ఉత్తర తెలంగాణ

తెలంగాణ మాండలిక పదకోశాలు పరిపుష్టం కావాలి ( అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ మాండలిక పదకోశాలను పరిపుష్టం చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలని కాంక్షించే ప్రముఖ కవి ‘ఎలనాగ’ అసలు పేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. వృత్తిరీత్యా వైద్యులు. 2012లో రాష్ట్ర స్థాయి వైద్యాధికారిగా ఉద్యోగ విరమణ చేశారు. కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామంలో జన్మించిన ఆయన రచనా వ్యాసాంగాల్ని ప్రవృత్తిగా మలచుకుని సంగీత ఆరాధకునిగా, కథకునిగా, కవిగా మరియు అనువాదకునిగా అందరి మన్ననలు పొందారు. ఆయన స్వతంత్రంగా 10 గ్రంథాలను వెలువరించడమే కాక.. మరో ఏడు గ్రంథాలను అనువదించారు. ఎలనాగ గారు తమ స్వతంత్ర గ్రంథాలకు పెట్టిన పేర్లు వైవిధ్యంగా వుండటం విశేషం! ‘వాగంకురాలు’ కవితాసంపుటి, ‘పెన్మంటలు’ (కోకిలమ్మ పదాలు గేయ సంపుటి), ‘సజల నయనాలకోసం’ (కవితా సంపుటి), ‘మోర్సింగ్ మీద మాల్కాస్ రాగం’ ‘ప్రయోగాల పద్యాల సంపుటి, ‘అంతస్తాపము’ (్ఛందోబద్ధ పద్యాల సంపుటి), ‘అంతర్ణయ’ కవితా సుంపుటి) ‘్భషానవ్యతకు బాటలు వేద్దాం’ (దీర్ఘవ్యాసం), ‘అంతర్ణయ’ కవితాసంపుటి, ‘అంతర్నాదం’ కవితాసంపుటి, ‘కొత్త బాణి’ (ప్రయోగ పద్యాలు) 10 గ్రంథాలను వెలువరించారు. అంతేగాక ఓ ఐదు గ్రంథాలను ఆంగ్లం నుండి తెలుగులోకి, మరో రెండు గ్రంథాలను తెలుగు నుండి ఆంగ్లంలోకి అనువదించారు. అనేక సంస్థల ద్వారా పురస్కారాలను, సన్మాన సత్కారాలను అందుకున్న ఎలనాగతో ‘మెరుపు’ జరిపిన ముఖాముఖి ఆయన మాటల్లోనే...

ఆ మీ దృష్టిలో కవిత్వం అంతే ఏమిటి?
దేన్ని చదివితే పాఠకుడు రసానుభూతిని పొందుతాడో అదే కవిత్వం అని చెప్పుకోవచ్చు. స్థూలంగా, ఆ రసం నవరసాల్లో ఏదైనా కావచ్చు. ఒకే రచనలో ఒకటికన్న ఎక్కువ రసాలు కూడా ఉండొచ్చునని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం మంచివి కావని అనుకునే లక్షణాలు కొన్ని ఉన్నంత మాత్రాన ఒక రచన కవిత్వం కాకుండా పోదు. ఉదాహరణకు అధిక్షేప కవిత్వం అసలు కవిత్వమే కాదని అనలేము. అది అభిలషించతగిన కవిత్వం కాదని మాత్రమే చెప్పగలం.

ఆమీరు ఎన్నో యేట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు?
పదిహేనేళ్ల వయసప్పుడు నా మొదటి కవిత గౌతమి అనే స్థానిక పత్రికలో అచ్చయింది. ఆ పత్రిక కరీంనగర్ నుండి వెలువడేది.

ఆ మీరు వచన కవిత్వంతో పాటు ఛందోబద్ధ పద్యాలు
రాయడానికి ప్రేరణ ఎవరు?
ప్రత్యేకంగా ఎవరూ ప్రేరణగా పనిచేయలేదు. అంతా సహజంగా జరిగిందే. నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు ఆకాశవాణి విజయవాడ వారి సమస్యా పూరణంలో పాల్గొని ఒక ఛందోబద్ధమైన పద్యాన్ని (శార్దూల విక్రీడితం) రాశాను.

