ఉత్తర తెలంగాణ

అసమర్థుడి ఆత్మహత్య (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మహత్య చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ఈజీ అయిపోయింది. ఫ్యాషన్ కూడా అయిపోయింది. ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకునే యువతీయువకులు, పరీక్ష తప్పామని ప్రాణాలు తీసుకునే విద్యార్థులు, వ్యవసాయంలో నష్టపోయామని ప్రాణత్యాగం చేసే రైతన్నలు, ఒకరేమిటి, ప్రాణాలంటే త్రుణప్రాయం అయిపోయాయి ఈ రోజుల్లో. ఒక తల్లి ఒక ప్రాణిని ఈ భూమిమీదకు తేవడానికి ఎంత యాతన పడుతుందో తెలిస్తే, ఒక డాక్టర్ పోతున్న ఒక ప్రాణాన్ని నిలుపడానికి ఎంత తపన పడతాడో తెలిస్తే, బహుషా ఈ ఆత్మహత్యలు కొంతవరకైనా ఆగిపోతాయేమో!
ఆ కోవలోకి చెందినవాడే మన మన్మథరావు. ఆస్తులు, అంతస్తులు తెలుసుకోకుండా ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించాడు. బడితపూజతో అతని ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఆత్మహత్య ఎలా చేసుకోవాలా అని బాగా ఆలోచించాడు. నిద్రమాత్రలు మింగి చావడం సులభం అని భావించాడు. మందుల దుకాణంలో అడిగితే డాక్టరు చీటి లేనిదే నిద్రమాత్రలు ఇవ్వడం కుదరదని అన్నారు. మందుల దుకాణంలో పనిచేస్తున్న తన స్నేహితుని ద్వారా, రాత్రిళ్లు నిద్రరావడం లేదని కారణం చెప్పి, ఓ గుప్పెడు నిద్రమాత్రలు సంపాదించాడు. మంచిరోజు చూసి, రాత్రి ఎప్పుడౌతుందా అని ఎదురుచూసి, నిద్ర మాత్రలన్నీ మింగి పడుకున్నాడు. ప్రాణం పోలేదు సరికదా! వాంతులు కూడా కాకుండా, ఉదయం యదావిధిగా మేల్కొన్నాడు. అన్ని మాత్రలు మింగినా తనకు చావు రానందుకు, తనను తాను నిందించుకుని, తన స్నేహితుడిని కలిసి కారణం అడిగాడు. కనీసం నిద్రకూడ రాలేదని వాపోయాడు. అన్ని వస్తువుల కల్తీ లాగే, మందుల కల్తీ సంగతి నీకు తెలియదా? నిద్రమాత్రలు నిజంగా బాగా పనిచేసి ఉంటే, నీవు చావడమే కాదు, నా ప్రాణానికి వచ్చేది అని ఓదార్చాడు మందుల దుకాణం మిత్రుడు. తనకు కావలసింది అదే అని తెలియని మూర్ఖుడు వీడు అనుకున్నాడు మన్మథరావు.
మరో మంచి ముహూర్తం చూసి ఫ్యానుకు ఉరేసుకోవాలనుకున్నాడు మన్మథరావు. రాత్రి కుటుంబ సభ్యులందరూ నిద్రపోయాక, తన తల్లి పాత చీరను ఉరితాడుగా ఫ్యానుకు కట్టి వ్రేలాడాడు. పాపం ఆ చీర పూర్తిగా చీకిపోయి పాతబడిపోయింది. చీర ముక్కలుముక్కలుగా చిరిగిపోగా ఫ్యానురెక్కలు ఊడి మన్మథరావు కిందపడ్డాడు. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి తప్ప ప్రాణం పోలేదు. ఆ అల్లరికి ఇంట్లోని వారంతా మేల్కొని, మన్మథరావును తిట్టినతిట్టు తిట్టకుండా తిట్టి, ఉత్త అసమర్థుడు ఆత్మహత్య చేసుకోవడం కూడా తెలియని చవట అని అనుకున్నారు ఎవరిమట్టుకు వారు.
