ఉత్తర తెలంగాణ

అంతర్వేదన( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అప్పటికే ఆలస్యమైందనుకుంటూ వడివడిగా నడుస్తూ సునీత బడిలోకి చేరింది. యుకేజీ చదువుతున్న దినేష్‌కు లంచ్ టైంలో అన్నం తినిపించడానికి ఇంకో నాలుగైదు నిమిషాల సమయమున్నట్లుంది. పిల్లలకు భోజనం పెట్టడానికి అన్నపూర్ణమ్మలు ఒక్కొక్కరు బడిలోకి చేరుతున్నారు. మూడు గంటల సేపు చదివి చదివి ఆకలితో అలమటిస్తున్నట్లుంది బడి. ఒక్కడున్న నాలుగైదు చెట్ల గాలి నిశ్శబ్ధంగా సునీత ముఖానికి తాకుతూ ఓ నిముషం పాటు ఎవో జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లింది. ఆ నిర్ఘాంతాన్ని చెరుపుతూ బడి గంట టన్..టన్..టన్..
ఇయ్యల్లనన్న ఎగ్గు కూర తెచ్చినవా వట్టి టమాటనేనా దినేష్ గాడి వేళ్లకున్న కండ్లు లంచ్ బాక్స్‌ను వెతుకుతూ..
‘చేతులు కడుక్కో నీకిష్టమైందే తెచ్చిన నాన్న’ అంది. అని వాని చేతులు కడుగి రోజులాగా టమాటా పప్పుకు విరుద్ధంగా ఆలుగడ్డ కూర తెచ్చి వాడికి తినిపించడానికి ప్రయత్నిస్తుంది.
నాకు తెలుసు నువు మోసం జేస్తవని’ అనుకుంటూనే అమ్మ మీద కోపాన్ని ఆకలిని చంపేసుకున్నాడు.
నిజానికి కోడిగుడ్డు విలువైందేమి కాదు గాని రోజు పెట్టడం సునీతకు కొంత భారం.
‘మళ్లీ నాన్న ఫోన్ జేసిండా నాలుగైదు రోజులైంది నాతోని మాట్లాడి. నువ్వేమో మాట్లాడిస్తలేవ్’
‘లేదు నానీ ఇంతకుముందే జేసిండు మల్లా సాయంత్రం జేస్తనన్నడు’
‘నువ్వు రోజు ఇట్లనే నన్ను మరిపిస్తున్నవ్..ఇప్పుడోసారి చెయ్యి మాట్లాడుతా’
‘అప్పడికి మాట్లాడిస్తా నువు తొందరగా తిను’
పెరుగుతో కలిపిన నాలుగు ముద్దలను తినిపించి క్లాస్ రూంలోకి పంపింది. నేరుగా ఇంటికి వెళ్లే అదృష్టం లేని సునీత ఒప్పుకున్న నాలుగు ఇండ్లల్లో పని పూర్తి చేసుకుంది.
ఆగని కాలం ఆమెకు ఒడిలో దినేష్ గాడు ఉన్నడన్న సంగతిని గుర్తు జేసింది. మళ్లీ బడిలో వాలడం..వాన్ని ఇంటికి తీసుకెళ్లడం రోజు లాగే వాన్ని కూర్చోబెట్టి రాయించడం, వాడు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం సునీతకు మళ్లీ చదువుకుంటున్న అనుభూతి.
‘హోం వర్క్ ఐపోయింది నాన్నకు ఫోన్ జెయ్యి అన్నాడు.
సునీతకు మళ్లి ప్రకంపన మొదలైంది.
‘నాన్న చాల దూరంలో ఉన్నడు నాని మన ఫోన్‌ల నుంచి పోదు. నాన్న జేసిప్పుడే మనం మాట్లాడాలి’
‘ఎందుకట్ల అబద్ధాలాడుతవ్ అఖిల్ గాన్నోళ్ల అమ్మ లంచ్ టైంల వాళ్ల డాడితోని మాట్లాడిస్తుంది కదా’
‘ఓహో వాళ్ల డాడీ ఇక్కనే్న లోకల్లో ఉంటడు. మరి మన నాన్న..
‘దగ్గర లేడా దూరంల ఉన్నడ’ ప్రశ్న సమాధానం వాడే చెప్పుకున్నాడు.
‘అవును నాని దూ..రంల ఉన్నడు.
‘మరి నాన్న ఫోన్ జేసినప్పుడు నువు బడికి వచ్చి నాతోని మాట్లాడియ్యాలే’ అంటుండగానే ఫోన్ మోగింది.
‘ఇగో నాని నాన్న మాట్లాడుతడట’ సునీత ఫోన్ దినేష్‌కు ఇచ్చింది.
‘నాన్నా..
