రాజమండ్రి

అక్షర దీపాలు వెలిగించాలి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకలి చీడ
అడవిని అల్లుకొన్న వేళ
దారిద్య్రపు జోరుగాలి
పేద బడుగు జీవితాన్ని తాకి
కొండలచెంత అమాయకంగా నిల్చొని ఉంది
అంధకార బంధమో
అయోమయపుతనమో
వెనుకబాటుతనం ఇంకా వెక్కిరిస్తూనే
అడుగుని అనుమానించి
ఉనికినే ప్రశ్నించే పరిస్థితి
బతుకుబాటకు తెలీని వెతుకులాట
పెగుల్చుకొన్నా పైకి రాని చేదుపాట
అనంతంగా సాగిపోయే దారులు
బేల చూపుల్ని బట్టీకట్టి మోస్తూనే ఉన్నాయి
బుంగమూతి బుగ్గల్లో
కాంతులు చూడాలని తల్లి ఆశ
ఎందుకో కలత తొణికిసలాడింది
బరువుగా నాన్న గుండెల్లో
కఠినంగా ఉన్న కొత్త పదాలకు
అర్ధాలు వెతుకున్న చిన్నారిని
అమ్మలా తన ఒడిలోకి తీసుకుంది బడి
అభయంగా ఆకలి తీర్చింది
అస్త్రంగా అక్షరం నేర్పింది
కన్నీళ్లు కష్టాల్ని కడగలేవని
ఓరిమి గాయాల్ని మాన్వలేవని
ఆ పసికూనకు అద్దంలో అర్ధం తారుమారైంది.
కాఠిన్యం కోరలు సాచింది
కర్కశంగా మృత్యుపాశాన్ని విసిరి
నిర్దయగా అమాయక బాల్యాన్ని చిదిమేసింది
తపస్సు చేసినా జవాబు దొరకని
విసుగుదల జాగాలో
బ్యురోక్రసి కర్టసి పాగా కబుర్లాడుతుంది
బేషజాల తుంపర్ల కింద
రాజకీయ గొడుగుల పరామర్శ తిరుగాడుతోంది
బాల్యాన్ని కడతేర్చే సమాజానికి
ఇప్పుడు కావల్సింది ఓదార్పులు, విలాపాలు కాదు
వ్యవస్థను పునర్ నిర్మితం చేసే సాధకులు కావాలి
అగాధాలు పూడ్చడానికి
ఆయుధదారులు రావాలి
అంతరాలు తొలగించటానికి
అక్షర దీపాలు వెలిగించాలి
బాల్యాన్ని ఉజ్జీవపరిచే జ్యోతికావాలి
- రవికాంత్
సెల్: 9642489244
**
గాయాలకి మందుగా...

అమ్మ తనమెపుడు కమ్మనై
అణువులందు పులకింత అవుతుంది
బిడ్డ భవితే ఆమెకి శ్వాస
శరీరానికి గాయమైనా
మనసు వేదనా భరితమైనా
మనిషి కళ్లు చెమ్మగిల్లుతవి
అపుడు భార్య కూడా
అమ్మలా మారిపోతుంది
చంటి బిడ్డను చేసి
సకల ఉపచారాలలో
నిండా మునిగిపోతుంది
ప్రతి పనిలోను భాగస్వామ్యం
ఆమెకి తృప్తినిస్తుంది
ఆమె ఓదార్పులో
గాయమైన మనసు
ఊపిరిపీల్చుకుని
సేద తీరుతుంది
పిల్లలు ఎదిగి, పెద్దయినాక
నాన్న జ్ఞాపకాలను
కళ్ల ముందర పరుస్తారు
కొందరు అనుబంధాన్ని
జీవనాడికి చుట్టుకుని
కొండంత ధైర్యాన్ని
ఊపిరిగా నిలుపుతారు
ప్రేమని హృదయమంతా
పూసుకుని నిరంతర సేవల్లో
శ్రమని అరగదీస్తారు
చూపుని నాన్న చుట్టూ
పహారాగా నిలుపుతారు
బాధ్యతని వర్తమానం చేసి
నాన్న కోలుకోవటం చూసి
తృప్తి మొక్కై విహరిస్తారు