ఎలాగైనా సరే, ఆత్మహత్య చేసుకొని తీరాలనుకున్న మన్మథరావుకు, ఆలోచించగా ఆలోచించగా, వాళ్ల ‘ఊరినానుకొని నది ఉందని గుర్తొచ్చింది. నీళ్లలో పడిచావటం, చాలా తేలికని భావించాడు. చచ్చాక తన శవాన్ని నీళ్లల్లో ఉండే జలచరాలు కొరికేస్తే ఎలా అని ఆలోచించాడు. తానే చచ్చాక, తన శవం ఏమైపోతే ఏమిటని ధైర్యం తెచ్చుకొని నదివైపు నడిచాడు. ఎప్పుడూ నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రదేశం, జనంతో కిటకిటలాడుతోంది. అప్పుడు గుర్తొచ్చింది మన్మథరావుకు, అది పుష్కర సమయమని, అప్పుడు చావడం మరింత పుణ్యమని నీళ్లల్లోకి దిగాడు. అక్కడే ఉన్న పురోహితుడు, మన్మథరావును గట్టిగా పట్టుకొని మూడు మునకలు వేయించి, ఏవేవో మంత్రాలు చదివి, దక్షిణ ఇమ్మని చేయి చాచాడు. తన జేబులో ఉన్న తడిసిన పది రూపాయల నోటు ఆ పురోహితుడి చేతిలో పెట్టి, అంత మంది జనంలో తన ఆత్మహత్యా ప్రయత్నం కుదరదని ఆ ప్రయత్నం మానుకొని నిరాశగా అక్కణ్ణుంచి వెళ్లిపోయాడు మన్మథరావు.
పట్టు వదలని విక్రమార్కుడిలా, నాలుగవ ప్రయత్నంగా రైలుకిందపడి చావాలనుకున్నాడు మన్మథరావు. అతడి అదృష్టంకొద్ది వాళ్ల ఊరి బయట రైల్వేట్రాకు ఉంది. అప్పుడప్పుడూ ఆ ట్రాకుపై రైళ్లు వస్తూవెళ్తూ ఉంటాయి. మన్మథరావు వెళ్లి రైలుకోసం ఎదురుచూస్తూ ట్రాకు పక్కన కూర్చున్నాడు. నాలుగైదు గంటలు గడిచినా, ఒక్క రైలూ రాలేదు. రైల్వేలైను చెక్ చేసే గాంగ్ మ్యాన్ అక్కడికి వచ్చాడు. అసహనంగా అటూ ఇటూ తచ్చాడుతున్న మన్మథరావును చూసి విషయం పసిగట్టాడు. అక్కడెక్కడో రైలుపట్టాలు తప్పిందట, ఇప్పుడప్పుడే ఏ రైలూ ఈ లైనులో రాదు, నువ్వు నీ ఆత్మహత్యను వాయిదా వేసుకుని ఇంటిముఖం పట్టడం మంచిది! అని ఉచిత సలహా ఇచ్చాడు.
అసలింతకూ ఎందుకు చావాలనుకుంటున్నావు నువ్వు? ఆశ్ఛర్యంగా అడిగాడు అప్పుడే వచ్చిన మరో గాంగ్ మ్యాన్.
మరేముంది, నా ప్రేమ విఫలమైంది! విచారంగా చెప్పాడు మన్మథరావు.
నీ ముఖమెప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? చీవాట్లు వేసాడు గాంగ్ మ్యాన్. అయినా ప్రతి అడ్డమైనవాడికి ఆత్మహత్య చేసుకోవడానికి మా రైల్వేట్రాకే దొరికింది. వెంటనే ఇక్కడ నుంచి వెళ్లకపోయావో, పోలీసులకు ఫోన్ చేసి అప్పగిస్తాను. హెచ్చరించాడు మరో గాంగ్ మ్యాన్.
ఇటు ప్రేమ విఫలమై, అటు ఆత్మహత్యాయత్నం విఫలమై, ముఖం వేలాడదీసుకొని, ఇంటిముఖం పట్టాడు మన్మథరావు.