‘పొట్టీ ఎట్లున్నవురా నానీ..మస్తు సార్ల జేసిన నువ్వేమో బడిల ఉన్నవట’
‘అవును..ఇంటికచ్చినంక కలిపియ్యమంటే అస్సలు కలిపిస్తలేదు’
‘ఇయ్యాల నీ బర్తుడే గదా అందుకే కలిపిచ్చింది. మంచిగ సదువుకుంటున్నవా బిడ్డా’
‘మంచిగ సదువుతున్న..మా క్లాసుల నేనే ఫస్టు గని నువ్వెక్కడున్నవ్ నిన్ను ఒక్కసారి గుడ జూల్లే ఒకసారి వచ్చిపోవా మరి’
‘సునీత కళ్లల్లో చిన్నపాటి ఉప్పెన..!
‘లేదు బిడ్డ నువ్వు పెద్ద పెద్ద సదువులు సదవాల్నంటే మస్తు ఫైసల్ కావాలె కదా, అందుకే నేను ఇక్కనే్న ఉండి ఫైసల్ పట్టుకుని వస్తా
‘పైసలద్దు ఏమద్దు..నువ్వు రా. మా బడిల అందరిని వాళ్ల నాన్నలే వచ్చి దించుతున్నరు. తీసుకపోతున్నరు. నువ్వేమో ఒక్కసారన్న రావు. రా..నువ్వు’
‘వద్దు నాని ఇక్కడ పని ఇడిశిపెట్టి రారాదు’
‘నాకేమద్దు..నన్నొక్కసారన్న ఎత్తుకున్నవా నువు? ఒక్కసారన్న ఐస్‌క్రీం తినిపిచ్చినవా నాకు?
కొనసాగుతున్న దినేష్ ప్రశ్నలకు సమాధానం పూర్తికాకముందే ఫోన్ కటయ్యింది. పున్నమి చంద్రునోలె ఎలిగిన దినేష్ గాని ముఖంల అమావాస్య వలె ముసురుకుంది. సునీతలో పుట్టిన ఉప్పెన సునీతనే కబలించేసింది..వేదన.
ఇగో మాట్లాడేది మాట్లాడంగనే పెట్టేసిండు. ఇగ నాన్నతోని నేనస్సలు మాట్లాడ’..అలక శోకసముద్రం నుంచి తేలుకున్న సునీత గుప్పెడంత వాడి గుండెలో నిండిన కన్నీళ్లను తుడవడానికి అరచేతిలో ఓ చాక్లెట్ పెట్టేసింది. వాడికింక తెలియదు అది నిజమైన తీపి కాదని..
వాడి సంతోషాన్ని చూస్తూ ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు.
అంతలోతుగా నిద్రలోకి జారుకోని సునీత నడిరాత్రి నిద్రలోంచి లేచింది. వాడి చేతిలో చాక్లెట్..ముఖంలో అమాయకత్వం చూస్తూ..ఐదేళ్లు వెనక్కెళ్లింది సునీత..తాను చివరిసారిగా ప్రసాద్‌తో మాట్లాడిన మాటలు..తన స్పర్శ ఇంకా ఆమె గుండెలో పదిలంగా ఉన్నాయి.
‘సునీతా..నువు జాగ్రత్తా. నానిగాడు జాగ్రత్తా..’
‘ప్రసాద్..ఆగని దుఃఖంతో సునీత.
‘లేదు సునీత నేను మీకు అన్యాయం చేస్తున్నాను. ఇలా జరుగుతుందని అనుకోలేదు. నన్ను క్షమించు..నానిగాడు జాగ్రత్తా.. వాడికి నేను లేనని తెలిస్తే..?
‘ప్రసాద్ నువ్వలా మాట్లాడకు నువు మాతోనే ఉంటావు’ ఆగని శోకం.
‘ఐయామ్ సారీ సునీత నీకింత అన్యాయం చేస్తానని ఊహించలేదు..ఆ దేవుడు మనకు అన్యాయం చేశాడు. నేను భరించలేను..సునీతా..సు..! రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై రెండు రోజులుగా ఐసియులో ఉన్న ప్రసాద్ మాట్లాడడం ఆపేశాడు. లేదు ఆపేయబడ్డాడు.
సునీత శోకం ఆకాశాన్నంటింది.
ఐదేళ్లుగా ఆమె రోదన హృదయగర్భంలో నిక్షిప్తమై ఉంది. అంతర్వేదనతో ఆమె ప్రస్తుతం జీవిస్తున్నట్లు జీవిస్తుంది. దినేష్‌కు ఊహ తెలిసే వరకు ప్రసాద్ లేని నిజాన్ని వాడికి తెలియనీయకుండా..ప్రసాద్‌పై ఉన్న ప్రేమను మరిచి ఇంకొకరితో ఉండకుండా..దినేష్ గాడు ఏడ్చినప్పుడల్లా తన తమ్ముడు సురేష్‌తో గొంతు మార్చి మాట్లాడిస్తూ తన మానిసక స్థితిని మార్చుకుంటూ ఆమె అంతర్వేదనను భరిస్తూ..ఉదయించిన సూర్యునికి స్వాగతం చెబుతూ నిద్రపోకున్నా కూడా మేల్కొంది. తనలో ముసిరిన చీకట్లను ఏ సూర్యుడు తొలగించలేడనుకుంటూ..

- కొత్త అనీల్ కుమార్ కరీంనగర్ సెల్.నం.9395553393