నెల్లూరు

రోగం మంచిదే!( కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంగారానికి తుప్పు పట్టదు. కానీ నిత్యానందానికి ఆ జబ్బు రావడం.. బంగారానికి తుప్పు పట్టినట్టే అనిపించింది అతగాడి భార్య నీరజకి. లేకపోతే నిత్య నిద్రలోలుడికి ఆ రోగం రావడం ఏంటి?ఒకప్పుడు తనలో కుంభకర్ణుడి అంశ ఏదో ఉన్నట్టు - ఏ కాస్త సందు దొరికినా చాలు చటుక్కున కునుకు తీస్తుండేవాడు నిత్యానందం. కునుకంటే కునుకేం కాదు - గాఢనిద్ర. నిల్చున్న పొజిషన్‌లో కూడా గురకపెట్టి నిద్రపోగల అతగాడి నిద్రాసమర్థతని తెగ ఎగతాళి చేస్తుండేది నీరజ.
‘‘మీ నిద్రమొహాన్ని తగలెయ్యా! ఎప్పుడు చూసినా ఆ పాడు నిద్రేంటండీ బాబూ?’’ అని తెగ విసుక్కుంటూ ఉండేది. ‘‘్ఛ-పీడ!’’ అని కూడా అనేది.
నిద్ర అనేది జీవితానికి చాలా అవసరం. కానీ, నిద్రపోడవడమే జీవితం కాదు గదా! అదే విషయాన్ని భర్తకు విడమరిచి చెప్పబోతుండేది.
కానీ అతగాడు విన్నపాపాన పోతే గదా? ఆమె అలా చెబుతుండగానే అతను తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకునేవాడు.
‘్ఛ ఖర్మ! అంతా నా ఖర్మ!’ అనుకుని నెత్తి బాదుకునేది నీరజ.
అంతటి నిద్ర పిపాసియైన నిత్యానందానికి ఉన్నట్టుండి ఓ ఫైన్ నైట్ నిద్ర పట్టడం మానేసింది.
‘‘ఏంటబ్బా ఇది?’’ అనుకున్నాడు ఆశ్చర్యంగా...
‘పోనీలే రేపు పట్టుద్దిలే’ అని సరిపెట్టుకున్నాడారోజుకి. రూఫ్ లేకపోతే తను ఏమైపోయేవాడో అని అనుకున్నాడు - ఎందుకంటే - ఆ రాత్రంతా రూఫ్‌కేసి గుడ్లప్పగించి చూస్తూ ఎలాగోలా గడిపేశాడు ఆ రేయిని.
పోనీ ఇంకోలా ‘హాయిగా’ గడుపుదామా అంటే - భార్య ‘రెడ్‌ఫ్లాగ్’ ఊపిందామె.
అంచేత ఆ రేయి అలా నిరర్ధకంగా గడిచిపోయింది.
మర్నాడు రాత్రి -
‘నిన్నంటే ఏదో అలా జరిగింది గానీ, రోజూ అలాగే ఎందుకవ్వుద్ది? అనుకుని ధీమాగా మంచమెక్కాడు నిత్యానందం.
కానీ, అతని ఆశ అడియాసే అయ్యింది. నిన్నటిది ఇవ్వాళ్టిది కలిపి నిద్రపోతా హ్యాపీగా అనుకున్నాడు - కానీ ఏదీ? ఆ రేయిని కూడా అతను రూఫ్‌కేసి గుడ్లప్పగించి చూస్తూనే గడపాల్సి వచ్చింది.
పుస్తకాలు చదివే అలవాటు బొత్తిగా లేదాయె. టి.వి.చుద్దామా అంటే అది కాస్తా చెడి మెకానిక్ దగ్గరకెళ్లి కూర్చుందాయె! భార్యని చూడపోతే ఎర్రజెండానాయె. ఫ్రెండ్స్ ఇళ్లకెళ్లి పేకాడుతూ కూర్చుందామా అంటే - ఆ అలవాటే లేకపోయె..!
రూఫ్ కేసి చూస్తూ గడపక చస్తాడా మరి?
ఆ మర్నాడు కూడా అలాగే జరిగేసరికి బెంబేలెత్తిపోయాడు నిత్యానందం. నిద్ర లేకుండా ఎవడు మాత్రం ఎన్నిరోజులుండగలడు? అదియునూ తెల్లర్లూ రూఫ్‌కేసి చూస్తూ.
‘‘నాకు నిద్రపట్టడం మానేసింది నీరూ..! నువ్వూ గమనిస్తూనే ఉన్నావ్‌గా! ఈ మాయదారి రోగం నాకే రావాలా? నాకేంటో భయంగా ఉంది’’ అంటూ వాపోయాడతను మూడోరోజు నాటి రాత్రి భార్య దగ్గర.
దానికామె ‘‘మీగ్గాక ఇంకెవరికొస్తుందండీ? మొన్నటిదాకా ఈ జీవితానికి సరిపడే నిద్రంతా పోయారుగా! అందుకే శేషజీవితానికింక మీకు నిద్ర అవసరం లేదనుకుని మీకీ జబ్బు రప్పించి ఉంటాడు ఆ భగవంతుడు...’’ అంటూ జోకిందే తప్ప కంగారుపడి శోకాలేం పెట్టలేదు. ఎర్రజెండా ఎల్లకాలం ఊగదు కదా! అంచేత - నాలుగోరేయి, అయిదోరేరుూ నిద్రపట్టకపోయినా హ్యాపీగానే గడిచిపోయింది నిత్యానందానికి. రంభ లాంటి పెళ్లాం పచ్చజెండా ఊపుతూ, పక్కనుండగా రూఫ్‌కేసి గుడ్లప్పగించి చూడాల్సిన అవసరం ఏముంటుంది? అంచేత ఆ రెండు రాత్రులూ అతను రూఫ్‌కేసి చూసిన పాపాన కూడా పోలేదు.
