విజయవాడ

వెలుగునీడల కలనేత (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీ. విరి ఆమనియొ? కాదు - పెదనోట్ల రద్దనం
తర కాంతి పరిమళనవత కాని;
మహితచైత్రమొ? కాదు - ‘మన్‌కి బాత్’ కలల సా
రథ్యవౌ ‘స్వచ్ఛ భారతము’ కాని;
వర‘హేమలంబ’ సుందరతయా? కాదు - భ
వ్యామరావతి వైభవమ్ము కాని;
కలకోకిలాలాపముల హడావిడొ? కాదు
కవితా ‘రజనిగంధ’ కళయె కాని;
అళుల రొదయొ? ‘ట్రంపు’నినాద గళము కాని;
శుచి ఉగాది పచ్చడి చేదురుచియొ? కాదు -
అమెరికాహత భరత విద్యార్థి కాని;
వెలుగునీడల కలనేత తెలుగుగాది
‘జాగరూకత చెలగుమా! జగతిలోన’
అన్న సందేశమును నీకు అందజేసె!

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ,
గుంటూరు.
చరవాణి : 9866944287
**

ఆమె ఒక ఉగాది!

ఆమె ఒక ఉగాది
జీవన సంధ్యారాగంలో
బతుకు పండించిన సహచరి
కలిమి లేముల్లో కష్టసుఖాల్లో
తోడునీడగా చీకటిలో వెనె్నలై
చిరుదీపాలు వెలిగించిన జీవనజ్యోతి
చిరునవ్వులు చిందిస్తూ
శ్రమనంతా మర్చిపోయి
సంసారాన్ని చక్కదిద్దుకునే ఇల్లాలు
అలసిసొలసిన వేళ చల్లగాలిలా సేదదీర్చుతుంది
దాంపత్య జీవనంలో అరమరికలు లేక
ఆణిముత్యాల్లాంటి వారసులనందించి
ఆలనాపాలనా చూసే మాతృమూర్తి
విసుగూ విరామం లేకుండా
యంత్రంలా కష్టించే శ్రమజీవి
అనుబంధాల కోసం జీవన మాధుర్యాన్ని అందించే
ఈ అనంత విశ్వంలో అపురూపమైన స్ర్తి!
ప్రతిభాపాటవాలను ప్రదర్శించే కళాకారిణి
సహనం, విజ్ఞత ఆమెకు అలంకార భూషణం.
ఆమె ఒక ఉగాది
ఆమె రాకతో వసంతం వచ్చి వాలుతుంది
ఋతువులన్నిటినీ అక్కున చేర్చుకొని
కాలగమన పాఠాలను బోధించే గురువు
ఉపద్రవాలను అవాంతరాలను
ధైర్యంగా ఎదుర్కొనే అజేయ శక్తి!
ధర్మాన్ని నాలుగుపాదాలపై నడిపించే దేవత
జగమంతా కుటుంబాన్ని ఏలిన పరాశక్తి
ఆకలి దప్పుల్ని తీర్చే అన్నపూర్ణ!
వసంతంలో వెనె్నల మాధుర్యాలు
పూయించే వనదేవత!
అనితర త్యాగాలకు ప్రతిబింబమైన మాతృమూర్తి
సృష్టికే సృష్టికర్త
ఆత్మాభిమానమే ఆయుధం
ఆత్మస్థైరాన్ని నింపుకున్న ఆదిశక్తి!
ఆమె తలచుకుంటే చాలు
ప్రకృతిని వికృతిగా మార్చగలదు
సమస్తాన్ని సంసార బంధనంలో
ఇముడ్చుకున్న స్ర్తిమూర్తి
కరుణిస్తే శాంతమూర్తి
కాదంటే అగ్నిహోత్రి
ఆమె ఒక వసంతం ఆమె ఒక ఉగాది
ఆమె ఒక మహిళా చైతన్యమూర్తి!

- తాటికోల పద్మావతి,
గుంటూరు.
చరవాణి : 9441753376
**

అనురాగం పెంచేలా..