ఆ కథలు, కవిత్వం రాస్తున్న మీరు ఈ రెండింటిలో
ఏది సులభంగా రాయగలరు?
మొదట్లో నేను రాసిన పది పదిహేను కథలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. అయితే అవేవీ నాకే నచ్చలేదు. నేను సులభంగా రాయగలిగింది కవిత్వమే. అయితే కథలను సులభంగా అనువదించగలను.

ఆ అనువాదం చేయడంలో మీరు మంచి ప్రావీణ్యాన్ని సంపాదించారు. అనువాదం వైపు మీ దృష్టి ఎలా మళ్లింది?
మంచి ప్రమాణాలున్న ఆంగ్ల సాహిత్యాన్ని చదవటం ఈ విషయంలో నాకు సహాయకారిగా పని చేసింది. మామ్, చెహూవ్, బెర్నార్డ్ షా, ఆయిన్ ర్యాండ్, సల్మాన్ రష్దీ మొదలైనవారి రచనలను చదివే క్రమంలో స్వయంకృషితో ఆంగ్లభాషా పరిజ్ఞానాన్ని పెంచుకున్నాను. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

ఆ సాహిత్యంతో పాటు మీకు సంగీతంపై మక్కువ
కలగడానికి స్ఫూర్తి ఎవరు?
నైజీరియాలో ఆరు సంవత్సరాల పాటు పనిచేసి తిరిగివచ్చిన తరువాత, నాకు ఆదిలాబాద్ జిల్లాలో వైద్యాధికారిగా మొదటి పోస్టింగ్ దొరికింది. అప్పుడు సామల సదాశివ గారిని తరచుగా కలవడం, సాహిత్య సంగీతాల గురించి ఆయన నాతో గంటల తరబడి మాట్లాడటం, ఇవి నాలో శాస్ర్తియ సంగీతం పట్ల ఆసక్తిని పెంచాయి. ఆ విధంగా ఈ విషయంలో ఆయనే నాకు స్ఫూర్తి.

ఆ మీకు నచ్చిన గ్రంథం?
ఒకటే పుస్తకం నచ్చడం అంటూ ఉండదు. తెలుగులో మ్యూజింగ్స్, ఆరో వర్ణం, ఇంగ్లీష్‌లో యులిసెస్, మిడ్ నైట్స్ చిల్డ్రన్ మొదలైన ఎన్నో పుస్తకాలు నాకు నచ్చాయి.

ఆ మీకు నచ్చిన కవి రచయిత?
తెలుగులో వట్టికోట ఆళ్వారు స్వామి, దాశరథి, శ్రీపాద, చలం, త్రిపుర, మో, ఇతర భాషల్లో మామ్, కాఫ్కా మొదలైనవారు.

ఆ మీ ముద్రిత గ్రంథాలు?
ఇప్పటివరకు 17 పుస్తకాలను వెలువరించాను. వాటిలో స్వతంత్ర రచనలు 10, అనువాద రచనలు 7, ఆనువాదాల్లో ఇంగ్లీష్ నుండి తెలుగులోకి చేసినవి 5, తెలుగు నుండి ఇంగ్లీష్‌లోకి చేసినవి 2 ఉన్నాయి.

ఆ నేడు వస్తున్న కవిత్వంపై మీ అభిప్రాయం?
కవుల సంఖ్య బాగా పెరిగింది. కొత్తవారిలో కొందరు బాగా రాస్తున్నారు కూడా. ఇది సంతోషించ తగిన పరిణామమే. అయితే వస్తువుతోనే సంతృప్తి పడిపోయి శిల్పాన్ని నిర్లక్ష్యం చేయడం బాగా కనిపిస్తున్నది. భాష మీద తగినంత పట్టు లేకపోవటం కూడా ఆందోళనను కలిగిస్తున్న విషయమే. కనీసం ప్రాథమిక స్థాయి భాషాదోషాలు దొర్లకుండానైనా చూసుకోవటం చాలా అవసరం. కవితా రచనలోకి అడుగు పెట్టాలనుకునే వారెవరైనా ముందు ఈ విషయం మీద దృష్టిని సారించి, ఆ దిశగా కృషి చెయ్యాలి. మనసులో ఉన్న ఆలోచనను మామూలుగా వ్యక్తీకరించడం కవిత్వం అయితే కవిత్వం రాయటం పెద్ద కష్టమైన పనేం కాదు. కానీ, వాస్తవంలో కవిత్వం రాయటం కష్టమైన పని. కవిత్వం ఒక ప్రత్యేకమైన కళ అనే విషయాన్ని కవులు కాదలచినవారూ, కవులు అయ్యామనుకుంటున్న వారూ పదే పదే మనసులో మననం చేసుకుంటూ ఉండాలి!

