విజయవాడ

బావ ఏంచెప్పినా ఓకే! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆటోలోంచి సూట్‌కేస్ పట్టుకుని దిగుతున్న అంజలిని చూసి ‘మళ్లీ అలిగి వచ్చేశావా?’ నవ్వుతూ అడిగింది అరుణ.
‘నేను బావనే పెళ్లి చేసుకుంటాను పిన్నీ. అమ్మ ఒప్పుకోవడం లేదు. బావకి నేనంటే చాలా ఇష్టం తెలుసా?’ అంది అంజలి.
‘మీ అమ్మా-నాన్న నిన్ను విడిచి వుండలేరు. బావ అమెరికా వెళ్లిపోతాడు. మరి ఎలా చెప్పు? నీకంటే పనె్నండేళ్లు పెద్దవాడు’.. నచ్చచెప్పాలని చూసింది. వినలేదు. చిరాకు పడింది.
‘మీ బావ హాస్పిటల్లో పక్కనే కూర్చున్న శాంతిని చూడలేదా? ఆ అమ్మాయితో మీ బావ అమెరికా పోతాడు నీకు తెలుసా?’
‘ఎప్పుడూ నవ్వుతూ ‘హరీ.. హరీ.. అంటుండే ఆమెతోనే? ఆ డాక్టరమ్మకి నేనొక పసిపిల్లలా కనబడతాను కాబోలు. ఎప్పుడు వెళ్లినా ముద్దు పెడుతుంది’ అంది సంబరంగా.
‘ఆ అమ్మాయినే మీ బావ పెళ్లి చేసుకుంటాడట. అమెరికా నుంచి వచ్చాక వాళ్లిద్దరూ పేదలకు ఉచిత వైద్యం చేస్తారట’
‘నిజంగానా?! ఆ డాక్టరమ్మ చాలా మంచిది. బావకి సరైన జోడీనే.. కానీ’ ఇంకా ఏదో అనబోతున్నది కాస్తా శ్రీహరిని చూసి ఆగిపోయింది. ‘నేను డిగ్రీ చదువుతాను’ అంది.
‘నువ్విక్కడ వున్నావా? అమ్మా-నాన్న నీ కోసం ఎంత బాధ పడుతున్నారో! పద’ అన్నాడు చిరుకోపంగా.
‘బావంటే నాకు చాలా ఇష్టం పిన్నీ. బావ ఏంచెపితే అది వింటాను’ అంది తలొంచుకుని. జాలిగా చూసింది అరుణ.
‘అంజలి మంచి పిల్ల. నేను అమెరికా నుంచి వచ్చి పెళ్లి చేస్తాను. అంతవరకూ బాగా చదువుకుంటుంది’ అన్నాడు శ్రీహరి.
‘బావ ఏంచెప్పినా ఓకే’ అంది కన్నీరు తుడుచుకుంటూ అంజలి.

- వి సాయిదుర్గ, విజయవాడ.

**
వేదిక
**
‘నానీ’లకు ఆహ్వానం

ఆచార్య ఎన్. గోపి అద్భుత సృష్టి నవ్య కవితా రూపం ‘నానీ’ ఆవిర్భవించి ఇరవై ఏళ్లు పూర్తయిన సందర్భంగా ద్విదశాబ్ది నానీల సంకలనం తీసుకురావడానికి సంకల్పించామని సంపాదకులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. దీనిలో ప్రచురణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదమూడు జిల్లాలకు చెందిన కవులు ఎవరైనా నానీలను పంపవచ్చు. నానీలు ప్రత్యేకంగా ఈ సంకలనం కోసమే రాసినవై ఉండాలి. ఒక్కొక్కరు పది నానీల చొప్పున పంపించాలి. గట్టి గింజల్లాంటి నానీలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ సంపాదక వర్గానికి ఉంది. నానీలతో పాటు అనుమతి పత్రం, ఫొటో, చిరునామా రాసి పంపాలి. ఫొటో వెనుక పేరు, సెల్ నెంబరు తప్పక రాయాలని సూచించారు. నానీలను ‘నాగిశెట్టి, లాలుపురం-522 017, గుంటూరు రూరల్’ చిరునామాకు ఫిబ్రవరి 15వ తేదీకల్లా పంపాలని వెంకట సుబ్బయ్య వివరించారు.
**
పుస్తక పరిచయం
**