కానీ... ఆరో రేయి మాత్రం రూఫ్‌కేసి గుడ్లప్పగించి చూస్తూ గడపటం అతనికి అనివార్యమే అయ్యింది.
అవునుమరి? ఒకటీ రెండురోజులైతే ఫర్వాలేదు గానీ, తెల్లవార్లూ అదే కార్యక్రమం అంటే ఎన్నిరోజులని సహించగలుగుతుంది ఏ స్ర్తి అయినా? అందునా ఇద్దరు బిడ్డలతల్లి.
‘‘నా వల్ల కాదు బాబూ..! మీ పాట్లేవో మీరు పడండి’’ అని సహజంగానే విసుక్కుని, ఆ నిద్రారహితుడికి ఎడంగా పెళ్లి పిల్లలిద్దరి మధ్య సెటిలైపోయింది నీరజ ఆ రాత్రి.
అలా.. ఇంకో నాలుగైదు రోజులు తెల్లవార్లూ రూఫ్‌ని చూస్తూ గడిపాక.. ఇంక అది తనవల్ల కాని పని అని గ్రహించేసి, డాక్టర్ సత్యానందం దగ్గరికి పరుగుతీశాడు నిత్యానందం - తోడుగా భార్యని కూడా వెంటబెట్టుకుని...
సమస్యేమిటో విన్నాక....
‘‘మీరేం చేస్తుంటారు?’’ అనడిగాడు సత్యానందం.
‘‘తనేమీ చెయ్యదండీ! హౌస్‌వైఫ్... ఇల్లు చక్కబెట్టుకుంటూ పిల్లల్ని కంటూ ఉంటుందంతే. ఇప్పటికీ ఇద్దర్ని కనింది’’ అన్నాడు నిత్యానందం.
‘‘ఈయనకి ఈ జబ్బు తగ్గకపోతే - ఇద్దరేం ఖర్మ ఇంకో ఇరవైమందిని కంటానేమోనని భయంగా ఉంది డాక్టర్... ప్లీజ్ సేవ్‌మీ..’’ అంది నీరజ బేలగా.
‘‘డోంట్‌వర్రీ అమ్మా! అయ్ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం.. అన్నట్టు మీరేం చేస్తుంటారని నేనడిగింది నీ గురించి కాదు. మీ వారి గురించి.. ఏం చేస్తుంటారాయన?’’ ఈసారి నీరజని అడిగాడు డాక్టర్ సత్యానందం.
‘‘బాలాజీనగర్‌లోని కొమ్మన ఫార్మాస్యూటికల్స్‌లో సీనియర్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్...’’ చెప్పింది నీరజ.
‘‘ఎంతిస్తారు నెలకి?’’
‘‘పాతిక వేలు!’’
‘‘సరిపోతుందా?’’
‘‘లేదు డాక్టర్ - ఎలాగో సర్దుకుంటున్నాం...’’ నిజమే చెప్పింది నీరజ.
‘‘దెన్ యూ డూ వన్‌థింగ్ మిస్టర్ నిత్యానందం’’ అన్నాడు డాక్టర్ సత్యానందం - నిత్యానందం వైపు తిరిగి.
‘‘చెప్పండి డాక్టర్..’’ ఒకింత ముందుకు వంగుతూ వినయంగా అన్నాడు నిత్యానందం.
‘‘మా హాస్పిటల్ నైట్‌వాచ్‌మెన్ అప్పలకొండ ఆరోగ్యం బావుండటం లేదని పని మానేశాడు. నువీరోజే రాత్రికొచ్చి డ్యూటీలో జాయినైపో.. జీతం నెలకి పనె్నండువేలు. పగలు నీ పనిని నువ్వు మామూలుగా చేసుకోవచ్చు..’’ అన్నాడు డాక్టర్ - కాబోయే నైట్‌వాచ్‌మెన్‌ని మన్నించడం దేనికిలెమ్మని ఏకవచనంలోకి మారిపోతూ..
‘‘దిసీజ్ టూమచ్ డాక్టర్..’’ అని కోపంగా ఇంకా ఏదో అనబోయాడు నిత్యానందం. కానీ అతనికి మధ్యలోనే అడ్డుపడుతూ ‘‘మీరు ముయ్యండి నోరు’’ అని గసిరిపారేసి ‘‘్థ్యంక్యూ డాక్టర్.. ఈరోజే జాయినవుతారు..రెండు నెలల జీతం అడ్వాన్స్ ఇవ్వండి..’’ అంటూ కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది నీరజ.
అంతే! ‘‘హే భగవాన్!’’ అంటూ బిగ్గరగా అరిచి స్పృహతప్పి పడిపోయాడు నిత్యానందం.
పోడామరి! పగలంతా మంచి ఉద్యోగం చేస్తున్న వ్యక్తికి సడన్‌గా నైట్‌వాచ్‌మెన్ ఉద్యోగం కూడా వస్తే - ఎవరు మాత్రం తట్టుకోగలుగుతారు?

- కోలపల్లి ఈశ్వర్
చరవాణి : 8008057571