విశాఖపట్నం

ముందుచూపు ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నా మరణానంతరం నా యవదాస్తి, అప్పుల మీద పూర్తి హక్కులు నా భార్య అయిన కనకానికి ఇచ్చుచున్నాను. పూర్తి స్వేచ్ఛగాను, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ఉన్న పరిస్థితిలో ఇది రాస్తున్నాను. ఈ వీలునామాకు సాక్షులు’’ చదివాడు సుందరమూర్తి.
కనకం కన్నీళ్లు పెట్టుకుంది. భర్త గోవిందం గుర్తొచ్చి.
‘‘నాకోసం ఏం తగలేయనక్కరలేదు. నా పాస్‌బుక్‌లో ఉన్నది వాడండి చాలు’’ భర్త అనే మాటలు గుర్తుకొచ్చాయి ఆమెకి.
గోవిందం బూడిదగా మారి మూడు రోజులయింది.
రిజిస్టర్ పోస్టులో ఒక లెటర్ వచ్చింది కొడుక్కి. అది తండ్రి రాసింది. చనిపోయిన వాడెలా రాశాడో అనుకున్నారు అంతా.
ఆ ఉత్తరంలో ఇలా ఉంది.
‘కనకానికి ఆశీస్సులు. నా గురించి ఎక్కువ ఖర్చు చేయనక్కరలేదు. అకౌంట్‌లో యాభైవేలు ఉన్నాయి. చాలంతే. నీ పేరిట ఏడు లక్షలు ఉంచాను. అందులో ఆరు లక్షలు నీ మరణానంతరం అంత వరకు నిన్ను బాగా చూసుకున్న వారికి అంతా గానీ, నీకు నచ్చినంత గానీ ఇవ్వవచ్చు. మిగిలిన మొత్తం ఇక ఈ నాలుగు లక్షలు నీ ఖర్చులకు పది సంవత్సరాలకు వాడుకోవలసి ఉంది. దీంట్లో పిల్లలకు ఎటువంటి హక్కులుండవు. బాబుకు ఉద్యోగం, ఉద్యోగస్తురాలైన పిల్ల ఉంది. బతుక్కి లోటులేదు. వాడు కొనుక్కున్న ఇల్లు అనుభవించాలే గానీ అమ్మేయకూడదు. అమ్మాయికి జీవితం స్థిరపడలేదు కాబట్టి నీ నగల్లో మూడు వంతులు అమ్మాయికి ఇవ్వాల్సి ఉంటుంది. ఈలోగా ఉద్యోగస్తురాలైతే చెరిసగం అమ్మాయికి, కోడలికి నీ తదనంతరం పంచెయ్. అమ్మాయి పేర అయిదు లక్షలు ఉంచాను. వడ్డీ మాత్రం ఖర్చు చేయాలి. అసలు పదేళ్ల తర్వాత వాడుకోవాలి. నా కోసం ఎవరూ బాధపడొద్దు. కన్నీళ్లు అమూల్యమైనవి పొదుపుగా వాడుకో’. సెలవ్.
- నీ గోవిందం
**

అసూయ

సిగరెట్ తాగుతూ, మధ్యలో కాఫీ సిప్ చేస్తూ చాలా సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు శ్రీనివాస్. రెండ్రోజుల క్రితం శర్మ కనిపించాడు. శర్మను అతను గుర్తు పట్టలేకపోయాడు. వాళ్లిద్దరూ ముప్పై అయిదేళ్ల క్రితం స్నేహితులు. డిగ్రీలో మూడేళ్లు క్లాస్‌మేట్స్. మనస్సు గతంలోకి పరిగెత్తింది.