ఏజెన్సీలో సాహితీ చైతన్యం

పేజీలు: 56 వెల : 60/-
ప్రతులకు: గోపగాని రవీందర్
ఇ.నం.9-76/2, ఫకీర్ గుట్ట
ఉట్నూర్-504203
ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9440979882
*
గత మూడు సంవత్సరాలుగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ‘ఉట్నూర్ సాహితీ వేదిక’ సాహితీ కార్యక్రమాలను నిర్వహిస్తూ సృజనకారులను ప్రోత్సహిస్తోంది. ఏజెన్సీ ప్రాంతంలో సాహితీ చైతన్యాన్ని తీసుకరావడంలో తనవంతు పాత్రను పోషించడం అభినందనీయం. 2014లో ‘ఉట్నూర్ కవిత’ను వెలువరించి అనేక మంది కొత్త కవులకు అవకాశం కల్పించారు. నేటితరానికి సాహిత్యం పట్ల ఆసక్తిని కలిగించేలా కృషి చేస్తున్న సాహితీవేదిక ఈ సంవత్సరం ‘ఉట్నూర్ సాహితీ సంచిక’ పేరుతో ఓ గ్రంథాన్ని వెలువరించారు. ఈ గ్రంథంలో కవితలు, పాటలు, వ్యాసాలు చోటుచేసుకున్నాయి. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గోపగాని రవీందర్ నేతృత్వంలో ఏర్పడిన సంపాదకవర్గం పర్యవేక్షణలో ఈ గ్రంథం రూపుదిద్దుకున్నది. కట్ట లక్ష్మణాచారి, కొండగుర్ల లక్ష్మయ్యల సహకారంతో సాహితీవేదిక అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు కవితా సంకలనాలను వెలువరించడం ముదావహం. ఈ గ్రంథంలో 3 పాటలు, 21 కవితలు, 7 వ్యాసాలున్నాయి. ఇవన్నీ ఉట్నూరులోని భిన్న భాషలకు అద్దం పట్టేలా ఉండటం విశేషం! ముఖ్యంగా హింది, కొలామి, తెలుగు, ఇంగ్లీష్, గోండి భాషలలోని రచనలకు ప్రాధాన్యతనిచ్చారు. కత్తి కంటే పదునైనది..బంధాలను దూరం చేసేది స్మోకింగ్ అనీ..దాన్ని మానుకొమ్మని 9వ తరగతి విద్యార్థి నితీష్ కుమార్ తన కవితలో చక్కగా తెలిపాడు. ఒక నిమిషంలో సిగరెట్ మాయం.. కాని నువ్వు పాడె ఎక్కడం ఖాయం అని హెచ్చరించాడు. విజయ్ కుమార్ నలుబోల ‘శుభోదయం’ పేరుతో రాసిన కవితలో ఉషోదయవేళ కొలువుదీరే అందాలను అక్షరాల్లో బంధించారు. జాధవ్ బంకట్‌లాల్ విద్యార్థులకు తమ భవితను తెలుసుకొమ్మని హితవుపలికారు. కుమ్రలాల్ షావ్ మూఢ నమ్మకం విడనాడాలని తమ రచన ద్వారా సూచించారు. డాక్టర్ జాధవ్ ఇందల్ సింగ్ తమ కవిత ద్వారా ‘పితాకీ అవేదన్’ను వినిపించారు. మొస్రం జగ్గేరావు ‘రేలా రేలా రేరేలా రేరేలా’ అంటూ గోండి పాటను రాశారు. జీవితంలో కష్టాలుంటాయి..వాటికి పరిష్కారం కనుక్కోవాలేకానీ.. ఆత్మహత్యలకు పాటుపడ వద్దని తెలుపుతూ ఎం.గిరిధర్ 9వ తరగతి విద్యార్థి తన కవితలో పేర్కొన్నాడు. స్నేహం యొక్క మధురిమలను ఎ.జ్యోతి 10వ తరగతి విద్యార్థిని తన కవితలో చక్కగా చిత్రించింది. కట్ట లక్ష్మణాచారి తమ కవిత ద్వారా కలాం స్పూర్తిని తెలిపారు.
