నెల్లూరు

చింతాలయ్య రూరల్ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి సెలవులు ఇవ్వటంతో బిసి బాలుర హాస్టల్ సందడిగా వుంది. అందరు తమ ఊర్లకు వెళ్లటానికి సామాన్లు సర్దుకొంటున్నారు. కొందరి పిల్లల తల్లిదండ్రులు, బంధువులు, హాస్టల్‌కి వచ్చి వాళ్లని తీసుకువెళ్లడానికి వరండాలో కూర్చుని వున్నారు.
తొమ్మిదో తరగతి చదువుతున్న చింతాలయ్య, వెంకటేశు, రమేష్, ఒకే ఊరుకే క్లాసు అవటం వలన ముగ్గురు ఎప్పుడు ఒకటిగా వుంటారు. తమ ఊరికి పోతున్నందుకు చాలా సంతోషంగా వుంది.
వాళ్ల సామాన్లు సర్దుకొని అక్కడి టీచర్లకు వార్డెన్స్‌కు చెప్పి బయటకొచ్చారు. వాళ్ల ఊరు పోయే బస్సు సాయంత్రం వరకు ఉండదు. అంతవరకు ఏంచేయాలో తోచక ముగ్గురు ఏదైనా సినిమాకి పోదాం అనుకున్నారు. వెంటనే సినిమా హాలుకి బయలుదేరారు.
సాయికుమార్ నటించిన ‘పోలీసుస్టోరీ’ సినిమాకెళ్లారు. అందులో సాయికుమార్ డైలాగ్స్ ప్రవర్తన అన్ని చింతాలయ్య మనసు మీద గాఢంగా ముద్రపడ్డాయి.
తను ఎప్పటికైన పోలీసు అవ్వాలని మనసులో దృఢ నిశ్చయానికొచ్చేశాడు. సినిమా అయిపోయాక దారిలో ట్రాఫిక్ పోలీసు దగ్గర నుండి, స్కూటర్ లైసెన్సులు చెక్ చేసే పోలీసుల్ని గమనించాడు. వాళ్ల దగ్గర అందరు వినయ విధేయతలతో ఉండడం ఎంతో నచ్చింది.
సాయంత్రం వాళ్ల ఊరి బస్సెక్కి రాత్రి కల్లా చేరుకున్నారు. కంచనపల్లి చిన్నగ్రామం, అక్కడ ఐదో తరగతి వరకే బడి వుంది.
చింతాలయ్య ఆదెమ్మ, రమణయ్యకు ఒక్కడే కొడుకు. రమణయ్య రెండెడ్ల బండి తోలుతాడు. వచ్చిన దాంతో పిల్లోడ్ని బాగా చదివించి ఏదైనా ఉద్యోగస్థున్ని చేయాలని రమణయ్య, ఆదెమ్మల కోరిక.
చింతాలయ్య కారునలుపుతో వయసుకు మించిన ఎత్తు, లావు నల్లరాతి విగ్రహంలా ఉండడంతో బడిలో కూడా చింతాలయ్యతో వేరే పిల్లలు మాట్లాడాలన్నా జంకుతారు.
కంచనపల్లిలో తెల్లవారుజామున సూర్యుడి కిరణాలు చెట్ల సందుల్లోంచి పడి మట్టిదారంతా మెరుస్తోంది. ప్రకృతి అందమంతా ఆ పచ్చని పల్లెటూరులోనే వున్నట్లుంది.
చింతాలయ్య ఉదయానే్న వెంకటేశు ఇంటికి బయలుదేరాడు. ‘‘ఏరా అప్పుడే ఆటలకు బయలుదేరాలా ఏమన్నా తిని పోరా’’ అంది ఆదెమ్మ. ‘‘లేదమ్మా, ఇప్పుడే వెంకటేశు ఇంటిదాకా పోయొస్తా’’ అంటూ పరిగెత్తినట్లు వెళ్లిపోయాడు.
వీడు చూస్తే ఇట్టా వుండాడు.. వయసుకు మించి ఎదుగుతున్నాడు. వాళ్ల తాత పోలిక, మనిషి కాకి నలుపు, ఈ ఊర్లో ఉంటే ఆటలే ఆటలు, వీడు బాగా చదువుకుని ఏదైనా ఉద్యోగం చేస్తే బాగుండు మనసులోనే అనుకొంది.