అవి బియస్సీ చదువుతున్న రోజులు. శ్రీనివాస్ దగ్గరలోనే ఉన్న రైల్వే క్వార్టర్స్ నుండి వచ్చేవాడు. శర్మ ఎక్కడో అగ్రహారం నుండి చిరిగిన బట్టలు, కాలికి జోళ్లు లేకుండా వచ్చేవాడు. వాడి వాలకం చూసి శ్రీనివాస్ హేళన చేసేవాడు. వీడు పనికిమాలిన వెధవ అని మనసులో ముద్ర వేసేసుకున్నాడు. అయినా వాళ్లిద్దరి మధ్య స్నేహం పెరిగింది. కాలేజీ రోజులు గడిచిపోయాయి. తర్వాత కొన్నాళ్లు ఉత్తరాలు రాసుకునేవారు. కాలం జ్ఞాపకాల్లో చివరికి ఇద్దరూ కనుమరుగైపోయారు. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. శ్రీనివాస్ బియస్సీ కంప్లీట్ చేయలేదు. గాలివాటంగా తిరుగుతూ, సిగరెట్లు కాలుస్తూ, ఇంగ్లీష్ నవలలు చదువుతూ కాలం గడిపేసాడు. శర్మ మాత్రం దుర్భర పరిస్థితుల్లో బియస్సీ పూర్తి చేసి తర్వాత ఎమ్మెస్సీ చేశాడు.
‘‘ ఏరా ఎన్నాళ్లకు కనిపించావు? బాగున్నావా?’’ అంటూ ఆప్యాయంగా పలకరించాడు.
శ్రీనివాస్‌ని చూసి శర్మ సంతోషించాడు. ఇద్దరూ కాసేపు కాలేజీ ముచ్చట్లు చెప్పుకున్నారు.
మాటల మధ్యలో శర్మ చెప్పాడు తను ప్రభుత్వ కళాశాలలో పని చేస్తున్నానని.
‘‘గుమస్తాగానా?’’ వెటకారంగా అన్నాడు శ్రీనివాస్.
‘‘కాదు అసోసియేట్ ప్రొఫెసర్ ర్యాంకులో ఉన్నాను’’ అంటూ చాలా కూల్‌గా చెప్పాడు శర్మ వెటకారానికి కాస్త నొచ్చుకున్నా.
శ్రీనివాస్‌కి తన మీద వెనకటి భావమే ఉందని అనుకున్నాడు. చాలా కాలం తర్వాత స్నేహితుడిని కలవడం వల్ల శర్మ అవేమీ పట్టించుకోలేదు.
‘‘నువ్వేం చేస్తున్నావ్?’’ అని శ్రీనివాస్‌ని అడిగాడు.
‘‘రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పని చేస్తున్నాను’’ ఒకింత అహంతో చెప్పాడు శ్రీనివాస్.
ఇంకా ఇద్దరికీ పదేళ్ల సర్వీసు ఉంది. పిల్లలు చదువుకుంటున్నారు. ఆనాటి నుండి ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు.
శర్మకి ఫోన్ చేసినప్పుడలా ‘‘ ఏరా వెధవా, చవటా’’ అంటూ తిట్లతో ప్రారంభిస్తాడు.
అదీ భార్యా పిల్లల ఎదుటే. దాంతో వాళ్లు ‘ ఓహో ఈయన ఎంత గొప్పవారో. అవతల శర్మ ఎంత హీనమైనవాడో అనుకోవాలని తాపత్రయం.
మళ్లీ భార్యని ఒక కప్పు కాఫీ అడిగి సిగరెట్లు తాగుతూ తెగ సీరియస్‌గా ఆలోచిస్తున్నాడు శ్రీనివాస్.
అతని మనసు ప్రశాంతంగా లేదు. ప్రశాంతంగా ఉండవలసిన సముద్రం మధ్యలో పెనుతుపాను పుట్టినట్లుగా గతాన్ని గురించి అనేక ఆలోచనలు ఉత్తుంగ తరంగాల్లా లేచి అంతరంగాన్ని కలచివేస్తున్నాయి. గతంలోకి మనస్సుని పరిగెత్తించి ఆలోచనలను మూటగట్టుకుని మరీ వెనక్కి తెచ్చుకుని తెగ బాధపడిపోతున్నాడు.