- ఎస్.ఆర్.పృథ్వి, రాజమహేంద్రవరం, సెల్: 9989223245
**
కదన కుతూహలం

అవును నమ్మండి నమ్మకపోండి
చెప్పేవాడికి వినేవాడుంటే కదా
కథ చెప్పేది
అది ఉత్కంఠభరితంగా
భయం గొలిపేలా ఉంటేనే
రసవత్తరంగా సాగినట్లు లెక్క
ఒళ్లంతా గగుర్పొడిచి
గుండె పట్టేస్తేనే కదా
కదన కుతూహలం
ఆకలి బాధతో అల్లల్లాడి
పెంటకుప్ప చివర్లోనో
మురిక్కాలువ మొదట్లోనో
చెత్త ఏరుకు తింటున్నాడని
హృదయ విదారకంగా చెప్తేనే
రాసిన వాడికి చప్పట్లు
ఒళ్లు కప్పుకోవడానికి
గుడ్డ ముక్కే తప్ప
మార్చుకోవడానికి మరొకటి లేదని
కళ్ల నిండా అప్పటికప్పటి జాతిలో
వార్తాకథనం చదివితే
అదీ కథనం మధనం
కాల్చుకు తినే మొగుడు,
మోసం చేసే ప్రియుడు
అవమానం చెందిన శరీరం
సహనం చచ్చిన కళేబరం ఆడదంటే
కడివెడు కన్నీరు కథాసాగరం
ఎల్‌కెజిలో థీసిస్ సిలబస్‌తో
చిట్టిపిల్లలు దిగాలు పడి ఏడుస్తుంటే
పువ్వూ సహజంగా వికసించే వరకు టైము లేదని
పట్టి లాగాల్సిందేనని కథ చెప్తే
అదో సెనే్సషనల్
తన నీడ తనని తరుముతోందని భయపడే మనిషికి
మాయేదో మర్మమేదో
తెలియనంత పరుగు
ఒకటే పరుగు పరుగు పరుగు!
- బులుసు సరోజినీ దేవి,
సెల్ : 9866190548.
**
జీవన సమస్యల ముఖచిత్రం

తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఒక ప్రత్యేక స్థానముంది. దీనికి పద్య గేయ ప్రక్రియలు రెండు జంట ప్రవాహాలు. కాలానికి నిలువుటద్దంగా మారిన అనేక జీవన సమస్యలు దీనిలో ప్రవాహప్రతిబింబాలు. ఈ నేపథ్యంలోంచి తనదైన సొంతశైలితో ప్రత్యేక ముద్ర వేసుకోగలిగారు కవి బుడితి రామినాయుడుగారు. వాజ్మయూఖాలు ఇతని రెండవ కవితా సంపుటి. స్వతహాగా రంగస్థల నటుడైన ఈ కవి పద్య, గేయ రచనలు చెయ్యడంలో మంచి దిట్ట. సహజ శైలితో సరళ సుందరంగా సాగిపోతోంది నడక. సామాజిక అనుభవాలను అనుభూతులతో జోడించి ఆత్మాశ్రయ, సామూహిక చింతనలతో, పలు రకాల హెచ్చరికలతో వ్యవస్థను మేల్కొలుపుతూ దిశానిర్దేశనం చేస్తారు కవి.
పెద్ద చదువు చదివి వృద్ధి జెందెదవని
అమ్మానాన్న చదువ నంపినారె
విద్య నేర్వబోయి వెకిలి రాగింగులా
ఆత్మవంచనన్న నదియే కదర అంటూ హితబోధ చేస్తారు రామినాయుడుగారు. పెద్ద చదువులతో వృద్ధిలోకి రావలసిన యువతరం, విద్యను అభ్యసించడానికి బదులు ర్యాగింగుల పేరుతో ఆత్మవంచన చేసుకొని పెడతోవ పడుతున్న విధానాన్ని దుయ్యబడతారు కవి. విద్యాలయాలకు చీడపురుగులా దాపురించిన ఈ విష సంస్కృతికి తుది వీడ్కోలు పలకాలనే అంతర్లీన భావన ఇందులో కొట్టొచ్చినట్టు కనబడుతుంది. సంఘ సంస్కరణలో భాగంగా నవతరాన్ని చైతన్యంతో మేల్కొల్పడానికి అక్షరాల్ని రచనాయుధంగా మలిచారు రామినాయుడు.
అన్యభాషలెన్ని యచ్చియున్నను గాని
మరువదారు తెలుగు మాతృభాష
తల్లిభాష మనకు దైవసమానము
తెలుగు నేర్వవయ్య కలుగు జయము అని
అంటారు ఓచోట. పరాయి భాషలెన్ని నేర్చినా, మాతృభాషైన తెలుగును విస్మరించకూడదు. దైవ సమానమైన తల్లి భాష తెలుగును అభ్యసిస్తే అన్నింటా జయము కలుగుతుంది అంటారు కవి. ఈ మాటలు అక్షరసత్యాలు. మాతృభాషలో పట్టు సాధించిన వాడికి మిగతాభాషలన్నీ, అవలీలగా, అలవోకగా పట్టుబడతాయి. ఈ నేపథ్యాన్ని సామాజిక వస్తువుగా మలచుకొని అచ్చమైన తెలుగు పద్యాన్ని హృద్యంగా అందిస్తారు రామినాయుడు.
మూఢ విశ్వాసాలు కవితలో ముస్లిం సాంప్రదాయక వివాహ వ్యవస్థ బంధాన్ని తూర్పారబెట్టే ప్రయత్నం చేస్తారు కవి.
మూడుసార్లు తలాక్ పలికి / మగడు పొమ్మని చెబితే
మతమేదైనా, భారత /
వనితల కెంతటి కష్టం అంటూ నిలదీసే ప్రయత్నం కనబడుతుంది. ముచ్చటగా మూడుసార్లు తలాక్ ఉచ్ఛారణతో సుదీర్ఘ వైవాహిక వివాహబంధం శాశ్వతంగా వీడిపోవడాన్ని జీర్ణించుకోలేని ఒక విషాద చేదు నిజంగా భావప్రకటన చేస్తారు. ఈ అంతర్మథనంలో మతం పేరుతో భారతీయ ముస్లిం వనితలకు పడుతున్న దుర్గతిని నిలదీసే కంఠంతో ప్రశ్నిస్తూ వర్తమాన సమాజానికి సవాలు విసురుతారు. ఈ రకమైన సామాజిక స్పృహ భావితరాలకు ఆదర్శవంతమైన ఆలోచనా మార్గానికి కొత్తబాట పరుస్తుంది.
పాతకొత్తల మేలుకలయికతో రచనాభిరుచిని కొనసాగించడంలో కవిది అందెవేసిన చెయ్యి. గ్రాంధిక భాషా నడకతోపాటు గేయ సాంప్రదాన్ని పోలిన సరళవచనానికి కూడా పెద్దపీట వేసినట్టయింది.
పలు రకాల వ్యక్తులపైనా, పుష్కర గోదావరిపైనా, మాతృభాషపైనా, రక్తదానంపైనా, నీటిపైనా, పుష్కర తుఫానుపైన రాసినా దేని ప్రత్యేకత దానిదే. వస్తు వైవిధ్యం కనిపిస్తుంది. అభివ్యక్తిలో ఆధునిక పోకడలను అందుకున్నట్లయితే ఈ సంపుటి మరింత శక్తివంతంగా రూపుదిద్దుకుంటుంది. భవిష్యత్తులో మరిన్ని మేలైన రచనలు వాసిలో ఉన్నత ప్రమాణాలను అందుకోవాలని ఆశిస్తూ కవి బుడితి రామినాయుడు గారి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆస్వాదిద్దాం!

- మానాపురం రాజా చంద్రశేఖర్, సెల్ : 9440593910
**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net