విశాఖపట్నం

ముసుగు ( కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంస్కృతీ సాంప్రదాయాలు పేరు చెప్పి ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలను చూస్తే నిజంగానే ఆశ్చర్యంగా ఉంటుంది. తరాలు మారినా, మనుషులు మారినా వాళ్ల ఆలోచనల్లో మార్పు రాదేమో బహుశా. చిన్నప్పటి నుండి వినయవిధేయతలతో పెరిగి పెద్దదైన సుధ ఎన్నో మధురమైన ఊహల ఊసుల బాసలను మనసులో పెట్టుకుని ఒడిశాలో ఉన్న మేనమామ కొడుకుని పెళ్లి చేసుకుని అత్తవారింట్లో అడుగుపెట్టిన రెండవ రోజు...
‘‘సుధా మన ఊరికి కొన్ని ఆచారాలు, పద్ధతులు ఉన్నాయి. ఈ రోజు నుండి వాటిని నీవు కూడా ఆచరించాల్సి ఉంటుంది. ఇంట్లో నుండి బయటికి వెళ్లాలి అంటే కచ్చితంగా ముసుగు వేసుకునే వెళ్లాలి’’
‘‘ముసుగు వేసుకోవాలా ఎందుకత్తయ్యా? వేసుకోకపోతే ఏమవుతుంది?’’
‘‘నేనేం చెప్పానో అలా ఉండాలి. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు ఇక ముందు వేయకు అర్ధమయిందా? వంట పూర్తి అయ్యాక ఇంట్లో ఉన్న వాళ్లందరికీ భోజనాలు పెట్టి అందరి భోజనాలు అయ్యాక నీవు భోజనం చెయ్యాలి. అసలే మీ మామయ్యగారికి కోపం ఎక్కువ. అతనికి కోపం రాకుండా చూసుకో’’ అంటూ చెప్పింది మీనాక్షమ్మ.
‘‘అలాగే అత్తయ్యా’’ అంటూ కళ్లలో సుడులు తిరుగుతున్న కన్నీళ్లను కనబడనీయకుండా దాచుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయింది సుధ.
‘‘వదినా వదినా ఏం చేస్తున్నావు. అమ్మ మనిద్దరినీ బావికి వెళ్లి నీళ్లు తీసుకురమ్మంది పద’’ అంటూ రెండు బిందెలు తీసుకుని వచ్చింది మరదలు నీరజ.
‘‘సరే పద’’ అంటూ అడుగు వేయబోతున్న సుధని ఆపి ‘‘ ఇలా బయటికి వెళ్లకూడదు ఉండు వదినా’’ అంటూ తలపై నుంచి చీర చెంగు మొహం కనిపించకుండా కిందకి లాగింది నీరజ.
‘్భగవంతుడా! అసలు ఏమీ కనిపించదు కదా ఎలా అడుగులు వెయ్యాలి’ అనుకుంటూ రెండు అడుగులు వెయ్యగానే కాలికి రాయి తగిలి రక్తం కారింది. ‘‘అమ్మా’’ అంటూ గట్టిగా అరిచింది సుధ.
‘‘మరేం కాదులే వదినా పద ఇవన్నీ మామూలే. నాకు ఇలా ఎన్నో తగిలాయి. పద ఆలస్యం అయితే అమ్మ తిడుతుంది’’ అంటూ నీరజ పిలిచే సరికి సుధ బలవంతంగా అడుగులు వేయసాగింది.
నడిచే కొద్దీ ఏదో దుర్వాసన. ఏమిటా అని తల దించి చూస్తే నడిచే దారికి ఇరుపక్కల మలమూత్రాలతో నిండి కంపు కొడుతుంది. ఎలాగో నీరజతో కలసి బావి దగ్గరకి వెళ్లింది సుధ.