బియస్సీ మూడేళ్లు పూర్తయ్యే సరికి శ్రీనివాస్ ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్‌కాలేదు. శర్మ మాత్రం ఎమ్మెస్సీ కూడా పూర్తి చేసి మంచి స్థాయికి చేరుకున్నాడు. మూడేళ్ల కాలాన్ని వ్యర్ధం చేసినందుకు తర్వాత శ్రీనివాస్ చాలాసార్లు బాధపడ్డాడు. ఇంటర్ అర్హతతో రైల్వే చిన్న ఉద్యోగం సంపాదించుకుని స్థిరపడ్డాడు. లంచాలు వచ్చే పదవి కనుక బాగానే సంపాదించాడు. దూరవిద్యా విధానంలో ఎంఏ చేశాడు. దాంతో ప్రమోషన్, ఆదాయం వచ్చి పడ్డాయి. ఇద్దరు పిల్లల్ని బాగా చదివించి విదేశాల్లో స్థిరపడేలా చేశాడు. సంఘంలో కాస్త హోదా పెరిగింది. అయినా శర్మని చూస్తే మనసు విలవిలలాడుతోంది. ఎంఏ పాస్ అయినట్లు తెలియగానే శర్మకి ఫోన్ చేశాడు. ‘‘ఇప్పుడు నువ్వూ నేను సమాన క్వాలిఫికేషన్‌తో ఉన్నాం’’ అంటూ గొప్పగా చెప్పాడు. దానికి శర్మ అభినందనలు తెలిపి నవ్వుతూ ఊరుకున్నాడు.
ఒకరోజు శర్మ కొలీగ్ ఒకతన్ని శ్రీనివాస్ కలిసాడు.
మాటాల మధ్యలో అతను శర్మని తెగ పొగిడేసాడు. ఆయన పేరంత పొడవున డిగ్రీలు ఉన్నాయని, అపర మేధావి అని అన్నాడు. ఆ మాటకి శ్రీనివాస్ మనసు కుతకుతలాడింది. ఆ మర్నాడు శర్మకి ఫోన్ చేసాడు.
‘‘ ఏరా శర్మ నీకు చాలా డిగ్రీలు ఉన్నాయట గదా. మీ కొలీగ్ ఒకాయన చెప్పాడు. మరి నాకెప్పుడూ చెప్పలేదేం?’’ అడిగాడు శ్రీనివాస్.
‘‘నా గురించి నేనెప్పుడూ చెప్పుకోను’’ వినయంగా అన్నాడు శర్మ. ‘‘పోనీ డబ్బులైనా సంపాదించావా?’’
‘‘అదీ నాకు చాత కాలేదు. నాకు చాతనైనది ఒక్కటే చదువు. వచ్చిన జీతపురాళ్లు తప్ప నాకే సంపాదనా లేదు. ట్యూషన్లు చెప్పుకోవడం, ప్రైవేట్ కాలేజీల్లో పాఠాలు చెప్పి డబ్బు సంపాదించవచ్చు. కానీ ప్రభుత్వ ఆంక్షలు వీలు కాకుండా చేశాయి’’ అన్నాడు.
ఈ మాటలకి శ్రీనివాస్ చాలా సంతోషించాడు.
రోజూ భార్య దగ్గర శర్మ గురించి చెబుతూ తన అక్కసునంతా వెళ్లగక్కేవాడు.
శర్మ అతనికో అబ్సెషన్ అయిపోయాడు. భార్య ముందు శర్మని తిట్టని రోజు లేదు.
ఒకరోజు శ్రీనివాస్‌కి హార్ట్ ఎటాక్ వచ్చింది. హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. మైల్డ్ ఎటాకే కనుక నాలుగు రోజుల్లో డిస్చార్జ్ చేసేశారు. సిగరెట్లు మానేయాలని, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలని డాక్టర్లు శ్రీనివాస్‌కు సీరియస్‌గా సలహా ఇచ్చారు. బిపి ఎక్కువగా ఉండడం వల్ల క్రమం తప్పకుండా మందులు వాడాలని చెప్పారు.
డిస్చార్జ్ అయి ఇంటికి రాగానే శ్రీనివాస్ మళ్లీ శర్మని తిట్టడం మొదలుపెట్టాడు.
