దక్షిన తెలంగాణ

దిక్కెవరు? (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం తొమ్మిదయింది..
సెల్ ఫోన్ మ్రోగింది..
రెస్పాండ్ కాకుండా మళ్లీ నిద్రలోకి జారుకున్నా..కాసేపటికి మళ్లీ ఫోన్ మ్రోగింది. ఏంటీ పడుకోనీయకుండా ఏమిటీ ఈ గోల అని..నాలో నేనే గుణుగుతూ..నెంబర్ చూడకుండానే ఫోన్ ఎత్తి ‘హలో’ అన్నాను.
‘హలో డియర్’ అన్న ఆత్మీయ పలకరింపు..కమ్మని స్వరం..నన్ను ఏక బిగిన నిద్రమత్తు వదిలేలా చేసింది.
ఆ వాయిస్ నన్ను..ప్రాణం కన్న మిన్నగా ప్రేమిస్తున్న కీర్తనదని తెలుసుకోవడం క్షణాల్లో జరిగిపోయి..తేరుకుని ‘హ..హలో కీర్తన’ అంటూ గొంతు కలిపాను.
ఆమె మాటల్లోని మాధుర్యం..నన్ను పులకరింపజేస్తుంటే..‘చెప్పు కీర్తన’ అని అన్నాను..లోలోన నిద్ర భంగమైందని ఓ వైపు సవ్వడి చేస్తున్న ఆలోచనలను ప్రక్కన పెట్టి..‘ఏమిటీ విశేషాలు?’ అన్నాను.
‘ఏ ముంది ప్రత్యేకంగా..ఈ రోజు ఆదివారం కదా..దొర గారిని ఒకసారి పలకరిద్దామనుకున్నానులే’ అని వెటకారంగా అంది..వెంటనే ఫోన్ ఎత్తలేదన్న బాధ, ఆమె మాటల్లో ప్రతిధ్వనిస్తుంటే..
‘అయ్యో డియర్ వెంటనే ఫోన్ రెస్పాండ్ కాలేదన్న కోపమా? నీకు తెలుసుగా నేను ఓ పత్రికా కార్యాలయంలో వెలగబెట్టే నౌకరు..రాత్రి ఒంటి గంట వరకు రూంకు రానివ్వదు..నిన్న రాత్రి మరీ రెండయ్యింది. అందుకే తొమ్మిదైనా ఉదయం నన్నింకా నిద్రాదేవి వదలడం లేదు కీర్తన!’ అన్నాను. ‘అయ్యో బంగారం లాంటి నిద్రను డిస్టర్బ్ చేశా ఏమీ అనుకోకు’ అంది కీర్తన. ‘అనుకునేదేముంది. మేల్కొన్నానుగా..’ అన్నాను. ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కీర్తనకు సామాజిక సేవ అంటే ఎంతో ఇష్టం..తనకు ఏమాత్రం తీరిక దొరికినా..దొరుకునా ఇటువంటి సేవ అంటూ పేదవారికి ఏదో ఒక రకంగా తోడ్పతుంది. ఈ రోజు ఆదివారం కనుక అందుకే చేసి వుంటుందని మనసులో అనుకునే లోపే..‘ఈ రోజు వృద్ధాశ్రమానికి వెళ్లి పండ్లు పంబి వద్దామా!’ అంది కీర్తన..
‘ఓ అలాగా తప్పకుండా’ అని అన్నాను. ఎందుకంటే ఇలాగైనా..తనను కలిసినట్టుంటుందని భావించి చకా చకా తయారై.. బయటకు బయలుదేరా! ఇంటి ముందున్న టిఫిన్ బండి వద్దకు చేరి.. గబగబ ఉప్మా తినేశా! నా కోసం కీర్తన ఎదిరి చూసే..బస్‌స్టాప్‌కు వెళ్లా..
ఇంతలో కీర్తన వడివడిగా.. బస్‌లోంచి దిగింది. అందమైన ముఖ వర్చస్సు..కుందనపు బొమ్మ..సుగుణమే ఆభరణంగా వున్న ఆమె వ్యక్తిత్వం..నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే..ఆమెపై నుండి దృష్టి మళ్లక అలాగే కొన్ని క్షణాలు ఉండిపోయా!