చల్లని వెనె్నల్లో చందమామలా
ప్రభాత కిరణాల వెలుతురులా
తొలకరి చినుకల చిరుసవ్వడిలా
పచ్చని పంటచేల పరవశంలా
చిరునవ్వుల చిన్నారి ఆనందంలా
అమ్మపాడే కమ్మని జోలపాటలా
ఆదరణతో అభిమానించే స్నేహితునిలా
ప్రజలకు ప్రాణవాయువునిచ్చే వృక్షంలా
కరవుకాటకాలకు కళ్లెం వేసే కల్పవల్లిలా
మంచిని పంచి మానవత్వం పెంచేలా
అన్నార్తుల ఆకలికి అన్నపూర్ణలా
మనసులలో శాంతిసుమాలు విరిసేలా
మనుషుల మధ్య అనురాగం పెంచేలా
కర్షకుల కళ్లలో కాంతిరేఖలు నింపేలా
చీకటి జీవితాలకు వెలుగుదీపంలా
కోటి ఆశలతో కొంగ్రొత్త కోరికలతో
అందరిలో ఆత్మవిశ్వాసం నింపగా
ఆనందాన్ని పంచ రావమ్మా ‘హేవలంబ’
నవ ఉగాదీ.. నీకిదే
మా శుభ స్వాగతం

- కాకరపర్తి సుబ్రహ్మణ్యం,
తెనాలి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9848297711
**

ఉగాది ఉషస్సు

నేనొక వసంతగీతికను
చైత్ర ప్రభాత ప్రశాంత వీచికను
తరువు తనువులపై పల్లవించిన పత్రికను
ప్రకృతి, పురుషుల గాఢ పరిష్వంగంలో
ఉదయించిన పుత్రికను
ఆకుల అంచుల నుంచి జాలువారి
తల్లివేరుని తడిమే తుషార బిందువుని
పుప్పొడి రేణువునై -
గాలి అలల మీద తేలియాడే
సుమసుగంధాన్ని
తేటనీటి కెరటమై సెలయేటి కదలికలలో
ధ్వనించే మృదంగనాదాన్ని
ఏటవాలు కొండల్లో పరవళ్లుతొక్కే
జలపాతాల యవ్వనాన్ని
ఎలమావి చివుళ్లు మేసి
రెమ్మల గుబురుల్లో
ఎలుగెత్తి కూసే ఎలకోయిల
స్వరమాధుర్యాన్ని
శిశిరం తెరమరుగయే నిశిరేయి
తారల తోరణాల మాటునుంచి
ఉగాది ఉషస్సు కోసం వేచిచూస్తున్న
వినీలాంబరపు సంబరాన్ని
ప్రకృతిలోని ప్రతి అణువునీ
ప్రేమతో పలకరించుతూ
ఆశలు చిగురించుతూ
హాయిగసాగే ఆమనిని!

- బలభద్రపాత్రుని ఉదయశంకర్,
నందిగామ,
చరవాణి : 9494536524
**
హేమలంబ.. స్వాగతం!
రేయింబవళ్ల వికృత విన్యాసాల నడుమ
కష్టాల కడలిలో ఈదులాడుతోన్న
సామాన్యుడి జీవన సమరాన్ని
శుష్క హాసాలతో పరిహసిస్తూ
చిద్విలాసంగా వెళ్లిపోయింది దుర్ముఖి!
దుర్ముఖి పాలన దుర్మార్గమై భాసిల్లింది
కృష్ణమ్మ తీరం కలుషితమై
హరితవనాలు అదృశ్యమై
పసిడిపంటలకు నెలవైన
నల్లరేగడి నేల
కాంక్రీటు రహదారుల నిలయమై
భూమితల్లి గుండెపై
బరువైన యంత్రాలను దించినవేళ
రైతన్న కంట కన్నీరు ఒలికింది!
నాగలి నడయాడిన నేలను
ఆధునిక యంత్రాలు ఛిద్రం చేయగా
మల్లెల పరిమళాలు వెదజల్లిన వనకన్య
పుట్లకొలదీ ధాన్యపు రాసులను
ప్రసవించిన అవనిమాత
రైతన్నల ప్రేమబంధానికి దూరమై
కసాయి పాలకుల కనుసన్నల్లో
బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు!
పాడిపంటలు శూన్యమై
ఆధునిక హర్మ్యాల నిలయమై
ధరణిమాత తల్లడిల్లుతోంది!
నవ్యాంధ్ర రాజధాని నడిబొడ్డున
భూమిపుత్రుల దీనస్థితిని చూసి
ఉగాదిలక్ష్మి ‘హేమలంబ’
విషణ్ణవదనంతో
కన్నీరుకార్చింది!
- విడదల సాంబశివరావు
చిలకలూరిపేట, గుంటూరు జిల్లా. చరవాణి : 09866400059
**

ఆదిగురువు అమ్మలా..

ఉత్సాహానికి నాంది పలికి
గాభరా పడకుండా
దినదినాభివృద్ధి చెందమని
తెలుపుతుందీ ఉగాది!
ఆవేదన చెందకయా! మానవా!
బతుకు కూడా
ఉగాది పచ్చడివలె
తీపి చేదుల సమాహారమే!
పాతకాలాన్ని నెమరువేసి చింతించక,
కొత్తకాలంతో ఉత్సాహంగా పరుగులెత్తు
ఆదిగురువు అమ్మ ఎలాగో
తెలుగువారికి ఉగాది అలాగని!
మరువకుమా.. మానవా!

