విశాఖపట్నం

జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమికుల మధ్య ఉండాల్సిన ప్రేమ, అవగాహన, నమ్మకం రోజురోజుకు ఆవిరైపోతున్నాయి. నేటి సమాజంలో ప్రేమికుల మధ్య ప్రేమ కంటే ఆకర్షణే ఎక్కువగా కనబడుతోంది. రెండు మనసుల కలయిక ప్రేమ. కానీ అందుకు విరుద్ధంగా కొంత మంది అనాలోచితంగా శారీరక ఆనందానికే ఎక్కువ విలువనిస్తున్నారు. భవితను అంధకారం చేసుకుంటున్నారు. అమ్మాయి అందాన్ని చూసి మోజులో పడిన ప్రేమలు, అబ్బాయిల ఆడంబరాన్ని, అతని బైకుల్ని చూసి మొలకెత్తే ప్రేమలు ఎక్కువ కాలం నిలబడవు. ప్రేమ మధురాతి మధురమైనది. గాలి వీచినంత సహజంగా, నీరు ప్రవహించినంత నిర్మలంగా, పూలతావిలా తాజాగా ప్రేమ పుడుతుంది. అలా పుట్టి, పెరిగిన ప్రేమను వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్‌డే లాంటిది ఒక సందర్భం మాత్రమే. కానీ ఆ రోజు సెలబ్రేట్ చేసుకోవడం కోసమే నలుగురిలో గొప్పగా చెప్పుకోవడం కోసమే ప్రేమించడం మాత్రం ప్రేమ అవదు.
ప్రేమికులు తమ ప్రేమను పది కాలాల పాటు పదిలంగా కాపాడుకోగల ధైర్యం, అవసరమైతే తల్లిదండ్రులను, సమాజాన్ని సైతం ఎదిరించి మనగలిగిన ఆత్మస్థైర్యం ఉండాలి. వ్యక్తిత్వం లేని వాళ్లు ప్రేమకు అనర్హులు. ప్రేమకు ముందు ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని ఆచితూచి అంచనా వేసుకోవాలి. వ్యక్తిత్వం లేని ప్రేమలు ఎక్కువ కాలం జీవించలేవు. బాహ్య సౌందర్యం కంటే అంత:సౌందర్యానికి విలువ ఇచ్చే ప్రేమలు ఎక్కువ కాలం నిలుస్తాయి.
ప్రేమ ఎంత మధురమైనదో వికటిస్తే అంత వెగటుగాను ఉంటుంది. వాలెంటైన్స్‌డే నాడు ప్రేమ జంటలు మనసు విప్పి మాట్లాడుకోవడమే కాదు విచ్చలవిడిగా తిరిగి హద్దులు మీరే ప్రమాదం కూడా పొంచి ఉంది. కొంత మంది జీవితాలు వికసిస్తే మరికొందరి జీవితాలు ఛిద్రమయ్యే ప్రమాదముంది. అసలే ఎయిడ్స్ మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న ఈ రోజుల్లో ప్రేమికుల రోజు వంటిది ఎంత వరకు సమంజసం? ప్రేమ పేరిట అమ్మాయిలను వలలో వేసుకుని సినిమాలు, షికార్లకు తిప్పడం, వీలు చూసుకుని ఆమెను కాలరాచే కామాంధులు పెళ్లి మాట ఎత్తితే అమ్మాయిలకు ముఖం చాటేయడం జరుగుతున్నదే.
ప్రేమ ఉచ్చులో పడిన అమ్మాయిలు అనాలోచితంగా తమ విలువైన మాన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఇది ఎంత వరకు న్యాయం? ఆత్మహత్యలు సర్వసాధారణమైనవిగా తలచడం అమానుషం. అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడే ముందు తాము చేస్తున్నది ఎంత వరకు సరైనదో ఆలోచిస్తే అర్ధమవుతుంది. ఒక దుర్మార్గుడి కోసం తమ విలువైన ప్రాణాలను విడనాడడం వెర్రితనమనిపిస్తుంది. జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అవి యాథృచ్ఛికమైనవిగా భావించి మరిచిపోవాలి. మళ్లీ జీవితంలో అటువంటి తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి.
మనసును ప్రగతిబాట వైపు మళ్లించుకోవాలి. అవసరమైతే కళ్ల ముందు తప్పు కనిపిస్తే తప్పుకోకుండా ఖండించగలగాలి. సాటి స్ర్తిపై జరుగుతున్న అత్యాచారాలను ఆపగలగాలి. ఎదుటి మనిషికి శాయశక్తులా సహాయపడాలి. జీవితమంటే ప్రేమ ఒక్కటే కాదు. ప్రేమ జీవితంలో ఒక భాగం మాత్రమే.
