నెల్లూరు

దత్తత తీర్చిన కోరిక (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నప్పటి నుండి చిన్నచిన్న కోరికలే తీరలేదు సీతమ్మకు. ఆమె తండ్రి ఆమెకు ఎంతో చదవాలని ఉన్నా ఎస్. ఎస్.సి.తో ఆపేసి ఒక గుమాస్తాకు ఇచ్చి పెళ్లి చేసేశాడు. కొన్నాళ్లకు అత్త ఆరళ్లు భరించలేక వేరు కాపురం పెట్టారు సీత-రఘు. పేరుకు వేరు కాపురమే అయినా రఘు ఆమెకు ఎలాంటి స్వేచ్ఛ యివ్వలేదు. ఏదైనా అతడి పేరు మీద జరగాల్సిందే తప్ప, ఒక్క చీర కొనే స్వేచ్ఛ కూడా లేదు ఆమెకు. పులి మీద పుట్రలాగ ఆమెకు పిల్లలు కలగలేదు. కూతురైతే ‘షిఫాలి’ అని కొడుకైతే ‘విశాల్’ అని పేరు పెట్టుకోవాలని ఆమె కోరిక కాని, ఆ భగవంతుడు ఆమె ఆ చిన్నపాటి కోరిక కూడా తీర్చలేదు. కారణం ‘ఆమె’ అంటూ ఆమె మీదకి తోసేశాడు రఘు కాని, అసలు నిజం అతడిలోనే లోపమంతా అని అతడి రిపోర్ట్స్ చదివాక ఆమెకు అర్థమైంది.
కాని, ఆ విషయం కదపడం వలన ఆమెకు దక్కేదేమీ లేదు అందుకే వౌనంగా ఉండిపోయింది. ఎవరూ ఆమెను సీమంతానికి, నామకరణానికి పిలిచేవాళ్లేలేరు. ఒకవేళ పిలిచినా ‘పేరు’ పెట్టమని కానీ, పేరు పెట్టడంలో సలహా కాని ఎవరూ అడగలేదు ఆ దుగ్ధ తనలోనే అణచుకుని పరితపించి పోతోంది సీత. కాలక్రమేణా సీత సీతమ్మ అయ్యిందే తప్ప సీత ‘అమ్మ’ కాలేకపోయింది. అక్కచెల్లెళ్ల పిల్లల స్థానంలో వాళ్ల మనవళ్లు మనువరాళ్లు వచ్చేశారు. వాళ్లు ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఈ పూట ఉండిపోయేవారు. ఏముంది వాళ్లింటో ఒక బ్లాక్‌అండ్‌వైట్ టీవీ, ఒక చిన్న ట్రాన్సిస్టర్ తప్ప. ఈ కంప్యూటర్ యుగంలో వీటిని భరించే వాళ్లెవరు నీకు నేను, నాకు నువ్వు అంటూ ఇద్దరు తప్ప.
ఇంతలో రఘు రిటైర్ అయ్యాడు. ప్రావిడెంట్ ఫండ్ 2 లక్షలు పైచిలుకు వచ్చింది. నెలకు పెన్షన్ 15వేలు వస్తోంది. పైన రెండు రూములు వేశాడు రఘు. వాటి మీద రెంట్ మూడువేలు వరకు వస్తోంది. ఇతగాడి ఆరళ్లు భరించలేక రెంట్‌కు ఉండేవాళ్లు త్వరగా వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోయేవారు. వాళ్లు సీతమ్మతో మాట్లాడకూడదు. వాళ్ల ఇండ్లకు ఎవరూ రాకూడదు. వచ్చినా ఒకపూట ఉండి వెళ్లిపోవాలి. మేకులు కొట్టకూడదు. ఇలాంటి ఆంక్షలు. పిల్లల అల్లరి చేస్తే వెంటనే వాళ్లను పట్టుకు కొట్టేవాడు. దాంతో వాళ్లు ‘‘ఏమైనా మేము మీలాగ గొడ్డుపోతులమా.. పిల్లలంటే అల్లరి చేస్తారు. అది మా సమస్య మీకేం సమస్య.. మీ ఇల్లు లేకపోతే ఇండ్లు గొడ్డుపోయాయా’’ అంటూ నానా మాటలంటూ ఖాళీ చేసి పైపెచ్చు రఘు మీద ఎన్నో కథలు అల్లి ప్రచారం చెయ్యడంతో కొన్నాళ్లకు ఆ ఇంటికి రెంట్‌కు రావడమే గగనమైపోయింది. వచ్చినా రఘు దాష్టీకము భరించలేక సీతతో చెప్పి వెళ్లిపోయేవారు. సీత మాత్రం ఏం చేస్తుంది. వాళ్ల అదృష్టానికి మురిసి, తన దురదృష్టానికి వగచడం తప్ప.