‘‘ ఏమిటి నీరజా మీ వదినను నీళ్ల కోసం తీసుకు వచ్చావా?’’ అంటూ ఓ నలుగురు ఆడంగులు కలసి అడిగారు. మరో ఇద్దరు ఆడవాళ్లు స్నానం చేస్తున్నారు. ఆ పక్కనే ముగ్గురు మగవాళ్లు స్నానం చేస్తున్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు శరీర భాగాలన్నీ తడి బట్టల్లో కనిపిస్తున్నాయి. అక్కడి పరిస్థితి చూసి సుధ ఆలోచనలో పడింది. అసలు వీళ్లంతా మనుషులేనా? ఆడవాళ్లు బయటికి వచ్చేటప్పుడు ఎవరూ చూడకూడదనేగా మొహాలకు ముసుగులు వేసేది. తీరా ఇక్కడ ఇలా అందరూ ఒకేచోట స్నానాలు చేయడం అసలు ఇదేం ఆచారం? చుట్టూ ఉన్న చెత్తను శుభ్రం చేయాల్సిందిపోయి వాటిని చూడకుండా ఉండేందుకు కాబోలు అలా మొహాలకు ముసుగులు వేసేసుకుంటున్నారు. ఆడవాళ్లు ఆరుబయట మలవిసర్జన చెయ్యడానికి వెళితే రాని సిగ్గు మొహం మీద ముసుగు వేసుకోకుండా తిరిగే సిగ్గుగా అనిపిస్తుందా? అసలు నేను పెరిగిన వాతావరణానికి, ఇక్కడికి ఎంత తేడా? ఇలా అయితే మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం కూడా కొద్దిరోజుల్లోనే కోల్పోవాల్సి వస్తుంది.
ఏమీ మాట్లాడకుండా సుధ నీరజతతో కలసి నీళ్లు పట్టుకుని వచ్చేసింది.
బావి దగ్గర స్నానం చేసి వచ్చి వంట చేసింది.
అత్తగారు చెప్పినట్లు అందరికీ వడ్డించింది.
అంతా భోజనాలు చేసి వెళ్లిపోయారు. సుధకి ఒక్కసారిగా ఏడుపు వచ్చింది. అదే ఇంటి దగ్గర అయితే అందరి కంటే చిన్నదానిని కనుక అందరూ కొసరి కొసరి తినిపించేవారు.
ఇల్లు మారినంత మాత్రాన మనసు మారిపోతుందా? మాంగల్యం బరువు మెడలో పడగానే కుటుంబ బాధ్యతలు మోయగలిగే శక్తి రాత్రికి రాత్రే వచ్చేస్తుందా? అన్నయ్యకు పెళ్లి చేశాక చాలా రోజుల వరకు వదినను వంట గదికే రానిచ్చేది కాదు అమ్మ. తనకు ఇష్టమైతే చదువుకోమని లేదంటే ఏదైనా ఉద్యోగం చేసుకోమని అమ్మ చెప్పడం తనే స్వయంగా వింది. వదిన కూడా మా ఇంటికి కోడలే కదా. మరి అమ్మ ఎందుకు అత్తయ్యలా ప్రవర్తించలేదు? అని ఆలోచిస్తూనే ఏదో కాస్త తిని తన గదిలోకి వెళ్లి అప్పటికి గాఢ నిద్రలో ఉన్న భర్తను చూసి నిట్టూరుస్తూ నిద్రపోయింది సుధ.
‘‘సుధా లే తెల్లరింది’’ అంటూ గావుకేకలు పెడుతున్న భర్త వంక చూస్తూ ‘‘ ఇప్పుడింకా నాలుగు కూడా కాలేదుగా. అంత తొందర ఏమిటి కాసేపు నిద్రపోనివ్వండి ప్లీజ్’’ అంటూ బ్రతిమాలింది సుధ.
‘‘నీ ఇష్టం అమ్మ ఇక్కడికి వచ్చి నిన్ను నిద్రపోతున్నట్లు చూస్తే గొడవ చేస్తుంది. తర్వాత చెప్పలేదు అనకు. లే అవనసరంగా గొడవ అవసరమా?’’
‘‘అసలు ఏమిటండీ ఈ ఆచారాలు, వ్యవహారాలు నాకు అర్ధం కావడంలేదు. ఉదయం నుండి ఎంత నరకయాతన అనుభవించానో మీకు ఎలా తెలుస్తుంది? నా గురించి పట్టించుకోనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలి? చదువుకున్న మీకు కూడా అర్ధం కావడంలేదా? ఇలా అయితే ఎక్కువ రోజులు నేను ఇక్కడ ఉండలేను’’
‘‘మా అమ్మ చేసుకోమంది చేసుకున్నాను. నీకు సమస్యగా అనిపించిన విషయం ఏదైనా ఉంటే అమ్మతో మాట్లాడు. నేను బయటికి వెళుతున్నాను’’
‘్భగవంతుడా! ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి? కట్టుకున్న వాడే నా సమస్యను అర్ధం చేసుకోకపోతే ఎవరు అర్ధం చేసుకుంటారు? ఈ మనుషుల్లో మార్పు తీసుకురావాలి అంటే ఎలా? అసలు తన సమస్యకి ఆ బావి వద్దే పరిష్కారం దొరుకుతుంది’ అనుకుని ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా హాయిగా ఊపిరి పీల్చుకుంది.