ముంజం జ్ఞానేశ్వర్ తన ‘పద్యరాగాలను’ అక్షరబద్ధం చేశారు. రసాస్వాదనతో స్వరాలపన ఎలా చేయాలో తెలిపారు. ముంజం మల్లేష్ అవ్వకు వందనం సమర్పించారు. కొండగుర్ల లక్ష్మయ్య అడవి బిడ్డల గొప్పదనాన్ని తన కవిత ద్వారా వివరించారు. ఆధునిక యుగంలో అమ్మతనం అమ్ముడు పోయిందని మహిళా ఉద్యమ నాయకురాలు మర్సుకోల సరస్వతి తమ కవితలో ఆవేదనను వ్యక్తపరిచారు. అన్ని మరిచినా..పరువాలేదు..తల్లి దండ్రులను మరువవద్దని గుగ్లావత్ వినోద్‌కుమార్ సూచించారు. శ్రావణ్ రాథోడ్ ‘మేలీగిందీ’,‘ఉగాది’ కవితల్ని రాసి మెప్పించారు.
అక్షరాలతోని నిర్మాతమైన పదాలతో కుస్తీ పడుతూ బతుకు భవనాన్ని కట్టుకునే విద్యార్థి కూడా ఓ శ్రామికుడేనని గోపగాని రవీందర్ తమ కవిత ద్వారా తేల్చి చెప్పారు. వీటితో పాటు ఆదివాసిల ఆచార వ్యవహరాలను, బంజార వివాహ వేడుకలు, కథ, నవలల్లో ఉత్తర తెలంగాణ ఆదివాసి జీవనం తదితర వ్యాసాలను ఈ గ్రంథం చివరన పొందుపరిచారు. సాడిగె రాజగోపాల్ ఉట్నూర్ సాహితీ వికాసాన్ని తమ వ్యాసం ద్వారా తెలిపారు. ‘శిల్పగురు’ పురస్కార గ్రహీత తొలి ఆదివాసి కళాకారుడు కోవ నానేశ్వర్ గురించి మహ్మద్ రహీ మోద్దీన్ తమ వ్యాసంలో వివరించారు. మర్సుకోల క్రాంతి కుమార్ ‘ది ఆదిలాబాద్ ఆదివాసి’ అంటూ ఆంగ్లంలో ఓ వ్యాసం రాశాడు.
సాదాసీదాగా ఇలా కవితలు, పాటలు, వ్యాసాలతో వచ్చిన ఈ గ్రంథంలోని రచనలు చాలావరకు కొత్త వాళ్లనే ఉండటం విశేషం..కవులు, రచయితల్ని తయారు చేయడాని సాహితీవేదిక చేస్తున్న కృషి శ్లాఘనీయం..గోపగాని రవీందర్ మార్గదర్శకత్వంలో కవిత్వం, ఇతర రచనలు ఎలా చేయాలో కొత్తవారికి శిక్షణనిచ్చే వర్క్‌షాపులు ఏర్పాటు చేసి..కొత్త వారిని ఇంకా ప్రోత్సహిస్తారని ఆశిద్దాం..అలాగే ఇందులో రచనలు వచ్చిన వారు ఇంతటితో ఆపక తమ కలాలకు ఇంకా పదును పెట్టుకుంటారని ఆశిద్దాం.

- సాన్వి, సెల్.నం.9440525544
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net