగారం. తోయజాత భవ చిత్త వశీకరణైక వాణి- ఇది వాచిక శృంగారం. శుకవారిజ పుస్తక రమ్యపాణి అన్నపుడిది- ఆహార్య శృంగారం. ఈవిధంగా త్రివిధ శృంగార రస స్వరూపిణియైన శారదను తాను దర్శించి సహృదయులకు సందర్శనీయం చేశాడు పోతనామాత్యుడు. పవిత్ర గంగా తరంగిణీ తీరంలో పోతకు దర్శనమిచ్చిన శ్రీరాముడు ‘మెఱుగు చెంగటనున్న మేఘంబుకైవడి నువిద చెంగట నుండ నొప్పువాడు’ ఆయన సీతారాముడు. స్కంధాద్యంత పద్యాలలో సైతం పోతన గారికి సీతామనోభిరాముడే ప్రత్యక్షవౌతాడు. ఆ రాముడు ‘జానకీ చిత్త చోరుడు’. ‘జనక సుతా మనో విమల సారస కోమల చంచరీ’కుడు. ‘శ్రీవిలసిత ధరణీ తనయా వదన సరోజ వాసరాధిపుడు’, ‘వరజనక సుతాభిషంగుడు’. ‘జనక సుతా హృచ్చోరుడు’. ఈ విశేషణాలన్నీ జానకీరాముని ప్రేమాంచిత హృదయానికి, వారి అమలిన ఆదర్శ దాంపత్య శృంగారానికీ ప్రతీకలు! శ్రీరామచంద్రుడు ‘సుందరీ శంబరారి’, ‘సుందరీ మానహారి’ కూడా. ఇలా పోతన గారి శ్రీరాముడు సుందర రాముడు, శృంగార రాముడు, జానకీ రాముడైనాడు. షష్ఠ్యంతాలలో నాయక సంబంధమైన ఇతర లక్షణాలతో పాటు శృంగార విశేషణ షట్కం కూడా గోచరిస్తుంది భాగవతంలో. వీటివల్ల పోతన గారి శృంగార తత్త్వ పరిపోషకత్వం వెల్లడౌతుంది. ‘హారిక నందగోకుల విహారికి’, ‘గోపనితంబినీ మనోహరికి’, మనోహర సౌందర్యమూర్తికి, ‘పీతవస్త్ర పరిధాయికి’, ‘గోపికానివహ మందిరయాయికి’ అంటూ కాముకులు ఏకాంతంగా కాంక్షించే సురత మర్దనం వల్ల బడలిక చెందే పిరుదులున్న గోపస్ర్తిల మనస్సులను ఆనందింపచేసేవాడికీ, రుక్మిణీ మనస్థాయికి, రుక్మిణీదేవి మనస్సులో స్థిరంగా వున్నవాడికీ, శేషశాయికి, భోగపరాకాష్ఠకు సంకేతమైన ఆదిశేషుడు పాన్పుగా గలవాడికీ తన భాగవతాన్ని సమర్పించాడు పోతన. ‘వీఁడటే యెలయించి వ్రేతల మానంబు, నూరలాడిన లోక సుందరుడు’ అంటాడు పోతన. రుక్మిణితోను, వ్రేతలందరితోను కృష్ణుడు భోగించాడని సూచించాడు. ఇది శృంగార నాయక స్తుతిగతమైన పోతన గారి శృంగార స్ఫూర్తికి సురుచిర నిదర్శనం. సాగరాన్ని చేరే పవిత్ర గంగానదీ ప్రవాహ వేగంలాగా పరమేశ్వరుని చేరాలనే తొందర కుంతీదేవి స్తవంలో కన్పిస్తుంది.
ఇలా భాగవతంలోని కొన్ని స్తుతిగత శృంగార సన్నివేశాలు హృదయాన్ని పరవశింపజేస్తాయి. సహృదయ హృదయాకాశాల్లో శృంగార భావాలు మలయమారుతాల్లా వీస్తాయి. అప్పుడు మనఃకమలాలు పరిమళిస్తాయి. అప్పుడే భాగవతం రసోల్లసితమై కావ్యస్థాయి అందుకుంటుంది. అందుకు పోతన గారు అవలంబించిన శిల్పమిది. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతంలో కూడా అమలిన, సున్నిత శృంగారం గోచరిస్తుంది.

- ఆర్ ఇందునాథ్,
నరసరావుపేట, గుంటూరు జిల్లా.
చరవాణి : 9533721776

**
పుస్తక సమీక్ష

బీదల మెతుకుపై
‘నెత్తుటి మరకలు’