చింతాలయ్య దార్లో రమేష్‌ను తీసుకొని వెంకటేశు ఇంటికెళ్లాడు. వెంకటేశు అప్పటికే వీధిలో రెడీగా వున్నాడు.
ముగ్గురు కలిసి చెరువు దగ్గరికెళ్లారు. దారిపొడవునా టీచర్ల గురించి, హాస్టల్ గురించి నవ్వుకొంటూ దార్లో వంకర టింకరగా నడుస్తూ వాళ్లేం చేస్తున్నారో వాళ్లకే తెలియకుండానే చెరువు దగ్గరకొచ్చారు. చెరువులో ఈత కొట్టడమంటే వాళ్లకి భలే ఇష్టం.
ముగ్గురు చాలాసేపు ఇష్టమొచ్చినట్లు ఈత కొట్టి మాట్లాడుకొంటూ ఇంటిదారి పట్టారు.
ఇంటికి రాగానే ఆదెమ్మ వేడివేడి అన్నం, వాడికిష్టమైన చేపల కూర, రొయ్యల వేపుడు, గోంగూర పచ్చడి అన్నీ చేసి పెట్టింది. ‘‘ఎందుకమ్మా.. ఇన్ని చేశావు’’ అన్నాడు.
‘‘హాస్టల్ భోజనం బాగుంటుందా’’ అడక్కూడదనే అడిగింది.
‘‘్ఫర్వాలేదమ్మా’’ అన్నాడు.
తమలాంటి వాళ్లకు హాస్టల్‌లో ఏంపెట్టినా తినాల్సిందే అనుకొన్నాడు.
‘‘బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది’’ అంది.
‘‘అవునమ్మా, నేను పోలీస్ అవుతాను’’ అన్నాడు నిశ్చయంగా.
‘‘పోలీసా, అది చాలా కష్టంరా, దొంగలు, పెద్దవాళ్లతో బాధలు పడాలి’’ ఒకింత భయంతో అంది.
‘‘అదేం లేదమ్మా నాకదే ఇష్టం’’ అన్నాడు.
సరేలే అప్పటి సంగతి అనుకొంది.
ప్రక్కరోజు ఉదయానే్న స్నేహితులు ముగ్గురు మామిడితోట మీద పడ్డారు. చెట్లు ఎక్కడం కాయలు కోసి జేబుల్నిండా తురుముకొని కాపలావాడు తమని ఎక్కడ పట్టుకొంటాడేమోనని తుర్రుమన్నారు.
వాళ్లకి ఈ సెలవులు భలే మజాగా వుంది.
దార్లో ఒకచోట కుందుడుగుమ్మ ఆడారు.
మళ్లా మామూలే. ఇంటికెళ్లి భోంచేసి మళ్లీ సాయంత్రం గుళ్లోకెళ్లి ప్రసాదం తినటం చాలా బాగుంది.
ఇంకోరోజు మైదానంలో ‘దొంగ పోలీస్’ ఆట ఆడారు.
ముగ్గురు చప్పట్లు వేశారు. చింతాలయ్య పోలీసు, వెంకటేశు, రమేష్ దొంగలయ్యారు. చింతాలయయ్య వాళ్లెక్కడ దాక్కున్నా పట్టుకొన్నాడు. మూడుసార్లు ఆట ఆడితే చింతాలయ్యే పోలీస్ అయ్యాడు.
‘‘పోరా ఈ ఆటవద్దు’’ అన్నారు.
చింతాలయ్యకు మాత్రం తను నిజంగా పోలీసు అయినట్టనిపించింది.
శెలవులు అయిపోవటంతో మళ్లీ ముగ్గురు హాస్టల్ చేరుకున్నారు.
మళ్లీ చదువులు, పరీక్షలు.. పదోతరగతి పరీక్షలు కూడా అయిపోయాయి. రమేష్, వెంకటేశు ఇంక చదవమని తమకంత ఆర్థికస్థోమత లేదని ఊరెళ్లిపోయారు.