- గరిశకుర్తి రాజేంద్ర
కామారెడ్డి, సెల్.నం.9493702652
**

పుస్తక సమీక్ష
**

చక్కని భావ చిత్రణ... మనసు పొరల్లోంచి..

పేజీలు: 92, వెల: 60/-
ప్రతులకు:
రామానుజం సుజాత లక్ష్మణ్
ఇం.నెం.4-75/3/1/ఎ
శాతవాహన కాలనీ, విజయపురి
రేకుర్తి, కరీంనగర్-505001
సెల్.నం.9701149302
**
కవయిత్రి రామానుజం సుజాత లక్ష్మణ్ వెలువరించిన తన తొలి కవితా సంపుటి చక్కని భావ చిత్రాలతో రూపుదిద్దుకున్నది.. జీవితాన్ని సృజనాత్మకంగా మలుచుకోవడం తెలిసిన సుజాత తమ కవిత్వం నిండా సున్నితత్వానికే పెద్దపీట వేయడం విశేషం! సుమధుర భావాలతో ముస్తాబై వచ్చిన ఈ గ్రంథంలోని కవితలు గుండె గుడి ధర్మాన్ని, న్యాయాన్ని అట్టి పెట్టుకోవాలని హితబోధ చేస్తాయి. కవితల్లోని కొన్ని ఫంక్తులు అక్షర జాజులై పాటలతో జతకట్టి..మన హృదయాలను మీటుతాయి! మహిళలు స్వాభిమానంతో బతికేందుకు భరోసానిస్తాయి..అంతేగాక వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి. భార్యాభర్తల బంధాన్ని అందంగా చిత్రించారు. రైతన్న వ్యధలకు అద్దం పట్టారు. అమ్మ ఔన్నత్వాన్ని చక్కగా ఆవిష్కరించారు. వస్తు ఎంపికతో పాటు.. శిల్పం విషయంలో తగు జాగ్రత్త తీసుకుని.. చిక్కని కవిత్వాన్ని పండించడంలో సుజాత సఫలీకృతులయ్యారు. ‘సంగమం’ కవిత ద్వారా భార్యాభర్తల అనుబంధాన్ని అక్షరాల్లో అందంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా భర్తను ఉన్నతంగా చిత్రించారు.
ఇంటింటా తలుపులను తడతాయంటూ.. ప్రకటించిన భావాలు.. ఆమె మనసు అడుగుపొరల్లో.. వౌనంగా దాక్కున్న అక్షర ఊసులు కవిత్వమై మన హృదయాలను నిమురుతాయి! సమకాలీన సంఘటనలను కవితల్లో బంధించాలన్న తపన, జీవితంలోని మంచి సంగతులు, బాధ కలిగించిన ఘటనలు, తమకిష్టమైన పరిసరాలు ఆశలు, కలలు.. ఒక్కటేమిటి.. కవయిత్రి సుజాత జీవితంతో ముడిపడి ఉన్న అనేక అంశాలు ఈ కవితల్లో ఉన్నాయి. ఓ కవితలో.. సామాన్యుడి ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య విలువలతో..ఆకలి కేకలు లేని.. ‘రేపటి తెలంగాణ’ను ఆమె కాంక్షించిన తీరు బాగుంది. ముఖచిత్రం గ్రంథానికి నిండు శోభను కూర్చింది. మొదటి గ్రంథంతోనే చిక్కని కవిత్వాన్ని అందించిన కవయిత్రి సుజాతను అభినందనలు తెలియజేద్దాం.. మరింత కవిత్వాంశతో మరిన్ని మంచి కవితలు ఆమె కలం నుండి జాలువారాలని కోరుకుందాం.

- సాన్వి, సెల్.నం.9440525544
**
సాహిత్య సమాచారం
సామల సదాశివ రాష్టస్థ్రాయ సాహితీ పురస్కారానికి ఎంట్రీల ఆహ్వానం
రాష్టస్థ్రాయ సామల సదాశివ సాహితీ పురస్కారానికి ఎంట్రీలను ఆహ్వానిస్తున్న ట్లు తెలంగాణ కళావేదిక అధ్యక్షులు, పురస్కార కమిటీ కన్వీనర్ అనుముల దయాకర్, కో-కన్వీనర్ దాస్యం సేనాధిపతి ఒక ప్రకటనలో తెలిపారు. 2013-2016 మధ్య ప్రచురితమైన తమ కథా సంపుటాలను నాలుగు ప్రతుల చొప్పున అనుముల దయాకర్, 10-1-181, రాంనగర్, కరీంనగర్ - 505 001 చిరునామాకు ఫిబ్రవరి 25వ తేదీలోగా పంపాలి. పురస్కారం కింద ఐదువేల రూపాయల నగదు, ప్రశంసాపత్రం, శాలువతో మార్చి నెలలో జరిగే సభలో విజేతను సత్కరించ నున్నట్లు తెలిపారు. వివరాలకు 8886623533 ఫోన్‌లో సంప్రదించవచ్చు.

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net