ఊహాలోకానికి, వాస్తవానికి వారధి వేసి దాని మీద నడిచి, మనగలగాలి. నువ్వు కోరుకున్నది జరగనప్పుడు నిరాశ చెందకు. ఊహించనిది జరిగినప్పుడు తుళ్లిపడకు. వివేకం కోల్పోకు. అది చాలు జీవితాన్ని ముందుకు నడిపించడానికి. సమాజ శ్రేయస్సు కోసం పాటు పడడంలోని ఆనందం, ప్రేమ కోసం పడిన ఆరాటంలో మచ్చుకైనా కనిపించదు.

- రాయవరపు సరస్వతి, కోటవీధి, మొదటిలైను,
చోడవరం (పోస్టు), విశాఖపట్నం-531036. సెల్ : 9885656356.
**

కవి పరిచయం
**
గంధవరపు రచనా బంధం
నాటినుంచి నేటి వరకు అటు సాహిత్యం, ఇటు సంస్కరణల పట్ల విశేష అభిమానం కనబరిచి పరిమళించిన గంధంలా గంధవరపు వెంకటరావు రచనా బంధం భాసిల్లుతుంది. అతి సామాన్య రైతు కుటుంబంలో చిన్నప్పలస్వామి, గురమ్మ దంపతులకు జన్మించి ఆంధ్ర సాహిత్యప్రియులు దేవరాజు వెంకట కృష్ణారావు ప్రభావంతో సాహితీవేత్తల సాహచర్యం వల్ల రచనా వ్యాసంగం పట్ల వెంకటరావు మక్కవ కలిగింది. బరంపురంలోని వేగుచుక్క ప్రింటింగ్ వర్క్స్‌లో చిన్న ఉద్యోగంలో చేరి కాలక్రమంలో రాజాం ప్రాంతంలో మొట్టమొదటి ప్రింటిగ్ ప్రెస్ వ్యవస్థాపకునిగా గుర్తింపు పొందారు. ప్రచురణకర్త నవలా రచయితగా మారి ‘తోడుకోసం’, ‘మారిన దొంగలు’, ‘పూలబంతులు’, ‘దైవసంకల్పం’ వంటి నవలలు రాశారు. వివిధ గ్రంథాలయాల్లో పఠనీయ గ్రంథాలుగా ప్రభుత్వం అనుమతించింది. ఆకాశవాణి, విశాఖపట్నం కేంద్రం నుండి గిరిజన, కార్మికుల కార్యక్రమాల ద్వారా ప్రబోధాత్మక రచనలు ప్రసారం కావడం, శారదా రచయితల సమితి వీరిని గుర్తించడం వారి రచనా శక్తికి నిదర్శనం. 1968లో అప్పటి భారత రాష్టప్రతి వి.వి. గిరి, వెంకటరావు రచనలు చదివి లేఖ రాయడం, ‘ప్రతిభా నీ గమ్యం ఎక్కడ?’ అనే అంశం ఆంగ్లంలోకి అనువదింపబడి టాలెంట్ వేర్ డజ్ యువర్ క్వెస్ట్ ఎండ్ అనే పేరిట నేషనల్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వారు నిర్వహించే ఇనె్వన్షన్ ఇంటిలిజెన్స్ అనే పత్రికలో ప్రచురింపబడింది. రాజాం, చీపురుపల్లి ప్రాంతాల్లో నిర్వహించిన కవి సమ్మేళనాలు, పంచాయతీరాజ్ స్వర్ణోత్సవాలు, నెహ్రూ జయంతి సందర్భంగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వారు వెంకటరావుని ఘనంగా సత్కరించారు. వెంకటరావు రచయితే కాకుండా ప్రచురణకర్త, మానవతావాది. తెలగా వీధిలో నిరుపేదలకు ఇళ్లు కట్టించి జివి ఆర్ కాలనీగా రూపకల్పన చేయడం, మంచినీటి బోరు ఏర్పాటు, ఉచిత విద్యుత్ కల్పన, మండల ప్రాథమిక పాఠశాలకు, వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విద్యుత్ సౌకర్యం కల్పించారు. నేటితరం వారంతా గంధవరపు వెంకటరావును ఆదర్శంగా తీసుకోవాలి. ఎనిమిది పదుల వయసులో కూడా రచనలు చేస్తూనే సమాజానికి సేవలందిస్తున్న ఘనాపాటి వెంకటరావు.

- టంకాల సత్యంనాయుడు, రాజాం-సారధి. సెల్ : 9395355952.