‘ఏం ఏ లోకంలో వున్నావు డియర్’ అంటూ కీర్తన గట్టిగా అనడంతో..ఉలిక్కిపడ్డా..
‘ఏం లేదు.. పదా’ అంటూ ఆటోలో వృద్ధాశ్రమానికి వెళ్లాము. వృద్ధుల ఆశ్రమం లోకి ప్రవేశించాము.. ముప్పది మంది వరకు తమ కన్న పిల్లల ఆదరణకు నోచుకోని అభాగ్యులు.. కాటికి కాళ్లు చాపి కాలం వెళ్లదీస్తున్నారు. కృష్ణా, రామా అంటూ మనుమలు, మనుమరాళ్ల మధ్య హాయిగా గడపాల్సిన జీవన సంధ్యలో.. ఈ దుర్భర పరిస్థితులు వీరికెందుకు దాపురించాయని ఇద్దరం మనసులో మదన పడుతూ కళ్లలో తిరిగే కన్నీళ్ల సుడులను కర్చ్ఫీలకు అద్దుకుంటూ.. నిర్వాహకులు సంజీవ్‌ను కలిశాం..
మాకు మేము పరిచయం చేసుకుని.. ఆశ్రమంలోని వృద్ధులందరికీ ఈ రోజు సాయంత్రం మాతరపున పండ్లు కొనిపెట్టమని.. అయిదొందల రూపాయలిచ్చాము. ‘సరే నండి..్ధన్యవాదాలు’ అన్నాడు సంజీవ్. టీ కోసం ఇద్దరం ప్రక్కనే ఉన్న బేకరీ వైపు అడుగులేశాం..మార్గంలో ఫుట్‌పాత్‌పై నడుస్తూ వెళ్తున్న మాకు..ఇద్దరు అనాధ బాలలు కనిపించారు. ఒంటిపై చిరిగిన డ్రెస్‌లు..చింపిరి జుట్టు..పట్టుమంటు పదేళ్లు కూడా నిండని చిన్నారుల నొసటి రాతమారి రోడ్డుపై వచ్చీపోయే వారిని దగ్గరకు పిలిచింది. ‘ఏం బాబు..మీదేవూరు? మీ అమ్మా నాన్నలు ఎక్కడ?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది.
‘జారుతున్న చెడ్డీని పైకి లేపుతూ..మాకు తెల్వదమ్మ..అంటూ ఒక రూపాయి ఇవ్వమ్మ’ అన్నాడు ఆ ఇద్దరిలో ఒకడు.
చక్కగా అమ్మానాన్నల మధ్య ఉంటూ బడికెళ్లి చదివే వయసులో ఇలా..్భక్షాటన చేస్తూ అనాథలుగా గడుపుతున్న దీనస్థితిని చూసి పర్స్‌లో నుండి వంద రూపాయలు తీసి ఇచ్చింది కీర్తన..
‘దండాలమ్మ అంటూ ఇద్దరు కీర్తన కాళ్లపై పడ్డారు. వారిని పైకి లేపి..‘గాడ్ బ్లెస్ యూ’ అంటూ తల నిమిరి..బాధాతప్త హృదయంతో అక్కడి నుండి బేకరీకి చేరాం..
బిస్కట్ టీ ఆర్డర్ చేశాం.. బిస్కట్ ప్లేట్ ముందు పెట్టాడు బేరర్..కానీ తినాలనిపించడం లేదు..వృద్ధాశ్రమం..రోడ్డుపై వున్న అనాధలే మా మది నిండా ఆవరించి కలిచి వేయసాగాయి..ప్రభుత్వ పథకాలు ఎన్నో వున్నా..కానీ దీనులకు, అర్హులకు చేరకపోవడంపై ఈ రోజు ఓ ప్రత్యేక వ్యాసం రాసి పాలకుల్లో చలనం తెద్దామని టీ త్రాగి అక్కడి నుండి కదిలాం..
