ఉత్తర తెలంగాణ

ముడుపు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయం ఏడు గంటలవుతోంది. పనిమనిషి ఇంకా రాలేదు. సుజాత అసహనంగా అటూ ఇటూ తిరుగుతోంది. డ్యూటీకై బ్యాంకుకు వెళ్లాలి.. తొందరగా పనులు ముగించుకొని తయారవుదామని.. ఆందోళన తో ఉంది. పిల్లల్ని లేపడానికి బెడ్‌రూంలోకి వెళ్లింది.
అప్పటికే పిల్లలు లేచారు. ‘అమ్మా మాకు స్నానం చేయించు’ అన్నారు. ‘సరేరా ఈ రోజు మీ నాన్నగారు స్నానం చేయిస్తారు’ అంది. వెంటనే ‘ఏమండీ’ అంటూ శ్రీవారు మూర్తి గారికి పిల్లలకు స్నానం చేయించే పని ఒప్పగించింది.. మూర్తిగారు, సుజాత ఇద్దరూ బ్యాంకులోనే పనిచేస్తారు. పిల్లల్ని స్కూల్‌కు పంపి డ్యూటీకి వెళతారు. వారికి ఇద్దరూ అబ్బాయిలే..ప్రైవేటు ప్రైమరీ స్కూల్‌లో చదువుతున్నారు.
‘ఏమండి పిల్లల డ్రసులు బల్లపై పెట్టాను’ అంటూ వంటింట్లోకి వెళ్లింది సుజాత.
ఇంతలో..కాలింగ్ బెల్ మ్రోగింది. ‘ఎవరో చూడండి’ అంది సుజాత మూర్తి తలుపు తీశాడు. పనిమనిషి లక్ష్మమ్మ వచ్చిన విషయాన్ని సుజాతకు క్షణాల్లో చేరవేశాడు. వెంటనే ఆనందంతో హాల్‌లోకి వచ్చింది సుజాత! ‘ఏం లక్ష్మమ్మ ఏడున్నరవుతోంది.. ఇప్పుడా నీవు రావడం?’ అని ప్రశ్నించింది సుజాత!
నోటికి మాటలు రాక.. తల్లడిల్లుతున్న లక్ష్మమ్మను చూసి.. ‘ఏమైంది ముఖమంతా అలా ఉంది?’ అంది సుజాత..
బోరున ఏడుస్తూ ‘ఏం చెప్పమంటారమ్మ.. నాకు ఒక్కగానొక్క కూతురు.. దానికి తండ్రి లేడు! నాలుగిల్లలో పాచి పని చేసి..బతుకు గడుపుతున్నాం..నా కూతురు పెండ్లీడుకొచ్చింది. ఓ సంబంధం వచ్చింది. కానీ యాభైవేలు కట్నం అడుగుతున్నారు. నాకు ఇచ్చే తాహతు లేక వాపసు పంపాను’ అంటూ ఏడ్పును రెట్టింపు చేస్తూ గినె్నలు కడగటానికి కూర్చుంది లక్ష్మమ్మ!
‘అయ్యో అలాగా’ అంది సుజాత. చెమ్మగిల్లిన కళ్లతో! పని పూర్తి చేసి లక్ష్మమ్మ వెళ్లిపోయింది. పిల్లల్ని గబా గబా తయారు చేసి పంపించేసింది. సుజాత..తాను, మూర్తిగారు డ్యూటీకి బ్యాంకుకు బయలుదేరారు. ఎవరి సీట్లు వారు ఆసీనులైనారు. సుజాతకు ఉదయం లక్ష్మమ్మ చెప్పిన మాటలే ఆమె మనోనేత్రంపై నాట్యమాడసాగాయి!
ఎన్ని ఏళ్లు కష్టపడినా.. యాబై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వడం లక్ష్మమ్మకు సాధ్యమయ్యేది కాదు. పాపం ఏదో ఒకటి చేసి లక్ష్మమ్మను ఆదుకోవాలని మనసులో ఆలోచించసాగింది. సాయంత్రం ఐదు అయింది. పని ముగించుకొని దంపతులు ఇద్దరు ఇంటికి బయలుదేరారు. ఇంటికి చేరారు. కాసేపట్లో పిల్లలూ వచ్చారు. చక చకా సాయంత్రపు పనులు పూర్తి చేసుకొని..రాత్రి భోజనాలు ముగించుకున్నారు. అలసటతో శ్రీవారు మూర్తిగారు త్వరగా నిద్రలోకి జారుకున్నారు. పిల్లలూ నిద్రపోతున్నారు. ఏమీ తోచని సుజాత..లక్ష్మమ్మ గురించే ఆలోచిస్తూ హాల్‌లోనే ఉండిపోయింది! ఎలా లక్ష్మమ్మను ఆదుకోవాలని ఆలోచింప సాగింది సుజాత..టక్కున ఓ ఐడియా మైండ్‌లో వెలిగింది. బ్యాంకులో తనకొచ్చిన మొదటి నెల జీతం వడ్డీతో సహా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ముడుపు చెల్లిస్తానని మొక్కుకున్న సంగతి గుర్తొచ్చింది. వచ్చే శనివారమే తిరుపతి వెళ్లాల్సి వుంది. తిరుమల తిరుపతి స్వామి వద్దకు ఎప్పుడైనా మున్ముందు వెళ్లొచ్చు.. ఈ డబ్బును ముందు ఇప్పుడు లక్ష్మమ్మకు ఇస్తే బాగుంటుందన్న నిర్ణయానికొచ్చింది. బెడ్ రూంకు వెళ్లి విశ్రాంతి తీసుకుంది.