* * *
‘‘అత్తయ్యా పెళ్లికి వచ్చిన చుట్టాలంతా ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. నీరజ కూడా వెళ్లిపోయింది. మీరు ఒప్పుకుంటే నేను ఇంట్లోనే చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పాలని అనుకుంటున్నా’’ అంది సుధ.
ఏమని ఆలోచించిందో మీనాక్షమ్మ తెలియదు గానీ ‘‘సరే! రేపటి నుండి ప్రారంభించు’’ అంది.
తన ఆలోచన కార్యరూపం దాలుస్తుందన్న సంతోషాన్ని నొక్కి పట్టి ‘‘అలాగే అత్తయ్యా’’ అంది సుధ.
పక్కింటి పిల్లల నుండి పక్క వీధి పిల్లల వరకు అందరికీ మెల్లగా ట్యూషన్ చెప్పడం మొదలు పెట్టింది. సాయంత్రం ట్యూషన్ పూర్తి కాగానే ‘‘పిల్లలూ మీ అందరూ ట్యూషన్ ఫీజు తీసుకురావాలి’’ అని అత్తగారికి వినబడేలా చెప్పి ‘‘రేపు ఉదయం బావి దగ్గరకు రమ్మని ఒకో చీటీ మీద రాసి పిల్లల చేతికి ఇస్తూ ‘‘ ఇది జాగ్రత్తగా మీ అమ్మకు ఇవ్వమని ప్రతి ఒక్కరికి ఇచ్చింది.
‘‘అత్తయ్యా నేను బట్టలు ఉతికి వస్తాను. పెళ్లి బట్టలన్నీ నల్లగా ఉన్నాయి. అన్ని పనులు చేసేసా. మీరు విశ్రాంతి తీసుకోండి’’ అని చెప్పి మెల్లగా బట్టలు తీసుకుని ముసుగు వేసుకుని బయటికి నడిచింది సుధ.
బావి దగ్గరకి వెళ్లే సరికి ఓ ఇరవై మంది ఆడవాళ్లు బిందెలు పట్టుకుని వచ్చారు. ఇంచుమించు అందరూ చదువుకున్న వాళ్లలాగే కనిపిస్తున్నారు. అందరినీ పలకరిస్తున్నట్లు ఓ చిరునవ్వు నవ్వింది సుధ. ‘‘సుధా ఏమిటి మా అందరినీ రమ్మన్నావు ఏదైనా విశేషమా’’ అని అందరూ ఒకేసారి అడిగారు.
‘‘మీ అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఆ తర్వాత మీకు ఎవరికైనా ఏమైనా అడగాలి అనిపిస్తే అడగండి’’ అని చెప్పి మరుగుదొడ్డి వలన కలిగే లాభాలు, అవి లేకపోవడం వల్ల ఊరిలో ఉన్న పిల్లలు, పెద్దవారు, ముఖ్యంగా ఆడవారు ఎలాంటి ఇబ్బందులకు గురి అవుతున్నారో అర్ధమయేలా చెప్పింది. ఈ సమస్య గురించి ఆలోచించకుండా మనం ఇలాగే బతికేయడం అస్సలు బాగోలేదు. ఆచార వ్యవహారాలు అన్నా, సంస్కృతీ సాంప్రదాయాలు అన్నా నాకు చాలా ఇష్టం కాని ఇవన్నీ అనవసరపు ఛాదస్తాలు. మీరంతా ఓసారి ఆలోచించి మీ ఆలోచనలు నాకు చెప్పండి’’ అంది.
‘‘సుధా నీవు చెప్పింది నిజమే. కానీ మనం ఏం చెయ్యగలం?’’ అని అందరూ అంటుంటే ఓ ఇద్దరు మాత్రం ‘‘ ఎందుకు చెయ్యలేం? చెయ్యి చెయ్యి కలిసి సంఘటిత శక్తిలా మారి సమస్యలను పరిష్కరించుకోగలం. సుధా నీవు ఏం చెయ్యమన్నా దానికి మేము సిద్ధమే’’ అని ఆ ఇద్దరూ అన్నారు.
‘‘మనందరం కలసి ముందుగా ఎవరింటి నుండి వారే పోరాటం మొదలుపెట్టాలి. మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్లకి అర్ధమయ్యేలా విషయం చెప్పి వాళ్ల నోటి ద్వారానే మరుగుదొడ్డి అవసరం గురించి ప్రస్తావన వచ్చేలా చేద్దాం. పోట్లాటకు దిగితే ఫలితం లేకపోవచ్చు. కాని కాస్త నేర్పరితనంగా మాట్లాడి వాళ్లుగా వాళ్లు మారేలా మనం ప్రయత్నిద్దాం సరేనా?’’