చింతాలయ్య కాలేజీలో చేరాడు. ఇప్పుడు అప్పటి ఫ్రెండ్స్ లేరు. కొత్త వాతావరణం, కొత్త మనుషులు చాలా రోజులు ఇబ్బందిగానే వుంది. తాను పోలీసు అవ్వాలంటే చదువుకోవాలి.
ఇంటర్ పూర్తవగానే పోలీసు ఉద్యోగాల ప్రకటన వెలువడింది. చింతాలయ్యకు ఆనందం వేసింది.
పోలీసు ఉద్యోగానికి అప్లయ్ చేసి కోచింగ్‌లో చేరాడు.
పోలీసు ఉద్యోగాల ఇంటర్వ్యూలో పాసై ట్రైనింగ్‌కి వెళ్లాడు.
పోలీసు ట్రైనింగ్‌లో చిన్నప్పుడు ఆడిన ఆటలన్నీ ఎంతో ఉపయోగపడ్డాయి. ట్రైనింగ్‌లో మంచి పేరు తెచ్చుకొని జాయినింగ్ ఆర్డర్స్ తీసుకొన్నాడు.
చింతాలయ్యకు రూరల్ పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ఆదెమ్మ, రమణయ్య తమ కొడుకు పోలీసు అయినందుకు సంతోషించారు. కానీ ఆ ఉద్యోగం చాలా కష్టమైంది. పగలు, ప్రతీకారాలు వుంటాయని భయపడ్డారు.
చింతాలయ్య వేరే ఇల్లు తీసుకొని డ్యూటీలో జాయిన్ అయ్యాడు. ఆదెమ్మ, రమణయ్య కొడుకు పెళ్లి చేయాలనుకొన్నారు.
ఎవర్ని సంబంధం మాట్లాడినా పోలీస్ అంటే భయంతో చాలా సంబంధాలు తప్పిపోయాయి.
చివరికి ఒక సంబంధం కుదిరింది.
సరళతో పెళ్లయిపోయింది. పెళ్లయ్యాక చింతాలయ్యకు చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉంది. తాను కోరుకున్న ఉద్యోగం, సరళ బాగానే వుంటుందని అనుకొన్నాడు.
రోజూ డ్యూటీకెళ్లాలి కొత్త కాపురం.
అందులో నైట్ డ్యూటీ కూడా వుండడంతో కొంచెం కష్టంగానే వుంది. ఒక రోజు దొంగల్ని పట్టుకొచ్చి ఎస్సై దశరధరామయ్య ముందు నిలబెట్టారు. అందులో వెంకటేశున్నాడు. వెంకటేశు చింతాలయ్యను చూశాడు. చింతాలయ్య కూడా వెంకటేశుని చూశాడు.
ఇప్పుడు చింతాలయ్యని ఒరే అనాలో..సార్ అనాలో తెలియక అలాగే ఉండిపోయాడు.
ఎదురుగా ఎస్సై ఉండడంతో చింతాలయ్య మాట్లాడలేదు. ఎస్సై చింతాలయ్యను పిలిచి ‘వీళ్లు పొలాల దగ్గర మోటార్లు దొంగతనం చేస్తున్నారంట వీళ్లని రైటర్ మస్తానయ్య దగ్గరికి తీసుకెళ్లి కంప్లయింట్ రాయించు’ అన్నాడు.
‘యస్సార్’ అని సెల్యూట్ చేసి వాళ్లని మస్తానయ్య దగ్గరికి తీసుకెళ్లాడు. వాళ్లు కంప్లయింగ్ రాశాక
‘‘ఏంది వెంకటేశు? ఏం జరిగింది?’’ అడిగాడు చింతాలయ్య.
‘‘ఇంట్లో పరిస్థితులు బాగా లేవు.. ఏదో కక్కుర్తిపడి’’ అన్నాడు తలవంచుకుని.
‘‘సరే ఇప్పటికైనా మీరు మోటార్లు దొంగతనం చేస్తే, నీ ప్రాణాలకే ప్రమాదం.. ఏమైనా పని చేసుకో, రమేశు ఎట్లా వున్నాడు’’ అడిగాడు.