తెల్లవారింది. ‘ముడుపు డబ్బును లక్ష్మమ్మ కూతురు పెళ్లికి ఇస్తే ఎలా ఉంటుందండి?’ అంటూ కాఫీ అందిస్తూ భర్త మూర్తిని అడిగింది. ఏదో ఆలోచిస్తున్న మూర్తిగారు తేరుకొని భార్య ఉత్తమ వ్యక్తిత్వానికి ఆమె తీసుకున్న నిర్ణయానికి చాలా సంతోషపడి.. ‘అలాగే సుజాత’ అన్నాడు.. ఇక సుజాత ఆనందానికి అవధులు లేవు.. లక్ష్మమ్మ ఎప్పుడెప్పుడొస్తదా? ఎంత త్వరగా ఈ విషయం చెప్పేద్దామని ఆరాట పడుతోంది. కాలింగ్ బెల్ మ్రోగింది. లక్ష్మమ్మ రానే వచ్చింది.. హుషారుగా వున్న సుజాతమ్మను చూసి.. ‘ఏమమ్మ ఏంటీ విశేషాలు? చాలా హుషారుగా వున్నారు?’ అని అడగాలనుకుంది. కానీ మనకెందుకులే అని.. పనిలో లీనమయింది లక్ష్మమ్మ. పని పూర్తయ్యాక ఇంటికెళ్తున్న లక్ష్మమ్మను పిలిచి.. లక్ష్మమ్మ రేపు నీ కూతురును తీసుకొని రా అంది. ‘ఎందుకమ్మా’ అంది లక్ష్మమ్మ!
‘నేను చెబుతున్నాగా.. తీసుకొని రా!’ అంది కొంత స్వరాన్ని పెంచుతూ..ఎదురు తిరగని లక్ష్మమ్మ ‘సరే’ నంది! మరునాడు సుజాత చెప్పినట్లు ఉదయం తన వెంట లక్ష్మమ్మ తన కూతురును తీసుకొని వచ్చింది. తల్లీ కూతుళ్ల ముఖాలు దిగాలుగా వుండటం చూసిన సుజాత బాధను లోలోనే అణుచుకుంది. తెల్లగా బొద్దుగా వున్న లక్ష్మమ్మ అమ్మాయిని చూసి.. ‘లోలోన బాగుందే అమ్మాయి’ అనుకుంది సుజాత. ‘లక్ష్మమ్మా మీరిద్దరు చాపపై కూర్చొండి’ అంటూ లోనికి వెళ్లింది. తల్లీ కూతులిద్దరూ బిత్తర పోయారు. సుజాతమ్మ ఏం చేయబోతున్నారోనని ఆసక్తిగా ఎదురు చూడాల్సింది పోయి.. ఒకింత ఆందోళనకు గురవుతున్నారు. గదిలో నుండి పళ్లెంలో చీర, పండ్లు, తన మొదటి నెల జీతం యాభై వేల రూపాయలు వడ్డీతో సహా తీసుకొచ్చింది సుజాత.. ఏమిటది సుజాతమ్మ! అని అడగాలనుకున్న లక్ష్మకు నోట మాట రాలేదు. ఇవి తీసుకొని మీ అమ్మాయి పెళ్లి చేయుమని కోరింది. సుజాత! ‘వద్దమ్మా’! వద్దమ్మా’ అంటున్న లక్ష్మమ్మ మాటలను వారించి ప్రేమతో పల్లెంలోని ‘ముడుపు’ను లక్ష్మమ్మకు సమర్పించుకుంది..సుజాత..తల్లీ కూతుళ్లిద్దరు చెమ్మగిల్లిన కళ్లతో సుజాత దంపతుల కాళ్లపై పడ్డారు. ఇదంతా గమనిస్తున్న మూర్తిగారు తన భార్య ఉదాత్త గుణానికి లోలోన గర్వంగా ఫీలయ్యారు.
*
- చిలుకమర్రి విజయలక్ష్మి
ఇటిక్యాల గ్రామం, జగిత్యాల జిల్లా
సెల్.నం.9493210293

- చిలుకమర్రి విజయలక్ష్మి ఇటిక్యాల గ్రామం, జగిత్యాల జిల్లా సెల్.నం.9493210293