‘‘అవును సుధా నీవు చెప్పింది బాగానే ఉంది. ఇంత మందిలో సగం మంది మనసు మారినా నీ ప్రయత్నం సఫలం అయినట్టే. నా వంతుగా ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తాను. మన ఊరి స్కూల్ టీచర్స్‌ని కూడా ఇందులో భాగస్వాములను చేస్తే మన పని ఇంకా సులువు అవుతుంది’’
‘‘అవును రాధా మన ఇంట్లో మనం చెప్పిన మాట కంటే పరాయి వాళ్లు చెప్పే మాటలే మన పెద్దవాళ్లకు అర్ధం అవుతాయి. మన స్కూల్లో ఇద్దరు లేడీ టీచర్లు ఉన్నారు. వాళ్లది కూడా మన వయసే. వాళ్ల ఆలోచనలు కూడా మనతో కలిస్తే మనకున్న ముసుగు సమస్యతో పాటు మరుగుదొడ్డి సమస్యకి కూడా పరిష్కారం దొరుకుతుంది.
‘‘సరే’’ అన్నారు అంతా.
‘‘రేపు ఇక్కడే ఇదే సమయానికి అంతాకలుద్దాం’’ అంది సుధ.
అంతా ఎవరిళ్లకి వాళ్లు వెళ్లిపోయారు.
* * *
పది రోజులు గడిచే సరికి ఆ ఊరిలో ఉన్న ఒక్కో కొత్త కోడలి ముసుగు తొలగిపోతుంటే చూసి సుధ చాలా సంతోషించింది. నా ముసుగు తొలగే రోజు ఎప్పుడు వస్తుందో. జంతువులకే ఆలోచనా శక్తి ఉంది. మరి మనుషులకి ఉండదా? కచ్చితంగా మా అత్తగారు మారుతుంది అని మనసులో అనుకుంటూ వంట పూర్తి చేసింది సుధ.
‘‘మీనాక్షిగారు మీనాక్షిగారు ఏం చేస్తున్నారండీ? నిజంగా మీరు ఆణిముత్యం లాంటి కోడల్ని తీసుకువచ్చారు’’ అంటూ పది మంది ఆడవాళ్లు ఇంట్లోకి వస్తుంటే విషయం ఏమిటో మీనాక్షికి అర్ధం కాలేదు.
‘‘మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?’’ అంది.
‘‘అదేనండి ఎన్నో తరాలుగా మన ఊరి ఆడవాళ్లు పడుతున్న అవస్థల్ని, ఛాదస్తాల్ని తన తెలివితేటలతో నెల రోజుల్లో మార్చి ఊరు ఊరంతా గర్వించదగ్గ విషయమే కదా. అందుకే మేమంతా కలసి మిమ్మల్ని అభినందించడానికి వచ్చాం’’ అన్నారు ఆడాళ్లంతా.
మీనాక్షి మరేం మాట్లాడకుండా ‘‘అమ్మా సుధా ఒకసారి ఇలా రా’’ అంటూ పిలిచింది.
అత్తయ్య పిలుపులోని మార్పు గమనించగానే తన ఆలోచన ఫలించినందుకు సంతోషిస్తూ ముసుగు కాస్త మొహానికి కప్పుకుని అత్తగారి ఎదుట నిలుచుంది సుధ.
‘‘అమ్మా సుధా ఇన్నాళ్లు నేను ఓ కోడలిగా పడ్డ ఇబ్బందుల్ని నీ మీద రుద్ది ఓ రకమైన మానసిక సంతోషాన్ని పొందడానికి ప్రయత్నించాలే కానీ ఆ రోజు నేను పడే బాధే నీవూ పడుతున్నావు అని ఆలోచించలేకపోయాను తల్లీ. అసలు చదువుకున్న నేను కూడా ఇలా ఆలోచించడం నిజంగా నా మూర్కత్వం. పోనీలే తల్లీ నా కోడలి వల్ల ఇంతటి మంచి పని జరిగింది అని అందరూ అనుకుంటూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఏది ఏమైనా విచక్షణారహితంగా ప్రవర్తించిన నన్ను క్షమించు’’ అంటూ సుధ తలపై ముసుగుని తొలగించి సుధ నుదుటిపై ముద్దు పెట్టి సుడులు తిరిగిన కన్నీటిని తుడుచుకుంది మీనాక్షమ్మ.
*
- సిరి లాభాల,
విజయనగరం
**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.