‘‘రమేశు ఊర్లోనే చిల్లరంగడి పెట్టుకొన్నాడు. బాగానే వున్నాడు’’ అన్నాడు.
‘‘సరే ఎస్సై గారు వస్తున్నాడు. రమేష్‌ని అడిగానని చెప్పు’’ అని గదిలోకి వెళ్లిపోయాడు. మనసు ఏదోలా అయిపోయింది.
డ్యూటీ అయిపోగానే చింతాలయ్య కానిస్టేబుల్ మస్తానయ్య దగ్గర కాసేపు మాట్లాడాడు.
‘‘ఏం చింతాలయ్య డ్యూటీ అయిపోయిందిగా వెళుతున్నావా? కొత్తకాపురం కదా!’’ అన్నాడు.
చింతాలయ్య చిన్నగా నవ్వాడు.
‘‘ఈ కంప్లయింట్‌లు వినివిని రాసేకన్నా ఇవన్నీ సినిమా కథలుగా రాసుకుంటే బాగుంటుంది. దీనికి తోడు గ్రీవెన్స్‌డే ఒకటి’’ అన్నాడు కొద్దిగా విసుగ్గా మస్తానయ్య. సరే నే వెళ్తున్నాను.
‘‘నేనొస్తానుండు’’ అని మస్తానయ్య వచ్చాడు.
ఇద్దరు బయటికొచ్చి ‘టీ’ తాగారు.
‘‘సరే మస్తానయ్య నేనొస్తా’’ అంటూ చింతాలయ్య లేచిపోయాడు.
ఆర్నెల్లు గడిచిపోయాయి.
సరళ మనస్సులో నిరాశ మొదలైంది. తనెన్ని కలలు కంది.
చక్కగా ఆఫీసుకెళ్లి భర్త సాయంత్రానికల్లా ఇంటికొచ్చి తనను షికారో, సినిమాకో తీసుకెళ్లటం ఏదైనా సరాదాగా వుండడం ఏమిలేదు.
ఈ పోలీసు ఉద్యోగంతో ఎప్పుడు ఖాకీ బట్టలు, ఒక సెలవు లేదు. ఒక ముచ్చట లేదు. ఎప్పుడూ నైట్ డ్యూటీ, డేడ్యూటీ, ఇంకేదైనా పండుగలు, మీటింగ్‌లు, అధికారులు, మంత్రులు, ఎవరొచ్చినా అదనపు డ్యూటీలు.. ఇంటికి బంధువులు వచ్చినా మాట్లాడానికి లేదు. తన జీవితం ఇలా అయిపోయిందేమిటి? తన వాళ్లు తనకు ఇలాంటి సంబంధం చేశారేమిటి? అనుకొంది.
ఈ మధ్య సరళ ఎందుకో చింతాలయ్యతో ముభావంగా వుంటోంది. ‘‘మీకెప్పుడూ డ్యూటీలే.. ఏ ముచ్చటా లేదు’’ అంది ఓసారి.
చింతాలయ్య ఒక్కసారి ఆశ్చర్యపోయాడు.
ఇన్నాళ్లు సరళ సంతోషంగా ఉందనుకొన్నాడు.
తనేమైనా తప్పు చేస్తున్నాడా, సరళకన్నీ వున్నాయి. ఇంకా ఏం కావాలి. తనకు డ్యూటీలు బాధ్యతలు ఉద్యోగం నిజమే కాని తనకిష్టమైన ఉద్యోగం ఎలా వదులుకుంటాడు.
‘‘పోనీలే సరళ, ఓ నాలుగు రోజులు సెలవుపెట్టి ఎటైనా వెళదాం’’ అన్నాడు. సరళ వౌనంగా వుండిపోయింది. రానురాను సరళలో అసంతృప్తి ఎక్కువైపోయింది. తనకన్న అందరు బాగున్నట్టు తనే కష్టపడుతున్నట్టు చింతాలయ్యతో మునుపటిలా వుండలేకపోతోంది.
చింతాలయ్యకు శ్రద్ధ తగ్గుతోంది. తనేమైనా పోలీసు ఉద్యోగంలో చేరి తప్పు చేశాడా అని మొదటిసారి బాధపడ్డాడు.