క విషయం మీదో, సంగతి మీదో, సంఘటన మీదో కవిత్వం అల్లటం పరిపాటే. అయితే సంఘటన మీద సుదీర్ఘ కావ్యం రాయడం చాలా అరుదుగా జరిగే విషయం. సమగ్రత, స్పష్టతకోసం సంపూర్ణ విషయాన్ని కవిత్వీకరించడం ఓ ప్రత్యేక ఒరవడితో కొనసాగుతున్న సాహిత్య ప్రక్రియ ‘లాంగ్ పోయిమ్’. దీర్ఘ కవితలకు తెలుగు ఆధునిక సాహిత్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకుని దళిత కవిత్వ వాదనకు దారి చూపిన అనేకానేక పరిణామాలకు విలక్షణమై చూపిస్తుంది ‘నెత్తుటి మరకలు’ దళిత దీర్ఘ కావ్యం. కవి నేలపూరి రత్నాజీ కలం నుంచి వెలువడిన ఆత్మగౌరవ ఆవేదన పూరిత దళిత దీర్ఘ కవిత ఇది. నిజమే వేనవేల సంవత్సరాల కాలం క్రితం నుంచి ఒక అసమాజ ప్రక్రియతో నడుస్తున్న వ్యవస్థ ఇది. పైమెట్టుపై ఉన్న కులం, కిందనున్న కులంపై ఆధిపత్యం, అణిచివేతను జరుపుతుంది. ఆ దిశలో జరిగిన లక్ష్మింపేట దృష్టాంతాన్ని కవితా వస్తువుగా తీసుకొని రాసిన పుస్తకం. ఎన్నో సంఘర్షణాత్మక కవిత్వ పలుకులకు కొలమానం, నాగరికపు సమాజ సంపూర్ణ అసమానత క్రియలకు సజీవ సాక్ష్యం పలికే కవిత్వ సంపుటి ‘నెత్తుటి మరకలు’. వేల ఏళ్లనాటి వివక్షతను అక్షరబద్ధం చేస్తూ సమానత్వ కాంక్షను బట్టబయలు చేస్తున్న నేలపూరి రత్నాజీ కలం నుంచి వచ్చిన ఆత్మఘోష పలుకులివి. తరతరాల వివక్షాపూరిత క్రియలకు అనేకానేక చర్యలకు అద్దంపట్టే సంఘటనల సమాహారం. ఈ దేశ కర్మభూమిలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక మూల అనునిత్యం సాగే దౌష్టాన్యాల హేల. నాగరికపు సమాజంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో కుల వివక్షాపూరిత దాడులు లౌకిక వాదుల ప్రశ్నార్థ పూర్వక నిందలకు తార్కాణమే లక్ష్మింపేట దళితుల మారణకాండ. స్వాతంత్య్రం తెచ్చాక స్వరాజ్యం వచ్చాక కూడా దళిత బహుజనులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. వస్తువును ఎన్నుకొనటంలో కవి సరికొత్త వాదాన్ని నినాదం చేశాడు. మట్టితనం మీద మమకారాన్ని ఎలుగెత్తి చాటుతున్నాడు. ‘్భమితోనే ఆత్మగౌరవం’ అనేదే ఆయన నినాదం. భూమి మీద పట్టు పెరుగుతుందనే అక్కసుతోనే దళితులపై జరిగిన దాడి ‘ఒక సంఘటనను తీసుకొని ఒక తాత్విక నేపధ్యంలో కొన్ని పరిణామాల్ని, పర్యవసానాన్ని వివరించి తీర్పునివ్వడమే దీర్ఘ కవితా లక్షణం’ అంటారు సుప్రసిద్ధ సాహిత్యకారులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి.
కవి పలుకులు వింటే భూమాత ఎంత పులకించి పోయేదో చూడండి. ‘మా చేతులతో కలగుమ్మిన భూమి / మా కాళ్ల కింద పచ్చగా / మొలకెత్తిన భూమి / నిత్యం పొర్లాడిన భూమి’ అనడంలో తల్లీబిడ్డల అనుబంధంతో కనిపిస్తుంది. అయితే అదే తల్లి తన ఒడిని చూసుకొని తల్లడిల్లిపోతుంది. కారణం కొంతమంది ముష్కరుల చేతుల్లోకి పోయిన భూమిని చూసి కలవరపడుతుంది. అంతలోనే మరో మూడు పాదాలు మనల్ని కూడా పరవశింప చేస్తాయి. ‘్భమితోనే ఆత్మగౌరవం / భూమితోనే అధికారం / భూమితోనే ఆర్థిక సమత్వం’ అనడం రత్నాజీకే చెల్లింది. పెనవేసుకుపోయిన అనుబంధాన్ని ఎలా తెల్పుతున్నారో చూడండి’ ఆ భూమిలోనే / మన పాదం నాటుదాం .. / భూమి మన పద్యం’ అనడం అది సార్వత్రికమని చెప్పడమే. భూమి మీద పెత్తనం చెలాయిస్తున్న వాళ్ల దౌర్జన్యకాండ మాత్రమే కాదు. బతుకు గడవక భూమితో పెనవేసుకున్న పాలేరు / పాలిగాపు గాళ్ల మొదలు మంచి గుడ్డలు కట్టుకున్న వాళ్లను చదువుల చెంత పోతున్న వాళ్లను ఆఖరికీ చెంచాగాళ్ల అభిమాన జాడ్యపు ఫ్లెక్సీలు కట్టినోళ్లపైన దాడులు జరగడం వెనుక దళితులు బహుజనులపై ఓర్వలేనితనానికి కారణం రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ సాధించి పెట్టిన రిజర్వేషన్లు. విద్య వైద్య వైజ్ఞానిక రంగాల్లో తమ స్థానాన్ని పదిలపర్చుకుంటూ పోవడాన్ని సహించలేక చేసే దుర్మార్గాలపై శంఖారావాన్ని పూరించాడు కవి నేలపూరి. కవిగా రత్నాజీ ప్రగాఢమైన అనుభూతితో పాఠకులను దళిత తాత్విక దృక్పథంతో వాళ్ల బతుకు వెతల్ని తెగేసి చెబుతున్నాడు. మెతుకు హక్కు బతుకు హక్కు భూమి హక్కు వాక్కుగా జాతీయ గీతాన్ని జాతిగేయం చేసి పాడదామంటున్నాడు. భూమిచుట్టూ అల్లుకున్న అనేకానేక కుతంత్రాలను అత్యంత పరిశీలనా దృష్టితో వివేచించిన ఈ కవి పాటను విందాం.

- రవికాంత్, సెల్: 9642489244

**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net