‘బై’ అంటూ కీర్తన హాస్టల్ దారి పట్టింది. అప్పటికే టైం రెండవ్వడంతో..నేరుగా ఆఫీసుకు వెళ్లాను ‘దిక్కెవరు?’ అన్న శీర్షికతో వార్తా కథనం మొదలు పెట్టాను!
**
- సంటి అనిల్ కుమార్
శ్రీరాములపల్లి, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9542620878

**
పుస్తక సమీక్ష

సాదా సీదాగా వికసించిన ‘మట్టిపూలు’

‘వసంతమై అల్లుకోకుండా / ఎడారిలోకి నెట్టివేసిన వేళ / విరబూసిన ఆనందాలు / వాడిపోతున్న తరుణంలో / మనసు కన్న కలలకు సాక్ష్యం ఏది?’ - అని ప్రశ్నిస్తూ.. తన అంతరంగంలోని భావాలకు అక్షరాకృతినిస్తూ కవి పొన్నగంటి ప్రభాకర్ ‘మట్టిపూలు’ కవితా సంపుటిని వెలువరించారు.
నీతో ఉన్న క్షణాలు వసంతంలా విరిసినా / దాని వెనక వేసవి ఉందని / గుర్తించలేక పోయాను అంటూ ‘గమ్యం’ తెలియని స్థితిని కవిత్వీకరించే యత్నం చేశారు.
ధైర్యమై ఎదురు నిలిచి / అవాంతరాలకు లొంగిపోని / ఆశించని హస్తంలా భాసిల్లాలని ‘స్నేహం’ గురించి చక్కగా ఆవిష్కరించారు. ‘నీనెవరు?’ కవితలో.. నిజంలాంటి నీడ ఒకటి చీకటిలో చిక్కుకు పోయింది. అంతరంగాన్ని నిశ్శబ్దం ఏలుతుంటే.. ఏవేవో మసకబారిన జ్ఞాపకాలు మదిలో మెదులుతున్నాయని చెప్పిన తీరు బాగుంది. ‘చెలిస్పర్శ’ కవితలో కవి పండించిన భావాలు రమణీయంగా వున్నప్పటికీ..’ మిగతా కవితల్లో కవిత్వపు ప్రమాణాలు పాటించి వుంటే బాగుండేదని పాఠకులు భావించే అవకాశముంది. చాలా కవితల్లో కవిత్వాంశ కొరవడింది. కవి తాను ఎంపిక చేసుకున్న కవితా వస్తువులు బాగున్నప్పటికీ.. అభివ్యక్తిలో ఇంకా పరిణతి సాధించాల్సి వుందని పాఠకులు ఇట్టే పసిగడతారు. ప్రకటించే భావాల్లో సందిగ్ధతకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తపడాల్సి వుంది. వాక్యాలను పంక్తులుగా పేర్చి.. ప్రకటిస్తే కవిత్వమై పోదన్న సంగతి కవి గుర్తిస్తారన్న విశ్వాసం ఉంది. వస్తువు, రూపం, శిల్పం వంటి అంశాలపై దృష్టి సారించాల్సి వుంది. కవి ‘మనసు’ అన్న పదంపై మనసు పడ్డట్టున్నారు. ‘మనం మనసు పెట్టి ఇందలి కవితల్ని చూస్తే.. మూడు, నాలుగు కవితలు తప్ప.. ఇంచుమించు ప్రతి కవితలో ‘మనసు’ పదాన్ని వాడారు. కవి యొక్క కవిత్వం ‘మనసు’కే పరిమితమయ్యిందా? అన్న చందంలా కొనసాగించారు. ఇప్పటికైనా ‘మనసు’ ఊత పదం చట్రంల్లోంచి కవి బయటకొస్తే.. సొగసైన కవిత్వం వైపు అడుగులేయవచ్చు! కవిత్వం రాయడంలోని మెళకువలు తెలుసుకుని అధ్యయనంపై దృష్టిపెట్టి.. కవి తమ కలానికి పదును పెట్టుకోవాలని కోరుకుందాం!
- సాన్వి, సెల్.నం.9440525544
**
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net