చిన్నప్పటి నుండి నీ కోరికలేమి తీరాయని అనుకుని వగచడం తప్ప ఎవరైనా పిల్లల్ని దత్తతకు తీసుకుందామండీ అంటే ‘‘మీనాన్న ముల్లె ఖర్చుకావడం లేదు.. ఎవడో దారినపోయేవాళ్లను దత్తతకు తీసుకుని ఖర్చు చేద్దాం సరేనా’’ అంటూ మాట్లాడ్డంతో ఆమె వౌనంగా ఉండిపోవడం తప్ప ఇక ఏమీ చేయలేక ఉండిపోయింది కానీ, చివరి దశలో ఒక నలుసు ఉంటే తమని చూస్తుంది కదా, స్వంత పిల్లలు ఆశలేదు కనీసం పెంచుకునే స్థోమత ఉన్నా రఘుకు ఇష్టం లేకపోవడంతో తన కోరికని తనలోనే అణచేసుకుంది సీత, దేవుడు దయతలచాడో లేక రఘుకు కాలం చెల్లిందో ఒకరోజు గుండెపోటుతో ‘హరీ’మన్నాడు రఘు. ఈ లోకం విడవలేక విడవలేక వెళ్లిపోయాడు. ఇప్పుడు అతడి గొంతు వినపడక, ఆరళ్లు లేక హాయిగా ఉన్నా మరీ ఒంటరి బ్రతుకు చాలా భయంకరంగా తయారైపోయింది సీతకు. వెంటనే ఆమె పైన ఇల్లు రిపేరు చేసి రెంట్‌కు ఇచ్చేసింది. వాళ్లతో ఇల్లు కొంచెం సందడిగా ఉంది.
బ్లాక్ అండ్ వైట్ టీవి స్థానంలో కొత్త కలర్ టీవి కొంది. వంట త్వరగా కావడానికి కావలసినవి కొనుక్కుంది. సీడి ప్లేయర్, సీడీలు కొంది. కొత్తకొత్త సినిమాలు వేసుకుని చూసుకుంటుంది. అవి చూడడానికి పైన రెంటుకు వున్న వారి పిల్లలు వచ్చి సందడి చేసేవారు. తను కాఫీ కలుపుకుని వాళ్లకు ఇస్తుంది. కొత్తకొత్త వంటలు చేసి వాళ్లకు ఇస్తుంది. ఈ విధంగా పైన ఉన్న ఆమె చాలా త్వరగా సీతతో కలిసిపోయింది. ఆమె పేరు వినీల. పిల్లలు సినిమా చూస్తూ అక్కడే పడుకునిపోయేవారు. ఆమె వచ్చి వారిని తీసుకుపోయేది. వాళ్ల పేర్లు వినీష, విమల్. వాళ్లను చూస్తే సీతమ్మకు చాలా ముచ్చటేసింది. వాళ్లతో ఎన్నో కబుర్లు చెప్పేది. వాళ్లు అలాగే చెప్పేవాళ్లు.
