విజయవాడ

విశ్వవిజేతల మెరుపు.. ( మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. అంతరిక్షములోని కద్వితీయమ్ముగా
నూట నాలుగు ‘శాటిలైటు’లంపి
ఉద్వేగభరితమై ఉత్కంఠతో చూచు
వేలాది హృదయాల వేడ్క నింపి
గత రికార్డులనెల్ల గత చరిత్రగ మార్చి
అగ్ర దేశాల ముందడుగు వేసి
విశ్వవిజేతగా విఖ్యాతమై నిల్చి
జగతికే మనశక్తి చాటిచెప్పి

తే.గీ. ఖండఖండాంతరమ్ముల ఖ్యాతి తెచ్చి
భరతమాతకు ఘనకీర్తి నెరపినట్టి
శాస్తవ్రేత్తల నెల్లర సంస్తుతింతు
అతులిత ముదాన ‘ఇస్రో’కు అంజలింతు

సీ. ఆనాటి ఓటములార్తిన రగిలించి
తిరుగులేని విజయాల తీరు చూప
తప్పులన్ గ్రహియించి గొప్పగా శ్రమియించి
అన్ని దేశాలలో మిన్న కాగ
సాయమడిగినట్టి సాటి దేశాలకే
సముచిత రీతిన సాయపడగ
నూట నాలుగు ‘శటిలైటు’ లతి రయాన
నిర్ణీత సమయాన నింగికెగయ

తే.గీ. అవధులెరుగని ఆనందమయ్యె మాకు
వాడవాడల సరికొత్త పండుగయ్యె
శాస్తవ్త్రేల నెల్లర సంస్తుతింతు
అతులిత ముదాన ‘ఇస్రో’కు అంజలింతు!

- చల్లా రామలింగశర్మ,
గుంటూరు.
చరవాణి : 9701112366
**

పూజగదిలో మేలుబంతివి!

ఓ.. ముద్దబంతీ
ముగ్దమోహన పూబందీ
పూజగదిలో మేలుబంతివి
స్ర్తిజాతికి నువ్వు సిగబంతివి
ప్రకృతి ప్రేమికులకు మాటామంతివి

సన్నని నడుముతో
వనె్నల సోయగాలతో
ఎంత ముద్దొస్తున్నావో!

మంచు సోనలకు నిలువెల్లా తడిసి
పిల్లగాలికి మెల్లిగా తలాడించి
గండు తుమ్మెదకు దండిగా తేనెలందిస్తావ్!

ముద్దబంతీ
ముద్దుల ఇంతీ
నీలో మూగమనసుల బాసలున్నాయి
నీ శుద్ధకాంతిలో
మంచి మనసుల
సంభాషణలున్నాయి!

- జి సూర్యనారాయణ
బందలాయిచెరువు, కృష్ణా జిల్లా.
చరవాణి : 9704784744
**

వృక్షమా.. నీకివే వందనాలు!

రహదారికిరువైపుల
ఠీవిగ తీరుగ నిలిచి
ఛత్రమై నీడ నిచ్చావు
చామరమై సుగంధ
పరిమళ గాలి వీచావు
పక్షి జాతిని పరమ ప్రేమించి
గూడునిచ్చి నెత్తికెక్కించుకున్నావు
ఇక మనుష్య జాతికి,
అడ్డ నిలువులు నీవై గూడునిస్తావు
వంగి మరీ పండ్లు కాయలనిస్తావు
బడి నీవు గుడి నీవు
బస్టాపు నీవు
నీవు లేక మా బ్రతుకు స్టాపు
జీవించినంతకాలం పోషించి
పెట్టెవై కట్టెవై కాటికొస్తావు
కాలి బూడిదై నీలో కలుపుకుంటావు
నీవు లేని తావు
ఇసుక లేని ఎడారి

నిప్పులు చెరిగే ఎండలో
నిస్త్రాణంతో నీ నీడకు చేరి
సేదతీరేది వీరే!
విస్తరణ పేరుతో
విచక్షణ రహితంగా
నేలకూల్చేది వీరే.!
సేవే నా లక్ష్యం అంటూ
చిగురులుతో మొలకలెత్తుతున్న
నీకివే నా వందనాలు

- టిఆర్‌కెజి ప్రసాద్
విజయవాడ
చరవాణి: 9494965879
**

నానీలు

మంచి కథ చదివా!
చాలా బాగుంది
రచయితతో ఒక్కమాట...
ఆఁ పోనిద్దూ!

సిపాయిల
అకుంఠిత సేవ
మన ప్రశాంత జీవనం
తీర్చుకోలేని ఋణం!

అపూర్వ చిత్రాలు
అందించిన విశ్వనాధ
తరతరాలకూ
విజయగాధ!

నిర్విరామ శ్రమ
తేనెటీగలది.
మకరందం
మన అందరిది!

చూస్తే చాలు నాటకం
చదివితే చాలు పుస్తకం
ఫ్రీగా...
కళ బతుకుతుంది!
పరమ భక్తులం?
దేవుళ్ళ చిత్రాలు
కవర్లపై ముద్రించి
చెత్త పాల్చేస్తాం!

నాయకులకు
నజరానాలు!
సంక్రాంతి కోళ్ళను
స్వర్గానికి పంపినందుకు!

నిద్ర పట్టని
నడిరాత్రి
నానీల జన్మకు
నడుం కట్టింది!

- కోపూరి పుష్పాదేవి,
విజయవాడ.
చరవాణి : 9440766375