ఆ మంచి కవిత్వానికి ఉండే లక్షణాలు?
చదివినప్పుడు మనసును రంజింప జేయడమో, అల్లకల్లోలానికి గురి చేయడమో, జలదరింపును కలిగించడమో, కళ్లలో తడిని పుట్టించడమో ఏదో ఒకటి చేయటం మంచి కవిత్వానికి ఉండాల్సిన లక్షణం.

ఆ నేటి తరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే
ఏం చేయాలి?
ఇది చాలా పెద్దమాట. ఎవరో ఒకరు బలవంతంగా రుద్దటం కంటే, తరంలో ఉండే వ్యక్తులే తమంతట తాము సాహిత్యం పట్ల ఆసక్తిని పెంచుకోవాలి. అట్లా పెంచుకున్న వాళ్లకు పత్రికలు, ప్రభుత్వం, సంస్థలు మంచి సాహిత్యాన్ని అందించటం ద్వారా చక్కని మార్గదర్శనం చేయాలి.

ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
చాలా సందర్భాల్లో ఇదొక ప్రహసనం. పరిచయాలు, ప్రయత్నాలు, కులం, మతం, వర్గం, ప్రాంతం, భావజాలం మొదలైన అంశాలేవీ తమను ప్రభావితం చెయ్యలేని విధంగా ఉండాలి న్యాయనిర్ణేతలు. ప్రతిభావంతులైన కవులను, రచయితలను వ్యక్తిగత కారణాలవల్ల పురస్కారాలకు దూరం చేస్తే అది సాహిత్యానికి హాని చేసినట్టే అవుతుంది. తగినంత ప్రతిభ లేని వారికి పట్టం కట్టటం కూడా సాహిత్య ప్రయోజనాలకు విఘాతాన్ని కలిగించే విషయమే. ఉత్తమ సాహిత్యం పట్ల న్యాయనిర్ణేతలకే సరైన అవగాహన లేనప్పుడు, వారు నిష్పాక్షికంగా వ్యవహరించినా ప్రయోజనం సున్న.

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే
ఏం చేయాలి?
మరుగున పడిన మంచి తెలంగాణ కవులకు, రచయితలకు (వాళ్లు పాతవారు కావచ్చు, కొత్తవారు కావచ్చు) ప్రాభవాన్ని కలిగించాలి. తెలంగాణ కవుల, రచయితల రచనలు ఇతర భాషల్లోకి విరివిగా తర్జుమా అయ్యేట్టు చూడాలి. తెలంగాణ మాండలిక పదకోశాలను పరిపుష్టం చేసేందుకు మరిన్ని ప్రయత్నాలు జరగాలి. అయితే మితిమీరిన ప్రాంతీయాభిమానాన్ని చూపే క్రమంలో సాహిత్య ప్రమాణాలకు గండి కొట్టే ప్రమాదముంది. కనుక ఆ విషయంలో జాగ్రత్తపడాలి.

ఆ ఇప్పటి కొత్త కవులు/రచయితలకు మీరిచ్చే సలహాలు?
రచనా ప్రక్రియను సీరియస్‌గా తీసుకుంటే తప్ప ఎవరైనా మంచి కవిగా, రచయితగా ఎదగలేరనే వాస్తవాన్ని గ్రహించాలి. అంటే సాహిత్యం నీ హృదయానికి చాలా దగ్గరి విషయమై ఉండాలన్న మాట.

**
ఎలనాగ
73, నక్షత్రకాలనీ,
బాలాపూర్ గ్రామం
హైదరాబాద్-500005
సెల్.నం.9866945424

**
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544