**
పుస్తక సమీక్ష
**
కవనంతో కట్టమూరి సవనం

ఆంధ్ర సారస్వత వనంలో పద్యం పాదుకట్టి వేయేండ్లకు బహు(ళ) శాఖా గుచ్ఛమై పెరిగిన మధురఫలం. ఆకాసగంగలో స్నానమాడి అమరత్వాన్ని పొందిన పద్యం తెలుగు భాషా పీఠికపై కుదురుగా కూర్చుని నన్నయ నుండి కట్టమూరి వరకు ఉన్నతిని పొందింది. అవధాన విద్య ద్వారా ప్రపంచ సాహితీ రహదారులందు తిరిగి మీసం మెలేసింది. తెలుగు వారి ధార, ధారణను చాటింది.
ఇలాంటి పద్యంతో యజ్ఞం చేయడం మాటలకందని విషయం. అవధాన యజ్ఞము పేరిట 35 అవధానములు పూర్తి చేసుకుని బ్రహ్మశ్రీ డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరావధాని వినూత్న పద్య సంపుటిని వెలువరించారు. ఈ సంపుటి సౌరదీక్షా సార్వభౌమ సద్గురు కృష్ణయాజి కృపతో యాజీ పబ్లికేషన్ ముద్రించింది.
ఈ అవధాన సంపుటిలో సమస్యల జఠిలతను సులభతరం చేసి, చమత్కార సంవిధానాన్ని పాటించారు డాక్టర్ కట్టమూరి. ఉదాహరణకు ఈ సంప్లిష్ట సమస్య సాధనను చూస్తే తెలుస్తుంది వారి విద్వత్తు, దాని విద్యుత్తు.
‘రాఘవు రాక్షసాంతకుని దాశరథిన్ వినుతించు టొప్పునే’. ఇందులో ‘ఘ’ ప్రాసాక్షరం. పద్య పూరణకు మొదటి కష్టము. యతి స్థానానికి ‘రా’ ప్రారంభాక్షరం. ఇది రెండవ కష్టం. రాముడ్ని పొగడడమా? అన్న భావనను సందర్భశుద్ధికి తెచ్చి సమర్ధించడం మూడవ కష్ట. అవధానంలో దీనిని ధారణలో వినిపించి అప్పటికప్పుడే పద్యం వినిపించడం నాలుగవ కష్టం. ఇన్ని సంక్లిష్టతల మధ్య ఎంత మధురంగా సునాయాశంగా, చక్కని పదాలను పొదిగి పూరించారో చదవండి.
‘ఓ ఘనుడా! మహామహుడా! ఓ మహనీయుడ రాక్షసేశ్వరా!
రాఘవు భార్య తెచ్చి తవురా ఇది ధర్మమ! నీతిన, పా
పౌఘమ తెచ్చికొంటివన, ఓరి విభీషణ పల్కువేల, త
ద్రాఘవు రాక్షసాంతకుని, దాశరథిన్వినుతించుటొప్పునే!
ఇందులో ‘్థ’కు యతిస్థానాన్ని తత్+ రాఘవు= తద్రాఘవు అని సంధి ద్వారా రాఘవుని తద్రాఘవుగా మార్చి యతి భంగము లేకుండా పూరించడం. రావణుడు విభీషణునితో అన్న మాటలుగా సమస్యకు పరిష్కారం చూపడం, చిన్నచిన్న సంభాషణలతో నాటకీయతను పద్యంలో చొప్పించడం, ‘పాపౌఘము’ వంటి మంజుల పద ప్రయోగం చేయడం వంటి విశేషణాలతో ఈ పూరణను రసభరితంగా చేసినారు చంద్రశేఖరావధాని. ‘శునకమ్మాయెను విష్ణుదేవుడహహో చోద్యంబుగా నత్తరిన్’, ‘రమ్మును తాగంశ వెలను రాతిరి వృద్ధుల్’, ‘ఖరపాదంబులు పట్టి ముకిత మదినాకాక్షింపరే సజ్జనుల్’ వంటి సమస్యల పూరణం పూర్ణచంద్ర దర్శనమంత సుందరంగా గావించారు అవధాని.
‘దత్తపదుల’తో కొత్త పద్యాలల్లిన తీరు, చిత్తానికి ఆనందం కలిగించకమానవు. మచ్చుకు ఒక దత్తపది.
సమంత, శ్రీయ, నయనతార, కాజల్ ఈ పదాలను పద్యంలో అద్ది వినాయక స్తుతి చేయమని ఒక సభలో అడిగినప్పుడు -
‘వీసమంత భాగ్యమ్ము నీవిమ్ము దేవ
నయము మీర ధనమున కాశ్రయము నీవ
పద్మనయనతార సమూహపతి విరోధి
కాణిపాకమునను నిలు, గాజుల మున’ అంటూ పూరించారు. సమంతను వీసమంతలో ఇమిడ్చారు. ఆశ్రయములో శ్రీయను స్వల్ప రూపాంతరంతో పొదిగారు. నయనతారను పద్మనయన తారలో చేర్చి పూరణను తారాపథానికి చేర్చారు. కాజల్‌ను గాజులుగా వింగడించారు. వినాయకుడన్న పదము రాకుండా చక్కని ‘తార సమూహపతి విరోధి’ అంటూ సంస్కారవంతమైన సమాస పదాన్ని ప్రయోగించి శ్రోతకు ఆనందాన్ని కలిగించారు. ఇది పదాలపై పెద్దరికం అంటే.