పెన్నా బ్రిడ్జి మీద బైక్ పెట్టి నదిలోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు.
సరళ మొదట ఎంతో ఆనందంగా ఉంది. జీవితాంతం అలాగే వుంటుందనుకొంటున్నాడు. స్టేషన్‌కెళితే మానభంగాలు, దోపిడీలు, హత్యలు, ఆత్మహత్యలు, దొంగతనాలు, దొమీలు అన్నీ సమస్యలే. ఒక్కరోజు ప్రశాంతం లేదు. తనకిష్టమైన ఖాకి యూనిఫాం వెనుక ఇంతటి మానసిక బాధ వుంటుందని ఊహించనే లేదు. అందరి బాధలు వింటుండాలి. ‘‘ఏంది చింతా ఈడుండావు’’ అంటూ హెడ్‌కానిస్టేబుల్ హరి అటుగా వచ్చాడు. హరిని చూసి చింతాలయ్య చిన్నగా నవ్వాడు.
‘‘ఏదో మనసు బాగాలేక ఇట్లా వచ్చాను’’ అన్నాడు.
వేదాంతిలా నవ్వాడు హరి.
‘‘ఏమిటి విషయం’’ అన్నాడు.
‘‘ఏం లేదు సార్ డ్యూటీలో అన్నీ సమస్యలే ఇంట్లో వాళ్లకి ఈ ఉద్యోగం మీద సదభిప్రాయం లేదు. వాళ్లతో ఒక బాధ’’ అన్నాడు.
‘‘నాకు తెలుసు చింతాలయ్య మొదట్లో ఇలాగే వుంటుంది. డ్యూటీలో అందరి సమస్యలు శ్రద్ధగా వినాలి. ఎవరికి సమస్యల్లేవు చెప్పు? మన దగ్గరకొచ్చేది వాళ్ల బాధలు చెప్పుకొనేందుకే, డాక్టరు, లాయర్ల దగ్గరకెళ్లి వాళ్లవాళ్ల సమస్యలు చెప్పేవాళ్లే. ఆఖరికి దేవుడి దగ్గరకెళ్లి తమ సమస్యలు దేవుడి దగ్గర చెప్పేవాళ్లు... ఇక ఇంట్లో వాళ్లంటావా... వాళ్లకీ కొన్నాళ్లకి అలవాటైపోతుంది.
మనం ఇంట్లో వాళ్లని బాగా చూసుకొంటే, వాళ్లే సర్దుకుపోతారు. ప్రతి ఉద్యోగికి సమస్య వుంటుంది. సమస్యలేని ఉద్యోగం ఏముంది చెప్పు. మనమింకా నయం గవర్నమెంటు ఉద్యోగం వుండి మనం హాయిగానే వున్నాం.
మనం అందరి సమస్యలు వింటాం.. అంతవరకే. అనుభవించే వాడికి తెలుస్తుంది దాని బాధ. పరిష్కారమైతే సరే లేకుంటే అలా సాగిపోతాయి. మొదట్లో నేను నీలాగే బాధపడ్డా. అలావాటైపోతుంది. అయినా ఒకసారి ఆలోచించు... మనదీ ఓ సమస్యేనా.. ఆసుపత్రుల్లో రోగాలతో, అనాధాశ్రమాల్లో దిక్కులేక జబ్బులతో ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారు. వాళ్లందరికన్నా మనమెంతో అదృష్టవంతులం కదా.
‘‘ఇంట్లో వాళ్లకి మన డ్యూటీలు అలవాటైపోతాయి నువ్వు ఇంకేం ఆలోచించకు అంతా బాగుంటుంది. డ్యూటీ టైం అవుతోంది.. వస్తా’’ అంటూ వెళ్లిపోయాడు.
హరి మాటలతో చింతాలయ్యకు గీతోపదేశం అయింది. చిరునవ్వుతో చింతాలయ్య రూరల్ అంటూ నూతనోత్సాహంతో డ్యూటీకి వెళ్లటానికి బైక్ తీశాడు.

- అనురాధా రామకృష్ణ, మనుమసిద్ధినగర్, నెల్లూరు చరవాణి : 9394837563