- సంగాపు లీలాలిఖిత,
మంగళగిరి, గుంటూరు జిల్లా.
చరవాణి : 9908427624
**

చైత్ర రథమా..

శే్వతాశ్వములతో
చైత్ర రథమునెక్కి
నేత్రానందము కలుగ
షడ్రుచుల సంగమమై
గున్నమావి గుబురుల
గుబాళింపులై
కోయిల స్వరరాజమై
కొత్త పెండ్లికూతురై
పైరు పంటల పైటవేసి
శుభ పరిణామాల
పారాణి పెట్టి
ప్రకృతి మాత
తిలకము దిద్దగ
ఉదయ కిరణాలు
ముంగురులు సర్దగ
వసంతరాణి
వేలు పుచ్చుకొని
నీతి నియమాల
తోరణాల మధ్య
ఓ నూతన వర్షమా
హేమలంబ రావమ్మా!
మాపాలిటి వరంగా..!!

- మాదిరాజు మాలతి,
సత్తుపల్లి, ఖమ్మం జిల్లా.
చరవాణి : 9959133714
**
వసంత గీతం

ప. ఓహో! వసంతమా!
నవలతాంత శుభోదయమా!
కిలకిల కోకిల సుస్వర
లహరీ నినాదమా!
చ. అరుణ పలాశ తరుశోభితమా!
పచ్చలు పొదిగిన ధరణీ లలామ
సోయగమా!
ఓహో! వసంతమా!

గుడిలో మ్రోగెడి గంటల ధ్వనులా!
క్షిలుసురతతి వినిపించెడి
వేదపు మంత్రములా!
ఓహో! వసంతమా!

సత్కవిగాయక కోలాహలమా!
చదువులదేవీ కరయుగ
వీణా నినాదమా!
ఓహో! వసంతమా!

గడపల ముగ్గుల శోభాకృతులా!
యువ సతీపతుల
అనురాగపు షడ్రుచులా!
ఓహో! వసంతమా!

- కలవకొలను
సూర్యనారాయణ,
గుంటూరు.
చరవాణి : 9849268659
**
జయము.. జయము జయహో!

ఉగాది పండుగ నూతన కాంతుల
వసంతకాలము చైత్ర మాసము
సృష్టి వెలుగులు కన్నుల పండువ
వేపపువ్వుల చేదు మధురము
తూరుపు గాలుల రాగసోయగముల
వర్షపు గాలుల వూగిసలాటలు
వంగి చూస్తున్న వానమబ్బులు
మామిడి చిగుళ్లమధ్యన చేరి
మత్తకోయిలల కువకువలు
గండుతుమ్మెదల తుంబర నాదం
తెల్లని మల్లెల సుగంధ సౌరభం
వేపపువ్వుల సృష్టి పరిమళం
దిరిశన చెట్ల పూల సువాసన
శిశిరం వెళ్లే వసంతమొచ్చె
చైత్రమాసపు తరువుల చిగుళ్లు
వసంతగానం వెల్లివిరియగ
మరులుగొలుపు మధుమాసపు వెలుగులు
నిండు పరువాల జవ్వని వూహలు
కలలుగనే కనె్నపడుచులు
తీరని ఆశల మది కంపింపగ
సీతలకాంతులు వేచి, దోసెను
మన్మధుని పదసేవలు కోరి నిలిచెను
పాణిగ్రాహములకు ప్రాయపువరులను
ప్రసాదించుము ప్రకృతి వరమున
వృష్టిపాతములను సస్యశ్యామలముగ
సంభాళింపుము సమతుల్యమున
ధరణి మాతను అక్కున చేర్చి
చీడపీడలను నశింపజేసి
పసిడి పంటలు ప్రాయము నొందగ
అన్నము పెట్టే రైతురాజుకు
అందలములు, ఆదరణల తోడ
అందించుము అపురూప సంపదలు
వనాలు పెరిగి పచ్చదనములను
జీవకోటికి జీవము నింపుము
నీ చిరునగవులతో సిరులు దండిగా
ధరణి దేవతను పులకింపజేసి
నవధాన్యములను పండించు దండిగా
పర్యావరణమును ప్రభవింపజేసి
పండించుము బంగారు పంటలు
దీవించుము ప్రాణికోటిని
హేమలంబ.. జయము జయము
జయహో నీకు!

- తన్నీరు సీతారామాంజనేయులు,
జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా.
స్థిరవాణి : 08654 - 224726