వర్ణనలలో ఎక్కువ భాగం సీసాలదే పైచేయి. సామాజికాంశాలను వర్ణనలో అడగడం ఇటీవల సామాన్యం కాగా కట్టమూరి మాత్రం అసమాన్యంగా పూరించిన సందర్భాలన్నీ ఫలప్రదాలే.
ఉదా : ఆడవారిపై అత్యాచారాల గురించి అడిగిన ప్రశ్నకు వర్ణన.
సీ॥ ఆడపిల్లని దెల్ప ఆడనే గర్భాన/ పసికందు మృత్యువు పాలు చేయ
అందాల భరిణెగా అగుపించినంతనే/ పడతి యాసిడు దాడి పాల జేయు
బాల్య వన భేద భావంబ లేకుండ/బాల్యనత్యాచార పాలు చేయు
అత్త వారింటిలో అడుగు పెట్టిన దుట్ట్భిమల మంటలపాలు చేయు’
గీ॥ అంగడి దొరుకు సరుకు కాదతివ చూడ/అమ్మలనునమ్మగావలె అమ్మవలదు అతివ ఆదిపరాశక్తి యనెడు మాట/మరచి పోవుటే మనకింత చెరుపుదెచ్చె
ఇలా అనేకాంశాలు సభలల్లో పాడదగ్గ పద్యాలనల్లారు ఆశువుగా డాక్టర్ కట్టమూరి చంద్రశేఖరం. నిషిద్ధాక్షరులు నిత్యపారాయణ మంత్రాల్లా పూరించి పాండితీ ప్రతిభాపాటవాలను చాటుకున్న తీరు అమోఘం.
ఉదా ॥ అ(మ్మ)బ (నీ)డ్కి(ని) క(న్న)టి
బ్రాకెట్‌లో నిషేధించిన అక్షరాలు. అంచ దీవెనలు తెల్పు ఈ పాదం ‘అంబ చూడ్కి కంటె అంబత్‌డనునికి... అంటూ నిషేధాన్ని సమర్ధవంతమైన అక్షరాలతో పూరించడం ప్రతిభకు తార్కాణం. ఇంకా మిగిలిన అంశాలలో అవధానిగారు ‘పురాణపఠనం’, ‘అప్రస్తుత ప్రసంగం’, ‘వారకథనం’, ‘సంఖ్యాగణనం’ అనే అంశాలు ఎంచుకున్నారు. తేదీకి వారాన్ని చెప్పడం పలువురిని ఆకట్టుకుంది. సంఖ్యాగణనం సభలో గళ్లలో పూరించడం ద్వారా ఎటు కూడినా ఒకే మొత్తం వచ్చేలా చేయడంలో సభను విజయవంతం చేసేవారు.
విజయనగరం జిల్లాలో ఎక్కువ భాగం ఉన్నత పాఠశాలల్లో సాగిన ఈ అవధాన క్రతువు నేటి తరానికి అవధాన పరిచయ భాగ్యాన్ని కలిగించడమే కాకుండా తెలుగు భాష గొప్పదనాన్ని చాటింది. విశేష సృజన ధారలను కురిపించింది. పద్య విద్యకు పట్టం గట్టింది. పండితాళిని స్పందింపజేసింది. పామరంజకత్వాన్ని అందుకుంది. ఈ అవధాన యజ్ఞంలో సారిపల్లి సోమేశ్వరరావు, మేజూరి సూర్యనారాయణమూర్తి, ప్రాత రాజేశ్వరరావు, పంతుల దక్షిణామూర్తి, కాకరపర్తి మార్కండేయులు, దశగ్రంథులవారు, రామిరెడ్డి మున్నగు పండితుల సహకారం ప్రశంసించదగ్గది. ఇట్టి గ్రంథాల్ని ప్రచురించిన యాజి పబ్లికేషన్‌ను అభినందించాల్సిందే. కట్టమూరి దిట్టతనాన్ని పట్టిచ్చిన గట్టి పాత్రములలో ఇదొక మేలిరత్నం.
**
- కిలపర్తి దాలినాయుడు,
సాలూరు-535591, విజయనగరం జిల్లా. సెల్ : 949176329.
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.netఆ ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.