వినీల ఒకసారి చెప్పింది ‘‘ఆంటీ మీరు ఏమి అనుకోనంటే ఎవరైనా పిల్లల్ని దత్తత తీసుకోండి సందడిగా ఉంటుంది.. మీకు వాళ్లు తోడు, వాళ్లకి మీకు తోడు, ఒక అనాధను పెంచి పోషిస్తే మీకు పుణ్యం కూడా వస్తుంది’’ అంటూ.. ఆ మాట నిజమే ఇలా ఎన్నాళ్లు ఒకరి పిల్లల్ని లాలిస్తుంది. ఒకరోజు వాళ్లు వెళ్లిపోతారు. అప్పుడు ఉసూరుమంటూ ఒంటరి బతుకు అయినా తనకు ఒక కోరిక ఉంది. తనకు ఇష్టమైన పేర్లు పెట్టి పిల్లల్ని పెంచాలని.. ఒకరోజు వినీలను తోడు తీసుకుని అనాధాశ్రమానికి వెళ్లింది సీత. అక్కడ కవల పిల్లలు రెండేళ్ల వాళ్లు చాలా నచ్చేశారు. వెంటనే వాళ్లను అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని తెచ్చి దత్తత చేసుకుంది.
వాళ్లకు తన ఇష్టమైన ‘‘షిఫాలి, విశాల్’’ అని పేర్లు పెట్టుకుంది. ఆ పిల్లల్ని ఆడించడానికి వినీష-విమల్ వచ్చేవారు. ఇప్పుడు ఆ ఇల్లు సందడిగా తయారైంది. ఒకప్పుడు రఘు-సీత తప్ప ఎవరూ లేని ఆ ఇంట్లో పైన వినీల దంపతులు-పిల్లలు, కింద సీత-పిల్లలు. బోలెడు సమయం గడిచిపోతోంది వాళ్ల ఆలనాపాలనలో సీతకు. వాళ్లు పెద్ద వాళ్లు అవుతున్నారు... చక్కగా చదువుకుంటున్నారు ముఖ్యంగా సీతని ప్రతిక్షణం వదలక అమ్మా.. అమ్మా అని పిలుస్తున్నారు.
రఘు చనిపోయిన తర్వాత దక్కిన ఈ అదృష్టానికి సీత ఎంతగానో మురిసిపోతోంది. ఇపుడు వాళ్ల బంధువులు అప్పుడప్పుడు వాళ్లింటికి వస్తున్నారు. ఆమె తన కన్నతల్లి కాదని తెలిసిన వాళ్లు ఆ నిజాన్ని వినరు, భరించలేరు. ఆమె తమ ‘కన్నతల్లి’ అంటూ ఘంటాపథంగా చెబుతారు.
ఇష్టమైన చెట్లన్నీ పెంచుతోంది సీత. తనకిష్టమైన జీవితం ఇప్పుడు ఆమెకు దక్కింది. ఎన్నో ఏళ్లు గడచిన తర్వాత తన కోరికలు ఒకటొక్కటిగా తీర్చిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది సీత. షిఫాలికి, విశాల్‌కు తనకు నచ్చిన వాళ్లతో పెళ్లిళ్లు చేసేసింది సీత. వాళ్ల పిల్లలతో ఆడుకోవడానికి రడీగా ఉంది సీత. ఇప్పుడు ఆమె బామ్మ-మామ్మ కాబోతుంది.
‘ఈ ఆనందం చాలు భగవంతుడా చిన్నప్పటి నుంచి నా తీరని కోరికల్ని ఈ విధంగా తీర్చినందుకు’ అనుకుంటోంది. వాళ్ల పిల్లలకి పేర్లు సెలెక్ట్ చేసేసింది. సంజన-అశ్విన్. మరి ఆమె కోరిక భగవంతుడు ఎప్పుడు తీర్చుతాడో వేచి చూడాల్సిందే. తన కిష్టమైన ‘పేర్లు’ పెట్టే అవకాశం భగవంతుడు ఇంకొకసారి ఇవ్వబోతున్నాడు.

- డాక్టర్ జ్ఞానేశ్వర్, మదనపల్లె, 9440729701