‘‘ ఆ పనికిమాలిన వెధవ శర్మకి ఫోన్ చేయాలి. ఆ చవట, గాడిద వెధవ వాడూ ఫోన్ చేయ్యలేదు. అయినా వాడికి నా అనారోగ్యం గురించి చెప్పలేదు’’ అని నీరసంగా కుర్చీలో కూలబడ్డాడు.
దాంతో భార్యకి చిర్రెత్తుకొచ్చింది.
‘‘మీరెందుకు శర్మని చవట, పనికిమాలిన వెధవ అని తిడుతుంటారు?’’ అని శర్మని వెనకేసుకొచ్చింది.
‘‘మీకు గుండెనొప్పి ఎందుకు వచ్చిందో తెలుసా? కేవలం సిగరెట్లు తాగడం వల్ల కాదు. లోలోన శర్మ పట్ల ఓర్వలేనితనం వల్ల కూడా. ఎప్పుడూ అతని గురించే ఆలోచిస్తూ తెగ బాధపడిపోతుంటారు. ఎందుకో మీకు శర్మ కన్నా తెలివైన వాడినన్న నమ్మకం ఉంది. నిజంగా మీరు శర్మకన్నా తెలివైన వారై ఉంటే బియస్సీ ఎందుకు పూర్తి చేయలేకపోయారు’’
భార్య అలా శర్మని వెనకేసుకొస్తుందని శ్రీనివాస్ ఊహించలేదు.
‘‘మీరు శర్మని చవట, పనికిమాలిన వెధవ అని ఎందుకంటున్నారో తెలుసా? అతను మీకన్నా తెలివైన వాడని మీకు తెలుసు. కానీ మీరు దాన్ని అంగీకరించలేకపోతున్నారు. అది మీలో ఉన్న ఆత్మన్యూనతా భావం. దానిని మరోలా వ్యక్తం చేయాలని మీరు భావిస్తున్నారు. అలా ప్రకటితమైతే దానిని అసూయ అంటారు. చూడండి నేనంటున్నానని మీరు బాధపడకండి. ప్రతి మనిషిలోను కొద్దోగొప్పో తెలివి, విద్వత్తు ఉంటుంది. శర్మ విషయంలో ఆనాడు ఆయన కుటుంబం ఉన్న పరిస్థితిలో అది బయటపడి ఉండకపోవచ్చు. ఆనాటి పరిస్థితులను ఎదిరించి తనకు తానే ఒక వ్యక్తిగా ఎదిగాడు. ఇందులో ఆశ్చర్యపడవలసిందీ, అసూయ పడవలసిందీ ఏమీ లేదు. మనం ఇంకొకరి కన్నా గొప్పగా ఉండాలనుకోవడం తప్పు కాదు కానీ ఇంకొకరు మన కన్నా తక్కువగా ఉండాలనుకోవడం పాపం. ఈ పాప ప్రవృత్తే అసూయకు మూలం. అందుకే మీరు తెగ బాధపడిపోతున్నారు. మనం చాలా మంది కన్నా ఉన్నతంగా బతుకుతున్నాం. కానీ అందరూ మనకన్నా తక్కువగా ఉన్నారని అనుకోవద్దు. నేను మీకు చెప్పేటంతటి దాన్ని కాను. ఒక్కొక్కరికి ఒక్కో స్థాయి ఉంటుంది. ప్రతి వ్యక్తినీ ఆయా స్థాయిలను బట్టి గౌరవించాల్సిందే. ఇంకొకరు మనకన్నా తక్కువగా లేరని ఏడుస్తూ బాధ పడితే మనకే ఆరోగ్యం పాడై గుండెనొప్పి వస్తుంది. మీరు సిగరెట్లు మానేయడంతో పాటు మీ దృక్పథాన్ని కూడా మార్చుకోగలిగితే మీ ఆరోగ్యం అదే బాగుపడుతుంది’’ అంటూ మెత్తగా చీవాట్లు పెట్టింది.
దానికి శ్రీనివాస్ సాంత్వన పొందాడు. మానసికమైన పరివర్తన వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగా కుదుటపడింది.

- నిష్టల సింహాచల శాస్ర్తీ, అక్కయ్యపాలెం,
విశాఖపట్నం-530016. సెల్ : 9492641284.